తులసి గబార్డ్: నరేంద్ర మోదీని అభిమానించే ఈ హిందూ నేతను ట్రంప్ ఎందుకు తన టీమ్‌లో చేర్చుకున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అన్షుల్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికాలోని హిందువుల సమస్యలపై గళమెత్తిన మాజీ డెమొక్రాట్ నాయకురాలిని కీలక పదవికి ఎంపిక చేశారు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.
తులసి పేరును ప్రకటిస్తూ ట్రంప్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఇలా రాశారు, ''నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా మాజీ ఎంపీ, లెఫ్టినెంట్ కల్నల్ తులసి గబార్డ్ పని చేయబోతున్నారని ప్రకటించేందుకు చాలా సంతోషిస్తున్నా. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసిన అభ్యర్థిగా ఆమెకు రెండు పార్టీల నుంచి మంచి మద్దతు ఉంది. ఇప్పుడు ఆమె గర్వించదగ్గ రిపబ్లికన్.'' అని పేర్కొన్నారు.
డోనల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపిన తులసి, అమెరికన్ పౌరుల భావప్రకటనా స్వేచ్ఛ కోసం, భద్రత కోసం కృషి చేస్తానని అన్నారు.

ఎవరీ తులసి గబార్డ్?
అమెరికాలోని సమోవాలో మైక్ గబార్డ్, కెరోల్ గబార్డ్ దంపతులకు 1981లో తులసి గబార్డ్ జన్మించారు. ఐదుగురు సంతానంలో ఈమె ఒకరు.
గబార్డ్ పుట్టిన రెండేళ్లకు, అంటే 1983లో ఆమె కుటుంబం అమెరికాలోని హవాయి వెళ్లి స్థిరపడింది. హవాయికి వచ్చిన తర్వాత తులసి గబార్డ్ తల్లి కెరోల్ గబార్డ్ హిందూ మతం స్వీకరించారు. ఆమె తండ్రి ఒక రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్. హిందూమత ప్రభావంతో కెరోల్ తన పిల్లలకు హిందూ పేర్లు పెట్టారు.
తులసి గబార్డ్ కూడా తనను తాను హిందువుగా చెప్పుకున్నారు. ఆమెకు భారతీయ మూలాలు లేవు.

ఫొటో సోర్స్, Getty Images
తులసి తండ్రి మొదట్లో అంటే 2004 నుంచి 2007 మధ్య రిపబ్లికన్ పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత 2007 నుంచి డెమొక్రటిక్ పార్టీలో చేరారు.
2013లో తొలిసారి హవాయి రాష్ట్ర ఎంపీగా ఎన్నికైన తులసి, 2021 వరకూ ఆ పదవిలో కొనసాగారు.
తులసి గబార్డ్‌కు ఆర్మీ నేషనల్ గార్డ్‌తో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధముంది. ఆ సమయంలో ఆమె ఇరాక్, కువైట్ వంటి దేశాల్లో పనిచేశారు.
2016లో ఆమె బెర్నీ సాండర్స్ కోసం ప్రచారం చేశారు. 2020లో జో బైడెన్ అభ్యర్థిత్వానికి ముందు, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయాలని ఆమె భావించారు.
అమెరికా కాంగ్రెస్‌లో తొలి హిందూ సభ్యురాలు తులసి గబార్డ్. కాంగ్రెస్ సభ్యురాలిగా ఆరోగ్య సంరక్షణ, ఉచిత కాలేజీ విద్య, గన్ కల్చర్ నియంత్రణ వంటి విషయాలకు ఆమె మద్దతునిచ్చారు.
సభ నుంచి వైదొలిగిన తర్వాత, ఆమె కొన్ని విషయాల్లో డెమొక్రటిక్ పార్టీని వ్యతిరేకించి ట్రంప్‌కు పరోక్షంగా మద్దతు తెలిపారు. మాజీ డెమొక్రాట్ కావడంతో, కమలా హారిస్‌కు వ్యతిరేకంగా ట్రంప్‌కు పలు విషయాల్లో సాయమందించారు.
విదేశాంగ విధానం, సామాజిక సమస్యలపై డెమొక్రటిక్ పార్టీ విధానాలను తప్పుబడుతూ అక్టోబర్ 2022లో ఆమె పార్టీని వీడి, ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు పలికారు. ఆ తర్వాత 2024లో రిపబ్లికన్ పార్టీలో చేరారు.

ఫొటో సోర్స్, X/@TulsiGabbard
బీజేపీతో సంబంధాలు
2015లో అమెరికాలోని హవాయిలో జరిగిన తులసి గబార్డ్ వివాహం భారత్‌లోనూ చర్చనీయాంశమైంది. సినిమాటోగ్రఫర్ అబ్రహం విలియమ్స్‌ను హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు.
