సోషల్ మీడియాలో సంచలనంగా మారిన మురికివాడల పిల్లల ఫ్యాషన్ షో

సబ్యసాచి డిజైన్లను అనుకరించిన చిన్నారులు

ఫొటో సోర్స్, Innovation for Change

ఫొటో క్యాప్షన్, సబ్యసాచి ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్ వీడియోల ఆధారంగా దుస్తుల డిజైన్

ఓ ఫ్యాషన్ షూట్ వీడియో వైరల్‌గా మారింది. ఓ పేద విద్యార్థుల గ్రూప్‌ను ఈ వీడియో స్థానికంగా సెలబ్రిటీలుగా మార్చివేసింది.

12 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు ఆ వీడియోలో కనిపిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది అమ్మాయిలే. వారంతా ఎరుపు, బంగారు రంగు దుస్తులు ధరించారు. అవన్నీ కొందరు వాడి వదిలేసిన దుస్తులతో తయారు చేసిన డ్రెస్‌లే.

ఆ డ్రెస్‌లను ఆ పిల్లలే రీడిజైన్ చేసి కుట్టుకున్నారు. మోడళ్ల మాదిరిగా ప్రదర్శన నిర్వహించారు. ర్యాంప్ వాక్ చేశారు. మురికి వాడల్లోని మురికి గోడలు, మిద్దెలు వారి ర్యాంప్ వెనక బ్యాక్‌డ్రాప్‌గా ఉన్నాయి.

15 ఏళ్ల అబ్బాయి ఆ వీడియోను చిత్రీకరించి, ఎడిట్ చేశాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చిన్నారుల వీడియోను రీపోస్ట్ చేసిన సబ్యసాచి

ఫొటో సోర్స్, Innovation for Change

ఫొటో క్యాప్షన్, లఖ్‌నవూలోని మురికివాడకు చెందిన చిన్నారుల ఫ్యాషన్ షో

సబ్యసాచి డిజైన్ల అనుకరణ

‘ఇన్నొవేషన్ ఫర్ చేంజ్’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ నెల ఆరంభంలో ఈ వీడియో మొదట కనిపించింది. ఇన్నొవేషన్ ఫర్ చేంజ్ అనేది లఖ్‌నవూకు చెందిన స్వచ్ఛంద సంస్థ.

నగరాల మురికివాడల్లోని 400 మంది చిన్నారుల కోసం ఈ స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది. వారికి ఆహారం, విద్య, ఉద్యోగ నైపుణ్యాల శిక్షణ అందిస్తోంది. వీడియోలో కనిపించిన చిన్నారులు ఈ ఎన్జీవో ద్వారా సాయం పొందుతున్న విద్యార్థులు.

బాలీవుడ్ నటుల దుస్తుల ఎంపికలను ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో గమనిస్తుంటామని, వాటిలో కొన్ని దుస్తుల అనుకరణలను తరచుగా తమ కోసం తయారు చేసుకుంటుంటామని విద్యార్థినుల్లో ఒకరైన మెహక్ కన్నోజియా బీబీసీకి చెప్పింది.

‘‘మా వనరులన్నింటినీ సమీకరించుకుని ఓ గ్రూప్‌లా పనిచేయాలని ఈ సారి నిర్ణయించుకున్నాం’’ అని 16 ఏళ్ల మెహక్ చెప్పింది.

ఈ వీడియో కోసం పిల్లలు బాలీవుడ్ సెలబ్రిటీలకు, హాలీవుడ్ నటీమణులకు, బిలయనీర్లకు దుస్తులు డిజైన్ చేసే సబ్యసాచి ముఖర్జీ ష్యాషన్ డ్రెస్‌లను గమనించారు. సబ్యసాచి ముఖర్జీకి డిజైనర్‌గా అంతర్జాతీయ గుర్తింపు ఉంది. కిమ్ కర్దాషియన్ 2018లో వోగ్ షూట్‌లో సబ్యసాచి డిజైన్ చేసిన ఎర్ర చీర ధరించారు.

భారత్‌లో సబ్యసాచిని ‘‘వెడింగ్స్ కింగ్’’ అని కూడా పిలుస్తారు. అనుష్కశర్మ, దీపికా పదుకొణె వంటి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు వేలమంది వధువులకు పెళ్లిదుస్తులను సబ్యసాచి రూపొందించారు. ప్రియాంక చోప్రా కూడా తన పెళ్లిలో సబ్యసాచి డిజైన్ చేసిన ఎర్రచీర కట్టుకున్నారు.

చిన్నారుల వీడియోను రీపోస్ట్ చేసిన సబ్యసాచి

ఫొటో సోర్స్, Innovation for Change

ఫొటో క్యాప్షన్, 3, 4 రోజుల్లో 12 డ్రెస్‌లు తయారుచేసుకున్నామని చెప్పిన చిన్నారులు

యే లాల్ రంగ్

సబ్యసాచి వధువుల కోసం సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తయారు చేసిన దుస్తులను స్ఫూర్తిగా తీసుకుని ‘యే లాల్ రంగ్(ఎరుపు రంగు)’ అనే పేరుతో ఈ ప్రాజెక్టు ప్రారంభించామని మెహక్ చెప్పింది.

‘‘దాతలు ఇచ్చిన దుస్తులను జల్లెడపట్టి, ఎర్ర రంగులో ఉన్న వాటన్నింటినీ ఎంచుకున్నాం. వాటన్నింటినీ కలిపి మాకు కావాల్సినట్టుగా, మేం కోరుకున్న విధంగా మార్చుకున్నాం. ఇందుకోసం చాలా కష్టపడ్డాం’’ అని మెహక్ వివరించింది.

