పాత ఫోన్లు, టీవీల నుంచి రాగి, బంగారం వెలికితీసేందుకు ప్రాణాలను పణంగా పెడుతున్నారు

ఈ భారీ డంపింగ్ యార్డు నుంచి దట్టమైన పొగ పైకి లేస్తుండడం చాలా దూరం నుంచే కనిపిస్తుంటుంది.
ఘనా రాజధాని ఆక్రాకు పశ్చిమాన ఉన్న ఈ డంపింగ్ యార్డు దగ్గర గాలి చాలా విషపూరితమైనది. మనం అక్కడకు వెళ్తున్నకొద్దీ ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. కళ్లు మసకబారుతుంటాయి.
ఆ దట్టమైన పొగల చుట్టూ పదుల సంఖ్యలో మనుషులు నిల్చుని ఉంటారు. కేబుళ్ల చుట్టలను ట్రాక్టర్ల నుంచి అన్‌లోడ్ చేయడానికి వాళ్లు అక్కడ ఉంటారు.
ఇంకొందరు ఆ విషపూరిత వ్యర్థాల ఎత్తయిన కుప్పలపై ఎక్కి టీవీలు, కంప్యూటర్లు, వాషింగ్ మెషీన్ల విడిభాగాలను కిందకి దించి కాల్చివేస్తారు.
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) నుంచి వాళ్లు రాగి, బంగారం వంటి విలువైన లోహాలను వెలికితీస్తున్నారు. ఈ పాత వస్తువుల్లో ఎక్కువ భాగం ధనిక దేశాల నుంచి ఘనాకు వచ్చినవే.


ఊపిరి పీల్చడం కూడా కష్టం
‘‘నా ఆరోగ్యం ఏమీ బాగుండట్లేదు’’ అని అక్కడ పనిచేస్తున్న యువకుడు అబ్దుల్లా యాకుబ్ చెప్పారు. ఆయన కళ్లు ఎర్రగా మారి, నీళ్లతో నిండిపోయాయి. ఆయన కేబుళ్లను, ప్లాస్టిక్‌ను కాల్చివేస్తున్నారు.
‘‘ఇక్కడ గాలి చాలా కాలుష్యంతో నిండి ఉంటుంది. నేను రోజూ ఇక్కడే పనిచేయాలి. ఇది కచ్చితంగా నా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది’’ అని ఆయన తెలిపారు.
వ్యర్థాలను తగలబెట్టే ప్రాంతానికి దగ్గరలో అబీబా అల్‌హసన్ పనిచేస్తున్నారు. ఆమెకు నలుగురు పిల్లలు. వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను ఆమె సేకరిస్తుంటారు. విషపూరితమైన పొగ ఆమెపై కూడా ప్రభావం చూపిస్తోంది.
‘‘కొన్నిసార్లు ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. గుండె అంతా భారంగా మారిపోతుంది. చాలా అనారోగ్యానికి గురవుతున్నాను’’ అని ఆమె చెప్పారు.
ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు బాగా పెరుగుతున్నాయి. 2022లో 62 మిలియన్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తయ్యాయని అంచనా. 2010తో పోలిస్తే ఇది 82 శాతం ఎక్కువని ఐక్యరాజ్య సమితి నివేదికలు తెలియజేస్తున్నాయి.
ఈ-వ్యర్థాలు బాగా పెరగడానికి ఎలక్ట్రోనైజేషన్(అంటే ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం భారీగా పెరగడం) కారణం.
స్మార్ట్ ఫోన్లు మొదలుకుని కంప్యూటర్లు, స్మార్ట్ అలారమ్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటివాటికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కేవలం 15 శాతం ఈ-వ్యర్థాలను మాత్రమే రీసైక్లింగ్ చేస్తున్నారు. కొన్ని కంపెనీలు అక్రమంగా ఈ వ్యర్థాలను వేరే ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకోసం కొందరు దళారులను ఆశ్రయిస్తున్నాయి. వారు వ్యర్థాలను దేశాల సరిహద్దులను దాటిస్తున్నారు.

