ఈ అరటి పండు 52 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది

ఫొటో సోర్స్, Sotheby's
టేపుతో గోడకు అతికించిన ఒక అరటి పండు దాదాపు 52 కోట్ల రూపాయలకు (6.2 మిలియన్ డాలర్లు) అమ్ముడుపోయింది.
చైనాకు చెందిన ఔత్సాహిక వ్యాపారవేత్త జస్టిన్ సున్ ఈ అరటి పండును వేలం పాటలో దక్కించుకున్నారు.
ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఈ అరటి పండును అదే రోజు 30 రూపాయలకు కొనుగోలు చేసి, టేపుతో గోడకు అతికించారు.
ఈ ఆర్ట్ వర్క్ పేరు 'కమీడియన్ '. దీనిని మౌరీజియో క్యాటేలాన్ అనే ఇటలీకి చెందిన ఒక విజువల్ ఆర్టిస్ట్ సృష్టించారు.
న్యూ యార్క్‌లోని ప్రముఖ వేలం సంస్థ సోదబీస్ ఈ వేలాన్ని నిర్వహించింది.

ఇలాంటి 'కమీడియన్' ఆర్ట్ వర్క్‌ను మొదట 2019లో ప్రదర్శించారు. అప్పుడు అది సంచలనం సృష్టించింది. కాలక్రమేణా మారుతున్న 'కళ' మీద ప్రపంచవ్యాప్తంగా అనేక చర్చలకు దారి తీసింది.
గతంలో సుమారు కోటి రూపాయలకు అమ్ముడుపోయిన 'కమీడియన్', ఈసారి ఊహించిన దానికంటే నాలుగింతల ధర పలికింది.
ఈ అరటి పండును చేజెక్కించుకునేందుకు వేలంపాటలో ఆరుగురితో పోటీపడి గెలిచిన జస్టిన్ సున్.. 'త్వరలో, ప్రత్యేక అనుభూతిని పొందేందుకు నేనే స్వయంగా ఈ అరటి పండును తింటాను' అని ప్రకటించారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫలాలలో ఇదొకటని చెబుతున్నారు.
ఈ అరటిపండు ఆర్ట్‌వర్క్‌ను మ్యూజియాలలో ప్రదర్శిస్తుంటారు. ఈ పండు కుళ్లిపోయినప్పుడల్లా కొత్త దాన్ని ఎలా గోడకు అతికించాలో ప్రత్యేక రూల్స్ కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అరటి పండును తినేసిన విద్యార్థి..
ఈ ఆర్ట్‌వర్క్ చాలా దేశాలకు వెళ్లింది. చాలా మ్యూజియంలలో దీనిని ప్రదర్శించారు.
2023లో దక్షిణ కొరియా రాజధాని సోల్ నగరంలోని ఒక మ్యూజియంలో దీన్ని ప్రదర్శించినప్పుడు, ఒక విద్యార్థి అరటి పండును లాక్కొని తినేశారు.
వెంటనే మ్యూజియం అధికారులు ఇంకో అరటి పండుని తెచ్చి అక్కడ అతికించారు.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం వల్ల తనకు బాగా ఆకలేసిందని, అందుకే ఆ అరటి పండును తీసుకుని తినేశానని ఆ విద్యార్థి చెప్పారు. మ్యూజియం అధికారులు ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
ఇదే ఆర్ట్ నాలుగేళ్ల కిందట అమెరికాలోని మయామీలో దాదాపు కోటి రూపాయలకు వేలంలో అమ్ముడుపోయింది. అయితే, ఆ వెంటనే ఒక పెర్ఫామెన్స్ ఆర్టిస్ట్ అరటి పండును తినేశారని స్థానిక మీడియా తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














