మహారాష్ట్ర ఎన్నికలు: శివసేన-బీజేపీలకు కాంగ్రెస్, ఎన్సీపీ పోటీ ఇవ్వగలవా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మయూరేష్ కొన్నూర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 21న, కౌంటింగ్ అక్టోబర్ 24న జరగనున్నాయి.
మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ లాంటి విపక్షాలు బీజేపీ-శివసేనకు సవాలు విసరగలవా? లేక ఐదు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లాగే మహారాష్ట్రలో అసెంబ్లీ ఫలితాలు పునరావృతం అవుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
2014 ఎన్నికల్లో మహారాష్ట్రలో ఏం జరిగింది?
2014లో దిల్లీలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఆరు నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ప్రభావం కనిపించింది. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి అయ్యారు.
ఆ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు. అందువల్ల శివసేనతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అయితే, ఆ ఎన్నికలకు ముందు సీట్ల పంపకాల్లో తేడాలు రావడంతో శివసేన-బీజేపీ తమ మధ్య ఉన్న 25 ఏళ్ల పొత్తును తెంచుకున్నాయి.
రెండు పార్టీలు విడివిడిగా ఎన్నికల బరిలోకి దిగాయి. కానీ ఎన్నికల తర్వాత మూడు నెలలకే శివసేనకు చెందిన 63 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో ఒప్పందం చేసుకుని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు.
గతంలో 1995లో మాత్రమే శివసేన-బీజేపీ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అది రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం.
అంతకు ముందు మహారాష్ట్రలో 1999 నుంచి 2014 వరకు అంటే 15 ఏళ్లు కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అధికారంలో ఉంది. కానీ 2014లో బీజేపీతో పోటీపడడంలో అవి వెనకబడిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
గత ఐదేళ్లలో ఏం జరిగింది?
శివసేన-బీజేపీ కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఆ రెండు పార్టీలు ఎప్పుడూ గొడవలతో పతాక శీర్షికల్లో నిలుస్తూ వచ్చాయి.
శివసేన ప్రభుత్వంలో భాగం కాలేదు. కానీ బీజేపీ రాజకీయ, ఆర్థిక విధానాలను తప్పుబడుతూ ఎప్పుడూ దూకుడు చూపించేది. బహుశా విపక్షాలు కూడా అంతగా వ్యతిరేకించ లేకపోయాయి.
నోట్లరద్దు అయినా, ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ అయినా, ముంబయి మెట్రో ఆరే కార్‌షెడ్‌పై నిరసనలు అయినా... శివసేన చాలాసార్లు బీజేపీని వ్యతిరేకిస్తూ కనిపించింది.
గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లో బీజేపీ-శివసేన విజయం సాధించాయి. అవి పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలైనా శివసేన-బీజేపీ విడివిడిగా పోటీచేశాయి. కానీ, విపక్షాలకు మాత్రం ఎలాంటి అవకాశం దక్కలేదు.
ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెండింటి మధ్యా గట్టిపోటీ నెలకొంది. ఎన్నో ఏళ్ల నుంచి శివసేన చేతుల్లో ఉన్న ముంబయి ఆ పార్టీ చేజారుతుందేమో అనిపించింది. కానీ ఇద్దరు కార్పొరేటర్ల మెజారిటీతో శివసేన మరోసారి ముంబయిని సొంతం చేసుకుంది. అయితే, ఇన్ని గొడవలు వచ్చినా ప్రభుత్వంలో కొనసాగుతూనే వచ్చింది.
శివసేన.. బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు కూడా చేయడంతో రాజకీయ కలకలం కూడా రేగింది. ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్న రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత ఏక్‌నాథ్ ఖడ్సే భూకుంభకోణం ఆరోపణలతో రాజీనామా కూడా చేశారు.
పంకజ్ ముండే, వినోద్ తావాడే లాంటి మంత్రులపై కూడా విపక్షాలు ఆరోపణలు చేశాయి. కానీ వారి పదవులకు మాత్రం ఎలాంటి ప్రమాదం రాలేదు.

