చైనా: స్టేడియంలో జనంపైకి దూసుకెళ్లిన కారు, 35 మంది మృతి

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, స్టీఫెన్ మెక్‌డోనల్, ఫ్రాన్సిస్ మావో
- హోదా, బీబీసీ ప్రతినిధులు
దక్షిణ చైనాలో ఓ వ్యక్తి అతివేగంగా జనంపైకి కారును పోనిచ్చిన ఘటనలో కనీసం 35 మంది చనిపోయారు. గడచిన కొన్ని దశాబ్దాల్లో చైనాలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనగా దీనిని చెబుతున్నారు.
సోమవారం చైనాలోని జుహయ్ ప్రాంతంలోని ఒక స్టేడియంలో ప్రజలు వ్యాయామాలు చేసుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి వేగంగా జనంపైకి కారు పోనిచ్చాడని పోలీసులు తెలిపారు.
ఈ దారుణమైన ఘటనలో దాదాపు 45 మంది గాయపడ్డారు. వారిలో వృద్ధులు, పిల్లలు ఉన్నారని స్థానిక మీడియా చెబుతోంది.
విడాకుల కేసులో అసంతృప్తిగా ఉన్న 62 ఏళ్ల ‘ఫ్యాన్’ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.
జుహయ్ స్టేడియం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన డ్రైవర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే అతను తన ఒంటిపై తనకు తానుగా చేసుకున్న గాయాలు ఉన్నాయని, తద్వారా కోమాలోకి వెళ్లిపోయాడని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విచారం వ్యక్తమవుతోంది.


ఫొటో సోర్స్, BBC/ ED LAWRENCE
విడాకుల కేసులో అసంతృప్తే కారణమా?
స్టేడియంలో జనాలపైకి కారుపోనిచ్చిన ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
అయితే, మృతి చెందిన వారి వివరాలను అక్కడి అధికారులు ఇంకా బయటపెట్టలేదు. అయినప్పటికీ, స్టేడియం బయట మృతులకు జనాలు మంగళవారం సంతాపం తెలిపారు.
వ్యాయామాలు చేయడానికి స్థానికులు ఎక్కువగా జుహయ్ స్టేడియానికి వస్తుంటారు. నిందితుడు కావాలనే ప్రజలపైకి కారు పోనిచ్చాడని ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఒక వ్యక్తి చైనీస్ మీడియాకు తెలిపారు.
“మా బృందం స్టేడియం చుట్టు ఒక రౌండ్ పూర్తి చేసింది. అప్పుడు ఒక కారు వేగంగా జనాలపైకి దూసుకెళ్లింది” అని కైకిన్స్ వార్తా పత్రికతో చెన్ అనే వ్యక్తి చెప్పారు.
విడాకుల సమయంలో తలెత్తిన ఆస్తి తాగాదాల కారణంగా నిందితుడు ఆవేశానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
అతడు ఇంకా కోమాలో ఉండటంతో ప్రశ్నించేందుకు అవకాశం దక్కలేదంటూ పోలీసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదే కాదు, ఈ ఏడాది ఫిబ్రవరిలో షాన్‌డాంగ్‌లో కత్తులు, తుపాకీతో జరిగిన దాడిలో కనీసం 21 మంది మరణించారు. అయితే, ఆ ఘటన బయటి ప్రపంచానికి తెలియకుండా దానిని నియంత్రించేందుకు చైనా అధికారులు ప్రయత్నించారు.
సోమవారం జరిగిన ఈ ఘటనపై కూడా అనేక ఆంక్షలు విధించారు. ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నుంచి తొలగిస్తున్నారు.
అయినప్పటికీ, ఈ దాడిలో పదుల సంఖ్యలో జనాలు కింద పడిపోయినట్లుగా ఉన్న కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో ఇంకా తిరుగుతున్నాయి.
చైనాలో ప్రముఖ నేరాలకు సంబంధించిన వీడియోలను నియంత్రిస్తూ, సోషల్ మీడియాలో వాటిని తొలగించడం సర్వసాధారణమే.

