నిజాం రజాకార్లు మల్లికార్జున్ ఖర్గే ఇంటిని తగలబెట్టి తల్లినీ, సోదరినీ చంపేశారా? యోగి ఆదిత్యనాథ్ ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నాటి రజాకార్ల అరాచకాలకు నేటి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కుటుంబం కూడా బాధితులేనా? మల్లికార్జున్ ఖర్గే తల్లి, సోదరిని రజకార్లు తగలబెట్టేశారా?
తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఖర్గే, యూపీ సీఎం యోగిల మధ్య మాటల యుద్ధానికి కారణమైన ఘటన ఏంటి? యోగి చెప్పిన దానిలో వాస్తవమెంత? ఖర్గే కుటుంబానికి హైదరాబాద్ రజాకార్లకీ మధ్య ఏం జరిగింది?
'ఖర్గే ఊరిని తగలబెట్టారు'
మల్లికార్జున్ ఖర్గే పుట్టిన ఊరిలో ఇళ్లను రజాకార్లు తగలబెట్టారన్నది వాస్తవమే. ఆ ఘటనలో ఆయన తల్లి, సోదరి కూడా చనిపోయారు.
ఈ విషయంపై మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే ‘న్యూస్ 18’ వార్తాసంస్థకు 2022లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
‘‘అప్పుడు మల్లికార్జున్ ఖర్గే ఏడేళ్ల బాలుడు. రజాకార్లు ఆయన ఇంటిని తగలబెట్టేశారు. ఆయన తండ్రి మాపన్న పరుగున వెళ్లారు. బాలుడైన మల్లికార్జున్ ఖర్గే తండ్రి చేతికి అందాడు. వెంటనే అతన్ని మంటల నుంచి రక్షించారు తండ్రి. అలా మల్లికార్జున్ ఖర్గే రజాకార్ల దాడి నుంచి బయటపడ్డారు. కానీ ఆయన తల్లి, సోదరి ఇద్దరూ ఆ మంట్లలో కాలిపోయారు. ఇది 1948లో జరిగింది. మల్లికార్జున్ ఖర్గే, ఆయన తండ్రి తమ ప్రాణాలు కాపాడుకోవటానికి పొదల్లో దాకున్నారు. తరువాత పుణెలో మల్లికార్జున్ చిన్నాన్న దగ్గరకు వెళ్లి అనంతరం గుల్బర్గా వచ్చారు.’’ అని ప్రియాంక్ ఖర్గే ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈ ఘటన గురించి పూర్తిగా తెలియాలంటే ఖర్గే పుట్టిన ఊరు, అక్కడి రాజకీయ నేపథ్యం తెలియాలి.

కాశిం రిజ్వీ నాయకత్వంలో పనిచేసే గ్రూపు
కర్ణాటకలో బీదర్ జిల్లాలోని వరవట్టి గ్రామంలో మల్లికార్జున్ ఖర్గే జన్మించారు. బీదర్ జిల్లా ఒకప్పుడు హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం పరిధిలో ఉండేది.
1948 ముందు వరకూ ఈ బీదర్ ప్రాంతం నిజాం నవాబుల పాలనలో ఉంది. సంస్థానాలు విలీనమయ్యే వరకు ఇక్కడ బ్రిటిష్ కనుసన్నల్లో నిజాం ప్రభువుల పాలన నడిచింది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం మొత్తం, మహారాష్ట్రలోని మరాఠ్వాడా, కర్ణాటకలోని హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాలు కలిపి నిజాం పాలన కింద ఉండేవి.
నిజాం పాలన సమయంలో రజాకార్ పేరుతో ఒక పారా మిలటరీ తరహా ప్రైవేటు సైన్యం ఆ ప్రాంతంలో ఉండేది. కాశిం రిజ్వీ నాయకత్వంలో పనిచేసే ఈ గ్రూపు, హైదరాబాద్ రాజ్యంలో ఇస్లామిక్ రాజుల పాలన సుస్థిరం చేయడం అనే అంతిమ లక్ష్యంతో, నిజాం ప్రభువును సమర్థిస్తూ పనిచేసేది.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ సంస్థానాలు స్వతంత్రంగా ఉండటంతో, నిజాం నవాబులు కూడా స్వతంత్ర ముస్లిం దేశంగా ఉండాలని భావించారు.
