‘పేకాట’లో భారత్‌కు సిల్వర్ మెడల్, ఈ “బ్రిడ్జ్ గేమ్” గురించి మీకు తెలుసా?

పేకాట, వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్

ఫొటో సోర్స్, World Bridge Federation/FACEBOOK

ఫొటో క్యాప్షన్, 16వ వరల్డ్ బ్రిడ్జ్ గేమ్స్‌లో 'సిల్వర్ మెడల్' గెలుచుకున్న భారత సీనియర్స్ జట్టు
    • రచయిత, బోడ నవీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గమనిక: వివిధ దేశాల్లో పేకాటకు సంబంధించి టోర్నమెంట్స్ జరుగుతాయని చెప్పే ప్రయత్నం మాత్రమే ఇది. అంతేకాని పేకాట ఆడాలి లేదా ఆడకూడదని చెప్పడం ఈ కథనం ఉద్దేశం కాదు.

భారత్‌లో పేకాటను ఎక్కువగా జూదంగానే చూస్తుంటారు. కానీ, కొన్ని దేశాల్లో దీనిని ఒక ప్రొఫెషనల్ గేమ్‌గా పరిగణిస్తారు.

ఆ కోవలోనే, అర్జెంటీనా వేదికగా జరిగిన 16వ వరల్డ్ బ్రిడ్జ్ గేమ్స్‌లో భారత్‌కు చెందిన సీనియర్స్ జట్టు ‘సిల్వర్ మెడల్’ గెలుచుకుంది. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 3 మధ్య జరిగిన ఈ పోటీల్లో.. ఫైనల్‌లో అమెరికా చేతిలో భారత్ ఓడిపోయింది.

పతకం సాధించిన భారత జట్టును స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 'ఎక్స్' వేదికగా అభినందించింది.

ఇంతకూ ఈ బ్రిడ్జ్ గేమ్ ఏంటి? ఈ టోర్నమెంట్ ఎలా నిర్వహిస్తారు? వంటి విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బ్రిడ్జ్ గేమ్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ

ఫొటో సోర్స్, World Bridge Federation/FACEBOOK

ఫొటో క్యాప్షన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ గుర్తింపు పొందిన 'వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్‌'

బ్రిడ్జ్ గేమ్ ఏంటి?

సాధారణంగా పేకాట ఆడేవాళ్లు ఎవరి ఆట వాళ్లు ఆడుతుంటారు. బ్రిడ్జ్ గేమ్‌లో అలా కాదు. ఇద్దరు కలిసి ఒక జట్టుగా ఆడాల్సి ఉంటుంది. సింగిల్‌గా ఆడేందుకు అవకాశం ఉండదు.

ఈ ఆటకు సంబంధించిన టోర్నమెంట్స్‌ని ‘వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్’ (డబ్ల్యూబీఎఫ్) నిర్వహిస్తుంది. ఇండియాలో ఈ గేమ్‌ను ‘బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (బీఎఫ్ఐ) చూసుకుంటుంది.

‘డబ్ల్యూబీఎఫ్’కు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ గుర్తింపు ఉంది. 'బీఎఫ్ఐ' కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందింది.

బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రెగ్యులర్‌గా వివిధ రాష్ట్రాల్లో టోర్నమెంట్స్ జరుగుతుంటాయి.

పేకాట, బ్రిడ్జ్ గేమ్, ఆటలు, స్పోర్ట్స్

ఫొటో సోర్స్, World Bridge Federation/FACEBOOK

ఫొటో క్యాప్షన్, నార్త్ -సౌత్ ఒక జోడీగా, ఈస్ట్-వెస్ట్ ఒక జోడీగా ఆడతారు

ఈ గేమ్ ఎలా ఆడతారు అంటే..

ఒక టేబుల్‌‌పై నలుగురు ఉంటారు. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ స్థానాల్లో కూర్చుంటారు. ఎదురెదురుగా ఉన్నవాళ్లను ఒక జోడీగా పరిగణిస్తారు. అంటే, నార్త్-సౌత్ ఒక జోడీ. ఈస్ట్-వెస్ట్ ఒక జోడీ.

జోకర్లు లేకుండా మొత్తం 52 కార్డులు ఉంటాయి.

అందులో డైమండ్స్, హార్ట్స్, స్పేడ్స్, క్లబ్ కార్డ్స్ ఉంటాయి. వీటిని ‘సూట్స్’ అంటారు.