బీబీసీ ప్రతినిధులను అడ్డుకున్న స్థానికుడు
జుహయ్ స్టేడియం దగ్గర మంగళవారం రిపోర్టింగ్ చేసే క్రమంలో బీబీసీ ప్రతినిధులు వేధింపులకు గురయ్యారు. వీడియోలు తీయొద్దంటూ వారిని అడ్డుకున్నారు.
ఘటనా స్థలానికి వెళ్లిన బీబీసీ ప్రతినిధులను.... ‘మీరు జర్నలిస్టులా?’ అని ఒక సెక్యూరిటీ గార్డు అడిగారు. అవును కానీ, కేవలం పరిస్థితిని చూడటానికి వచ్చామని బీబీసీ ప్రతినిధులు చెప్పారు.
అయితే, ఆ సెక్యూరిటీ గార్డు వెంటనే వీరి ఫొటోలు తీసి ఎవరికో కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. బీబీసీ ప్రతినిధులను దూరం నుంచి చూసిన ఒక మహిళ “విదేశీయులు, విదేశీయులు” అంటూ అరిచింది.
వెంటనే ఒక వ్యక్తి కోపంతో ఊగిపోతూ బీబీసీ వీడియో తీయడాన్ని అడ్డుకున్నాడు.
చైనాలో ఈ తరహా సున్నితమైన ఘటనలు జరిగినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వారు స్థానికులుగా నటిస్తూ, విదేశీ జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని రిపోర్టింగ్‌ను నిరోధించేందుకు ప్రయత్నిస్తుంటారు.
అయినప్పటికీ, దీని వల్ల కథనాలు ఏమీ ఆగిపోవు. ఇంకా చెప్పాలంటే ఈ తరహా ఘటనలతో చైనాపై అవిశ్వాసం పెరుగుతుంది.
గత ఏడాది మాజీ ప్రధాని లీ కెకియాంగ్ మరణించినప్పుడు కూడా అంతే. ఈ తరహా గుంపులు లీ కెకియాంగ్ ఇంటికి చేరుకుని, అక్కడికి రిపోర్టింగ్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులపై దాడులు చేసేందుకు ప్రయత్నించారు.
ఈ మధ్య కాలంలో చైనాలో హింసాత్మక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి.
అక్టోబర్‌లో బీజింగ్‌లోని ఒక ప్రముఖ స్కూల్‌లో కత్తితో దాడికి పాల్పడిన ఘటనలో ఐదుగురు గాయపడ్డారు.
ఇక సెప్టెంబర్ నెలలో షాంఘైలోని ఒక సూపర్ మార్కెట్‌లో ఒక వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు.
ఆ ఘటన స్థలానికి బీబీసీ ప్రతినిధులు వెళ్లగా, దాడి జరిగిన కొన్ని గంటల్లోనే అక్కడ ఎలాంటి ఆధారాలు కనిపించకుండా మొత్తం శుభ్రం చేశారు. ఆ మరుసటి రోజు ఏం జరగనట్లు యథావిధిగా సూపర్ మార్కెట్ నడుస్తోంది. పోలీసుల క్రైమ్ సీన్ టేప్, మృతులకు నివాళులు అర్పించడం వంటివి అక్కడ ఏమి కనిపించలేదు.
కొన్నిసార్లు ఈ తరహా ఘటనలపై నుంచి వీలైనంత త్వరగా జనాల దృష్టి మరల్చేందుకు అధికారులు ప్రయత్నిస్తుంటారు.

ఫొటో సోర్స్, Reuters
కారు దాడి నేపథ్యంలో చైనాలోని జపనీయులు బహిరంగ ప్రదేశాల్లో జపనీస్ భాషను గట్టిగా మాట్లాడకూడదని ఆ దేశ ఎంబసీ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు, ఈ దాడిలో గాయపడిన వారికి రక్తాన్ని ఇచ్చేందుకు చాలా మంది స్థానికులు ఆసుపత్రికి తరలివస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














