భీమిలి ఎర్రమట్టి దిబ్బలు :ఇక్కడ ఇల్లు కట్టుకోవడం తప్పా,అన్ని దిబ్బలు ఎర్రమట్టి దిబ్బలేనా, సరిహద్దుల గుర్తింపులో సమస్య ఏంటి?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన భీమీలిలోని ఎర్రమట్టి దిబ్బలు మరోసారి వివాదంలోకి వచ్చాయి.
అధికారులు ఎర్రమట్టి దిబ్బల పరిధిని సరిగ్గా నిర్ణయించకపోవడంతో తమకు ఐదు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని భీమిలిపట్నం మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులు అంటున్నారు.
“దేశంలోనే రెండో మున్సిపాలిటీ అయిన భీమిలిలో ఐదు దశాబ్దాల కిందట ఈ సొసైటీ ఏర్పాటైంది. ఇప్పటీకే సభ్యులు చాలా మంది చనిపోయారు. కానీ భూమి ఇప్పటికీ సభ్యులకు అందలేదు. అధికారులను అడిగితే ఎర్రమట్టి దిబ్బలను కారణంగా చూపుతున్నారు” అని సొసైటీ కార్యదర్శి సూరిబాబు చెప్పారు.
“50 ఏళ్ల క్రితం మా నాన్న, ఇప్పుడు నేను, నా తర్వాత నా మనవళ్లు, అందరం ఈ సొసైటీకి డబ్బులు కడుతూనే ఉండాలా? ఇప్పటికే బిడ్డలపై ఆధారపడి బతుకుతున్నానని చెప్పుకోడానికి ఇబ్బందిగా ఉంది. మా స్థలం మాకు ఇప్పించి మా ఆత్మగౌరవాన్ని కాపాడండి” అని సొసైటీ సభ్యురాలు పద్మ బీబీసీతో చెప్పారు.
ప్రభుత్వం ఈ సొసైటీకి ఇచ్చిన భూమి సభ్యులకు ఎందుకు అందడంలేదు? ఎర్రమట్టి దిబ్బలు ఈ వివాదంలోకి ఎందుకొచ్చాయి? 54 ఏళ్ల కిందట ఏర్పాటైన భీమిలిపట్నం మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యుల వాదనేంటి? అధికారులు ఏం చెబుతున్నారు?


మున్సిపాలిటీ గుర్తింపు పోకుండా...
భీమిలిపట్నం మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఏర్పాటుకు సంబంధించి ఈ విషయాలు తెలుసుకుంటే, ఎర్రమట్టి దిబ్బలకు, ఈ సొసైటీకి ఉన్న సంబంధం అర్థమవుతుంది.
ఈ సొసైటీని భీమిలి హౌసింగ్ సొసైటీగా పిలుస్తుంటారు.
భీమిలిపట్నం 1861లో మున్సిపాలిటీ గుర్తింపు పొందింది.
భీమిలిపట్నం మున్సిపాలిటీగా ఏర్పాటైన సమయానికి అదొక రెండువేల మంది కంటే తక్కువ జనాభా ఉన్న చిన్నపట్టణం అని భీమిలిపట్నానికి చెందిన న్యాయవాది కె. మల్లికార్జునరావు చెప్పారు. ఆయన భీమిలి హౌసింగ్ సొసైటీలో సభ్యుడు కూడా.
సొసైటీకి సంబంధించిన కోర్టు కేసుల అవసరార్థం భీమిలిపట్నం చరిత్రపై పరిశోధన చేశారు.
“భీమిలిపట్నానికి చెందిన కోట అప్పలనర్సయ్య జిల్లా జడ్జిగా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు భీమిలిపై విపరీతమైన ప్రేమ. 1970 నాటికి భీమిలిపట్నంలో అభివృద్ధి లేదు. పైగా ఉన్న జనం కూడా ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. దీంతో దేశంలోనే రెండో మున్సిపాలిటీలో జనాభా లేకపోతే ఈ ఊరికి మున్సిపాలిటీ హోదా పోతుందని భావించి, జనాన్ని ఇక్కడికి రప్పించాలని 1970లో ఇక్కడొక టౌన్ షిప్ ను అభివృద్ధి చేయాలని దాదాపు 4500 మంది సభ్యులతో ఈ సొసైటీని ప్రారంభించారు. అప్పుడు ప్రభుత్వం భీమిలి రోడ్డు పక్కనే ఈ సొసైటీకి 374 ఎకరాలను ఇచ్చింది.” అని మల్లికార్జునరావు బీబీసీకి చెప్పారు.

