హింసతో రగులుతున్న రాష్ట్రంలో శాంతి నెలకొనేదెప్పుడు? - గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, రాఘవేంద్రరావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
కర్ఫ్యూ , ఇంటర్నెట్ లేదు.. రోడ్డు మధ్యలో ఒక కారు తగలబడిపోతోంది.
ఏడాదిన్నర కిందట 2023 మే 5న మేం మణిపుర్ రాజధాని ఇంఫాల్ చేరుకున్నప్పుడు ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చాక మాకు కనిపించిన దృశ్యం అది.
ఏడాదిన్నర తర్వాత కూడా ఇంఫాల్‌లో అదే దృశ్యం.
కర్ఫ్యూ , ఇంటర్నెట్ లేదు.. రోడ్డు మధ్యలో తగలబడుతున్న కారు.
2023 మే3న మైతేయీ, కుకీ తెగల మధ్య హింస భగ్గుమంది.
ఇప్పటి వరకు హింసలో 258 మంది చనిపోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇదొక్కటే కాదు. ఈ రెండు తెగల మధ్య ఏర్పడిన అంతరం రోజురోజుకీ పెరుగుతోంది.

నవంబర్ 7న మణిపుర్‌లో మరోసారి హింస మొదలైంది.
ఆ రోజు, మణిపుర్‌లోని జిరీబామ్ జిల్లాలో సాయుధులు ఒక గిరిజన మహిళను కాల్చి చంపారు. ఈ దాడి చేసినవారు మైతేయీ తెగకు చెందినవారని ఆరోపించారు.
అక్కడికి నాలుగు రోజుల తర్వాత నవంబర్ 11న జిరీబామ్‌లోని పునరావాస కేంద్రంపై దాడి జరిగింది. ఈ దాడి తర్వాత ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు. వీరంతా మైతేయీ వర్గానికి చెందినవారు
నవంబర్ 11న జిరీబామ్‌లో భద్రతా బలగాలు 10 మంది సాయుధులను హతమార్చాయి. వీరంతా తీవ్రవాదులని ప్రభుత్వం పేర్కొంది.

తాజా హింసకు కారణమేంటి?
నవంబర్ 16న ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. నవంబర్ 11న జిరీబామ్ జిల్లాలోని పునరావాస కేంద్రంలో అదృశ్యమైన ఆరుగురి మృతదేహాలు అస్సాంలోని ఓ నదిలో దొరికినట్లు వార్తలు వచ్చాయి.
మృతదేహాలు లభించాయనే విషయం తెలియగానే ఇంఫాల్‌లో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి.
నిరసనలకు దిగిన వారు ఆగ్రహంతో స్థానిక ఎమ్మెల్యేల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఇంఫాల్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
హింస ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మణిపుర్‌కు 9వేల మంది అదనపు భద్రత బలగాలను పంపాలని నిర్ణయించింది.
“ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలను కుకీ తీవ్రవాదులు హత్య చేశారు. నిందితుల కోసం వెతుకుతున్నాం” అని మణిపుర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నవంబర్ 19న చెప్పారు.

ఎమ్మెల్యేల ఇళ్లలో హింస
పట్సోయి నియోజకవర్గంఎమ్మెల్యే, బీజేపీ నేత సపమ్ కుంజకేశ్వర్ సింగ్ ఇంఫాల్‌లో ఉంటున్నారు. ఆయన ఇంటికి మేం వెళ్లాం.
నవంబర్ 16 సాయంత్రం ఒక పెద్ద గుంపు ఆయన ఇంటిని ధ్వంసం చేసింది. ఆ హింసకు సంబంధించిన జాడలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తున్నాయి.
ఆయన ఇంటి బయట రోడ్డు మీద కారు తగలబెట్టారు. ఆ రోజు సాయంత్రం ఎమ్మెల్యే ఇంట్లోకి వందల మంది జనం వచ్చారని అక్కడ ఉన్న భద్రత సిబ్బంది మాతో చెప్పారు.
ఎమ్మెల్యే ఇంట్లో నుంచి తీసుకెళ్లిన కారుని రోడ్డు మధ్యకు నెట్టి నిప్పు పెట్టారు.
ఇంటి లోపల ఉన్న పోలీస్ ఎస్కార్ట్ వాహనాలనూ ధ్వంసం చేశారు. తర్వాత ఎమ్మెల్యే ఇంటి మీదకు వెళ్లారు.
కుంజకేశ్వర్ సింగ్ ఇంటి ముందు లాన్‌లో పగిలిపోయిన కుండలు, గాజు పెంకులు, విరిగిపోయిన ఫర్నిచర్ ఉంది.
దాడి జరిగినప్పుడు ఎమ్మెల్యే ఇంట్లోనే ఉన్నారు. ఆయనకు ఎలాంటి హాని జరగకుండా భద్రత సిబ్బంది చర్యలు తీసుకున్నారు.
ఎమ్మెల్యేకు భద్రత కల్పించేందుకు అక్కడే ఉన్న మణిపుర్ రైఫిల్స్ ఆందోళనకారుల్ని అడ్డుకోలేకపోవడంతో వారు ఇంట్లోకి ప్రవేశించి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు.
చీకటి పడిన తర్వాత ఎమ్మెల్యే ఇంటి వద్ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన బలగాలను మోహరించారు.

