ఈ రోబో శునకాలు ట్రంప్ ఇంటి వద్ద ఏం చేస్తున్నాయి, వీటివల్ల ఉపయోగమేంటి?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, లిల్లీ జమాలి
- హోదా, ఉత్తర అమెరికా టెక్నాలజీ కరస్పాండెంట్
అమెరికా సీక్రెట్ సర్వీస్ అంబులపొదిలో చేరిన తాజా అస్త్రం రోబో శునకం. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లోని మార్-ఎ-లాగో రిసార్ట్ పరిసర ప్రాంతాల్లో ఈ రోబో శునకం గస్తీ కాస్తోంది. ఈ రిసార్ట్స్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనల్డ్ ట్రంప్‌కు చెందినవి.
ఇది ఎక్కడివరకు వెళ్లాలి, ఎలా పనిచేయాలనేది ముందుగానే ప్రోగ్రామ్ చేసి పెట్టారు. దీనిని రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు.
అటుగా వెళ్లేవారు ఎవరైనా ఈ శునకాన్ని చూసి ముచ్చటపడి దాన్ని ముద్దు చేస్తారేమో అనే ఉద్దేశంతో అది పెంపుడు జంతువు కాదు అనే హెచ్చరికను ఆ శునకం కాళ్లపై రాసిపెట్టారు.
“ఈ రోబో కుక్కను పెంచుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారని నేను అనుకోవడం లేదు, ఎందుకంటే ఇదేమీ ముద్దుగా లేదు కదా” అని మెన్లో కాలేజీకి చెందిన రాజకీయ శాస్త్రవేత్త మెలిస్సా మిచెల్సన్ అన్నారు.
రిసార్ట్ చుట్టూ తిరుగుతూ పహారా కాస్తున్న స్పాట్ వీడియో టిక్ టాక్‌లో వైరల్‌గా మారింది. దానిపై కూల్, క్యూట్, గగుర్పాటు కలిగించే విధంగా ఉంది అనే కామెంట్లు వచ్చాయి. అమెరికన్ లేట్ నైట్ షోలో స్పాట్‌పై జోకులు కూడా వేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలల ముందు, ట్రంప్ లక్ష్యంగారెండు హత్యాయత్నాలు జరిగాయి. ఒకటి జూలైలో పెన్సిల్వేనియాలోని బట్లర్ ర్యాలీలో జరిగింది, మరొకటి సెప్టెంబర్‌లో మార్-ఎ-లాగో గోల్ఫ్ కోర్స్‌లో జరిగింది.దీంతో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ని రక్షించడం తమ ప్రధాన లక్ష్యం అని యుఎస్ సీక్రెట్ సర్వీస్ కమ్యూనికేషన్స్ చీఫ్ ఆంథోనీ గుగ్లియామి బీబీసీతో చెప్పారు.
రొబోశునక వినియోగం సహా ‘‘భద్రతా వ్యవహరాలపై ఆందోళన’’ను ఉటంకిస్తూ బీబీసీ అడిగిన నిర్దిష్ట ప్రశ్నలకు సీక్రెట్ సర్వీస్ జవాబును నిరాకరించింది.
బోస్టన్ డైనమిక్స్ కూడా నిర్దిష్ట ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించింది కానీ సీక్రెట్ సర్వీస్ రోబో శునకం ‘స్పాట్’ను మోహరిస్తున్నట్లు ధృవీకరించింది

ఇప్పుడే ఎందుకు?
ట్రంప్‌పై హత్యాయత్నాల నేపథ్యంలో వాటిని గుర్తించి, నిరోధించే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి అత్యవసరమైంది. ఇందులో భాగంగా ఈ చర్య తీసుకున్నారు అని మాజీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ రాన్ విలియమ్స్ తెలిపారు. ప్రస్తుతం ఈయన సెక్యూరిటీ, రిస్క్ మేనేజ్‌మెంట్ సంస్థ టాలోన్ కంపెనీలకు సీఈఓగా ఉన్నారు.
చాలా ఆస్తుల గురించి వెల్లడైన మార్-ఎ-లాగోలో, రోబో శునకాలు చాలా కాలం పాటే పహారా కాయాల్సి ఉంటుందని విలియమ్స్ తెలిపారు. మనుషులకంటే మెరుగ్గా అవి కాపలా కాయగలవని చెప్పారు. కాలక్రమేణా రోబో కుక్కలు పహారా కాసే దృశ్యం సాధారణమైపోవచ్చని చెప్పారు.