మరాఠా రిజర్వేషన్ ఉద్యమం, రైతు ఉద్యమం, భీమా కోరెగావ్
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు మొదలైనప్పుడు బీజేపీ-శివసేన ప్రభుత్వానికి ఐదేళ్లలో మొట్టమొదటి పరీక్ష ఎదురైంది. రాష్ట్ర జనాభాలో మరాఠాల సంఖ్య ఎక్కువ. వారు సుదీర్ఘ కాలంగా ఓబీసీ రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమంలో లక్షలాది మంది రోడ్లపైకి వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో హింస కూడా చెలరేగింది.
చివరికి ప్రభుత్వం రిజర్వేషన్ల డిమాండ్‌ను అంగీకరించాల్సి వచ్చింది. ప్రభుత్వం మరాఠాలు ఆర్థిక, విద్యా పరంగా వెనుకబడినట్లు ప్రకటించి 18 శాతం రిజర్వేషన్లు కల్పించింది. హైకోర్టు కూడా ఈ రిజర్వేషన్లను కొనసాగించింది.
ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారీ స్థాయిలో రైతుల ఆందోళన కూడా జరిగింది. ఒత్తిడిలో పడిన ప్రభుత్వం.. రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది. అయితే ఆ పథకం రైతుల వరకూ చేరలేదనే ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కువ ఒత్తిడి తెచ్చింది మాత్రం 2018 జనవరి 1న భీమా- కోరెగావ్‌లో వేలాది దళిత కార్యకర్తలు ఒక్కటి కావడమే. చారిత్రక యుద్ధం జరిగి 200 ఏళ్లు పూర్తైన సందర్భంగా వారు సంబరాలు చేసుకున్నారు. కానీ అక్కడ హింస జరిగింది. రాళ్లు రువ్వుకోవడాలు, నిప్పు పెట్టడం వల్ల చాలా నష్టం జరిగింది.

ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?
అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో శివసేన-బీజేపీ పొత్తు కొనసాగుతుందా.. లేక ఆ రెండూ విడివిడిగా ఎన్నికల బరిలోకి దిగుతాయా అనే ప్రశ్న వస్తోంది.
లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేపీ-శివసేన పొత్తు పెట్టుకున్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండూ సగం సగం సీట్లలో పోటీచేయాలని నిర్ణయించుకున్నాయి. కానీ లోక్‌సభ ఎన్నికల్లో లభించిన చారిత్రక విజయం తర్వాత శివసేనకు అన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేమని బీజేపీ స్పష్టం చేసింది.
బీజేపీలోని ఒక వర్గం తమ పార్టీ సొంతంగా మెజారిటీ స్థానాలు గెలుచుకోగలదని చెబుతోంది. అయితే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాత్రం పదేపదే పొత్తు గురించి మాట్లాడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కొన్నిరోజుల క్రితం ఒక కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదే వేదికపై కూర్చున్న ఉద్ధవ్ ఠాక్రేను 'తమ్ముడు'గా వర్ణించారు. మహారాష్ట్ర రాజకీయాల ప్రకారం చూస్తే, ఎవరికి తక్కువ చోటు ఉంటుందో వారిని 'తమ్ముడు' అంటారు.
మరోవైపు బీజేపీ, శివసేన చేస్తున్న పోటాపోటీ ప్రచార సన్నాహాలు చూస్తుంటే, బహుశా అవి ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లే అనిపిస్తోంది.
ముఖ్యమంత్రి ఫడణవీస్ ఆగస్టులో 'మహా జనాదేశ్ యాత్ర' ప్రారంభించారు. కానీ ఆ యాత్ర గురించి ప్రకటించగానే శివసేన నేత, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే 'జన ఆశీర్వాద్ యాత్ర' ప్రారంభించారు.
శివసేన వైపు నుంచి ఆదిత్య పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పడం మొదలైంది. ఠాక్రే కుటుంబం నుంచి ఇప్పటివరకూ ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు ఆదిత్య ముంబయిలోని ఏదో ఒక స్థానం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని స్పష్టమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
విపక్షాల నుంచి వలసలు
కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి చాలా మంది ప్రముఖ నేతలు బీజేపీ, శివసేన వైపు వెళ్తున్నారు. ఈ స్థాయిలో ఇంతమంది పార్టీలు మారడం మహారాష్ట్రలో ఎప్పుడూ జరగలేదు. అంటే దీనిని బట్టి బీజేపీ-శివసేన బలంగా ఉన్నట్లు, విపక్షాలు బలహీనం అయ్యాయనే భావన వస్తోంది.