కుంజకేశ్వర్ సింగ్ ఇంటికి కొంచెం దూరంలోనే మణిపుర్ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సుసింద్రో మైతేయీ ఇంటిపై ఓ గుంపు రాళ్లు విసిరింది.
ఆ సమయంలో అక్కడ మోహరించిన సరిహద్దు భద్రతాదళ సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపి జనాన్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
మేం సుసింద్రో ఇంటికి చేరుకున్నప్పుడు అక్కడ పగిలిపోయిన అద్దాలను చూశాం. నవంబర్ 16 తర్వాత ఆయన ఇంటిని దుర్బేధ్యంగా మార్చడాన్ని గుర్తించాం.
ఆయన ఇంటి ముందు పెద్ద ఇనుప గేటు ఏర్పాటు చేశారు. వాటికి ముళ్ల తీగల్ని అమర్చారు. ఇంటి దగ్గర సాయుధులైన బీఎస్ఎఫ్ బృందం ఉంది.
ఆరోజు సాయంత్రం జరిగిన హింసలో బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డాడని భద్రత సిబ్బంది మాకు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఉన్నారు.
సుసింద్రో కెమెరా ముందు మాట్లాడేందుకు నిరాకరించారు. తాను చెప్పేది రికార్డు చేయొద్దని కోరుతూ అనేక విషయాలు చెప్పారు. తన ఇంటిపై దాడి చేసేందుకు వచ్చిన వారు నిరసనకారులు కాదని ఆయన అన్నారు.
మణిపుర్‌లో ప్రస్తుత సంక్షోభానికి ఆజ్యం పోయడమే వాళ్ల లక్ష్యం. గుంపులో చాలా మంది ఎలక్ట్రిక్ డ్రిల్స్, సుత్తితో వచ్చారని సుసింద్రో మాతో చెప్పారు.
ఆయన ఇంటిని తగలబెట్టడం, దోచుకోవడమే వారి ఉద్దేశం.
దాడి జరిగిన సమయంలో సుసింద్రో ఇంట్లో లేరు. నవంబర్ 16న రోజంతా తన ఇంటికి స్థానిక మహిళలు, వృద్ధులు వస్తూనే ఉన్నారని చెప్పారు.
తన కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన అధికారిక నివాసానికి చేరుకున్నారు. సాయంత్రానికి వందల మంది ఆయన ఇంటి చుట్టూ గుమిగూడారు. ఆ తర్వాత హింస మొదలైంది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆరోజు సాయంత్రం దాదాపు డజను మంది ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వీరిలో ఎక్కువ మంది బీజేపీ ఎమ్మెల్యేలే.
ఈ దాడులపై విచారణకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