‘ది కారవాన్’లో ప్రచురితమైన కథనం ప్రకారం, అమెరికాలో అప్పటి భారత రాయబారి తరణ్‌జిత్ సంధు, బీజేపీ నేత రామ్ మాధవ్ కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. ఆ సమయంలో రామ్ మాధవ్ బీజేపీ అధికార ప్రతినిధి. అంతకుముందు పదేళ్లకు పైగా ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ అధికార ప్రతినిధిగా ఆయన పని చేశారు.
వివాహ వేడుకలో, ప్రధాన నరేంద్ర మోదీ వ్యక్తిగత సందేశాన్ని రామ్ మాధవ్ చదివి వినిపించి, వినాయకుడి ప్రతిమను బహుమతిగా అందజేశారు.
వివాహానికి కొద్దినెలల ముందు తులసి గబార్డ్ తొలిసారి భారత్‌లో పర్యటించారు. మూడు వారాలు భారత్‌లో పర్యటించిన ఆమె, ప్రధాని మోదీ, కేబినెట్ మంత్రులు, ఆర్మీ చీఫ్‌తో సమావేశమయ్యారు.
ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీపై తులసి ప్రశంసలు కురిపించారు.
''మోదీ శక్తివంతమైన నాయకుడు. భారత్ భవిష్యత్తుపై ఆయనకు స్పష్టమైన విజన్ ఉంది. భారత్ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక ఉన్న నాయకుడు'' అని ఆమె అన్నారు.
అంతేకాకుండా, ఒక పాఠశాలలో చీపురు పట్టుకుని ఊడ్చి, మోదీ స్వచ్ఛ భారత్ ప్రచారానికి తులసి మద్దతు తెలిపారు. యోగాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే మోదీ ప్రయత్నాలకూ ఆమె బలమైన మద్దతుదారుగా నిలిచారు.
2014 సెప్టెంబర్‌లో తొలిసారి ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆమె భగవద్గీతను బహుమతిగా ఇచ్చారు.
2014 నుంచి ఆమె మోదీకి మద్దతు ఇస్తున్నారు. 2002 గుజరాత్ అల్లర్ల ఆరోపణల కారణంగా నరేంద్ర మోదీకి వీసా మంజూరు చేసేందుకు అమెరికా ప్రభుత్వం నిరాకరించడాన్ని విమర్శించిన కొద్దిమంది నేతల్లో తులసి గబార్డ్ కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హిందూ ఐడెంటిటీని దాచుకోని నేత
తాను హిందూమతాన్ని ఆచరించడం గురించి తులసి గబార్డ్ 2019లో రెలిజియన్ న్యూస్ సర్వీస్‌కు రాసిన కథనంలో వివరించారు. ''హిందువునైనందుకు గర్విస్తున్నా. కానీ నేను హిందూ జాతీయవాదిని కాను'' అని ఆమె రాశారు.
''హిందూ జాతీయవాదినని నాపై ఆరోపణలు చేశారు. నేను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడాన్ని ఆ ఆరోపణలకు సాక్ష్యంగా చూపించారు. ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, ప్రెసిడెంట్ డోనల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ సహా కాంగ్రెస్‌లోని నా సహచరులు చాలామంది ఆయన్ను కలిసినప్పటికీ నాపై మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేశారు'' అని ఆమె రాశారు.
క్రైస్తవులు, ముస్లింలు, యూదులు, బౌద్ధులతో పాటు వివిధ మతాలకు చెందిన వారి నుంచి తనకు లభిస్తున్న మద్దతు అందరినీ కలుపుకోయే తన దృక్పథానికి నిదర్శనంగా ఆమె పేర్కొన్నారు.
''దురదృష్టకరమైన విషయమేంటంటే, హిందూఫోబియా అనేది నిజం. ఈ కాంగ్రెస్ (పార్లమెంట్), అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో దానిని నేను ప్రత్యక్షంగా చూశా. మన దేశంలో హిందువులు నిత్యం భరించాల్సినదానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. అయితే, మన రాజకీయ నాయకులు మీడియా దీనిని సహించలేకపోగా, ప్రచారం కూడా చేస్తుండడం బాధాకరం'' అని 2020లో ఆమె ఎక్స్‌లో రాశారు.
తులసి గబార్డ్ చాలా సందర్భాల్లో, హిందూమత గ్రంథం భగవద్గీత గురించి ప్రస్తావిస్తూ, అందులోని శ్లోకాలను వల్లెవేస్తూ కనిపించేవారు. పార్లమెంట్‌కు ఎన్నికైన తొలిసారి ఆమె భగవద్గీతపై ప్రమాణం చేశారు.
ప్రమాణ స్వీకారం తర్వాత తులసి మాట్లాడుతూ....‘‘నా దేశం కోసం, పొరుగువారి కోసం నా జీవితాన్ని అంకితం చేసేందుకు భగవద్గీత నాకు స్ఫూర్తినిచ్చింది’’ అని చెప్పారు.