అలాగే కేవలం సీక్రెట్ సర్వీస్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మిలిటరీలు, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఉపయోగించే సాధనంగా రోబోటిక్ కుక్కలు మారాయని విలియమ్స్ చెప్పారు.
పెన్సిల్వేనియాలో పేలుడు పదార్థాలను తనిఖీ చేయడానికి మోంట్‌గోమేరీ కౌంటీలోని బాంబు స్క్వాడ్ రోబో శునకాన్ని కొనుగోలు చేసినట్లుగా బోస్టన్ డైనమిక్స్ ప్రమోషనల్ మెటీరియల్స్ పేర్కొంది.
మరో వైపు, 2022 నుంచి రష్యా ఆక్రమణతో చెలరేగిన ఘర్షణలలో రషన్ దళాలను గుర్తించడానికి యుక్రెయిన్ ఈ రోబోశునకాలను వినియోగించినట్టు కీయేవ్ పోస్ట్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
స్పాట్ పరుగు చూశారంటే...
స్పాట్ పేరుతో ఉన్న ఈ రోబో శునకం చాలా చురుకైనది. ఇది మెట్లు ఎక్కి, దిగగలదు. ఇరుకైన ప్రదేశాలలో దారి చూపించగలదు. తలుపులు కూడా తెరవగలదు.
ఈ సామర్థ్యాలను చూసిన అనేక ఏజెన్సీలు దానికోసం $75,000డాలర్లు అంటే సుమారు 63 లక్షల రూపాయలకు పైగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది కొన్ని ప్రమాదాలను ముందే పసిగట్టడంలో దిట్ట.
"నిఘా సాంకేతికతతోపాటు, రక్షణ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే అధునాతన సెన్సర్ల శ్రేణిని రోబో కుక్కలు కలిగి ఉన్నాయి" అని సీక్రెట్ సర్వీస్ కమ్యూనికేషన్స్ చీఫ్ గుగ్లియామి తెలిపారు.
ఇందులో ఈ శునకం సంచరించే పరిసరాలను త్రీడీ మ్యాప్‌లో రూపొందించే బహుళ కెమెరా వ్యవస్థ ఉంటుందని బోస్టన్ డైనమిక్స్ మార్కెటింగ్ మెటీరియల్స్ పేర్కొంది. స్పాట్ కూడా ముందే నిర్దేశించిన మార్గాల్లో దానంతట అదే కదలగలదు.
అవి నిజమైన శునకాల్లా దృశ్యాలు, శబ్దాలు, వాసనవల్ల తమ దృష్టిని మరల్చవు.
" కెమెరాలు పనిచేయకుండా ఆపాలంటే దాని 'ముఖం'పై ఆక్వా నెట్ హెయిర్‌స్ప్రేతో పిచికారీ చేస్తే చాలు " అని కమ్మింగ్స్ చెప్పారు. ఆమె జార్జ్ మాసన్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ ప్రొఫెసర్.
మార్-ఎ-లాగోలో కనిపించే రోబోకుక్కకు ఆయుధాలు లేనప్పటికీ, పోటీదారులు ఆయుధాలు కూడా ప్రయోగించగలిగేవాటి కోసం ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పారు.
"ప్రజలు ఈ కుక్కలను ఆయుధాలుగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నారు," అని కమ్మింగ్స్ చెప్పుకొచ్చారు.
రోబో కుక్కలు మనుషులను భర్తీ చేయలేవని మెలిస్సా మిచెల్సన్ చెప్పారు..దానికి ఆమె ఆటోమేటిక్ కార్లను ఉదహరించారు.
"సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల సామర్థ్యంపై మాకు విశ్వాసం లేదు" అని మిచెల్సన్ చెప్పారు.
మార్-ఎ-లాగోలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు రోబో కుక్కతో పాటు గస్తీ కాస్తూ కనిపించారు.
" వీటి పనితీరు గురించి చెప్పడానికి, ఒకవేళ ఇవి పాడైతే వెంటనే రంగంలోకి దిగి పనిచేయడానికి మనుషులు కచ్చితంగా అవసరమే" అని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














