ట్రంప్ సర్కార్‌లో ఎలాన్ మస్క్‌తో సమానంగా వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు.. వీరు ఏం చేయనున్నారు?

వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డోనల్డ్ ట్రంప్ తన ప్రభుత్వంలో కీలక స్థానాల భర్తీపై సన్నాహాలు ముమ్మరం చేశారు. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌తో పాటు భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామిని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డీఓజీఈ)’ అధిపతులుగా నియమించారు.

ఈ ప్రకటన చేసే క్రమంలో ఎలాన్ మస్క్‌ను ‘ గ్రేట్ ఎలాన్‌ మస్క్’ అని, వివేక్ రామస్వామిని ‘అమెరికా దేశభక్తుడు’ అని ట్రంప్ అభివర్ణించారు.

ఈ బాధ్యతలు స్వీకరించబోతున్న వివేక్ రామస్వామి, తాము సున్నితంగా వ్యవహరించబోమని తెలిపారు. తమకిచ్చిన బాధ్యతలను దూకుడుగా నిర్వర్తిస్తామని ఆయన స్పష్టం చేసినట్లు అర్థమవుతోంది. ట్రంప్ కోరుకునేది కూడా అదే.

బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వివేక్‌ రామస్వామి కోరుకుంటున్న బాధ్యతల్నే ట్రంప్ అప్పగించారు.

ఎలాన్ మస్క్‌తో కలిసి ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణంపై వివేక్ రామస్వామి దృష్టిసారించనున్నారు. అనవసరమైన నియమ నిబంధనలను తొలగించేందుకు, ప్రభుత్వం చేసే దుబారా ఖర్చులను నియంత్రించేందుకు వీరు కృషి చేయనున్నారు.

‘సేవ్ అమెరికా’ ప్రచారానికి ఇది కీలకమని ట్రంప్ వ్యాఖ్యానించారు.

దీనితో పాటు మరికొన్ని ముఖ్యమైన నియామకాలకు ట్రంప్ ఆమోదం తెలిపారు.

ఫ్లోరిడాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్జ్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా, మార్కో రూబియోను విదేశాంగ శాఖ మంత్రిగా నియమించారు.

వివేక్ రామస్వామి, అపూర్వ రామస్వామి

ఫొటో సోర్స్, RAMASWAMY CAMPAIGN

ఫొటో క్యాప్షన్, బయోటెక్నాలజీ రంగంలో పారిశ్రామికవేత్తగా ఎదిగిన వివేక్ రామస్వామి

ఎవరీ వివేక్ రామస్వామి?

రిపబ్లికన్ పార్టీ తరఫున మొదట్లో అధ్యక్ష అభ్యర్థి రేసులో వివేక్ రామస్వామి కూడా ఉన్నారు. అయితే, ట్రంప్‌కు ఎక్కువ మద్దతు లభించడంతో తర్వాత ఆ రేసు నుంచి రామస్వామి తప్పుకున్నారు.

39 ఏళ్ల వివేక్ రామస్వామి అమెరికాలోని ఒహయో రాష్ట్రంలో జన్మించారు. హార్వర్డ్, యేల్‌ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న ఆయన, బయోటెక్నాలజీ రంగంలో భారీగా సంపాదించారు.

‘రోవాంట్ సైన్సెస్’ అనే బయోటెక్ కంపెనీని స్థాపించారు. ఈ సంస్థ విలువ సుమారు ఏడు బిలియన్ డాలర్లు.

గొంతు శస్త్ర చికిత్స నిపుణురాలు అపూర్వను వివేక్ రామస్వామి వివాహం చేసుకున్నారు. ఒహయో స్టేట్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ ఆమె పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం... కేరళ నుంచి అమెరికాకు వెళ్లిన ఎన్ఆర్ఐ దంపతులకు వివేక్ రామస్వామి జన్మించారు.

ఆయన తండ్రి వి. గణపతి రామస్వామి ఇంజినీర్‌గా పని చేశారు. తల్లి గీతా రామస్వామి అమెరికాలో సైకియాట్రిస్ట్‌గా పని చేశారు.

“మా అమ్మ అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. మా నాన్న మాత్రం ఇంకా భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు” అని వివేక్ రామస్వామి 2023లో జరిగిన అయోవా స్టేట్ ఫెయిర్‌లో తెలిపారు.

డోనల్డ్ ట్రంప్, ట్రూత్, ఎక్స్

ఫొటో సోర్స్, THE TRUTH

ఫొటో క్యాప్షన్, 'ట్రూత్' వేదికగా నియామకాల గురించి ప్రకటించిన డోనల్డ్ ట్రంప్

మస్క్, వివేక్‌లు చేయాల్సిన పనేంటి?

అమెరికా ప్రభుత్వంలో అనవసరమైన ఏజెన్సీలు, శాఖలు, సంస్థలు చాలా ఉన్నాయని, వాటిని తొలగించి ప్రభుత్వంపై భారం తగ్గించే దిశగా కృషి చేస్తామని ట్రంప్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు.

ప్రభుత్వ రాబడి ఎంత, ఖర్చు ఎంత? ఎక్కడెక్కడ ఖర్చును తగ్గించవచ్చు? వంటివి చూడటం ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ’ (డీఓజీఈ) పని.

సింపుల్‌గా చెప్పాలంటే, ప్రభుత్వానికి సంబంధించిన దుబారా ఖర్చులను నియంత్రించడమే ‘డీఓజీఈ’ అధిపతులుగా వివేక్, మస్క్‌ల పని.

