మహారాష్ట్ర ఫలితాలు మోదీకి మళ్లీ శక్తినిచ్చాయా

Prime Minister Narendra Modi with Union Ministers and senior BJP leaders Rajnath Singh, Amit Shah, and Union Minister and party National President JP Nadda during celebration of the party's victory in the Maharashtra Assembly elections and in several bypolls, at BJP headquarters on November 23, 2024 in New Delhi, India.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహారాష్ట్రలో విజయం తరువాత శనివారం(23.11.2024) బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రధాని మోదీని అభినందిస్తున్న రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా

మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అత్యధిక స్థానాల్లో గెలుపొందింది.

మహాయుతి కూటమిలోని బీజేపీ మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ 132 స్థానాల్లో విజయం సాధించింది. శివసేన (శిందే వర్గం) 57 స్థానాల్లో గెలిచింది, ఎన్సీపీ 41 చోట్ల గెలుపొందింది.

అయితే, గత మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 48 స్థానాల్లో కేవలం 17 మాత్రమే గెలుచుకున్న మహాయుతి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎక్కువ స్థానాలను గెలుచుకుంది.

లోక్‌సభ ఎన్నికల్లో 28స్థానాల్లో పోటీచేసిన బీజేపీ 9 సీట్లు మాత్రమే గెలుచుకుంది.

17 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ 13 సీట్లు కైవసం చేసుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ani

భవిష్యత్ రాజకీయాలకు బాట?

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇస్తున్న సంకేతాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకే కాదు... శివసేన, ఎన్సీపీలకు కూడా చాలా ముఖ్యమైనవి.

శివసేన, ఎన్సీపీ రెండూ చీలిపోయాయి. ఈ పరిస్థితుల్లో గెలిచిన వర్గం తమదే నిజమైన శివసేన, ఎన్సీపీ అని బలంగా వాదించే అవకాశం ఉంటుంది.

ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌కు సవాళ్లు పెరుగుతాయి.

మహారాష్ట్రలో బీజేపీ గెలుపుతో హిందూత్వ రాజకీయాలపై తమదే గుత్తాధిపత్యం అని భావించే బాల్ ఠాక్రే కుటుంబ వాదన బలహీనపడే అవకాశముంది. అంటే మహారాష్ట్రలో హిందుత్వ రాజకీయాల విషయంలో శివసేనతో గతంలో ఉన్న తరహాలో బీజేపీకి పోటీ ఉండకపోవచ్చు.

ముంబయిని దేశ ఆర్థిక రాజధానిగా పరిగణిస్తారు. అక్కడ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆర్థిక రాజధానిపై నియంత్రణ ఉంటుంది.

ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ వరుస ఓటములు ఎదుర్కొంటున్న పార్టీగా కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత హరియాణాలో ఓడిపోయిన కాంగ్రెస్ మహారాష్ట్రలోనూ పరాజయం పాలైంది.

ఏక్‌నాథ్‌శిండే, ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, 149 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ

మోదీ ప్రజాదరణపై మారిన అభిప్రాయం

ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు సాధించింది. ఆ పార్టీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీకి సొంతంగా మెజార్టీ చాలకపోవడం వల్ల ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలకు ప్రాధాన్యం పెరిగింది.

2014, 2019లో బీజేపీ కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజార్టీ సాధించలేకపోవడానికి ప్రధాని మోదీకి ప్రజాదరణ తగ్గడమే కారణమన్న అభిప్రాయాలు వినిపించాయి.

కానీ హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాలు.. జమ్ముకశ్మీర్‌లో మెరుగుపడడం వంటివి గమనిస్తే ప్రధాని మోదీకి ప్రజాదరణ తగ్గిందని భావించలేం.

ఝార్ఖండ్‌లో జేఎంఎం, కాంగ్రెస్ పార్టీల కూటమి గెలుపు ఆ పార్టీలకు కాస్త ఉపశమనం కలిగించేదే. అయితే... అక్కడ కూడా పార్టీ పరంగా చూస్తే కాంగ్రెస్‌కు బీజేపీ కంటే తక్కువ సీట్లే వచ్చాయి.

అంతేకాదు.. మహారాష్ట్రతో పోలిస్తే జాతీయ రాజకీయాల్లో ఝార్ఖండ్ ప్రభావం తక్కువ.

మహారాష్ట్రలో బీజేపీ గెలుపు ఎన్డీఏలో బీజేపీ పట్టు పెరగడానికి కారణమవుతుంది.

ఆ పరిస్థితుల్లో ఎన్డీఏలోని భాగస్వామ్యపక్షాల ప్రభావం తగ్గుతుంది.

వచ్చే ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తాజా విజయాలను చూపించి ఆ రాష్ట్రంలో నితీశ్ కుమార్‌తో సీట్ల పంపకంలో బీజేపీ తన మాట నెగ్గేలా చేసుకోవచ్చు. ఎక్కువ సీట్ల కోసం పట్టు పట్టొచ్చు.