ఒక్కొక్కరికి 13 కార్డులు పంచుతారు. వాటిని చూసుకున్న తరువాత 13 ట్రిక్స్‌లో 6 కంటే ఎక్కువగా ఎన్ని గెలుస్తాం అన్నదానిపై బిడ్ వేయాలి.

సింపుల్‌గా చెప్పాలంటే ట్రిక్ అంటే ఒక రౌండ్ అని అర్థం. ఎన్ని రౌండ్లలో గెలుస్తామన్న దానిపై బిడ్ వేయాలి.

అలా ఎవరైతే ఎక్కువగా బిడ్ వేస్తారో వారిని 'డిక్లేరర్' అంటారు.

డిక్లేరర్ ఎడమ వైపున కూర్చున్న వ్యక్తి మొదటగా ఒక కార్డు వేస్తారు. ఆ కార్డు కంటే పెద్ద కార్డు ఎవరు వేస్తే వాళ్లు ఆ ట్రిక్ లేదా ఆ రౌండ్‌లో గెలిచినట్లు.

మొత్తం 13 కార్డులు కాబట్టి 13 ట్రిక్స్ ఉంటాయి.

ఒకవేళ అవతలి వ్యక్తి వేసిన సింబల్‌(సూట్)కు సంబంధించిన కార్డు మన దగ్గర లేకపోతే ఏం చేయాలి?

అంటే, బిడ్డింగ్ ఆరంభంలో డిక్లేరర్‌ ఏదైనా ఒక సూట్‌ను ‘ట్రంప్ సూట్‌’గా చెబుతారు. దానిని ఉపయోగించవచ్చు. అన్నింటి కంటే ఆ ట్రంప్ సూట్‌కే విలువ ఎక్కువ.

కొన్ని సార్లు 'ట్రంప్ సూట్' లేకుండానే ఆడుతుంటారు. అది డిక్లేరర్ చాయిస్.

అలా… కనీసం మూడు ఆటల్లో రెండు ఆటలు (2-1) ఎవరు గెలిస్తే వారు విజయం సాధించినట్లు.

అయితే, స్కోర్ అనేది... ఎంత బిడ్ వేశారు? ఏ సింబల్‌ కార్డును ట్రంప్ సూట్‌గా ఎంచుకున్నారు? ఎన్ని ట్రిక్స్ గెలిచారు? వంటి వాటి ఆధారంగా నమోదు చేస్తారు. ఆ వివరాలు వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

సీనియర్ టీమ్ విభాగంలో భారత జట్టు పతకం గెలుచుకుంది.

భారత జట్టులో అరుణ్ బాపట్, ప్రణబ్ కుమార్ బర్ధన్, బాదల్ చంద్రదాస్, రవి గోయెంకా, కమల్ కృష్ణ ముఖర్జీ, విభాస్ తోడితో పాటు కెప్టెన్ గిరీష్ బిజూర్ ఉన్నారు.

“టీమ్‌గా చూసినప్పుడు ఒక జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఉంటారు. ఒకేసారి నలుగురు మాత్రమే గేమ్‌లో పాల్గొంటారు. వాళ్లు రెండు టేబుల్స్‌పై కూర్చుంటారు. ఒక టేబుల్‌పై నార్త్-సౌత్‌లో, మరొక టేబుల్‌పై ఈస్ట్-వెస్ట్ స్థానాల్లో కూర్చొని గేమ్ ఆడతారు” అని నరసింగ రావు తెలిపారు. విశాఖపట్నంకు చెందిన ఈయన బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ నేషనల్ డైరెక్టర్‌.

ఇతర గేమ్స్‌లో అంపైర్స్ లేదా రిఫరీలు ఉంటారు కదా, అలాగే ఈ బ్రిడ్జ్ గేమ్‌లో అంపైర్స్‌ను డైరెక్టర్స్ అంటారు.

జూదం, గేమ్, పోలీసులు

ఫొటో సోర్స్, World Bridge Federation/FACEBOOK

ఫొటో క్యాప్షన్, 'బ్రిడ్జ్ గేమ్' టేబుల్

ఈ గేమ్‌కు చట్టబద్ధత ఉందా?

పేకాట, జూదంపై తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో నిషేధం ఉంది.

అయితే, ఈ బ్రిడ్జ్‌ గేమ్ చట్టబద్ధమేనని బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ప్రసాద్ కేని చెప్పారు.