ఈ - వ్యర్థాల అక్రమ తరలింపు
విషపూరిత రసాయనాలు, లోహాలు, ప్లాస్టిక్స్, ఇతర మూలకాలు ఉండే అలాంటి ఈ-వ్యర్థాలను రీసైకిల్ చేయడం కష్టం. వాటిని వేరుచేసి, రీసైకిల్ చేయడం అంత తేలికకాదు.
అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఈ-వేస్ట్ నిర్వహణకు సంబంధించి సరిపడా మౌలికసదుపాయాలు లేవు.
ఇప్పటికే అభివృద్ధి చెందిన, ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ఈ-వ్యర్థాల అక్రమ రవాణా బాగా పెరుగుతోందని ఐక్యరాజ్య సమితి వర్గాలు చెబుతున్నాయి.
అక్రమ రవాణా కేసుల్లో స్వాధీనం చేసుకుంటున్న వస్తువుల్లో ఈ-వ్యర్థాలే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా పట్టుబడుతున్న వ్యర్థాల్లో ఆరింట ఒకటి ఈ-వేస్ట్ వస్తువే అని వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ గుర్తించింది.

అక్రమ రవాణాదారులు ఈ-వ్యర్థాలను ఎలా దాచిపెట్టి రవాణా చేస్తారో ఇటలీలోని నేపుల్స్ పోర్టు అధికారులు బీబీసీ వరల్డ్ సర్వీస్‌కు చూపించారు. ఆ పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్న వ్యర్థాల్లో దాదాపు 30 శాతం ఈ-వేస్ట్.
ఆఫ్రికాకు కారును తీసుకెళ్తున్న ఓ కంటెయిన్ బౌండ్ స్కాన్‌ను వారు చూపించారు. కానీ పోర్టు అధికారులు ఆ కంటెయిన్‌ను తెరిచి చూడగా, వాహనాల విడి భాగాలు, ఈ-వేస్ట్ అందులో ఉంది. వాటిలో కొన్నింటి నుంచి ఆయిల్ కారుతోంది.
‘‘మీరు వ్యక్తిగత వస్తువులను ఇలా ప్యాక్ చేయరు. ఇలా చేశారంటే వాటిని పారేయడానికే తీసుకెళ్తున్నారని అర్థం’’ అని యూరోపియన్ యాంటీ-ఫ్రాడ్ ఆఫీస్‌కు చెందిన పరిశోధకులు లుయిగి గర్రుటో చెప్పారు. యూరప్ అంతటా పోర్టుల అధికారులతో వీరు కలిసి పని చేస్తున్నారు.

కొత్త కొత్త మార్గాల్లో అక్రమ రవాణా
ఈ-వేస్ట్ అక్రమ రవాణా బాగా పెరగడం తాము కూడా గమనించామని బ్రిటన్ అధికారులు చెప్పారు.
‘‘పనికిరాని వస్తువులను మళ్లీ ఉపయోగించొచ్చు అని తరచుగా చెబుతుంటారు. కానీ ఇది తప్పు. నిజంగా ఏం జరుగుతోందంటే విలువైన వస్తువుల కోసం వాటిని ధ్వంసం చేసి, ఘనా వంటి దేశాల్లో నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్నాక అక్రమంగా తగలబెడుతున్నారు’’ అని ఫీలక్స్‌స్టో పోర్టు దగ్గర బ్రిటన్ ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ ప్రతినిధి బెన్ రైడర్ చెప్పారు.
ఈ వ్యర్థాలను, ప్లాస్టిక్‌తో కలిపి ఎగుమతి చేసేందుకు అక్రమ రవాణాదారులు ప్రయత్నిస్తున్నారు.
ఈ-వ్యర్థాల్లో ఎక్కువ భాగం ఉండే మోటారు వాహనాల అక్రమ రవాణా దాదాపు 700 శాతం పెరిగిందని వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ గత నివేదిక తెలిపింది.
అయితే, ఇలా స్వాధీనం చేసుకునేవి, రిపోర్ట్ చేసే కేసులు.. నిజంగా జరిగేవాటితో పోలిస్తే చాలా తక్కువ అని నిపుణులు అంటున్నారు.
అభివృద్ధి చెందిన దేశాల వెలుపల ఈ వ్యర్థాల అక్రమ రవాణాకు సంబంధించి సమగ్ర నివేదిక లేనప్పటికీ, ఈ వ్యర్థాలకు ఆగ్నేయ ఆసియా దేశాలు ప్రధాన గమ్యస్థానంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి ఈ-వేస్ట్ రిపోర్ట్ తెలియజేస్తోంది.
అయితే వాటిలో కొన్ని దేశాలు ఇలాంటి వ్యర్థాల అక్రమ రవాణా కట్టడికి చర్యలు తీసుకోవడంతో ఈ-వ్యర్థాల్లో చాలా భాగం ఆఫ్రికన్ దేశాలకు చేరుతోందని ఐక్యరాజ్యసమితి వర్గాలు చెబుతున్నాయి.
మలేసియాలో ఈ ఏడాది మే నుంచి జూన్ మధ్య 106 కంటెయినర్ల ప్రమాదకర ఈ-వ్యర్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఐక్యరాజ్య సమితి ఆగ్నేయ ఆసియా, పసిఫిక్ డ్రగ్స్, నేరాల నిరోధక కార్యాలయం ప్రాంతీయ ప్రతినిధి మసూద్ కరిమిపోర్ చెప్పారు.
కొత్త కొత్త స్మగ్లింగ్ వ్యూహాలతో అక్రమ రవాణాదారులు అధికారులను బురిడీకొట్టిస్తున్నారని, ప్రభుత్వాలు కావాల్సినంత వేగంగా స్పదించడం లేదని ఐక్యరాజ్య సమితి వర్గాలు తెలిపాయి.
‘‘ఈ -వేస్ట్ వంటి ప్రమాదకర వ్యర్థాలను తీసుకెళ్లే ఓడలు, చేయాలనుకున్న ప్రాంతంలో అంత తొందరగా సరుకును అన్‌లోడ్ చేయలేవు. అలాంటప్పుడు లైట్లు ఆర్పేసి ఆ ఓడలు సముద్రం మధ్యలో ఉంటాయి. అప్పుడు వాటిని గుర్తుపట్టలేం’’ అని కరిమాపోర్ చెప్పారు.
‘‘అక్రమంగా రవాణా చేస్తున్నవాటిని సముద్రంలో పడేయడం అన్నది వ్యవస్థీకృత నేరంగా మారిపోయింది. అనేక సంస్థలు, అనేక దేశాలు ఈ అంతర్జాతీయ నేర వ్యవస్థ నుంచి లాభాలు పొందుతున్నాయి’’ అని ఆయన తెలిపారు.

