మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికలు: ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలు ఏం చెబుతున్నాయి?

హేమంత్ సోరెన్, ఏక్‌నాథ్ షిండే

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా, ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించాయి.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరిగాయి.

ఈ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని ఎక్కువ సర్వేలు అంచనా వేశాయి.

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్ల సంఖ్య 145. బీజేపీ నేతృత్వంలోని కూటమి 150 నుంచి 170 స్థానాలు గెలుచుకునే అవకాశముందని మాట్రిజ్ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ కూటమి 110 నుంచి130 స్థానాలు సాధించవచ్చని అంచనా వేసింది. ఇతరులు 8 - 10 సీట్లు గెలుచుకోవచ్చని తెలిపింది.

పీపుల్స్ పల్స్ అంచనా ప్రకారం, మహాయుతి 182 స్థానాల్లోనూ, మహా వికాస్ అఘాఢీ 97 స్థానాల్లోనూ గెలిచే అవకాశముంది.

బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 152 - 160 స్థానాలను సాధించే అవకాశముందని, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ 130 - 138 స్థానాల్లో గెలిచే అవకాశముందని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది.

మహాయుతి 137- 157 సీట్లు, మహా వికాస్ అఘాడీ 126-146 స్థానాలు గెలుచుకునే అవకాశముందని పీ– మార్క్ సర్వే పేర్కొంది.

లోక్‌షాహి-మరాఠి-రుద్ర సర్వే అంచనాల ప్రకారం, మహాయుతి 128 - 142 స్థానాల్లో, ఎంవీఏ 125 – 140 సీట్లలో గెలుపొందే అవకాశముంది.

టైమ్స్ నౌ-జేవీసీ అంచనా ప్రకారం, మహాయుతి 150-167 సీట్లు, ఎంవీఏ 107-125 స్థానాలు, ఇతరులు 13 నుంచి 14 సీట్లు గెలుచుకునే అవకాశముంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఝార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఝార్ఖండ్‌లో రెండు దశల్లో ముగిసిన పోలింగ్

ఝార్ఖండ్ ఎగ్జిట్ పోల్ అంచనాలు..

ఝార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ జరిగింది.

ఝార్ఖండ్‌లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలూ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందన్న అంచనాలను వెలువరించాయి.

ఎన్డీఏకు 42-47 సీట్లు రావొచ్చని మాట్రిజ్ సర్వే అంచనా వేసింది. జేఎంఎం నేతృత్వంలోని ఆల్ ఇండియా కూటమికి 25-30 సీట్లు, ఇతరులకు 1-4సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పింది.

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం, ఎన్డీఏకు 42-48 సీట్లు, ఇండియా కూటమికి 16-23 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

వీటికి భిన్నంగా ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. ఇండియా కూటమి 53 స్థానాలు, ఎన్డీఏ 25 స్థానాలు గెలుచుకోవచ్చని ఈ సర్వే తెలిపింది.

ఝార్ఖండ్‌లో ఎన్డీఏ 45 నుంచి 50 సీట్లు సాధించే అవకాశం ఉందని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. ఇండియా కూటమి 35-38 సీట్లు, ఇతరలు 3-5 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.

టైమ్స్ నౌ-జేవీసీ సర్వే, ఎన్డీఏ 40-44 స్థానాలతో ముందంజలో ఉంటుందని, ఇండియా కూటమి 30-40 స్థానాలు గెలుచుకునే అవకాశముందని, ఇతరులు ఒక చోట గెలుపొందుతారని అంచనావేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)