బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ షిప్... ఆ రెండు దేశాల మధ్య అసలేం జరుగుతోంది, భారత్ ఆందోళన దేనికి?

చిట్టగాంగ్‌ పోర్టులో పాకిస్థాన్ కార్గో షిప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సముద్ర వాణిజ్యంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ నేరుగా భాగస్వాములు కావడం వాటి సంబంధాల మధ్య మార్పును సూచిస్తోంది.

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా రాజీనామా తర్వాతి నుంచి పరిస్థితులు మారిపోతున్నాయి. భారత్‌కు ఆందోళన కలిగించే అనేక విషయాలు అక్కడ జరుగుతున్నాయి.

గత బుధవారం పాకిస్తాన్ కార్గో షిప్ కరాచీ నుంచి బయలుదేరి బంగ్లాదేశ్ ఆగ్నేయ తీరంలో ఉన్న చిట్టగాంగ్ పోర్టుకు చేరుకుంది.

పాకిస్తాన్ నుంచి 1971లో విడిపోయి బంగ్లాదేశ్ ఆవిర్భవించిన తర్వాత రెండు దేశాలు ఇలా సముద్ర వాణిజ్యంలో నేరుగా భాగస్వాములు కావడం ఇదే తొలిసారి.

గతంలో సింగపూర్ లేదా కొలంబో ద్వారా ఈ రెండు దేశాల సముద్ర వాణిజ్యం జరిగేది.

‘‘పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నౌకాశ్రయానికి ఒక కార్గో నౌక నేరుగా చేరుకోవడం ఇదే తొలిసారి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ముఖ్యమైన దశకు ఇది నాంది’’ అని బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ హైకమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.

‘‘ఈ కొత్త మార్గం వల్ల రవాణా సదుపాయాలు పెరుగుతాయి. రవాణా సమయం తగ్గిపోతుంది. రెండు దేశాలకు కొత్త వ్యాపార అవకాశాలు ఏర్పడతాయి’’ అని ఆ ప్రకటనలో తెలిపారు.

సముద్రవాణిజ్యంలో ఇలా రెండు దేశాలు నేరుగా భాగస్వాములు కావడం పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంప్రదాయకంగా, క్లిష్టంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రక మార్పును సూచిస్తోంది.

భారత్‌తో స్నేహపూర్వకంగా ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత బంగ్లాదేశ్‌లో ఏర్పడిన మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం... పాకిస్తాన్‌తో సంబంధాలను బలోపేతం చేసుకుంటోందనడానికి కూడా ఇది ఓ సంకేతం.

తాజా పరిణామం భారత్‌కు ఆందోళన కలిగించేదే. హసీనా తొలగింపు తర్వాత భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
షాబాజ్ షరీఫ్, ముహమ్మద్ యూనస్

ఫొటో సోర్స్, YEARS

ఫొటో క్యాప్షన్, ఇరుదేశాల మధ్యన కొత్త అధ్యాయం ప్రారంభించడంపై న్యూయార్క్‌లో షాబాజ్ షరీఫ్, మొహమ్మద్ యూనస్ సమావేశమయ్యారు

బంగ్లాదేశ్ విధానాల్లో మార్పులు

షేక్ హసీనాను అధికారం నుంచి తొలగించిన తర్వాత ఇస్లామాబాద్, ఢాకా రెండూ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం గురించి మాట్లాడాయి.

ఈ ఏడాది సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశం సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్, పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పునురుద్ధరించడంపై చర్చలు జరిపారు.

అనేక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు దేశాల మధ్య సంబంధాలలో “కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాల్సిన అవసరాన్ని గురించి చర్చలు జరిపాం’’అని న్యూయార్క్‌లో యూనస్ చెప్పారు.

హసీనా పరిపాలనాకాలంలో ఉన్న విధానాల్లో ఇది పెద్ద మార్పు.

ఆగస్టు 2022లో బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనా నిర్మిత పీఎన్‌ఎస్ తైమూర్‌ యుద్ధనౌకను చిట్టగాంగ్ నౌకాశ్రయంలో నిలపడానికి అనుమతి నిరాకరించిందని హిందుస్థాన్ టైమ్స్‌ తెలిపింది.