“భారత దేశంలో పేకాట అనే సరికి చాలా మంది చట్టవిరుద్ధమైన ఆట అనుకుంటారు. కానీ, ఈ బ్రిడ్జ్‌ గేమ్ చట్టబద్ధమే. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాధాన్యతనిస్తున్న ఆటల్లో ఇది ఒకటి. చెస్‌లాగే ఇది ఒక రకమైన మైండ్ గేమ్” అని ప్రసాద్ కేని బీబీసీ తెలుగుతో చెప్పారు.

“ఈ పేకలతో పోకర్, రమ్మీ, తీన్‌పత్తి వంటి ఆటలు ఆడుతుంటారు. అక్కడ విజయం పూర్తిగా అదృష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మంచి ముక్కలు పడితే సరే, లేకపోతే అంతే సంగతులు. డబ్బులు పెట్టి ఆడుతుంటారు. ఇదంతా జూదం కిందకు వస్తుంది. బ్రిడ్జ్‌ గేమ్ అలా కాదు, ఇది స్కిల్‌కు సంబంధించిన గేమ్. ఇందులో సింగిల్‌గా కాదు జట్టుగానే ఆడాల్సి ఉంటుంది. స్కోరింగ్ ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్డ్‌ గేమ్. మంచి ముక్కలు పడకపోయిన్పటికీ స్కిల్ ద్వారా ఇందులో విజయం సాధించవచ్చు" అని ప్రసాద్ అన్నారు.

“చాలా చోట్ల జూదానికి, బ్రిడ్జ్‌ గేమ్‌కు మధ్య తేడాను పోలీసులు కూడా గుర్తించలేకపోతున్నారు. ఈ సమస్యలు చాలానే ఎదురవుతున్నాయి. అలాంటి సందర్భాల్లో సంబంధిత అధికారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపును చూపిస్తున్నాం” అని నరసింగ రావు చెప్పారు.

బ్రిడ్జ్ గేమ్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్

ఫొటో సోర్స్, World Bridge Federation/FACEBOOK

బిల్‌గేట్స్, వారెన్ బఫెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రిడ్జ్ గేమ్ ఆడుతున్న బిల్‌గేట్స్, వారెన్ బఫెట్ (ఫైల్ ఫొటో)

వారెన్ బఫెట్, బిల్‌గేట్స్‌కు ఇష్టమైన గేమ్

“ఇది మెదడుకు పనిపెట్టే గేమ్‌. అందుకే వారెన్ బఫెట్, బిల్‌గేట్స్ వంటి దిగ్గజాలు దీనిని ఎంతో ఇష్టపడుతున్నారు” అని ప్రసాద్ కేని అన్నారు.

ఈ గేమ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చాలా సందర్భాల్లో బిల్‌గేట్స్‌ చెప్పారు.

2023 మార్చిలో భారత పర్యటనకు వచ్చినప్పడు వరల్డ్ యూత్ బ్రిడ్జ్ చాంఫియన్‌షిప్‌లో మూడు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న అన్షుల్ భట్‌ను కలిసి ప్రత్యేకంగా అభినందించారు. ఆటపై బిల్‌గేట్స్‌‌కు ఎంత ఇష్టముందో చెప్పడానికి ఇదో ఉదాహరణ.

“ఈ గేమ్ ఇంగ్లండ్‌లో పుట్టింది. బ్రిటిష్ ఇండియా కాలంలో ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు వంటివారు ఈ గేమ్ ఆడేవారు. ప్రస్తుతం అమెరికా, చైనా, ఇండోనేషియా, తుర్కియే, ఇటలీ తదితర దేశాల్లో ఈ గేమ్ ప్రసిద్ధి చెందింది.

ఈ ఆటను ఇండియాలో పదివేల మందికి పైగా ఆడుతున్నప్పటికీ 'బీఎఫ్ఐ'లో మెంబర్‌షిప్ పొందినవారి సంఖ్య దాదాపుగా 5 వేలు మాత్రమే” అని ప్రసాద్ కేని తెలిపారు.

“బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల్లో ఈ పోటీలు జరుగుతుంటాయి. ఈ నెలలో(నవంబర్) తెలంగాణలో పెద్దపల్లి, ఏపీలో కాకినాడలో పోటీలు ఉన్నాయి” అని తెలంగాణ రాష్ట్ర బ్రిడ్జ్ అసోసియేషన్ అధ్యక్షులు జి. వీరభద్రరావు తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)