మహారాష్ట్ర, ఝార్ఖండ్: బరిలో సీఎంలు, మాజీ సీఎంలు, వారసులు - గెలుపా? ఓటమా?

ఆదిత్య ఠాక్రే, యుగేంద్ర పవార్, అమిత్ ఠాక్రే, కల్పనా సోరెన్

ఫొటో సోర్స్, Getty Images/facebook

ఫొటో క్యాప్షన్, ఆదిత్య ఠాక్రే, యుగేంద్ర పవార్, అమిత్ ఠాక్రే, కల్పనా సోరెన్
    • రచయిత, జక్కుల బాలయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన పలువురు కీలక నేతల స్థానాల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే.. మాజీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న దేవేంద్ర ఫడణవీస్.. మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన అజిత్ పవార్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే వంటి పలువురు ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

బారామతిలో సోదరుడి కుమారుడితో అజిత్ పవార్ పోటీ

అజిత్ పవార్, యుగేంద్ర పవార్

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, అజిత్ పవార్, యుగేంద్ర పవార్

మహారాష్ట్ర రాజకీయాల్లో బారామతికి ప్రత్యేక స్థానముంది. రాజకీయ ప్రాధాన్యం కలిగిన ఈ స్థానం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి అజిత్ పవార్ పోటీలో ఉన్నారు.

ఆయనపై సోదరుడి కుమారుడు యుగేంద్ర పవార్ పోటీ చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) పార్టీ తరఫున యుగేంద్ర బరిలోకి దిగారు.

అజిత్ పవార్‌ ప్రతిష్టకు ఈ ఎన్నికల ఫలితం కీలకం కానుంది.

గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ స్థానం వార్తల్లో నిలిచింది.

ఇక్కడి నుంచి శరద్ పవార్ కుమార్తె, సీనియర్ ఎంపీ సుప్రియా సూలేపై అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేశారు.

ఆ ఎన్నికల్లో సుప్రియా సూలేను విజయం వరించింది.

శిందే ప్రత్యర్థి తన రాజకీయ గురువు కుటుంబీకుడే..

ఏక్‌నాథ్ శిందే

ఫొటో సోర్స్, EKNATH SHINDE/FACEBOOK

ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ శిందే థానేలోని కోప్రి -పాచ్‌పఖాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

ఆయనపై శివసేన (ఉద్దవ్ వర్గం) నుంచి కేదార్ దిఘే ప్రత్యర్థిగా నిలిచారు.

శివసేన రెండువర్గాల మధ్య ఇక్కడ హోరాహోరీ పోరు సాగుతోంది.

శిందే రాజకీయ గురువు, శివసేన నేత ఆనంద్ దిఘే సోదరుడి కుమారడే కేదార్ దిఘే.

ఆనంద్ దిఘే శిష్యుడైన ఏక్‌నాథ్ శిందే, ఆనంద్ సోదరుడి కుమారుడు కేదార్ దిఘే పోటీతో వారసత్వ పోరుకు తెరతీసినట్టైంది.

నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నుంచి ఫడణవీస్

దేవేంద్ర ఫడణవీస్

ఫొటో సోర్స్, facebook/Devendra Fadnavis

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నాగ్‌పూర్ నైరుతి నుంచి బరిలో ఉన్నారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫ్రఫుల్ల వినోద్‌రావ్ గుడాధె పోటీ చేస్తున్నారు.

2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఏర్పాటైన నాగ్‌పుర్ సౌత్ వెస్ట్ స్థానం నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు దేవేంద్ర ఫడణవీస్. ఇక్కడి నుంచి నాలుగోసారి ఎన్నికల బరిలో నిలిచారు. అంతకుముందు ఆయన నాగ్‌పుర్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు.

నితిన్ గడ్కరీ, ఏక్‌నాథ్ ఖడ్సే, పంకజ ముండే, వినోద్ తావ్డే, చంద్రకాంత్ పాటిల్ వంటి వారిని దాటుకుని 2014లో ముఖ్యమంత్రి అయ్యారు.

