అదానీ కేసుపై ఆంధ్రలో ఎందుకింత సైలెన్స్?

చంద్రబాబు, వైఎస్ జగన్, గౌతమ్ అదానీ

ఫొటో సోర్స్, FB/cbn, FB/ysjagan, Getty

ఫొటో క్యాప్షన్, గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసుపై ఏపీ నేతలు ఎవరూ పెద్దగా స్పందించడంలేదు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

జగన్ హయాంలో చాయ్‌, సమోసాల కోసం పెట్టిన ఖర్చు మీదే నానా యాగీ చేస్తున్న తెలుగుదేశం నేతలు, అదానీ - జగన్ వివాదంలో ఎందుకింత సైలెన్స్ పాటిస్తున్నారనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో మొక్కుబడిగా అది కూడా అదానీ ప్రస్తావన లేకుండా చంద్రబాబు చేసిన ప్రకటన తప్ప తెలుగుదేశం నేతల నుంచి పెద్ద సౌండ్ వినిపించడం లేదు. నాయకులు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో మీడియా నిర్దేశించేది కాకపోయినప్పటికీ ఈ అంశంలో తెలుగుదేశం పాటిస్తున్న మౌనం చర్చనీయాంశమవుతోంది.

దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ అమెరికాలో కేసు నమోదైంది. అమెరికాలో పెట్టుబడిదారుల నుంచి సేకరించిన డబ్బును భారత్‌లోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చేందుకు వినియోగించారనేది ప్రధాన ఆరోపణ. ఆ లంచాల్లో 80 శాతానికి పైగా అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తికి ఇచ్చినట్టు కూడా అందులో పేర్కొన్నారు.

నిర్దిష్టంగా చెప్పుకుంటే సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాల కాంట్రాక్టులను దక్కించుకునేందుకు దేశంలోని ఐదు రాష్ట్ర ప్రభుత్వాలకు 2,029 కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వగా, ఆంధ్రప్రదేశ్‌లోని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తికి ఒక్కరికే 1,750 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు అమెరికా ప్రాసిక్యూటర్‌ ఈ కేసుపత్రాల్లో పేర్కొన్నారు.

ఊరికూరికే చిన్న చిన్న విషయాలకే అగ్గి బుగ్గి అన్నట్టుండే ఆంధ్ర రాజకీయాల్లో ఎంత వివాదం రేగాలి? ఎంత చర్చ రచ్చ ఉంటుందనుకోవాలి? కానీ ఎటు చూసినా సైలెన్సే! తప్పదన్నట్టు అసెంబ్లీలో ముక్తసరిగా మాట్లాడి ముగించిన చంద్రబాబు రెస్పాన్స్ తప్ప, రాష్ట్ర అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేని కాంగ్రెస్ స్పందన తప్ప ముఖ్యమైన పార్టీల నుంచి అంతులేని సైలెన్స్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అదానీ

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా వారి అభియోగాల్లో ఆంధ్ర గురించి ప్రస్తావించింది ఇదీ...

2021 జులై నుంచి 2022 ఫిబ్రవరి మధ్య సోలార్‌ విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ డిస్కంలు 7 వేల మెగావాట్ల విద్యుత్‌ కోసం సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2025 జనవరి నుంచి విద్యుత్‌ సరఫరా చేస్తామని సెకీ చెప్పింది. అయితే అదానీ పవర్‌ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌ను ఏపీకి సరఫరా చేయాలని సెకీ నిర్ణయించింది. వాస్తవానికి, అధిక ధరల కారణంగా సెకీ నుంచి విద్యుత్‌ కొనుగోలుకు ఏ ప్రభుత్వ సంస్థా ముందుకు రాకపోవడంతో అదానీ గ్రూపు ప్రతినిధులు లంచాలు ఎరవేసినట్లు అమెరికన్‌ ప్రాసిక్యూటర్‌ పేర్కొన్నారు.

అదానీ కంపెనీ ఈ ఆరోపణలను ఖండించింది. చట్ట ప్రకారం ముందుకెళ్తామని ప్రకటించి ఉంది.