కంబోడియా, మలేషియా నౌకాదళాలతో నావికా విన్యాసాల అనంతరం ఆ యుద్ధనౌకను చివరకు శ్రీలంక నౌకాశ్రయంలో నిలిపారు.

సైనిక విన్యాసాలు ముగించుకుని పాకిస్తాన్ వెళుతున్న యుద్ధ నౌకను చిట్టగాంగ్‌ ఓడరేవులో నిలపడానికి బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అనుమతించలేదు. చైనా నౌక కొలంబో పోర్టుకు రావడానికి శ్రీలంక అనుమతి ఇచ్చింది.

పాకిస్తాన్‌లో 2025లో జరగబోయే నౌకాదళ విన్యాసాల్లో పాల్గొనబోతున్నట్టు ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రకటించింది.

ఇది రెండు దేశాల మధ్య ఉన్న సైనిక సహకారాన్ని కూడా తెలియజేస్తోంది.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షేక్ హసీనా రాజీనామాతో తమకు ఒక కొత్త అవకాశం దొరికిందని పాకిస్తాన్ భావిస్తోంది

షేక్ హసీనా రాజీనామా: పాక్‌కు అవకాశం

ఈ ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌లో జరిగిన అధికార మార్పిడితో పాకిస్తాన్‌కు ఒక అవకాశం వచ్చిందని భారత్‌లోని పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ పాకిస్తాన్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ అంగీకరించారు. షేక్ హసీనా పూర్తిగా భారత్‌కు అనుకూలంగా ఉండేవారని తెలిపారు.

బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ సంబంధాలు అంతంత మాత్రంగా ఉండడానికి షేక్ హసీనాదే బాధ్యతని ఆయనన్నారు. “షేక్ హసీనా భారత్ చెప్పినట్టల్లా చేస్తారు. ఆమెకు ఓ ఎజెండా ఉంది. దానికి తగ్గట్టుగా ఆమె ముందుకు వెళతారు’’ అని బాసిత్ చెప్పారు.

పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌కు తొలి కార్గో చేరుకోవడం చాలా ముఖ్యమైన ఘటన అని అబ్దుల్ బాసిత్ అంటున్నారు.

“పాకిస్తాన్ కార్గో షిప్ నేరుగా చిట్టగాంగ్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. ఇది భారత్‌లో కలవరం కలిగించింది. ఇంతకు ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఏ వాణిజ్యం జరిగినా సింగపూర్, శ్రీలంక మీదుగా జరిగేది. ప్రస్తుత బంగ్లాదేశ్‌ నాయకత్వానికి విశాల దృక్పథం ఉంది. భారత్‌తో మెరుగైన సంబంధాల విషయంలో వారు వ్యతిరేకంగా ఉన్నారనుకోకూడదు. దీంతో పాటు వారు అనేక అవకాశాలను ఏర్పరుచుకుంటున్నారు. వాటిలో పాకిస్తాన్‌తో సంబంధాలను పెంచుకోవడం ఎందుకుండకూడదు’’ అని బాసిత్ ప్రశ్నించారు.

"ఇప్పుడు వాణిజ్యం, పరిశ్రమల ఏర్పాటు తదుపరి దశగా ఉంటుంది. వాణిజ్య ప్రతినిధులు ఇరుదేశాల్లో పర్యటించడం వంటివి ఉన్నాయి. వచ్చే ఏడాదికి విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది.’’ అని ఆయన చెప్పారు.

“షేక్ హసీనా నిష్క్రమణ ద్వారా పాకిస్తాన్‌కు ఒక అవకాశం లభించింది. పాకిస్తాన్-బంగ్లాదేశ్ సంబంధాలపై షేక్ హసీనా ఆలోచనావిధానం వల్ల మేం బంగ్లాదేశ్‌తో సంబంధాలపై ఆశలు వదిలేసుకున్నాం. ఆమె పాకిస్తాన్ విషయంలో పక్షపాతంగా వ్యవహరించేవారు. గతం నుంచి ఆమె బయటకు రాలేకపోయారు’’ అని ఆయన చెప్పారు.