సొసైటీకి 54 ఏళ్లు..
1970లో ఏర్పడిన ఈ సొసైటీకి 2024కి 54 ఏళ్లు నిండాయి.
సొసైటీ ఏర్పాటైనప్పుడు ఇచ్చిన 374 ఎకరాలు ఇప్పుడు 280 ఎకరాలైంది. సభ్యులు 4500 మంది నుంచి 2000కి తగ్గిపోయారు. కొందరు చనిపోయారు. ఇంకొందరు సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నారు.
సొసైటీకి డబ్బులు కట్టింది మొదటితరం అనుకుంటే..స్థలం కోసం ఇప్పుడు మూడో తరం వ్యక్తులు ఎదురు చూస్తున్నారని సభ్యురాలు పద్మ బీబీసీతో అన్నారు.
“భీమిలి హౌసింగ్ సొసైటీలో మా తండ్రి 1975లో డబ్బులు కట్టి చేరారండి. తర్వాత ఆయన చనిపోయారు. ఆయనకు ఆ సొసైటీ ల్యాండ్ అందలేదు. ఆ తర్వాత వారసురాలిగా నేను అదే భూమి కోసం రూ. 12.50 లక్షలు కట్టాను. నాకూ ఆ భూమి వచ్చేటట్టు లేదు. నాకు 60 ఏళ్లు వచ్చేశాయి. మా మనవళ్లకే 15 ఏళ్లు. కనీసం వాళ్లకైనా వస్తుందని అనుకుంటున్నాం. నాకు సొసైటీ స్థలం ఇస్తే గౌరవంగా బతుకుతాను. నా పిల్లల మీద ఆధారపడి బతుకుతున్నాను.” అని సొసైటీ సభ్యురాలు పద్మ బీబీసీతో చెప్పారు.
“ఈ సొసైటీకి 374 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత దీనిలో కొంత భాగాన్ని 2016లో జియోహెరిటేజ్ సైట్ గా గుర్తించడంతో 91.5 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు సొసైటీకి 280 ఎకరాలు మిగిలింది. దీనిలో పనులు చేసినా అధికారులు జియోహెరిటేజ్ సైట్ అని అడ్డుపడుతున్నారు.” అని సొసైటీ కార్యదర్శి సూరిబాబు తెలిపారు.

అన్నీ ఎర్రమట్టి దిబ్బలే..
“మేమేదైనా చిన్న పని ప్రారంభిస్తే పర్యావరణవేత్తలు...ఎర్రమట్టి దిబ్బలు ధ్వంసం చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. విశాఖ తీరం పొడవునా ఎర్రమట్టి దిబ్బలే ఉంటాయి. ఇక్కడ దిబ్బలన్ని ఎర్రగానే ఉంటాయి. అందుకే జియో హెరిటేజ్ డిపార్ట్ మెంట్ అసలైన ఎర్రమట్టి దిబ్బలను గుర్తించింది. అయినా సరే ఎర్రమట్టి దిబ్బల పక్కన ఎక్కడ ఏ చిన్న పని చేసినా ఎర్రమట్టి దిబ్బలు విధ్వంసమంటూ అడ్డుపడుతున్నారు.” అని సూరిబాబు చెప్పారు.
“ఇక్కడ 12 వందల ఎకరాల్లో జియోహెరిటేజ్ గా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలు, ఐఎన్ఎస్ కళింగ, కొన్ని హోటళ్లు, రైతులకు ఇచ్చిన అసైన్డ్ భూములు, వీఎంఆర్డీఏ లే అవుట్లు అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క భీమిలి హౌసింగ్ సొసైటీకే సమస్య వచ్చిందా?” అని ప్రశ్నిస్తున్నారు సొసైటీ సభ్యులైన పద్మనాభరావు.
“మా చిన్నతనం నుంచి చూస్తున్నాం, విశాఖ బీచ్ రోడ్డులో ఉన్నవన్ని కూడా ఎర్రమట్టి దిబ్బలే. ఎర్రగా ఉన్నవన్ని ఎర్రమట్టి దిబ్బలేనా, దానికి వారసత్వ సంపదని ఒక పేరు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సొసైటీకి ల్యాండ్ ఇచ్చేటప్పుడు ఇవన్ని తెలియదా ప్రభుత్వానికి” అని పద్మనాభరావు అన్నారు.
“కాపాడుకోవాల్సిన ఎర్రమట్టి దిబ్బల చుట్టూ వివిధ కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటీకే ఐఎన్ఎస్ కళింగ ఉంది. మరో వైపు లే అవుట్స్ వేశారు. ఇప్పుడు భీమిలి హౌసింగ్ సొసైటీ ఇష్యూ. ఇలా ఎర్రమట్టి దిబ్బల చుట్టూ హడావిడి ఎక్కువైంది.” అని పర్యావరణవేత్త సొహన్ హట్టంగడి బీబీసీకి చెప్పారు.