కానీ, అమెరికా ఆభియోగాల ప్రకారం గౌతమ్‌ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్‌ అదానీ, అదానీ బోర్డు సభ్యుడు వినీత్‌ జైన్, ఇతరులు అప్పటి ప్రభుత్వంలోని పెద్దకు లంచాలు ఇవ్వడం ద్వారా ఒప్పందాలకు మార్గం సుగమం చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తికి లంచం అందిందని మాత్రమే అమెరికాలోని బ్రూక్లిన్‌లో ఉన్న ఫెడరల్‌ కోర్టు పేర్కొంది, కానీ నేరుగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పేరు ఎక్కడా తన నివేదికలో ప్రస్తావించలేదు. అయితే ఆదానీ నుంచి కొనుగోలు చేసిన పవర్‌ను సెకీ ఏపీకి సరఫరా చేయాలని నిర్ణయించిన నేపథ్యంతో పాటు 2021 ఆగస్టు 7, సెప్టెంబర్‌ 12, నవంబర్‌ 20 తేదీలలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌తో గౌతమ్‌ అదాని భేటీ అయినట్టు యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ కమిషన్‌(ఎస్‌ఈసీ) కోర్టుకిచ్చిన తన ఫిర్యాదులో పేర్కొంది.

చంద్రబాబు

ఫొటో సోర్స్, ChandrababuNaidu

అదానీ పేరు ప్రస్తావించకుండా బాబు స్పందన

అదానీ ఎపిసోడ్, అందులోనూ ఆంధ్రతో ఉన్న బంధం గురించి జాతీయ స్థాయి మీడియాలో చర్చ అవుతున్న తరుణాన అసెంబ్లీలో చంద్రబాబు క్లుప్తంగా స్పందించారు. అయితే జగన్ మీద ఎప్పుడూ జనరిక్‌గా మాట్లాడే ఆరోపణలకే పెద్దపీట వేసి అదానీ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు.

వాస్తవానికి అమెరికా అభియోగాలు ప్రధానంగా అదానీ, ఆయన అసోసియేట్ల మీదే. అమెరికాలో పెట్టుబడులు సేకరించి వాటిని విదేశాల్లో లంచాల కింద వాడారు కాబట్టి ఆ మేరకు తమ పరిధి ఉంటుందంటూ వారిపై పెట్టిన కేసు. మిగిలిన లంచాల వ్యవహారం నిజమైతే ప్రధానంగా తేల్చుకోవాల్సింది ఇక్కడే. ఆ తీగ ఆధారంగా ఇక్కడ జరిగిందంటున్న అవకతవకల మీద, పాత్రధారుల మీద, ఇక్కడ విచారణ జరగాల్సి ఉంటుంది. అలాంటి కేసులో ప్రధానమైన అదానీ పేరును, వారి పాత్రను వదిలేసి చంద్రబాబు కేవలం జగన్ మీద జనరల్‌గా చేసే ఆరోపణల్లాగానే మాట్లాడడం ఆసక్తికరమైన అంశం.

గత శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు ఈ విషయంపై చంద్రబాబు మాట్లాడారు. అయితే ఎక్కడా అదానీ పేరు ప్రస్తావించలేదు. కేవలం వైఎస్‌ జగన్‌పై విమర్శలకే పరిమితమయ్యారు.

ఇంతకూ చంద్రబాబు ఏమన్నారంటే..

‘‘చరిత్రలో ఏ రాజకీయ నాయుడు చేయనన్ని తప్పులు చేశారు. గతంలో వ్యవస్థలు విధ్వంసమయ్యాయి. అధికార యంత్రాంగం నిర్వీర్యమైంది. గడచిన ఐదేళ్లలో వైకాపా చేసిన విధ్వంసం, అవినీతిని ఇప్పటికే చర్చించాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్ఠ, బ్రాండ్‌ను దెబ్బతీసేలా ప్రవర్తించారు. ఈ అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది. మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తాం. అమెరికా కోర్టులో వేసిన ఛార్జిషీటు కూడా మా దగ్గర ఉంది. అధ్యయనం చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం’’ అని అన్నారు.

గత శుక్రవారం అసెంబ్లీలో ఈ ప్రకటన చేసిన చంద్రబాబు ఆ తర్వాత ఎక్కడా ఈ విషయంపై మాట్లాడలేదు.

‘‘అదానీని అంటే మోదీని అన్నట్టే.. అందుకే బాబు మాట్లాడటానికి ఇబ్బంది’’

‘‘ప్రధాని నరేంద్ర మోదీకి గౌతమ్‌ అదానీ అత్యంత దగ్గరి వ్యక్తి. ఇక ఎన్‌డీఏలోనూ చంద్రబాబు ఉన్నారు. నరేంద్ర మోదీతో ఆయన రాజకీయ సావాసం చేస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలోనూ టీడీపీ, బీజేపీలు భాగస్వాములు. ఇప్పుడు అదానీ మీద ఆరోపణలు చేస్తే నరేంద్ర మోదీ మీద మాట్లాడినట్లే అనుకోవచ్చు. అందువల్ల చంద్రబాబు నాయుడు అదానీ ఇష్యూ గురించి మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడటం లేదని మనం భావించాలి’’ అని సీనియర్‌ జర్నలిస్టు గాలి నాగరాజు బీబీసీతో మాట్లాడుతూ అన్నారు.

చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండటానికి మరొక కారణం కూడా ఉందని నాగరాజు చెప్పారు. ‘‘మరోవైపు చూస్తే. చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెడితే, ఇప్పుడు చంద్రబాబు పారిశ్రామిక రంగంపై దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల అదానీ గ్రూప్‌ పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నుంచి ఈ విషయంపై తీవ్రంగా స్పందన ఆశించలేం. మొత్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పరిశ్రమల ప్రయోజనాలను కాపాడటానికి, అటు ప్రధాని నరేంద్ర మోదీకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి చంద్రబాబు నాయుడు నామమాత్రంగా స్పందించారని అనుకోవచ్చు’’ అని గాలి నాగరాజు అభిప్రాయపడ్డారు.

‘‘చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితి’’

’’అదానీ ముడుపుల కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్థి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం 1,750 కోట్ల రూపాయలు అదానీ నుంచి డబ్బులు తీసుకుందని చంద్రబాబు నాయుడుకు వకాల్తా పుచ్చుకునే మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయి. కానీ చంద్రబాబు గట్టిగా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే జగన్‌ గురించి మాట్లాడితే అదానీ గురించి మాట్లాడినట్టే.. అంటే అది ఫైనల్‌గా నరేంద్ర మోదీ గురించి మాట్లాడినట్టే. ఇది బాబుకు ఇరకాటమే’’ అని రాజకీయ పరిశీలకుడు చెవుల కృష్ణాంజనేయులు వ్యాఖ్యానించారు.

‘‘వాస్తవంగా చూస్తే చంద్రబాబు సీరియస్‌గానే స్పందించాలి. ఎందుకంటే ఆ ఆరోపణ చిన్నది కాదు. గత ప్రభుత్వంలోని కీలక అధికారి తీసుకున్నారన్నది నిజమే అయితే అది ప్రజల సొమ్ము.. ఈ విషయమై చంద్రబాబు కేసు కూడా పెట్టొచ్చు. కానీ అదానీకి దెబ్బ తగిలితే భారత ఆర్థిక వ్యవస్థకు దెబ్బ తగిలినట్లుగా భావిస్తున్న బీజేపీతో బాబు కలిసి ఉండటం వల్ల బాబు ‘కట్టె విరగకుండా.. పాము చావకుండా’ అన్న సామెత చందాన మాట్లాడారు’’ అని కృష్ణాంజనేయులు అభిప్రాయపడ్డారు.

మరోవైపు చంద్రబాబే కాదు.. ఈ విషయంపై టీడీపీ సీనియర్‌ నేతలు, మంత్రులు కూడా పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించడం లేదని కృష్ణాంజనేయులు గుర్తు చేశారు.

జగన్ మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, APCMO/FB

వైఎస్‌ జగన్‌ కూడా నేరుగా స్పందించలేదు, కానీ..

ఈ ఆరోపణల మీద వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎక్కడా నేరుగా స్పందించలేదు. ఆ ఆరోపణలు వచ్చిన మరుసటి రోజు ఆయన బెంగళూరుకు వెళ్లిపోయారు. ఆదానీ ముడుపులు ఇచ్చినట్టు మీడియాల్లో వచ్చిన వాదనలు, వార్తలపై పార్టీ పరంగా వివరణ, ఖండన మాత్రం నాలుగురోజుల కిందటే వెలువడింది.

ఆ తర్వాత మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించి వివిధ మీడియాల్లో వస్తున్న కథనాలను, వార్తలను ఖండించారు.

amarnath gudivada

ఫొటో సోర్స్, FB/amarnath.gudivada

ఆ కేసుతో జగన్‌‌కు ఏం సంబంధం?: మాజీ మంత్రి గుడివాడ

పారిశ్రామికవేత్త అదానీ కేసుతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు ఏం సంబంధం ఉందని గత ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేసిన గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.

ఆయన ఈ విషయంపై బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘అసలు మా ప్రభుత్వ హయాంలో మేము అదానీ నుంచి కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేశాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో మా ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. అంతేగానీ అదానీ గ్రూప్‌‌తో ఎక్కడా అలాంటి ఒప్పందం చేసుకోలేదు. చేసుకోని ఒప్పందాలకు నాటి ప్రభుత్వానికి లంచాలు ఇచ్చారని అమెరికా ఫెడరల్‌ కోర్టులో యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ కమిషన్‌ కేసు దాఖలు చేయడాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఎవరైనా చేసుకోని ఒప్పందాలకు ఎక్కడైనా లంచాలిస్తారా?’’ అని గుడివాడ అమర్నాథ్‌ ప్రశ్నించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)