స్టాక్ మార్కెట్: షేర్లు కొనాలంటే డీమ్యాట్ ఖాతా ఉండాలా, అసలేమిటీ ఖాతా, దీని ప్రయోజనాలేంటి?

డీమ్యాట్ అకౌంట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డీమ్యాట్ కూడా బ్యాంకు ఖాతా లాంటిదే.
    • రచయిత, కొటేరు శ్రావణి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఈ మధ్యకాలంలో భారీగా పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం ఈ సంఖ్య 17 కోట్లు దాటిందని తెలిసింది.

ఇంతకీ అసలు డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటి? బ్యాంకు అకౌంట్‌కు డీమ్యాట్ అకౌంట్‌కు మధ్య తేడా ఏమిటి? డీమ్యాట్ అకౌంట్ వలన ఉపయోగం ఏమిటి?.

బీబీసీ తెలుగు న్యూస్ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

డీమ్యాట్ అకౌంట్ అంటే..?

డీమెటీరియలైజేషన్ అకౌంట్‌కు సంక్షిప్త రూపమే డీమ్యాట్ అకౌంట్. ఇది కూడా బ్యాంకు ఖాతా లాంటిదే. మీ డబ్బును ఎలాగైతే బ్యాంకులో దాచుకుంటారో అలాగే, సెక్యూరిటీస్ మార్కెట్ ద్వారా మీరు కొన్న కంపెనీ షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, ఈటీఎఫ్‌, ఇతర సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఈ అకౌంట్‌లో జమ చేసుకోవచ్చు.

సెక్యూరిటీస్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఈ అకౌంట్ తప్పనిసరి.

గతంలో ఇన్వెస్టర్లు కొనుగోలుచేసిన షేర్లను పేపర్ రూపంలో పంపించేవారు.

దీనివల్ల అవి కొన్నిసార్లు మిస్ అయ్యే ప్రమాదం ఉండేది. పైగా ఎక్కువ సమయం కూడా పట్టేది. సెకండరీ మార్కెట్ ఆపరేషన్స్‌లో కొన్నిసార్లు సంతకాల్లో తేడాలు, ఫేక్ సర్టిఫికెట్లు వచ్చేవి. ఈ సర్టిఫికెట్లను దొంగలించే వారు కూడా.

ఇవిచేతికి వచ్చే సమయానికి ఆలస్యం అవుతుండటంతో వీటిపై ఇన్వెస్టర్లకు విశ్వాసం తక్కువగా ఉండేది. షేర్ సర్టిఫికెట్లను ప్రింట్ చేసి, వాటిని ఇన్వెస్టర్లకు పంపించేందుకు ఖర్చులు కూడా ఎక్కువగా అయ్యేవి.

ఈ నేపథ్యంలో 1996లో డీమ్యాట్ ఖాతాల పద్ధతిని భారత్‌లో ప్రవేశపెట్టారు. దీంతో షేర్లను పేపర్ల రూపంలో పంపే ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది.

ఎన్ఎస్ఈ

ఫొటో సోర్స్, Getty Images

డీమ్యాట్ అకౌంట్‌ను ఎలా తెరవాలి?

మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ముందు డీమ్యాట్ అకౌంట్‌ను ఎలా తెరవాలో తెలుసుకోవాలి.

గతంలో డీమ్యాట్ అకౌంట్ తెరవాలంటే, చాలా టైము, ప్రాసెస్ ఉండేది. డిపాజిటరీ పార్టిసిపెంట్ (డీపీ) వద్ద అతిపెద్ద దరఖాస్తును నింపి, డీపీ అగ్రిమెంట్‌పై సంతకం చేసి, అవసరమైన పత్రాలను సమర్పించాలి. చిరునామా, మీ గుర్తింపు ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు, పాన్ కార్డు కాపీలన్నీ సెల్ఫ్ అటెస్ట్ చేసి, డీపీకి ఇవ్వాలి. పరిశీలనా సమయంలో డీపీ అధికారులు ఈ పత్రాల ఒరిజినల్స్‌ అన్నింటినీ చెక్ చేసేవారు. దీంతో డీపీ అకౌంట్ యాక్టివేట్ అయ్యేందుకే ఐదారు రోజులు పట్టేది. కానీ ఇప్పుడంతా ఆన్‌లైన్ అయ్యింది.

