వయనాడ్‌లో తన అన్న రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ, ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

ఫొటో సోర్స్, X/priyankagandhi
వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ 4 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు.
ప్రియాంకకు 6,22,338 ఓట్లు, సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకెరికి 2,11,407 వచ్చాయి. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ 1,09,939 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి విజయం సాధించిన రాహుల్ గాంధీకి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లతో ప్రియాంక గాంధీ గెలిచారు.
తనకు ఈ విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రియాంక గాంధీ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. పార్లమెంటులో ప్రజల గొంతుకగా నిలుస్తానని అన్నారు.
"నా ప్రియమైన వయనాడ్ సోదర సోదరీమణులారా, మీరు నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ విజయం మీదేనని మీకు అనిపించేలా పనిచేస్తాను. మీకు ప్రాతినిధ్యం వహించడానికి మీరు ఎంచుకున్న వ్యక్తి మీ ఆశలు, కలలను అర్థం చేసుకుంటారని, మీ కోసం మీలో ఒకరిగా పోరాడుతారని నిరూపిస్తా. పార్లమెంటులో మీ గొంతుకగా నిలుస్తా. నాకు ఇంతటి గౌరవం, ప్రేమ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. " అని ప్రియాంక రాశారు.
పార్టీ నేతలకు, కార్యకర్తలకు ప్రియాంక గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నాకు అండగా నిలిచి, నా కోసం ఎంతో కష్టపడి ప్రచారం చేసిన కేరళలోని యూడీఎఫ్ నాయకులకు, నా కార్యాలయ సహచరులు, కార్యకర్తలకు ధన్యవాదాలు. మీరంతా రోజూ 12 గంటలు నిద్రాాహారాలు మాని కష్టపడ్డారు.’’ అని ఆమె పేర్కొన్నారు.
“మా అమ్మకు, నా భర్త రాబర్ట్‌కు, నా ఇద్దరు పిల్లలు రెహాన్, మీరాయాకు కృతజ్ఞతలు చాలవు. చివరగా, నా అన్న రాహుల్ గాంధీకి, మీరు చాలా ధైర్యవంతులు, నాకు మార్గం చూపినందుకు, నా వెనుక నిలబడినందుకు ధన్యవాదాలు’’ అని ప్రియాంక రాశారు.


ఫొటో సోర్స్, Getty Images
ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎలా వచ్చారంటే..
1988.. అప్పటికి తన నానమ్మ ఇందిరా గాంధీ హత్యకు గురై నాలుగేళ్లు అవుతోంది. అప్పుడు ఓ వేదిక మీద ప్రియాంక గాంధీని ప్రజలు చూశారు.
అప్పుడామెకు 16 ఏళ్లు. బహిరంగ సభలో ప్రసంగించడం అదే తొలిసారి. అప్పటి నుంచి ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తూ వచ్చాయి.
ఆ సంఘటన జరిగిన 31 ఏళ్ల తర్వాత 2019లో పార్టీలో జనరల్ సెక్రటరీగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంతానికి ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకను కాంగ్రెస్ నియమించింది.
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ప్రియాంక ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ, ఆ స్థానం నుంచి మోదీ పోటీకి దిగడంతో ప్రియాంక తన నిర్ణయాన్ని విరమించుకున్నట్లు వార్తలు వచ్చాయి.
"ప్రియాంక రాజకీయాల్లోకి ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వస్తారు" అని 2018లో సోనియా గాంధీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రియాంక గాంధీని 'భయ్యాజీ' అని ఎందుకంటారు?
బీబీసీ హిందీ కథనం ప్రకారం, ప్రియాంక గాంధీ యుక్తవయసులో ఉన్నప్పుడు తన తండ్రి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీతో కలిసి ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయబరేలీకి వెళ్లేవారు. అప్పుడు ఆమె జుట్టు పొట్టిగా కత్తిరించుకుని ఉండేవారు.
అమేఠీ, రాయబరేలీ నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు గ్రామస్థులు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకను కూడా 'భయ్యా' అని పిలిచేవారు. ఆ తర్వాత రానురాను 'భయ్యా జీ' అని గౌరవంగా పిలవడం మొదలుపెట్టారు.
అందుకు కారణాలు.. ఆమె హెయిర్ స్టైల్, దుస్తుల ఎంపికతో పాటు, ఇందిరా గాంధీ హావభావాలను కలిగి ఉండటమే.

ఫొటో సోర్స్, Getty Images
2004లో ఎన్నికల ప్రచారం
2004 ఎన్నికల ప్రచారంలో ప్రియాంక పాల్గొన్నారు. అప్పటికి ఆమె ప్రియాంక క్రీయాశీల రాజకీయాల్లో లేరు. అయినా, ఆమె అప్పుడు ప్రచారం ఎందుకు చేయాల్సి వచ్చిందో సీనియర్ పాత్రికేయులు రషీద్ కిద్వాయ్ 2019లో వివరించారు.
‘‘2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉందన్న అభిప్రాయం అందరిలో ఉండేది. దాంతో, ఆ పార్టీ అధినాయకత్వం అనుభవం కలిగిన ఓ వ్యూహకర్తను సంప్రదించింది. అత్యంత ప్రభావమంతమైన బీజేపీ నేత, ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయిని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదని ఆ వ్యూహకర్త చెప్పారు. రాహుల్ గాంధీ, ప్రియాంకలతోనూ ప్రచారం చేయిస్తే ఫలితం ఉంటుందని ఆయన సలహా ఇచ్చారు. ఆ తర్వాత, రాహుల్ గాంధీ యూకేలో ఉద్యోగం వదిలేసి వచ్చి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రియాంక ప్రచారం చేశారు’’ అని కిద్వాయ్ చెప్పారు.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గెలిచి, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, ఆ విజయంలో తన పాత్రేమీ లేదని, అంతా 'మమ్మీదే' అని ప్రియాంక అప్పట్లో చెప్పారు.
ఆ తర్వాత కూడా చాలాకాలం పాటు పూర్తి స్థాయి రాజకీయాల్లో చేరకుండానే ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భర్తపై ఆరోపణలు
ఇటీవలి సంవత్సరాలలో, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై మనీలాండరింగ్ సహా మరికొన్ని అభియోగాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేశాయి. అయితే, ఆ ఆరోపణలను రాబర్ట్ వాద్రా ఖండించారు.
అవన్నీ తప్పుడు ఆరోపణలని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఆ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని, గాంధీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేందుకు అలా చేస్తున్నారని ఆ పార్టీ విమర్శించింది.
ప్రియాంక గురించి మరికొన్ని విషయాలు..
- 1972 జనవరి 12న జన్మించారు.
- 1984లో తన నానమ్మ ఇందిరా గాంధీ హత్యకు గురైనప్పుడు ప్రియాంకకు 12 ఏళ్లు.
- 1991లో తన తండ్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు ప్రియాంక వయసు 19 ఏళ్లు.
- ప్రియాంక గాంధీ దిల్లీలోని మోడ్రన్ స్కూల్‌లో చదుకున్నారు.
- దిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని జీసస్ అండ్ మేరీ కాలేజీలో మానసిక శాస్త్రం అభ్యసించారు.
- 1997లో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాతో వివాహం జరిగింది.
- 2004 ఎన్నికల్లో అమేఠీలో సోనియా గాంధీ కోసం ప్రచారం చేశారు.
- ప్రియాంకకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