చురాచాంద్‌పుర్ చేరుకోవడం చాలా కష్టం
మేం ఇంఫాల్ నుంచి చురాచాంద్‌పుర్ చేరుకున్నాం.
2023 మే 3న ఇదే చురాచాంద్‌పుర్‌లో మైతేయీ, కుకీ తెగల మధ్య రాజుకున్న హింస రాష్ట్రమంతా పాకింది.
చురాచాంద్‌పుర్- ఇంఫాల్ మధ్య 60 కిలోమీటర్ల దూరం ఉంది.
ఇంఫాల్ లోయలో మైతేయీలదే ఆధిపత్యం. చురాచాంద్‌పుర్‌లో కుకీలు ఎక్కువ.
ఇంఫాల్- చురాచాంద్‌పుర్ మధ్య విష్ణుపుర్ ఉంది. మణిపుర్‌లో హింసాత్మక పరిస్థితులు తలెత్తిన తర్వాత ఇది బఫర్‌జోన్‌గా ఉంది. ఇక్కడ భారత సైన్యం భారీగా మోహరించింది.
ఇంఫాల్ నుంచి చురాచాంద్‌పుర్.. చురాచాంద్‌పుర్ నుంచి ఇంఫాల్‌కు వెళ్లడం అంత తేలిక కాదు. విష్ణుపుర్‌లోని బఫర్ జోన్‌లో చాలా తక్కువ దూరంలోనే అనేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.
ఈ చెక్‌పోస్టుల దగ్గర ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేస్తున్నారు.
గతఏడాది, ఒక గుంపులో ఒక్కరి వివరాలు నమోదు చేస్తే ఈ చెక్‌పోస్టులను దాటి వెళ్లేందుకు అనుమతి ఉండేది. ఇప్పుడు అందరి వివరాలు నమోదు చేయాల్సిందే.
మేం ఈ చెక్‌పోస్టుల వద్దకు రాగానే మమ్మల్ని ఆపి చురాచాంద్‌పుర్ వెళ్లేందుకు అనుమతి ఉందా అని అడిగారు. ఈ ప్రాంతంలో ఫోటోలు తీయడం, వీడియో చిత్రీకరణకు అనుమతి లేదు.
మేం చురాచాంద్‌పుర్ ఎందుకు వెళ్తున్నామో కూడా వాళ్లు అడిగారు. అక్కడ మీరు ఎవరిని కలుస్తారు? మీరు ఏ పని చేస్తారు? అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నారని మేం తిరిగి ప్రశ్నిస్తే "అక్కడ పరిస్థితి విషమంగా ఉంది. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు" అని భద్రత సిబ్బందిలో ఒకరు మాతో చెప్పారు.
దాదాపు అరగంట సేపు సీనియర్ అధికారులతో అనేక సార్లు ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆ అధికారి చురాచాంద్‌పుర్ వెళ్లేందుకు మాకు అనుమతి ఇచ్చారు.
“ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. అక్కడకు మీరు మీ సొంత పూచీ మీద వెళుతున్నారు. అక్కడ మీకు ఏం జరిగినా మీదే బాధ్యత” అని మాకు అనుమతి ఇచ్చిన అధికారి మాతో చెప్పారు.

చురాచాంద్‌పుర్: ఆ ప్రశాంతత వెనుక కనిపించని అలజడి
చెక్‌పోస్టుల్లో అన్ని అనుమతులు తీసుకుని చురాచాంద్‌పుర్ చేరుకున్న తర్వాత అక్కడ అంతా సాధారణంగా ఉన్నట్లు కనిపించింది.
అయితే కనిపించే ప్రశాంతత వెనుక కనిపించని అలజడి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
నవంబర్ 11న జిరీబామ్ జిల్లాలో భద్రత దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన 10 మంది ఫొటోలతో అనేక చోట్ల బ్యానర్లు పెట్టారు.
ఈ 10 మందిలో ఎనిమిది మంది చురాచాంద్‌పుర్ వాసులు ఉన్నట్లు చెబుతున్నారు.
వాళ్లంతా ఉగ్రవాదులని మణిపుర్ ప్రభుత్వం చెబుతోంది.
నవంబర్ 11న జిరీబామ్‌లోని బోరోబెకరా ప్రాంతంలోని పునరావాస కేంద్రం, పోలీస్ స్టేషన్‌లో ఉంటున్న స్థానికులపై దాడి చేశారు.
"భయాన్ని వ్యాపింపజేయడం, విధ్వంసం సృష్టించడమే వారి లక్ష్యం. అయితే, అక్కడ మోహరించిన సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల వారి దాడి విఫలమైంది" అని ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ చెప్పారు.
"భద్రతా బలగాల ధైర్యం, వేగంగా స్పందించిన తీరు వల్ల ఆ 10మంది అక్కడికక్కడే చనిపోయారు. దీని వల్ల పునరావాస కేంద్రంలో ఉన్న వందల మంది ప్రాణాలకు ముప్పు తప్పింది" అని ఆయన చెప్పారు.
అయితే చనిపోయిన వాళ్లంతా గ్రామంలో స్వచ్చంధ సేవకులని స్థానిక ప్రజలు చెబుతున్నారు. వారు తమ వారిని కాపాడుకునేందుకే జిరీబామ్ వెళ్లారని తెలిపారు.