‘‘రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అణు బాంబుల తయారీ కోసం అప్పటి ప్రభుత్వం ‘ది మన్హటన్ ప్రాజెక్ట్’ను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ప్రస్తుత తరుణంలో మేం చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ కూడా అంతే ప్రతిష్ఠాత్మకమైనది’’ అని ట్రంప్ అన్నారు.

అయితే, ఈ విభాగం ఎలా పని చేస్తుంది? విధి విధానాలు ఏంటన్నది ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కానీ, ఈ వ్యవస్థ బయటి నుంచి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.

వీరిద్దరు తమ పనిని పూర్తి చేయడానికి 2026 జులై 4ని తుది గడువుగా ట్రంప్ నిర్దేశించారు.

వివేక్ రామస్వామి, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వివేక్ రామస్వామిని అమెరికా దేశభక్తుడిగా అభివర్ణించిన డోనల్డ్ ట్రంప్

రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడం, సోషల్ మీడియా నుంచి పిల్లలను దూరంగా ఉంచడం, అనేక ఫెడరల్ డిపార్ట్‌మెంట్స్‌ని రద్దు చేయడం వంటివి రామస్వామి ప్రధాన లక్ష్యాలు. వాటిలో విద్యాశాఖ, అణు నియంత్రణ కమిషన్, దేశీయ రెవెన్యూ సేవలు, ఎఫ్‌బీఐ వంటివి ఉన్నాయి.

H1-బీ వీసాకు స్వస్తి పలకాలన్నది కూడా రామస్వామి అభిప్రాయం. ఈ వీసా ద్వారా అమెరికాలోని సంస్థలు నైపుణ్యాలు గల విదేశీయులను ఉద్యోగంలోకి తీసుకోవచ్చు. ఒకవేళ దీనికి స్వస్తి పలికితే అనేక మంది భారతీయులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.

సోషల్ మీడియా ఒక వ్యసనం అని రామస్వామి వ్యాఖ్యానించారు. 12-13 ఏళ్ల వయసున్న పిల్లలపై సోషల్ మీడియా చూపే ప్రభావం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

చిన్న పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించడాన్ని నిషేధించాలని రామస్వామి ఎన్నికల ప్రచారంలో అన్నారు. అయితే, టిక్‌టాక్‌లో చేరిన కొన్ని రోజుల తరువాతే రామస్వామి ఈ ప్రకటన చేయడంతో ప్రత్యర్థులు ఆయనపై విమర్శలు చేశారు.

మరోవైపు, కొరియా యుద్ధంలో జరిగిన సంధి తరహాలో రష్యా -యుక్రెయిన్ యుద్ధానికి కూడా ముగింపు పలకాలని జూన్‌లో రామస్వామి అన్నారు.

చైనా, రష్యా, అమెరికా, యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా, రష్యాల మధ్య బంధంపై వివేక్ రామస్వామి ఆందోళన

చైనా- రష్యా బంధంపై వివేక్ ఏమన్నారు?

అమెరికా సైన్యానికి చైనా-రష్యా కూటమితో అతిపెద్ద ముప్పు పొంచి ఉందని రామస్వామి భావిస్తున్నారు.

‘‘యుక్రెయిన్‌ను ఎప్పటికీ నేటోలో చేర్చుకోబోమని హామీ ఇస్తాం. దానికి బదులుగా చైనాతో చేసుకున్న సైనిక ఒప్పందాన్ని రష్యా రద్దు చేసుకోవాలి’’ అని రామస్వామి అన్నారు.

యుక్రెయిన్‌కు ఎక్కువగా ఆయుధాలు సరఫరా చేయడమంటే, పరోక్షంగా రష్యాను చైనా చేతుల్లోకి నెడుతున్నట్లే అన్నది ఆయన అభిప్రాయం.

అమెరికాలో ఓటు హక్కు వయసుపై కూడా వివేక్ రామస్వామికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.

‘‘ఓటు వేయడానికి కనీస వయసును 25 ఏళ్లకు పెంచాలి లేదా 18 ఏళ్లు నిండిన వారికి నేరుగా ఓటు హక్కు ఇవ్వకుండా అమెరికా పౌరసత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే ఇవ్వాలి.

అత్యవసర సేవల్లో లేదా ఆరు నెలల పాటు సైన్యంలో పని చేసిన 18 ఏళ్ల లోపు వయసుగల వారికి కూడా ఓటు హక్కు ఇవ్వాలి’’ అని ఆయన అన్నారు.

అయితే, వివేక్ రామస్వామి చెప్పినట్లుగా ఓటు హక్కును పొందే వయసులో మార్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. అందుకోసం 2/3 వంతుల మెజార్టీ అవసరం.

అలాగే, ఎఫ్‌బీఐ, విద్యాశాఖ వంటి వాటిని రద్దు చేయాలన్నది ఆయన వాదన.

“చాలా సందర్భాల్లో ఈ ఏజెన్సీలు పనికిరానివిగా మారిపోయాయి. వాటి స్థానాలను ఇతర విభాగాలతో భర్తీ చేస్తాం” అని ఎన్‌బీసీ న్యూస్‌తో రామస్వామి తెలిపారు.

ఒకవేళ ఎఫ్‌బీఐని రద్దు చేస్తే ఆ సంస్థకు కేటాయించే నిధులను ఇతర రక్షణ సంస్థలైన సీక్రెట్ సర్వీస్, ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నెట్‌వర్క్, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు కేటాయించవచ్చని ఆయన సూచించారు.

ఎఫ్‌బీఐ తనపై ప్రతీకార చర్యలు తీసుకుంటోందని డోనల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)