"ఇప్పుడు మా ముందుకు ఓ అవకాశం వచ్చింది. దానిని ఇరు దేశాల ప్రయోజనాల కోసం మేం సరిగ్గా ఉపయోగించాలి’’ అని అబ్దుల్ బాసిత్ అన్నారు.

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూనస్ బంగ్లాదేశ్ బహిష్కృత ప్రధాని షేక్ హసీనాకు దీర్ఘకాల రాజకీయ శత్రువు

ఉచిత వీసాలు

వాణిజ్యంతో పాటు ఇతర రంగాల్లోనూ సహకారం కోసం పాకిస్తాన్ చర్యలు తీసుకుంటోంది.

బంగ్లాదేశ్ పౌరుల కోసం తక్షణ ఉచిత వీసా సౌకర్యాన్ని పాకిస్తాన్ ప్రారంభించింది.

“బంగ్లాదేశ్ పౌరులకు ఉచిత వీసాలు ఇస్తాం. దీనిపై 48 గంటల్లో నిర్ణయం తీసుకుంటాం. వీసా కావాల్సిన వాళ్లు వెబ్‌సైట్‌లో మాత్రమే సమాచారం ఇవ్వాలి. వ్యాపార, పర్యటక వీసాలు అనే రెండు రకాలున్నాయి. రిటర్న్ టికెట్, వారు ఎక్కడ ఉండాలనుకుంటున్నారనే సమాచారాన్ని మాత్రమే ప్రయాణికులు అందించాలి’’ అని బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ అహమ్ మరూఫ్ నవంబర్ 6న చెప్పారు.

భారత్, బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సంబంధాలలో చరిత్రాత్మక మార్పుపై భారత్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది.

భారత్‌కు ఆందోళన

పాకిస్తాన్, బంగ్లాదేశ్ సంబంధాలలో చరిత్రాత్మక మార్పుపై భారత్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది.

“బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్, మోంగ్లా రెండు ప్రధాన ఓడరేవులు. ఈ రెండు రేవులు ఐదు దశాబ్దాలుగా పాకిస్తాన్‌కు అందుబాటులో లేవు. గతంలో కొలంబో, శ్రీలంక మీదుగా రెండు దేశాల మధ్య సముద్ర సంబంధాలు ఉండేవి. ఇప్పుడు పాకిస్తాన్ నౌకలు నేరుగా చిట్టగాంగ్ చేరుకోనున్నాయి. నిషేధిత వస్తువులు బంగ్లాదేశ్‌కు వెళ్లి అక్కడి నుంచి అవి భారత్‌లోని వేర్పాటువాద గ్రూపుల చేతుల్లోకి వెళ్లే అవకాశాన్ని తోసిపుచ్చలేం’’ అని కోల్‌కతాకు చెందిన పత్రిక ది టెలిగ్రాఫ్‌కు ఒక నిపుణుడు చెప్పారు.

చిట్టగాంగ్‌లో 2004లో భారీగా స్వాధీనం చేసుకున్న అక్రమ ఆయుధాల ఘటనను ఆయన ప్రస్తావించారు.

బంగ్లాదేశ్‌లో 2001నుంచి 2006 మధ్య ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్‌పీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పది ట్రక్కుల ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది.ఈ ఘటన అప్పటి ప్రభుత్వానికి అనేక సమస్యలు తెచ్చిపెట్టింది.

ఏప్రిల్ 1, 2004న బంగ్లాదేశ్ చరిత్రలోనే భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఆయుధాలను రెండు పెద్ద ట్రాలర్ల ద్వారా సముద్ర మార్గంలో చిట్టగాంగ్‌లోని యూరియా ఎరువుల జెట్టీకి తీసుకువచ్చారు.

అంత భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం అప్పటి బంగ్లాదేశ్, భారత్ సంబంధాలపై ప్రభావం చూపింది.

షేక్ హసీనా, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌తో బంగ్లాదేశ్ సంబంధాలు ఎప్పటికప్పుడు బలపడ్డాయి.