2023లో మైతేయీ, కుకీ తెగల మధ్య హింస ప్రారంభమైనప్పుడు తమ గ్రామాలను రక్షించుకోవడానికి రెండు పక్షాలు సాయుధ సమూహాలను ఏర్పాటు చేసుకున్నాయి.
అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరిగాయి..
చనిపోయిన 10 మందిలో కొంతమంది కుటుంబీకులను మేం కలిశాం.
భద్రత బలగాల చేతిలో చనిపోయిన లాల్ థానేయి వయస్సు 22 ఏళ్లు. అతను భవన నిర్మాణ పనులు చెయ్యడంతో పాటు ఇళ్లకు రంగులు వేస్తాడని అతని కుటుంబం చెప్పింది.
తమ్ముడు చనిపోయాడంటే అతని అన్న రామ్ మసూ ఇప్పటికీ నమ్మలేక పోతున్నారు.
“నేను కళ్లు మూసుకున్నప్పుడల్లా, వాడి మొహం గుర్తుకొస్తుంది. చనిపోయిన 10 మందిలో మిలిటెంట్లు ఎవరూ లేరు. వారంతా మిలిటెంట్లని పోలీసులు చెప్పారు. ఇది పూర్తిగా అవాస్తవం. వాళ్లు మిలిటెంట్లు కాదు”
లాల్ థానేయి విలేజ్ వలంటీర్‌గా జిరీబామ్ వెళ్లినట్లు రామ్ మసూ చెప్పారు.
"మణిపుర్‌లో హింసాత్మక పరిస్థితులు చెలరేగినప్పటి నుంచి గ్రామాల్లో అందరూ వలంటీర్లుగా మారారు. వాళ్లు తమ ఇంటిని, గ్రామాన్ని కాపాడుకోవడానికి ముందుకొచ్చారు” అని ఆయన చెప్పారు.
‘వాళ్లంతా పేదలు. ఎవరిదీ పెద్ద కుటుంబం కాదు. రోజూ కూలి పనులు చేసుకునే వాళ్లు’ అని అన్నారు.

రామ్ మసూ ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న మరో ఇంట్లో ఇలాంటి పరిస్థితే ఉంది.
బార్తా తన కుమారుడు జోసెఫ్‌తో చివరిగా నవంబర్ 10న మాట్లాడింది. మరుసటి రోజు తన 20 ఏళ్ల కొడుకును జిరీబామ్‌లో భద్రత బలగాలు కాల్చి చంపినట్లు తెలిసింది.
"నా కొడుకు తన ప్రజలను రక్షించడానికి గ్రామ వలంటీర్‌గా వెళ్ళాడు. అందరూ అతన్ని మిలిటెంట్ అంటున్నారు. చనిపోయిన వారిని మిలిటెంట్లు అని పిలవవద్దని ప్రభుత్వానికి నా విన్నపం" అని బార్తా అన్నారు.
జోసెఫ్ 10వ తరగతి చదువుతున్నాడని అతని కుటుంబం చెప్పింది. అతను డ్రైవింగ్ కూడా నేర్చుకున్నట్లు తెలిపింది.
"మేం భారతీయులం. విదేశీయులం కాదు. అతివాదులం కాదు. బయటి నుంచి రాలేదు. అందరిలాగే మాకు సమాన హక్కులు ఉండాలి. మాకు న్యాయం చేయాలి" అని అతని తల్లి బార్తా డిమాండ్ చేశారు.
నవంబర్ 11న జిరీబామ్‌లో మరణించిన 10 మంది, మార్ కమ్యూనిటీకి చెందినవారు. వారి మృతితో చురాచాంద్‌పుర్‌లో ఉద్రిక్తత ఏర్పడింది.
ఈ 10 మంది మృతదేహాలను చురాచాంద్‌పుర్ జిల్లా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.
మృతుల కుటుంబీకులు, మార్ కమ్యూనిటీ ప్రజలు మృతదేహాల కోసం ఎదురు చూస్తున్నారు.
మార్ కమ్యూనిటీ ఆచారం ప్రకారం, అంత్యక్రియలు నిర్వహించే వరకు మృతదేహాలను ఒంటరిగా ఉంచకూడదు.
మార్ కమ్యూనిటీకి చెందిన వందల మంది రోజంతా మార్చురీ బయట కూర్చుంటున్నారు.
కొన్ని రోజుల క్రితం, చూరాచాంద్‌పుర్‌లోని కుకీ సంస్థలు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారి జ్ఞాపకార్థం ఖాళీ శవపేటికలతో ర్యాలీ నిర్వహించాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర దర్యాప్తు జరగాలని మార్ సంఘం డిమాండ్ చేస్తోంది.
"ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. 2023 మేలో హింసాత్మక పరిస్థితులు మొదలైన తర్వాత తొలిసారి ఇక్కడ 10 మంది మరణించారు. స్థానికుల్లో చాలా అసంతృప్తి, కోపం ఉంది." అని మార్ సంఘం అధికార ప్రతినిధి డేవిడ్ బహ్రిల్ అన్నారు.
హింసతో రగులుతున్న మణిపుర్ ఇప్పటికీ శాంతికి దూరంగానే కనిపిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