చెల్లుబాటయ్యే పాన్ కార్డు, ఆధార్‌తో లింక్ అయిన వాలిడ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఉంటే చాలు, డీమ్యాట్ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో తెరుచుకోవచ్చు అని ఎస్‌బీఐ సెక్యూరిటీస్ డీమ్యాట్ అకౌంట్ వివరాలలో ఎస్‌బీఐ తెలియజేసింది.

ఎన్ఎస్ఈ

ఫొటో సోర్స్, Getty Images

డీమ్యాట్ అకౌంట్ తెరిచాక...

డీమ్యాట్ అకౌంట్ తెరిచిన తర్వాత, మీ డిపాజిటరీ పార్టిసిపెంట్ నుంచి కింద పేర్కొన్న వివరాలను తీసుకోవాలి.

2. డిపాజిటరీ పార్టిసిపెంట్ ఐడీ. డీమ్యాట్ అకౌంట్ నెంబర్‌లో డీపీ ఐడీ కూడా ఒక భాగం.

3. పవర్ ఆఫ్ అటార్నీ అగ్రిమెంట్ (పీఓఏ)కు చెందిన నెంబర్. ఈ అగ్రిమెంట్‌లో నిర్దేశిత సూచనల ప్రకారం తన అకౌంట్‌ నిర్వహణకు ఇన్వెస్టర్ స్టాక్ బ్రోకర్‌కు అనుమతి ఇస్తారు.

డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లకు యునిక్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ కూడా పొందవచ్చు.

సెబీ రూల్స్ ఏమిటి?

డిపాజిటరీ పార్టిసిపెంట్‌ (డీపీ)గా బ్యాంకులు, స్టాక్ బ్రోకర్లు, ఆర్థిక సంస్థలు ఉంటుంటాయి. వీటిని నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్‌డీఎల్) లేదా సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్‌ఎల్) లు నియమిస్తాయి.

పైన పేర్కొన్న రెండు సంస్థలకు, ఇన్వెస్టర్లకు మధ్య వారధిలా డిపాజిటరీ పార్టిసిపెంట్లు పనిచేస్తాయి.

డీపీల వద్ద డీమ్యాట్ అకౌంట్‌ను తెరుచుకోవచ్చు.

అలాగే బ్యాంకు అకౌంట్ల మాదిరిగానే ఇన్వెస్టర్లు ఒకటికి మించిన డీమ్యాట్ అకౌంట్లను తెరుచుకోవచ్చు.

అయితే, అన్ని డీమ్యాట్ అకౌంట్లు కూడా ఒకే పాన్ కార్డుతో లింక్ కావాల్సి ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ తెరిచే సమయంలో ఒరిజినల్ పాన్ కార్డును చూపించాల్సి ఉంటుంది.

డీమ్యాట్ అకౌంట్ తెరవడం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వేగంగా షేర్ల బదిలీ కోసం డీమ్యాట్ అకౌంట్‌పై ఆధారపడొచ్చు.

ప్రయోజనాలేంటి?

డీమ్యాట్ ఖాతాల వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వివరాలను బ్యాంకులు, స్టాక్ బ్రోకింగ్ సంస్థలు కూడా తమ వెబ్‌సైట్లలో పొందుపరుస్తున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం..

ఎన్ని షేర్లు కావాలంటే అన్ని షేర్లను, ఈ అకౌంట్‌లో స్టోర్ చేసుకోవచ్చు. వేగంగా షేర్ల బదిలీ కోసం డీమ్యాట్ అకౌంట్‌పై ఆధారపడొచ్చు.

స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ సాయంతో డీమ్యాట్ అకౌంట్‌ను వాడుకోవచ్చు. ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా దీని ద్వారా షేర్ల వ్యవహారాలు నడపవచ్చు.

డీమ్యాట్ అకౌంట్‌కు నామినేషన్ సౌకర్యం ఉంది. డిపాజిటరీ నిర్దేశించిన ప్రకారం నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఒకవేళ ఇన్వెస్టర్‌కు ఏదైనా అయితే, ఆ ఖాతాను నామినీ పొందుతారు. ఇది న్యాయపరమైన వివాదాలను కూడా తప్పిస్తుంది.

ఈక్విటీ, డిబెంచర్లు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, సావరిన్ గోల్డ్ బాండ్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి వివిధ రకాల సెక్యూరిటీలను ఒకే అకౌంట్‌లో కలిగి ఉండొచ్చు.

మార్కెట్‌లో ట్రేడింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లో డీమ్యాట్ అకౌంట్ చార్జీలలో వార్షిక నిర్వహణా ఫీజు, కస్టడీ చార్జీ, లావాదేవీల చార్జీలు ఉన్నాయి.