‘‘వారసత్వ సంపద కాపాడే చర్యలేవీ’’
“జియో హెరిటేజ్ గా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలకు, సొసైటీ స్థలాలకు మధ్యన సరిహద్దులను 2016లో ప్రభుత్వం, జియో హెరిటేజ్ విభాగం గుర్తించింది. అన్ని రకాల సమస్యలు పరిష్కరించుకుని 2024 జూలైలో భూమి చదును చేస్తుంటే మళ్లీ అధికారులు వచ్చి పనులు నిలిపివేశారు. ఎందుకంటే ఏవో ఫిర్యాదులు అందాయని, పర్యావరణ వేత్తలు అందోళనలు చేస్తున్నారని. జీవీఎంసీ కూడా వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చింది. దీంతో పనులు నిలిపివేశాం.” అని సొసైటీ సెక్రటరీ సూరిబాబు చెప్పారు.
“దీనిని వారసత్వ సంపదని పర్యావరణ వేత్తలు, ప్రభుత్వం అంటున్నారు. కానీ దానిని కాపాడేందుకు ప్రభుత్వం ఏ చిన్న పని చేయలేదు. ఎర్రమట్టి దిబ్బల్లో ఎవరికి ఏ భూమి ఉంది అనేది కూడా చూడలేదు. కనీసం ఎర్రమట్టి దిబ్బల లోపలకి ఫుట్ వే కూడా వేయలేదు .ఒకవేళ మా సొసైటీయే ఎర్రమట్టి దిబ్బలకు అడ్డయితే..మిగతా వారు చేస్తున్న కార్యకలాపాలను కూడా ఆపి, వారికి ఇచ్చిన స్థలాలను వెనక్కి తీసుకోండి.” అని సెక్రటరీ సూరిబాబు అంటున్నారు.
‘‘స్పష్టత వచ్చాక పనులు చేసుకోవచ్చు’’
‘‘ఆ ప్రాంతంలో 262 ఎకరాలను జియో హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. దీనికి కనీసం 50 మీటర్ల మేర బఫర్ జోన్‌గా విడిచి పెట్టి, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. భీమిలి హౌసింగ్ సొసైటీ చేస్తున్న పనులపై కొన్ని అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చాయి. అందుకే పనులు నిలిపివేశారు. వాటిపై స్పష్టత వచ్చాక సొసైటీ తమ పనులు చేసుకోవచ్చు.’’ అని భీమిలి తహశీల్దార్ రామారావు బీబీసీకి తెలిపారు.

సరిహద్దుల నిర్ణయమే పరిష్కారమా?
‘‘ఎర్రమట్టి దిబ్బలకు ఒకవైపు ఐఎన్‌ఎస్ కళింగ, ఇంకోవైపు హౌసింగ్ సొసైటీ స్థలాలు, మరోవైపు సముద్రాన్ని అనుకుని ఉన్న రోడ్డు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటిని కూడా ఎర్రమట్టి దిబ్బల్లో భాగంగానే చూస్తున్నాం" పర్యావరణవేత్త, రాజకీయ నాయకుడు, జల్‌బిరదారి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ గతంలో బీబీసీతో అన్నారు.
ఎర్రమట్టి దిబ్బల సమీపంలో ఎటువంటి నిర్మాణాలు జరిగినా కచ్చితంగా వాటికి ప్రమాదంగానే పరిగణించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
భీమిలిలో మొత్తం ఎర్రమట్టి దిబ్బలు 12 వందల ఎకరాల్లో ఉన్నాయని ఏయూ జియోలజీ మాజీ ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
వీటిని పర్యాటక ప్రాంతంగానే కాకుండా భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అపురూప భౌగోళిక సంపదగా చూడాలని ఆయన అన్నారు.
“ప్రభుత్వం ఎర్రమట్టి దిబ్బలు, ఇతర సొసైటీలు, లే అవుట్లకు మధ్య సరైన సరిహద్దులను నిర్ణయించాలి. శాటిలైట్ సర్వే జరిపి ఎర్రమట్టి దిబ్బలను కచ్చితంగా గుర్తించి దాని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ అధికారులతో కలిసి జియాలజిస్టుల ఆధ్వర్యంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఎర్రమట్టి దిబ్బలు, వాటి చుట్టు పక్కల కాంక్రీట్ నిర్మాణాలు, చేపట్టకుండా నిబంధనలు తేవాలి. ఇలా చేస్తే ఇప్పుడే కాకుండా భవిష్యత్‌లోనూ ఎర్రమట్టి దిబ్బలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.” అని పర్యావరణవేత్త సొహన్ హట్టంగడి బీబీసీతో అన్నారు.
‘‘ఇప్పుడున్న రాజకీయ పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, ఏవీ కూడా సొసైటీ ఏర్పడినప్పుడు లేవు. మా పరిస్థితిని అర్థం చేసుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.” అని భీమిలి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు హరిగోపాల్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