అమ్మాయిలు మూడు, నాలుగు రోజుల్లో 12 రకాల డ్రెస్‌లు కుట్టారు. అయితే ఇవి తయారుచేసే క్రమంలో తమకు చాలా ఆనందం కలిగిందని మెహక్ చెప్పింది.

ర్యాంప్‌వాక్ కోసం సబ్యసాచి వీడియోల్లో మోడళ్లను జాగ్రత్తగా గమనించి, వారిని అనుకరించామని తెలిపింది.

‘‘మోడళ్లలా మాలో కొందరం సన్‌గ్లాస్ పెట్టుకున్నాం. ఒకరు సిప్పర్‌తో, ఇంకొకరు చంక కింద దుస్తుల మూట ఉంచుకుని ర్యాంప్ వాక్ చేశారు. కొన్ని అయితే అనుకోకుండా అలా జరిగిపోయాయి’’ అని మెహక్ తెలిపింది.

‘‘షూట్‌లో ఓ చోట నేను నవ్వాల్సి ఉంది. ఆ సమయంలో ఎవరో ఏదో చెప్పారు. అది విని నేను పగలబడి నవ్వాను’’ అని మెహక్ చెప్పింది.

మురికివాడల చిన్నారులు ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన ఈ ప్రాజెక్టు భారత్‌లో అనేకమంది హృదయాలను గెలుచుకుంది. అతి తక్కువ డబ్బులతో, దాతలు ఇచ్చిన దుస్తులతో కలిసికట్టుగా అందరూ కలిసి రూపొందించిన ఈ వీడియోను సబ్యసాచి ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో హార్ట్ ఎమోజీతో రీపోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇది వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై పెద్దఎత్తున ప్రశంసలు కురిశాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఈ చిన్నారుల పనితీరును నిపుణులతో పోలుస్తూ కామెంట్లు పెట్టారు.

సబ్యసాచి వీడియోల్లో మోడళ్లను అనుకరించిన చిన్నారులు

ఫొటో సోర్స్, Innovation for Change

ఫొటో క్యాప్షన్, దాతలు ఇచ్చిన దుస్తులతో డ్రెస్‌ల తయారీ

చిన్నారులకు దేశవ్యాప్తంగా గుర్తింపు

ఈ వైరల్ వీడియో వల్ల చారిటీ సంస్థ, వారి స్కూల్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది. చాలా టీవీ చానళ్లు ఆ స్కూల్‌ను సందర్శించాయి. వీడియోలో నటించిన పిల్లల్లో కొందరిని తమ షోల్లో పాల్గొనాల్సిందిగా ప్రముఖ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు ఆహ్వానించాయి. సినీ నటి తమన్నా ఈ పిల్లల దగ్గరకు వెళ్లారు.

ఇలాంటి స్పందనను తామసలు ఊహించలేదని మెహక్ సంతోషం వ్యక్తం చేసింది.

‘‘కల నిజమైనట్టు అనిపించింది. నా స్నేహితులంతా ఆ వీడియోను షేర్ చేస్తూ ‘నువ్వు సెలబ్రిటీ అయ్యావు’ అని అంటున్నారు. మాకొచ్చిన ఈ పేరు చూసి నా తల్లిదండ్రులు చాలా సంతోషించారు’’ అని మెహక్ చెప్పింది.

‘‘మాకు అద్భుతంగా అనిపిస్తోంది. మాకిక ఇప్పుడున్న ఒకే ఒక కోరిక సబ్యసాచిని కలవడం’’ అని మెహక్ అంటోంది.

చిన్నారుల వీడియోను రీపోస్ట్ చేసిన సబ్యసాచి

ఫొటో సోర్స్, Innovation for Change

ఫొటో క్యాప్షన్, చిన్నారుల ఫ్యాషన్ షోపై ప్రశంసలు, విమర్శలు

బాల్యవివాహాలను ప్రోత్సహించేలా ఉందన్న విమర్శలు

అయితే, ఈ వీడియోపై విమర్శలు కూడా వచ్చాయి. చిన్నవయసు అమ్మాయిలను పెళ్లికూతుళ్లలా చూపించడం వల్ల బాల్యవివాహాలను ప్రోత్సహించినట్టవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నిర్ణీత వివాహ వయసు 18 ఏళ్లు రాకముందే లక్షల మంది అమ్మాయిలకు తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేస్తున్న దేశంలో ఇలాంటి వీడియోలు సరైనవి కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ విమర్శలపై ఇన్నోవేషన్ ఫర్ చేంజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. బాల్యవివాహాలను ప్రోత్సహించే ఉద్దేశం తమకు లేదని తెలిపింది.

‘‘బాల్యవివాహాలను ప్రోత్సహించడం ఎలాంటి పరిస్థితుల్లోనూ మా ఉద్దేశం కాదు. అలాంటి ఆలోచనలను, పద్ధతులను వ్యతిరేకిస్తూ ఈ అమ్మాయిలు ఇలాంటివి చేయగలుగుతున్నారు. దయచేసి వారిని అభినందించండి. లేకపోతే ఈ పిల్లల మానసికస్థైర్యం దెబ్బతింటుంది’’ అని ఇన్నోవేషన్ ఫర్ చేంజ్ విజ్ఞప్తి చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)