మెకానిక్ రాకీ రివ్యూ: విశ్వక్‌సేన్ తాత, మనవడిగా మెప్పించాడా

విశ్వక్‌సేన్

ఫొటో సోర్స్, Twitter//SRTEntertainments

    • రచయిత, శృంగవరపు రచన
    • హోదా, బీబీసీ కోసం

మాస్ సినిమాలతో తనకంటూ ఒక ఇమేజ్‌ను ఏర్పరచుకుంటున్న హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం మెకానిక్ రాకీ.

ఇది కూడా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. విశ్వక్ సేన్ హీరోగా, మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్, సునీల్ ముఖ్య పాత్రలుగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

రాయలసీమకు చెందిన రాకీ (విశ్వక్ సేన్ ) తాతయ్య కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి హైదరాబాద్‌కు పారిపోయి వచ్చి ఒక గ్యారేజ్ పెట్టుకుంటాడు.

ఆ గ్యారేజ్‌లోనే రాకీ మెకానిక్‌గా పని చేస్తూ ఉంటాడు. రాకీ ప్రేమించిన ప్రియ(మీనాక్షి చౌదరి) అన్నయ్య ఎలా మరణించాడు? ఆ మరణానికి రాకీ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే కథ.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మెకానిక్ రాకీ రివ్యూ

ఫొటో సోర్స్, Twitter//SRTEntertainments

‘విశ్వక్‌సేన్ వన్ మ్యాన్ షో’

విశ్వక్ సేన్ మెకానిక్ పాత్రలో ఒదిగిపోయాడు. మాస్ యాక్షన్ సీన్స్‌లోనూ, హీరో ఎలివేషన్ సన్నివేశాల్లోనూ విశ్వక్ సేన్ నటన బావుంది. తనదైన బాడీ లాంగ్వేజ్, మేనరిజంతో మొత్తం సినిమాను వన్ మ్యాన్ షో గా నడిపించాడు.

మీనాక్షి చౌదరి పాత్రలో రాకీ పాత్రకు తగినంత జోష్ లేదు. ఈ పాత్ర కొంత డల్‌గా అనిపించడం వల్ల మీనాక్షి తన పరిధిలో బాగానే నటించినా గొప్పగా అనిపించలేదు.

శ్రద్ధ శ్రీనాథ్ బాగా నటించారు. సునీల్, నరేష్, వైవా హర్ష, విశ్వదేవ్ రాచకొండ నటన పర్లేదనిపించింది.

మెకానిక్ రౌడీ

ఫొటో సోర్స్, Twitter//SRTEntertainments

సినిమా ఎలా ఉందంటే?

చాలా రొటీన్ కథ ఇది. ఫస్టాఫ్ మొత్తంలో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ పెద్దగా లేవు. మెకానిక్ రాకీ అనే మాస్ టైటిల్‌కి తగినట్లుగా స్టోరీని సరిగ్గా మలచలేదు.

రంకి రెడ్డి పాత్రలో విలన్‌గా సునీల్ ఒకటి రెండు సన్నివేశాల్లో బాగా అనిపించినా తర్వాత ఆ పాత్ర కూడా తేలిపోయింది.

ఆన్‌లైన్స్ స్కామ్స్ మీద ఇప్పటికే అనేక సినిమాలు రావడంతో ఈ సినిమాకు ఆ ఎలిమెంట్ కూడా పెద్దగా ప్లస్ కాలేదు. సునీల్ లాంటి మంచి కాస్టింగ్‌ను సరిగ్గా వినియోగించుకోలేకపోవడంతో సినిమాలో విలన్ పాత్ర ఆకట్టుకునేలా లేదు. నరేష్ కామెడీ ట్రాక్ కూడా చాలా రొటీన్‌గా ఉంది.

ఒక్క విశ్వక్ సేన్ మాత్రమే వన్ మ్యాన్ షోతో సినిమాను నడిపించాడు. బాడీ లాంగ్వేజ్‌తో మాస్ ఎమోషన్స్‌ను పలికించిన విశ్వక్‌సేన్ యాక్షన్ సీక్వెన్స్‌ల్లోనూ ఎక్కడా ఎనర్జీ తగ్గకుండా నటించడం మాత్రమే సినిమాకు ప్లస్ పాయింట్.

రాకీ పాత్రకు తగ్గ పవర్‌ఫుల్ డైలాగ్స్ లేకపోవడం కూడా మైనస్ పాయింట్. విశ్వక్ సేన్‌ను డబుల్ రోల్‌లో తాత పాత్రలో కూడా చూపించే ప్రయత్నం చేసినా అది కూడా సరిగ్గా ప్రెజెంట్ చేయలేదు.

మెకానిక్ రాకీ

ఫొటో సోర్స్, Twitter//SRTEntertainments

'నడుము గీరితే'

ఉల్టా పల్టా పాట, టైటిల్ పాట పర్లేదనిపించాయి. తెలంగాణ యాసలో ఉన్న 'నడుము గీరితే' పాట కథతో సంబంధం లేకుండా అసహజంగా చొప్పించినట్టు ఉంది. మ్యూజిక్‌లో జోరు లేదు. సినిమాటోగ్రఫీ పర్లేదనిపించింది.

సినిమాలో కథను సీరియస్‌గా ఎస్టాబ్లిష్ చేసే రంకి రెడ్డి పాత్ర బలహీనంగా ఉండటంతో సినిమా తేలిపోయింది. అటు రాకీ పాత్ర, ఇటు రంకి రెడ్డి పాత్రల్లో బాగా నటించగలిగే విశ్వక్ సేన్, సునీల్ ఉన్నా వారి కాంబినేషన్ సన్నివేశాలు చాలా పేలవంగా ఉండటంతో 'హీరో -విలన్' కాన్‌ఫ్లిక్ట్ కూడా సినిమాకు మైనస్ అయ్యింది.

విశ్వక్ సేన్ మంచి మాస్ యాక్షన్ కథతోనే వచ్చినా, రొటీన్ కథలను అన్నింటిని కలిపి గందరగోళం చేయడంతో నిరాశపరిచిన సినిమానే 'మెకానిక్ రాకీ.'

(గమనిక: అభిప్రాయాలు సమీక్షకురాలి వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)