నేతలు పార్టీలు మారడం వల్ల ఎక్కువగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు నష్టం జరిగింది. ఆయనతో పాటు ఎన్నోఏళ్లు రాజకీయాల్లో ఉండి, పవార్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసిన ఒక నేత ఇప్పుడు ఆయన్ను వదిలి వెళ్తున్నారు.
అధికారపక్షం నుంచి ఏజెన్సీల విచారణ పేరుతో విపక్ష నేతలను భయపెడుతున్నారని, నేతలను పార్టీకి దూరం చేస్తున్నారని శరద్ పవార్ స్వయంగా చెప్పారు.
కాంగ్రెస్ నుంచి కూడా చాలా మంది పెద్ద నేతలు అధికార పార్టీలోకి వెళ్లారు. అయితే పార్టీ లోపల గ్రూపులు ఏర్పడడం కూడా కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి కారణం. దానివల్ల మహారాష్ట్రలో పార్టీ బలహీనపడింది.
ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు వచ్చారు. ముంబయి కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇప్పటికీ ఖాళీగానే ఉంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇద్దరూ మహారాష్ట్ర వైపు దృష్టి పెట్టలేదు.
మొత్తంగా చూస్తే, మహారాష్ట్రలో చెల్లాచెదురైపోయిన కాంగ్రెస్.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేనలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
దళిత, ముస్లిం ఓట్లు ఏమవుతాయి?
భీమా-కోరెగావ్ ఘటన తర్వాత ఆగ్రహించిన దళిత సమాజాన్ని ప్రకాశ్ అంబేడ్కర్ ముందుకు నడిపించారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీతో చేతులు కలిపిన ఆయన లోక్‌సభ ఎన్నికల ముందు 'వంచిత బహుజన అగాడీ' కూటమిని ఏర్పాటు చేశారు. ముస్లిం ఓట్లు రాబట్టుకోడానికి చేసిన ఈ ప్రయత్నం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పెద్ద ప్రభావాన్నే చూపించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ కూటమి విడిపోయింది. సీట్ల పంపకంపై రెండు పార్టీల్లో విభేదాలు తలెత్తడంతో పొత్తు తెగిపోయింది.
మహారాష్ట్రలో ఒక భాగమైన మరాఠ్వాడా కరవు కోరల్లో చిక్కుకుంటే, మరో భాగం పశ్చిమ మహారాష్ట్ర ఇటీవలి వరదల నుంచి తేరుకుంటోంది.
ముంబయి, పుణె, నాసిక్, ఔరంగాబాద్, పారిశ్రామిక రంగాలపై ఆర్థిక మందగమనం దెబ్బ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంశాలన్నీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయా లేదా జాతీయవాదం, ఆర్టికల్ 370 లాంటి అంశాలు వాతావరణాన్ని వేడెక్కిస్తాయా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి
- అత్యాచారం ఆరోపణలపై బీజేపీ నేత చిన్మయానంద అరెస్టు
- శేఖర్ రెడ్డిని చంద్రబాబు బినామీ అన్న జగన్ ఆయనను టీటీడీ బోర్డులోకి ఎలా తీసుకున్నారు?
- గోదావరి పడవ ప్రమాదాలు: ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేంటి? ఫలితాలేమైనా ఉన్నాయా?
- గాంధీకి దగ్గరైన ఈ ఎనిమిది మంది మహిళల గురించి మీకు తెలుసా?
- గోదావరిలో పడవ ప్రమాదం: కొనసాగుతున్న గాలింపు చర్యలు.. బోటును బయటకు తీయడంలో ఆలస్యం
- గ్లోబల్ వార్మింగ్ వెనుక ఉన్న డర్టీ సీక్రెట్ ఇదే
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
- #HowdyModi: అమెరికాలో మోదీ కార్యక్రమానికి రానున్న ట్రంప్
- దిల్లీ కాలుష్యం: దేశ రాజధానిలో వాయు కాలుష్యం తగ్గుతోందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