దక్షిణాసియాలో ప్రభావం

బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న సంబంధాన్ని భారతదేశం గమనిస్తోంది. దక్షిణాసియాలోని భౌగోళిక రాజకీయ సమీకరణాలపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది.

“గత ఏడాది మోంగ్లా పోర్ట్‌ నిర్వహణ బాధ్యత భారత్‌కు లభించింది. చైనా విషయంలో భారత్‌కు ఇది వ్యూహాత్మక ప్రయోజనం కలిగించే విషయం. అయితే ఇప్పుడు చిట్టగాంగ్ పోర్ట్‌తో పాకిస్తాన్‌కు సంబంధాలు ఏర్పడ్డాయి. రెండు పోర్టులు పాకిస్తాన్ నౌకలను అనుమతిస్తాయి. మియన్మార్‌కు చిట్టగాంగ్ దగ్గరలో ఉంది. ఈ కొత్త మార్పులు భౌగోళిక రాజకీయాలపై ప్రభావం చూపుతాయి’’ అని భారత భద్రతా సంస్థలకు చెందిన వర్గాలు టెలిగ్రాఫ్ వార్తా పత్రికకు చెప్పాయి.

ఈశాన్య ప్రాంతంలోని తిరుగుబాటు గ్రూపులు మియన్మార్‌లో ఆశ్రయం పొందుతున్నాయని ఈ మార్గం ద్వారా వారికి ఆయుధాలు అందుతున్నాయని భారత భద్రతా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి.

తొలుత బంగ్లాదేశ్‌కు చెందిన జమాతే ఇస్లామీపై నిషేధాన్ని ఎత్తివేస్తామనడం, ఇప్పుడు బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి సెక్యులరిజం అనే పదాన్ని తొలగిస్తున్నట్టు వార్తలు రావడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశాలు.

"బంగ్లాదేశ్‌ మిలిటరీ పాలనలో ఉందని, యూనస్ దేశానికి నామమాత్రపు అధిపతిగా ఉన్నారని... హింసాత్మక ఇస్లాంవాదులకు బంగ్లాదేశ్ కంచుకోటగా మారుతోందని ప్రముఖ భారతీయ రక్షణ నిపుణుడు బ్రహ్మ చెల్లానీ విశ్లేషించారు. రాజ్యాంగం నుంచి సెక్యులరిజం అనే పదాన్ని తొలగిస్తామని అటార్నీ జనరల్ హైకోర్టుకు చెప్పారని విమర్శించారు.

ముస్లిం జనాభా 90 శాతం ఉన్న దేశంలో సెక్యులరిజం అనేపదం వాస్తవ పరిస్థితులకు విరుద్ధమైనదని అటార్నీ జనరల్ వాదిస్తున్నారని బ్రహ్మ చెల్లానీ విమర్శించారు.

పాకిస్థాన్‌తో బంగ్లాదేశ్ సత్సంబంధాలు ఏర్పరచుకోవడం ఇదే మొదటిసారి కాదు.

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), సైనిక నియంతల నేతృత్వంలోని ప్రభుత్వాలు కూడా 16 ఏళ్లపాటు పాకిస్తాన్‌తో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాయి.

అయితే, భారత్‌తో బంగ్లాదేశ్ సంబంధాలు ఎప్పటికప్పుడు బలపడ్డాయి.

షేక్ హసీనా ప్రధానిగా ఉన్న 1996- 2001 మధ్య, 2009- 2024 మధ్య రెండు దేశాల మధ్య స్నేహబంధం బలంగా ఉంది.

హసీనా 15 ఏళ్ల పాలనలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ద్వైపాక్షిక ఆర్థిక సహకారం కూడా గణనీయంగా పెరిగింది. వాణిజ్యం, ఇంధనం, రక్షణ రంగాలలో రెండు దేశాల మధ్య విస్తృత సహకారం ఉంది. దక్షిణాసియాలో భారతదేశానికి బంగ్లాదేశ్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.

రెండు దేశాల మధ్య 16 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)