ముఖ్యంగా గ్రామాలపై పడి దోచుకోవడం, అమాయకులను కాల్చి చంపడం వంటివి విచ్చలవిడిగా చేశారు. హిందువులు లక్ష్యంగా ఎన్నో దాడులు చేశారు. అభ్యుదయ భావాలున్న ముస్లింలపైనా దాడికి దిగారు.
ఇక తెలంగాణ సాయుధ పోరాటం చేస్తున్న కమ్యూనిస్టులు, వారి సానుభూతిపరులపై కూడా దాడులు చేశారు. సామూహిక హత్యలు, గ్రామాలను దోచుకోవడం, ఆస్తులు తగలబెట్టడం, అత్యాచారాలు ఇలా ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు రజాకార్లు.
వీరి అకృత్యాలను తెలంగాణ, మరాఠ్వాడా, హైదరాబాద్ కర్ణాటకలలో ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు.
1948లో ‘ఆపరేషన్ పోలో’ తరువాత హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం అయింది. దాంతో ఈ రజాకార్ సంస్థ అంతరించింది. కాశిం రిజ్వీని ముందు అరెస్ట్ చేసి, తరువాత పాకిస్తాన్ వెళ్లడానికి అనుమతించింది భారత ప్రభుత్వం.

ఫొటో సోర్స్, Getty Images
ఈ అంశం ఇప్పుడు ఎందుకు ప్రచారంలోకి వచ్చింది?
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ‘బటేంగే తో కటేంగే’ అనే నినాదంపై స్పందించిన ఖర్గే, యోగి ఆదిత్యనాథ్‌పై మల్లికార్జున్ ఖర్గే పరోక్షంగా విమర్శలు చేశారు.
‘‘కొందరు సాధువుల్లాగా కనిపిస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. జుట్టు పెంచుకోరు. సన్యాసి అయితే రాజకీయాలు వదిలేయండి లేదా తెల్లబట్టలు వేసుకోండి. ఒకవైపు కాషాయం కట్టుకుని, మరోవైపు ఆ మాటలేంటి?’’ అంటూ యోగిపై విమర్శలు చేశారు ఖర్గే.
‘బటేంగే తో కటేంగే’ అన్న యోగి నినాదాన్ని తప్పు పడుతూ కాషాయం కట్టిన వారు అలా మాట్లాడవచ్చా అంటూ ఖర్గే ప్రశ్నించారు. యోగి వేషధారణ గురించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఖర్గే. తరువాత మరో సభలో కూడా యోగి మాటలను ఖర్గే ప్రస్తావించారు.
‘‘(యోగి) సాధువు దుస్తులు వేసుకుంటారని మొన్న ముంబయిలో ఒక మీటింగులో అన్నాను. సాధుసంతులు అందరి గురించీ ఆలోచించాలి. బటేంగే తో కటేంగే అనేది సాధువులు మాట్లాడే మాటా? ఇలాంటివి తీవ్రవాదులు మాట్లాడతారు. మీలాంటి సాధువు కాదు’’ అన్నారు ఖర్గే.
దానికి మరో సభలో యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.