ట్రేడింగ్ అకౌంట్ కూడా ఉండాలా?

డీమ్యాట్ అకౌంట్‌ అనే దాన్ని మీరు కొన్న షేర్లను స్టోర్ చేసుకోవడానికి ఉపయోగిస్తే.. ట్రేడింగ్ అకౌంట్‌ను స్టాక్ ఎక్స్చేంజీలలో సెక్యూరిటీలను కొనేందుకు, అమ్మేందుకు వాడతారు.

మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్, డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి.

కంపెనీల్లో మీరు షేర్లను కొన్నప్పుడు, వాటిని మీ డీమ్యాట్ అకౌంట్‌లో జమ చేసుకోవచ్చు. స్టాక్ ఎక్స్చేంజీలో షేర్ల లావాదేవీలు జరిపేందుకు కేవలం ఈ అకౌంట్‌ మాత్రమే సరిపోదు. దీనికి ట్రేడింగ్ అకౌంట్ కావాల్సి ఉంటుంది.

ఉదాహరణకు.. మీరు ఒక కంపెనీ షేర్లను కొంటే, అవి డీమ్యాట్ అకౌంట్‌లో డిపాజిట్ అవుతాయి. ఆ తర్వాత కొన్ని నెలలకు మీరు వీటిని అమ్మాలనుకుంటే, మీ డీమ్యాట్ అకౌంట్ నుంచి అవి డెబిట్ అవుతాయి. మీ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా వాటిని మార్కెట్లో అమ్మవచ్చు. ఆ లావాదేవీకి సంబంధించిన డబ్బులు వాటితో లింకైన బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ అవుతాయి.

పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం ఇటీవల 3 ఇన్ 1 అకౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. అంటే డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ మూడూ కలిసి ఉంటున్నాయి.

అయితే, డీమ్యాట్ అకౌంట్ లేకుండా కూడా ట్రేడింగ్ అకౌంట్ తెరవవచ్చు. ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా ట్రేడింగ్ అకౌంట్ తీసుకోవచ్చు. అయితే, స్టాక్స్ ట్రేడ్ చేసేందుకు కేవలం ఈ అకౌంట్ అనుమతించదని గుర్తుంచుకోవాలి.

చార్జీలు చెల్లించాలా?

భారత్‌లో డీమ్యాట్ అకౌంట్ చార్జీలలో వార్షిక నిర్వహణా ఫీజు, కస్టడీ చార్జీ, లావాదేవీల చార్జీలు ఉన్నాయి.

డీమ్యాట్ అకౌంట్ తెరిచే సమయంలో కూడా చార్జీలుంటాయి.

వార్షిక నిర్వహణ ఫీజు మీరు ఎంపిక చేసుకునే డిపాజిటరీ పార్టిసిపేటరీని బట్టి రూ.300 నుంచి రూ.800 మధ్యలో ఉంటుందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

సెబీ కొత్త మార్గదర్శకాల ప్రకారం, మీ పోర్టుఫోలియో రూ.4 లక్షల వరకు ఉంటే, మౌలిక సేవా డీమ్యాట్ అకౌంట్‌కు ఎలాంటి వార్షిక నిర్వహణా ఫీజులు ఉండవు.

ఒకవేళ పోర్టుఫోలియో రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో ఉంటే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. రూ.10 లక్షలు దాటితే,మౌలిక సేవా డీమ్యాట్ అకౌంట్ రెగ్యులర్ డీమ్యాట్ అకౌంట్‌గా మారిపోతుంది.

ఒకవేళ మౌలికసేవల డీమ్యాట్ అకౌంట్ తీసుకుంటే, ఎలక్ట్రానిక్ స్టేట్‌మెంట్లకు ఎలాంటి చార్జీలు వర్తించవు. భౌతికంగా స్టేట్‌మెంట్ కావాలనుకుంటే, ఒక్కో స్టేట్‌మెంట్‌కు రూ.25 చెల్లించాలి.

డీమ్యాట్ అకౌంట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మీ డీమ్యాట్ అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ కూడా ఉండొచ్చు.

డీపీని ఏ విధంగా ఎంచుకోవాలి?

పొదుపు ఖాతా తెరిచేందుకు బ్యాంకును ఎంపిక చేసుకున్న విధంగానే, డీపీని కూడా ఎంపిక చేసుకోవచ్చు. డీపీ ఎంపికలో ప్రధానంగా మనం చూడాల్సినవి..