2020లో, కరోనా కారణంగా ప్రపంచం కష్టకాలంలో ఉన్న సమయంలో, తులసి గబార్డ్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నిలిచారు.
అనంతరం ఆమె భగవద్గీత గురించి ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ''ఈ కష్టకాలం నాకు మిడిల్ ఈస్ట్‌లో పనిచేసిన నాటి రోజులను గుర్తుకుతెస్తోంది. ఇప్పటి పరిస్థితిలాగే, అప్పట్లో మా ప్రాణాలు నిత్యం ప్రమాదంలో ఉండేవి. ఇప్పుడు చనిపోతున్న తరహాలోనే అప్పుడు కూడా చాలామంది చనిపోయారు. అప్పుడూ, ఇప్పుడూ నాకు భగవద్గీత ధైర్యాన్ని ఇస్తుంది'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ గురించి ఆమె ఏమన్నారు?
2021లో దుర్గాపూజ సందర్భంగా బంగ్లాదేశ్‌లో హింస చెలరేగి దాదాపు వందకి పైగా హిందూ కుటుంబాలపై దాడులు జరిగాయి. అనేక హిందూ దేవాలయాలు, ఇళ్లు, దుకాణాలు ధ్వంసం కావడంపై కేసులు నమోదయ్యాయి.
ఈ దాడులను ఖండిస్తూ తులసి గబార్డ్ ఎక్స్‌లో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
''బంగ్లాదేశ్‌లో దేవాలయాలపై, దేవుడిని ఆరాధించే భక్తులపై ఇంతటి ద్వేషం, హింసను చూసి నా గుండె బద్దలవుతోంది. దేవాలయాలను, విగ్రహాలను ధ్వంసం చేయడం.. ఈ జిహాదీలు నిజంగా దేవుడికి ఎంతదూరంగా ఉన్నారో తెలియజేస్తుంది. ద్వేషంతో రగిలిపోతున్న ఈ జిహాదీ శక్తుల నుంచి హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులతో సహా ఇతర మైనారిటీలను రక్షించేందుకు లౌకికవాదిగా చెప్పుకునే బంగ్లాదేశీ ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన సమయం వచ్చింది.'' అని అందులో పేర్కొన్నారు.
అంతకుముందు, ఆమె బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లోని హిందువులు, ఇతర మైనారిటీల రక్షణకు సంబంధించిన ప్రతిపాదనలను అమెరికా పార్లమెంట్ ముందుంచారు.
బంగ్లాదేశ్‌లో 1971లో హిందువులపై అరాచకాలు మొదలయ్యాయని, దీనికి పాకిస్తాన్ సైన్యమే బాధ్యత వహించాలని ఆమె ఈ సందర్భంగా అన్నారు.
2019 ఆగస్ట్ 5న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని తొలగించడం ద్వారా జమ్ము కశ్మీర్‌కి ప్రత్యేక హోదాను రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.
అదే ఏడాది సెప్టెంబర్‌లో తులసి గబార్డ్‌ను కశ్మీర్ గురించి ప్రశ్నించినప్పుడు, ''కశ్మీర్ సమస్య జటిలమైనది. గతంలో జరిగిన పరిణామాల కారణంగా చాలామంది తమ ఇళ్లను వదిలేసి పారిపోవాల్సి వచ్చింది. నేటికీ వారు తిరిగిరాలేకపోయారు'' అని ఆమె అన్నారు.
ఆర్టికల్ 370 గురించి ప్రస్తావించని ఆమె, ''గత ప్రభుత్వ విధానాలు, చట్టాల ప్రకారం స్వలింగ సంపర్కం ఇక్కడ చట్టవిరుద్ధం. కొద్దిరోజుల కిందట నేనొక మహిళను కలిశాను. ఆస్తిని కలిగివుండే హక్కు కశ్మీరీ మహిళలకు లేదు. ఇలాంటి విధానాల వల్ల మహిళలు అణచివేతకు గురవుతున్నారు" అని అన్నారు.
2017లో సిరియాను సందర్శించిన తులసి గబార్డ్ ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌తో భేటీ కావడం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీపై ఆమె విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
అమెరికా పార్లమెంట్ సభ్యులు విదేశీ నేతలతో భేటీ కావడం సాధారణ విషయమే అయినప్పటికీ, అస్సాద్ ప్రభుత్వం దేశంలో హింసకు, సొంత ప్రజలను అణచివేతకు గురించేస్తోందని ఆరోపణలు ఎదుర్కొంది. దీని కారణంగా అస్సాద్‌తో ఆమె భేటీ చర్చనీయాంశమైంది.
2019లో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడిన సమయంలోనూ ఈ భేటీకి సంబంధించి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