చంద్రబాబునాయుడు, నితీశ్ కుమార్ మద్దతుతో కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడింది.

కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాలు లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత నెలకొన్న పరిస్థితిని మార్చే అవకాశం ఉంది.

బీజేపీ వరుస విజయాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ తగినంత స్థాయిలో మోదీ ప్రభుత్వంతో బేరసారాలు సాగించే అవకాశం లేదు.

మహా ఎన్నికల్లో ప్రతిపక్షకూటమికి ఎదురుదెబ్బ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మహారాష్ట్ర ఎన్నికల్లో కలిసి పోటీచేసిన కాంగ్రెస్, శివసేన(యూటీ), ఎన్సీపీ(ఎస్‌సీపీ)

మరింత బలమైన నేతగా ప్రధాని మోదీ

హరియాణాలో పదేళ్లగా బీజేపీ అధికారంలో ఉంది. ఇటీవల వరుసగా మూడోసారి గెలుపొందింది.

పదేళ్ల పాలనపై ఉండే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగిన తర్వాత కూడా బీజేపీ హరియాణాలో మూడోసారి అధికారంలోకొచ్చింది.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజార్టీ లేకపోవడం ప్రతిపక్షాన్ని బలపరుస్తుందని ‌లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత విశ్లేషకులు భావించారు.

కానీ అలాంటిదేదీ జరగలేదని, ప్రతిపక్షాలు బలపడలేదని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి.

హరియాణా, మహారాష్ట్రలో ప్రతిపక్షాలు గెలిచి ఉంటే కేంద్రంలో మోదీ ప్రభుత్వం బలహీనపడిఉండేది. అలాగే ఎన్డీఏలో బీజేపీ ప్రభావం కూడా తగ్గిపోయుండేది.

బీజేపీ బలపడడమన్నది ప్రతిపక్షాలకు మాత్రమే నిరాశ కలిగించే అంశం కాదు. ఎన్డీఏలోని బీజేపీ మిత్రపక్షాలకు కూడా కొంత నిరాశ కలిగించేదే.

మహారాష్ట్రలో అత్యధికంగా బీజేపీ 149 స్థానాల్లో పోటీచేసింది.

మోదీ ప్రజాదరణ, విధానాలను చూపించే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేసింది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమంటే అది మోదీ విజయంగానే భావించాలి.

ఈ పరిస్థితి గమనిస్తే, బీజేపీలోనూ అంతర్గతంగా మోదీ స్థానం మరింత పదిలంగా ఉండబోతోంది.

మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆ పార్టీ నుంచే ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌కు ఇది చాలా నిరుత్సాహం కలిగించే అంశం. లోక్‌సభ ఎన్నికల్లో 99 స్థానాలు సాధించిన తర్వాత పార్టీలో నెలకొన్న ఉత్సాహంపై అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నీళ్లు చల్లాయి.

భవిష్యత్తు వ్యూహాలపై పార్టీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పార్టీ నాయకత్వాన్ని ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ ఓటమితో కాంగ్రెస్ అగ్రనాయకత్వం ముఖ్యంగా రాహుల్ గాంధీ సామర్థ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది.

అయితే మహా ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసికట్టుగా పోటీచేయడంతో ఓటమికి ఒక పార్టీని నిందించడం కష్టం కావొచ్చు.

మరో రెండున్నర నెలల తర్వాత దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2025 ఫిబ్రవరిలో జరగనున్న ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు బరిలో నిలుస్తున్నాయి.

హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు లేదు. దిల్లీలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేసే సూచనలు లేవు.

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉన్న దిల్లీని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూడలేం.

మోదీ, యోగీ ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మోదీ, యోగి ఆదిత్య నాథ్

హిందూత్వ రాజకీయాల విజయం?

‘విడిపోతే, అంతర్థానమైపోతాం’ అనే నినాదంపై మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో విస్తృత చర్చ జరిగింది.

మహా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఈ నినాదాన్ని ఎక్కువగా ఉపయోగించారు.

హిందూ మతానికి చెందిన విభిన్న కులాలను కలిపి ఉంచడానికి ఈ నినాదం పనిచేసిందని నమ్ముతున్నారు.

ఈ నినాదంపై వివాదం చెలరేగిన తర్వాత ప్రధాని మోదీ ‘ఒక్కటిగా ఉంటే సురక్షితంగా ఉంటాం’ అని ఎన్నికల్లో ప్రచారం చేశారు.

హిందూ సమాజాన్ని ఐక్యంగా ఉండచానికి ఈ నినాదం కూడా ఓ మార్గంలా పనిచేసినట్టు కనిపిస్తోంది.

మహారాష్ట్ర ఎన్నికల్లో కులాలవారీగా ఓట్లు చీలిపోకుండా బీజేపీ జాగ్రత్త పడింది.

అదే సమయంలో ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బంగ్లాదేశ్ చొరబాటుదారుల సమస్యను బలంగా లేవనెత్తింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)