వెసులుబాటు.. ఇంటికి, ఆఫీసుకు వారి ఆఫీసు దగ్గరగా ఉందో లేదో చూసుకోవడం

చార్జీలు.. డీపీలు మనకు అందిస్తున్న సర్వీసు చార్జీలు, సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకుని వారి వద్ద అకౌంట్ తీసుకోవాలి.

డీమ్యాట్ అకౌంట్లో సెక్యూరిటీలకు కూడా మినిమమ్ బ్యాలెన్స్ పెట్టాల్సి ఉంటుందా?

అవసరం లేదు. కనీస బ్యాలెన్స్‌ను డిపాజిట్‌లో నిర్దేశించలేదు. మీ డీమ్యాట్ అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ కూడా ఉండొచ్చు.

డీమ్యాట్ అకౌంట్ క్లోజ్ చేయాలంటే..?

డీమ్యాట్ ఖాతా క్లోజ్ చేయాలంటే ముందస్తుగా, ఆ అకౌంట్లో ఉన్న సెక్యూరిటీలను, ఫండ్లను మొత్తాన్ని క్లియర్ చేసుకోవాలి. ఆ తర్వాత డీమ్యాట్ అకౌంట్ తెరిచిన డీపీని సంప్రదించాలి. డీపీ వద్ద క్లోజర్ అప్లికేషన్ ఫామ్‌ను నింపాలి.

అవసరమైన డాక్యుమెంట్లను అంటే పాన్ కార్డు కాపీ, అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్‌ను సమర్పించాలి. మీ డీమ్యాట్ అకౌంట్‌తో ఏమైనా బకాయిలు లేదా ఛార్జీలు ఉంటే, అకౌంట్‌ను క్లోజ్ చేయడానికి ముందే మొత్తం సెటిల్ చేసుకోవాలి.

డీపీ మీ క్లోజర్ ఫామ్‌ను, డాక్యుమెంట్లను పరిశీలించి, అంతా బాగుంటే, అకౌంట్‌ను మూసివేసే ప్రక్రియను ప్రారంభిస్తారు.

డీమ్యాట్ అకౌంట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరోనా మహమ్మారి తర్వాత భారత్‌లో డీమ్యాట్ అకౌంట్లు బాగా పెరిగాయి.

డీమ్యాట్ అకౌంట్లు ఎందుకు పెరిగాయి?

ఎస్‌బీఐ సెక్యూరిటీస్ తన బ్లాగ్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం.. కరోనా మహమ్మారి తర్వాత భారత్‌లో డీమ్యాట్ అకౌంట్లు బాగా పెరిగాయి.

కరోనా సమయంలో చాలామందికి మార్కెట్లు, పెట్టుబడులపై అవగాహన పెరిగిందని ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థలో బ్రాంచ్ హెడ్‌గా పనిచేసే కళ్యాణ్ అన్నారు.

‘‘కరోనా తర్వాత చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. ఆ సమయంలో, స్టాక్ మార్కెట్లపై ఉద్యోగులకు అవగాహన పెరిగేందుకు పలు కారణాలు దోహదం చేశాయి. ఆ సమయంలో మరో ఆదాయ వనరుగా మార్కెట్‌ను ఎంపిక చేసుకున్నారు. పెట్టుబడుల వల్ల డబ్బులు సంపాదించవచ్చని తెలుసుకున్నారు. కొత్తగా వచ్చిన ఐపీవోలు, సోషల్ మీడియాలో అవగాహన కూడా మార్కెట్లలో పెట్టుబడులు పెరిగేందుకు దోహదం చేశాయి. రిటైల్ బేసిస్‌లో వ్యక్తిగత ఖాతాలు పెరిగాయి. కరోనా తర్వాత మార్కెట్ రికవరీ కూడా బాగుండటంతో, చాలామంది మార్కెట్లో పెట్టుబడికి ఆసక్తి చూపించారు. ఇవన్నీ డీమ్యాట్ అకౌంట్లు పెరిగేందుకు కారణమవుతున్నాయి.’’ అని చెప్పారు.

‘‘మార్కెట్లు పెరగడం వల్ల తక్కువ సమయంలోనే డబ్బులు సంపాదించాలని చాలా మంది అనుకుంటున్నారు. అలాంటి సమయంలో కొన్నిసార్లు వారు లక్ష్యాలను చేరుకోలేరు. దీర్ఘకాలికంగానే, మార్కెట్లలో మంచి లాభాలను పొందవచ్చు’’ అని కళ్యాణ్ సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)