ఇజ్రాయెల్- హిజ్బొల్లా కాల్పుల విరమణ ఒప్పందంలో ఏం ఉంది, లెబనాన్‌కు కలిగే ప్రయోజనం ఏంటి?

ఫొటో సోర్స్, Reuters
ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య 13 నెలల పోరాటానికి తెరపడింది. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
"ఈ ఒప్పందం స్థానిక కాలమానం ప్రకారం బుధవారం 04:00 గంటలకు (భారత కాలమానం బుధవారం ఉదయం 7:30 గంటలకు) అమలులోకి వస్తుంది" అని బైడెన్ అన్నారు.
లెబనాన్‌లో పోరాటాన్ని నిలిపివేసి, ‘హిజ్బొల్లా, ఇతర ఉగ్రవాద సంస్థల నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించడం’ ఈ ఒప్పందం లక్ష్యం అని యుఎస్, ఫ్రాన్స్ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం గురించి అధికారిక అప్‌డేట్‌లు, మీడియా నివేదికల ద్వారా ఇప్పటివరకు తెలిసిన వివరాలేంటంటే?
‘శాశ్వత కాల్పుల విరమణ’ లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగిందని బైడెన్ ప్రకటించారు.
ఒప్పందంలో భాగంగా:
- 60 రోజులలో హిజ్బొల్లా బ్లూ లైన్ (లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య అనధికారిక సరిహద్దు), లిటాని నదికి (ఉత్తర దిశకు సుమారు 30 కి.మీ దూరం) మధ్య ఉన్న ప్రాంతం నుంచి తన ఫైటర్లను, ఆయుధాలను తొలగిస్తుంది.
- అమెరికా సీనియర్ అధికారి ప్రకారం.. లెబనాన్ సైన్యం ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆయుధాలు, సైనిక నిర్మాణాలు తొలగిస్తారు, వాటిని మళ్లీ అక్కడ పునర్నిర్మించకుండా చూసుకుంటాయి.
- అదే 60 రోజులలో ఇజ్రాయెల్ నెమ్మదిగా తన దళాలను, పౌరులను అక్కడి నుంచి ఉపసంహరించుకుంటుంది. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న ప్రజలు తమ ఇళ్లకు తిరిగి రావడానికి ఇది వీలు కల్పిస్తుందని బైడెన్ చెప్పారు.


ఫొటో సోర్స్, UN
హిజ్బొల్లా స్థానంలో లెబనాన్ దళాలు
అమెరికా అధికారి ప్రకారం.. దక్షిణాన హిజ్బుల్లా స్థానంలో ఐదు వేలమందితో కూడిన లెబనాన్ దళాలను మోహరించడం ఈ ఒప్పందంలో ఉంది.
అయితే, దీని గురించిన ఆందోళనలు ఉన్నాయి. లెబనాన్ సైన్యం కాల్పుల విరమణను ఎలా అమలు చేస్తుంది?
అవసరమైతే అది హిజ్బొల్లాతో తలపడుతుందా? ఇది బలమైన మత, జాతి సమూహ విభేదాలున్న దేశంలో పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.
అయితే, ఒప్పందం ప్రకారం బాధ్యతలను పూర్తిగా నెరవేర్చడానికి తమ వద్ద తగినంత నిధులు, సిబ్బంది, సామగ్రి లేవని లెబనాన్ సైన్యం పేర్కొంది. కాగా, మిత్రదేశాల సహాయంతో లెబనాన్‌కు ఈ సమస్య నుంచి సడలింపు దొరకవచ్చు.
హిజ్బొల్లా ప్రస్తుతం బలహీనంగా ఉందని చాలామంది పాశ్చాత్య అధికారులు అంటున్నారు. మొత్తం దేశంపై నియంత్రణను తిరిగి పొందడానికి లెబనాన్ ప్రభుత్వానికి ఇది అవకాశంగా మారింది.

ఫొటో సోర్స్, Reuters
కాల్పుల విరమణను ఎవరు పర్యవేక్షిస్తారు?
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1701పై ఆధారపడి ఈ ఒప్పందం జరిగింది. ఇదే 2006లో ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్యన జరిగిన యుద్ధాన్ని ముగించింది.
1701 తీర్మానం ప్రకారం: లిటాని నదికి దక్షిణాన ఉన్న ప్రాంతంలో లెబనీస్ ప్రభుత్వ, యూఎన్ శాంతి పరిరక్షక దళం (యునిఫిల్) మినహా ఎలాంటి సాయుధ గ్రూపులు లేదా ఆయుధాలు ఉండకూడదు.
అయితే, ఈ నిబంధనలను ఉల్లంఘించారని ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. హిజ్బొల్లా అక్కడ మౌలిక సదుపాయాలను నిర్మించిందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. తమ భూభాగంపై సైనిక విమానాలు తీసుకొచ్చి ఇజ్రాయెల్ తీర్మానాన్ని ఉల్లంఘించిందని లెబనాన్ అంటోంది.
ఈసారి ఉల్లంఘనలను గుర్తించడానికి యునిఫిల్, లెబనాన్, ఇజ్రాయెల్‌లతో కూడిన ప్రస్తుత పర్యవేక్షణ వ్యవస్థలో అమెరికా, ఫ్రాన్స్ చేరుతాయని యుఎస్ అధికారి ఒకరు తెలిపారు.
‘’అమెరికా యుద్ధ దళాలు ఏ ప్రాంతంలో ఉండవు. ఫ్రెంచ్ మిలిటరీతో కలిసి పనిచేసే లెబనాన్ సాయుధ దళాలకు అమెరికా సైనిక మద్దతును అందిస్తుంది’’ అని ఆ అధికారి అన్నారు.
హిజ్బొల్లా ‘ఉగ్రవాద కేంద్రాలు’ ఇక దక్షిణ లెబనాన్‌లో పునర్నిర్మాణం కాబోవని బైడెన్ హామీ ఇచ్చారు.

ఫొటో సోర్స్, Reuters
ఉల్లంఘనలకు ప్రతిస్పందించే హక్కు
అమెరికా మద్దతుతో లెబనాన్‌లో స్వేచ్ఛగా సైనిక చర్య తీసుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని ప్రధాని నెతన్యాహు అన్నారు.
‘‘ ఒప్పందాన్ని ఉల్లంఘించి, హిజ్బొల్లా ఆయుధాలు పొందడానికి ప్రయత్నిస్తే.. మేం దాడి చేస్తాం. సరిహద్దుల్లో ఉగ్రవాద కేంద్రాలను పునర్నిర్మిస్తే దాడులు చేస్తాం. అది రాకెట్లను ప్రయోగించినా, సొరంగాలు తవ్వినా, రాకెట్లతో ట్రక్కులను తీసుకువచ్చినా దాడి చేస్తాం’’ అని ఆయన అన్నారు.
"హిజ్బొల్లా లేదా మరెవరైనా ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయెల్‌కు ముప్పు తలబెడితే అంతర్జాతీయ చట్టం ప్రకారం తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది" అని బైడెన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ ఒప్పందం లెబనాన్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తుందని కూడా ఆయన అన్నారు.
‘ఇజ్రాయెల్ తిరిగి దాడి చేసే హక్కు’ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగమని నమ్మడం లేదు ఎందుకంటే దీన్ని లెబనాన్ తిరస్కరించింది. దీంతో ఇజ్రాయెల్ హక్కుకు మద్దతిస్తూ అమెరికా ఒక లేఖను పంపవచ్చని మీడియా కథనాలు వస్తున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














