ఎన్నికల ఫలితాలు: మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ

ఫొటో సోర్స్, Getty Images
మహారాష్ట్రలో 288 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది.
రాత్రి 9. 30 గంటల వరకు ఎన్నికల సంఘం ప్రకటించిన ఫలితాల ప్రకారం, మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఇప్పటి వరకు ఆ పార్టీ 128 స్థానాల్లో విజయం సాధించింది. మరో 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాయుతి కూటమిలోని శివసేన (శిందే వర్గం) 55 స్థానాల్లో గెలిచింది, మరో రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్సీపీ 40 చోట్ల గెలిచింది, ఒక చోట ఆధిక్యంలో ఉంది.
కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి వెనుకంజలో ఉంది.
ఇప్పటి వరకు, కాంగ్రెస్ 13 స్థానాల్లో గెలుపొంది, మరో మూడు చోట్ల ఆధిక్యంలో ఉంది. శివసేన (ఉద్దవ్ ఠాక్రే) 20 సీట్లు సాధించింది. ఎన్సీపీ (శరద్ పవార్) 10 స్థానాలను గెలుచుకుంది.
ఝార్ఖండ్‌లో జేఎంఎం 34 సీట్లు, బీజేపీ 21 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు సాధించాయి.

మహాయుతి భారీ విజయంతో బీజేపీ, శివసేన(శిందే), అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
అయితే, మహాయుతి కూటమి ప్రభుత్వానికి కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.
మహారాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ జితేంద్ర దీక్షిత్ బీబీసీతో మాట్లాడుతూ, మహాయుతి కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పారు. అందువల్ల బీజేపీ నేత మాత్రమే ముఖ్యమంత్రి కాగలరని ఆయన అభిప్రాయపడ్డారు. అలా జరిగితే, ముందుగా గుర్తుకొచ్చే పేరు దేవేంద్ర ఫడణవీస్. ఆయన కాకపోతే మరో కొత్తపేరు తెరపైకి రావొచ్చన్నారాయన.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ అనూహ్యంగా కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసిందని, అదే సంప్రదాయాన్ని ఇక్కడ కూడా కొనసాగిస్తే ఫడణవీస్ కాకుండా మరొకరిని ముఖ్యమంత్రి పదవి వరించవచ్చని జితేంద్ర అన్నారు.
అలా చూస్తే, సుధార్ ముంగంటీవార్ పేరు ముందువరుసలో ఉంటుందని జితేంద్ర దీక్షిత్ చెప్పారు. ఓబీసీ ప్రతినిధిగా ఆయనకు అవకాశం దక్కొచ్చన్నారు. అలాగే, వినోద్ తావ్డే, పంకజ ముండే పేర్లు కూడా పరిశీలించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, facebook/priyanka gandhi
వయనాడ్‌లో ప్రియాంక గాంధీ విజయం
కేరళలోని వయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలూ వెలువడుతున్నాయి.
వయనాడ్‌లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ 4 లక్షలకు పైగాకు ఓట్ల మెజార్టీతో గెలిచారని ఎన్నికల సంఘం ప్రకటించింది.
ప్రియాంక గాంధీకి 6,22,338 ఓట్లు పడగా, సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరికి 2,11,407 వచ్చాయి. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ 1,09,939 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది.
ప్రధానంగా రెండు కూటముల మధ్య జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు ఆయా పార్టీల భవిష్యత్తులకు కీలకం కానున్నాయి. అధికారంలో ఉన్న మహాయుతి కూటమి, విపక్ష మహావికాస్ అఘాడీ భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది.
మహాయుతి కూటమిలో బీజేపీ, ఏక్‌నాథ్ శిందే సారథ్యంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి.
మరో కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(శరద్ పవార్), కాంగ్రెస్ పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి.

మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో అధికారం కైవసం చేసుకునేందుకు 145 సీట్లు రావాల్సి ఉంటుంది.
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 56 స్థానాలు, ఎన్‌సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలను గెలుచుకున్నాయి.
ఆ ఎన్నికల అనంతరం, శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ జట్టుకట్టి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, ఆ తర్వాత శివసేనలో ఏక్‌నాథ్ శిందే వర్గం చీలికతో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్ శిందే ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా రెండుగా చీలిపోయింది. అజిత్ పవార్ వర్గం పార్టీని వీడి బీజేపీ - శిందే కూటమికి మద్దతునిచ్చింది.
దీంతో మహారాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. దాంతో ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి.
బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఏ నాయకుడి వర్గానికి ప్రజామోదం లభించిందనే అంశం మహారాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ కీలకంగా మారనుంది.

ఫొటో సోర్స్, facebook
ఝార్ఖండ్ ఎన్నికలు ఫలితాలు..
మొత్తం 81 స్థానాలున్న ఝార్ఖండ్ అసెంబ్లీకి రెండువిడతలుగా పోలింగ్ జరిగింది. నవంబర్ 13, నవంబర్ 20న ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. ఇవాళ ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలో ఇండియా కూటమి ఎన్నికల్లో పోటీ చేసింది.
ఈ కూటమిలో జేఎంఎం, కాంగ్రెస్ ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ నేతృత్వంలోని కూటమిలో ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ ఉంది.
మెజార్టీ సీట్లలో బరిలోకి దిగిన బీజేపీ, కూటమిలోని ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు పది సీట్లు కేటాయించింది.
మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సారథ్యంలోని ఇండియా కూటమి, ఈసారి ఎలాగైనా ఝార్ఖండ్ పీఠం దక్కించుకుకోవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డాయి. ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది.
యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) వంటి విషయాలు కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా కనిపించాయి. బంగ్లాదేశీ వలసదారుల అంశాన్ని బీజేపీ తన ప్రచారంలో బలంగా వినిపించింది.
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో మహిళా ఓటర్లు అత్యధికంగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తం 81 స్థానాలకు గానూ దాదాపు 68 స్థానాల్లో మహిళల ఓటింగ్ ఎక్కువగా నమోదైందని ఎన్నికల అధికారులు గురువారం తెలిపారు.
నవంబర్ 13న 43 అసెంబ్లీ స్థానాలకు, నవంబర్ 20న 38 స్థానాలకు ఈ రాష్ట్రంలో పోలింగ్ జరిగింది.

ఫొటో సోర్స్, ANI
వయనాడ్ నుంచి ప్రియాంక
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఆమెపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI)కి చెందిన సత్యన్ మోకేరీ, బీజేపీకి చెందిన నవ్యా హరిదాస్ పోటీలో ఉన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాలు వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం వయనాడ్ సీటును వదులుకోవడంతో ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో నిలిచారు.
మహారాష్ట్రలోని నాందేడ్ లోక్ సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర చవాన్‌పై బీజేపీ అభ్యర్థి డాక్టర్ సంతుక్‌రావ్ హంబర్డే పోటీ చేశారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వసంతరావ్ చవాన్ 56 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ప్రతాప్‌రావ్ చిఖ్లీకర్‌పై విజయం సాధించారు.
వసంతరావ్ చవాన్ ఈ ఏడాది ఆగస్ట్ 26న మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.
అసెంబ్లీ ఉప ఎన్నికల స్థానాలివే..
లోక్ సభ ఉప ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీల్లో ఖాళీగా ఉన్న శాసన సభ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి.
వీటిలో అస్సాంలోని 5 స్థానాలు, బీహార్ - 4, ఛత్తీస్‌గఢ్ - 1, గుజరాత్ - 1, కర్ణాటక - 3, కేరళ - 2, మధ్యప్రదేశ్ 2, మేఘాలయ 1, పంజాబ్ - 4, రాజస్థాన్ - 7, సిక్కిం - 2, ఉత్తరప్రదేశ్ - 9, ఉత్తరాఖండ్ - 1, పశ్చిమ బెంగాల్ నుంచి 6 స్థానాలు ఉన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














