బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ: తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ విజయం

ఫొటో సోర్స్, Getty Images
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐదు టెస్ట్‌మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్టును భారత్ గెలుచుకుంది.
దీంతో ఇండియా 1-0 ఆధిక్యం సాధించింది.
స్వదేశంలో న్యూజీలాండ్ చేతిలో 3-0 తేడాతో ఘోర ఓటమిపాలైన ఇండియా ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ మ్యాచ్ గెలిచిన తీరు అభిమానులకు ఆనందాన్ని కలిగించింది.
పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత్ నిర్దేశించిన 534 పరుగుల లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు 238 పరుగులకే ఆల్అవుట్ అయింది.
భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆల్అవుట్ కాగా ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులు మాత్రమే చేసి మొత్తం వికెట్లను పోగొట్టుకుంది.
దీంతో 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన భారత్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్ని అందించారు. 77 పరుగులు చేసి కేఎల్ రాహుల్ అవుటయ్యాడు. అయినా జైస్వాల్ తన జోరు కొనసాగించాడు.
యశస్వి, విరాట్ కోహ్లీ సెంచరీలు చేయడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 487 పరుగులు సాధించగలిగింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 534 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి, కోహ్లీతో సెంచరీలతోపాటు కేఎల్ రాహుల్ 77, నితీష్‌రెడ్డి 38 పరుగులు చేశారు.


ఫొటో సోర్స్, Getty Images
బుమ్రాకు 8 వికెట్లు
భారత్ గెలుపులో బ్యాటర్లతోపాటు బౌలర్లు చక్కని పాత్ర పోషించారు.
ఈ మ్యాచ్‌లో బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 8 వికెట్లు తీసి కీలకపాత్ర పోషించాడు. దీంతోపాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గానూ ఎంపికయ్యాడు.
అలాగే మొహమ్మద్ సిరాజ్ మొత్తంగా 5 వికెట్లు తీశాడు.
ఇక తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి కూడా ఒక వికెట్ తీయడంతోపాటు రెండు ఇన్నింగ్స్‌లలోనూ మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
హెడ్ అర్ధసెంచరీ
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో చెప్పుకోవాల్సింది ట్రావిస్ హెడ్ గురించే.
వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇండియా నుంచి విజయాన్ని లాగేసుకున్న హెడ్ ఈసారి కూడా అడ్డుపడతాడేమోననే బెంగ అభిమానులను వెంటాడింది.
కానీ హెడ్ 89 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో అవుటవడంతో భారతజట్టు ఊపిరిపీల్చుకుంది.
హెడ్ తరువాత రెండంకెల స్కోరు చేసినవారిలో మిషెల్ మార్ష్ (47), అలెక్సీ కారీ (36), స్టీవెన్ స్మిత్ (17), మిషెల్ స్టార్క్ (12) ఉన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