గత 40 ఏళ్లలో పూర్తిగా ఐదేళ్లు పదవిలో ఉన్న మొట్టమొదటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అనిపించుకున్నారు.

వర్లి నుంచి ఆదిత్య ఠాక్రే

ఆదిత్య ఠాక్రే, మిలింద్ దేవరా

ఫొటో సోర్స్, Getty Images/Facebook

మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే మరోసారి వర్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు.

2019లో ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు.

ఈసారి శివసేన (శిందే వర్గం) ఇక్కడి నుంచి మిలింద్ దేవరాను రంగంలోకి దించింది.

బరిలో రాజ్ ఠాక్రే కుమారుడు

అమిత్ ఠాక్రే, సరదా సర్వాంకర్
ఫొటో క్యాప్షన్, అమిత్ ఠాక్రే, సరదా సర్వాంకర్

ఈ ఎన్నికల్లో మాహిమ్ నియోజకవర్గం కూడా ఎక్కువగా వార్తల్లో నిలిచింది.

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే తొలిసారి ఇక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగారు.

ఆయనపై శివసేన (శిందే వర్గం) నుంచి సిటింగ్ ఎమ్మెల్యే సదా సర్వాంకర్, శివసేన(యూబీటీ) నుంచి మహేశ్ సావంత్ పోటీలో ఉన్నారు.

ఝార్ఖండ్‌లో సోరెన్, ఆయన భార్య

హేమంత్ సోరెన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, హేమంత్ సోరెన్

ఇక ఝార్ఖండ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పన సోరెన్, మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ ఎన్నికల బరిలో ఉన్నారు.

సీఎం హేమంత్ సోరెన్ జైలుకి వెళ్లినప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంపయూ సోరెన్ ఆ తర్వాత బీజేపీలో చేరారు.

ఇప్పుడాయన బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు.

హేమంత్ సోరెన్ బర్హేట్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు.

2014, 2019లోనూ ఇదే స్థానం నుంచి పోటీ చేసిన హేమంత్ సోరెన్ మూడోసారి బరిలో నిలిచారు.

ఆయనపై బీజేపీ అభ్యర్థి గమాలియమ్ హేంబ్రమ్ పోటీ చేస్తున్నారు.

కల్పన సోరెన్

కల్పనా సోరెన్

ఫొటో సోర్స్, Getty Images

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య గండే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఆమెపై బీజేపీ అభ్యర్థిగా మునియా దేవి పోటీ చేస్తున్నారు.

2024లో జరిగిన ఉప ఎన్నికల్లో కల్పనా సోరెన్ ఇక్కడి నుంచి గెలుపొందారు.

చంపయీ సోరెన్

చంపయీ సోరెన్

ఫొటో సోర్స్, RAVI PRAKASH

ఫొటో క్యాప్షన్, చంపయీ సోరెన్

ఇటీవల మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్ జైలుకి వెళ్లినప్పుడు, ఆయన స్థానంలో చంపయీ సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అయితే, జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత హేమంత్ సోరెన్ మళ్లీ సీఎం పదవి చేపట్టారు.

అనంతరం చంపయీ సోరెన్ జేఎంఎంను వీడి బీజేపీలో చేరారు.

చంపయీ సోరెన్ సరాయికేలా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనపై జేఎంఎం అభ్యర్థి గణేశ్ మహాలి చేరారు.

బాబూలాల్ మరాండీ

ఫొటో సోర్స్, facebook

బాబూలాల్ మరాండీ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బాబూలాల్ మరాండీ ఈ ఎన్నికల్లో ధర్వాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. జేఎంఎం అభ్యర్థి నిజాముద్దీన్ అన్సారీ ఆయన ప్రత్యర్థిగా ఉన్నారు.

బాబూలాల్ మరాండీ ఝార్ఖండ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. 2000 సంవత్సరంలో ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.

ఆ తర్వాత బీజేపీని వీడి ఝార్ఖండ్ వికాస్ మోర్చా పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. తదనంతర రాజకీయ పరిణామాల అనంతరం మళ్లీ బీజేపీలో చేరిన మరాండీ ప్రతిపక్ష నేతగానూ వ్యవహరించారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)