‘‘మల్లికార్జున్ ఖర్గే గారు అనవసరంగా నా మీద కోపంగా ఉన్నారు. నేను మీ వయసుకు మర్యాద ఇస్తాను. మీరు కోపం తెచ్చుకోవాలనుకుంటే హైదరాబాద్ నిజాం మీద కోపం తెచ్చుకోండి. ఆ నిజాం రజాకార్లు మీ ఊరిని తగలబెట్టారు. మీ తల్లిని, సోదరిని, మీ కుటుంబ సభ్యులనూ తగులబెట్టారు. ఈ సత్యాన్ని దేశం ముందుంచండి. మీరు ఓటు బ్యాంకు కోసం (ముస్లింలను ఉద్దేశించి) దీన్ని దేశం ముందుకు తీసుకురావడం లేదు. నేను ఒక యోగిని. నేనొకటే నేర్చుకున్నాను. దేశం కోసం ఎక్కువ పనిచేయాలని (ఔర్ కామ్, దేశ్ కీ నామ్)’’ యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
ఈ ఘటననే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ తన ప్రసంగంలో ఉపయోగించుకున్నారు. యోగి మాటలపై తిరిగి మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే స్పందించారు.
‘‘ఖర్గే గారి ఇల్లు తగలబెట్టారు. రజాకార్లు మా నానమ్మ, మేనత్తలను చంపారు. కానీ చంపింది ముస్లింలు, ముస్లిం సమూహం కాదు. ప్రతీ సమూహంలోనూ కొందరు తప్పులు చేసే వాళ్లు ఉంటారు. అందుకని ఆ సమూహాన్ని మొత్తంగా తప్పుబట్టలేం. ఉదాహరణకు మరో సమూహం వారు ఇదే ఖర్గేని దేవాలయానికి కూడా రానివ్వరు. ఈ మధ్యే మాండ్యలో అటువంటి ఘటనే జరిగింది. మా ఇంట్లో జరిగిన ఘటన ముస్లింలు చేసింది కాదు, రజాకార్లు చేశారు. ప్రాణాలు పోయింది మా ఇంట్లో.. మాకు లేని కోపం మీకు ఎందుకు?.’’ అంటూ కర్ణాటకలోని వివిధ మీడియా సంస్థలతో ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Facebook/Priyank Kharge
ఈ ఘటనపై ప్రియాంక్ ఖర్గే ఎక్స్ వేదికగా కూడా స్పందించారు.
‘‘ఆ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. తరువాత రాజకీయంగా ఎదిగారు. ఆ ఘోరమైన ఘటనను ఆయన ఎన్నడూ రాజకీయ లాభాల కోసం వాడుకోలేదు. విక్టిమ్ కార్డు వాడలేదు. తనను తాను ద్వేషంతో నింపుకోలేదు. ప్రతీ సమూహంలోనూ తప్పులు చేసే వారున్నారు.
సీఎం గారూ (యోగిని ఉద్దేశించి) మీ సిద్ధాంతాలు ఖర్గే గారిని సమానంగా చూడవు. మనుషుల మధ్య వివక్ష చూపుతుంది (పరోక్షంగా కులాన్ని ఉద్దేశించి). కాబట్టి మీ వాళ్లంతా చెడ్డవాళ్లు అనాలా లేక ఆ వివక్షను పాటించే వారిని మాత్రమే అనాలా? అంటరానివాడు, దళితుడు అని ఆయనపై ముద్ర వేసిందెవరు? ఆ వివక్ష ఉన్నంత మాత్రాన ఆ కమ్యూనిటీలో అందరిదీ తప్పు కాదు కదా?
82 ఏళ్ల వయసులో ఖర్గే గారు మీరు ప్రవచించే ద్వేషం నుంచి, బుద్ధ, బసవ, అంబేడ్కర్ విలువలను, రాజ్యాంగాన్ని కాపాడటానికి శ్రమిస్తున్నారు. ఆయన ఆ విషయంలో పోరాడుతూనే ఉంటారు. కాబట్టి యోగిగారూ మీ ద్వేషాన్ని మరోచోటుకు తీసుకెళ్లండి. మీరు ఖర్గే గారి సిద్ధాంతాలను చెరిపి వేయలేరు. ఆ విషపు విత్తనాలు నాటేకంటే, మోదీగారు చేసిన పనులపై ఎన్నికలకు వెళ్లండి.’’ అంటూ ట్వీట్ చేశారు ప్రియాంక్ ఖర్గే.
దీనిపై పలువురు నాయకులు రెండు వైపులా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