అత్యంత ఆందోళన కలిగించే రసాయనాలు
ఈ-వ్యర్థాలను తగలబెట్టినప్పుడు, ఒకచోట నుంచి మరో చోటకు తరలించేటప్పుడు వాటిలోని ప్రమాదకర ప్లాస్టిక్, లోహాల వల్ల మనుషుల ఆరోగ్యంపైనా, పర్యావరణంపైనా తీవ్ర ప్రభావం పడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
వ్యర్థాలు చేరుతున్న దేశాల్లో ఈ-వేస్ట్ రీసైక్లింగ్ సరైన విధానంలో జరగడం లేదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. మహిళలు, పిల్లలు కూడా ఎలాంటి శిక్షణా లేకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా రీసైక్లింగ్ పనులు చేస్తుంటారు. దీనికి తగ్గ మౌలిక సదుపాయాలు కూడా ఉండవు. దీనివల్ల రీసైక్లింగ్ సమయంలో సీసం వంటి విషరసాయనాల బారిన పడుతుంటారు.
సరైన నిబంధనలు, జాగ్రత్తలు లేని రీసైక్లింగ్ విభాగంలో పనిచేస్తూ లక్షల మంది మహిళా కార్మికులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని డబ్ల్యుహెచ్ఓ, అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ అంచనావేశాయి.
గర్భస్థ శిశువు ఎదుగుదలపైనా, పిల్లలపైనా ఈ ప్రభావం పడుతోందని, నాడీవ్యవస్థ సంబంధిత అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని తెలిపాయి.
ప్రపంచ వ్యర్థాల ఒప్పందం ప్రకారం 2025 జనవరి నుంచి ఈ వేస్ట్ ఎగుమతి చేసే అన్ని దేశాలు వ్యర్థాలు దిగుమతి చేసుకునే దేశాల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అక్రమ రవాణాదారులకు ఉపయోగకరంగా ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ కొత్త విధానం పనిచేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.
అయితే ఈ-వ్యర్థాల ఎగుమతిలో అత్యంత ఎక్కువ వాటా ఉన్న అమెరికా వంటి కొన్ని దేశాలు ఈ ఒప్పందాన్ని ఆమోదించలేదు. దీంతో ఈ వ్యర్థాల అక్రమరవాణా కొనసాగుతుందని కొందరు భావిస్తున్నారు.
‘‘మేం కఠిన నిబంధనలు పాటిస్తుండడంతో మెక్సికో సరిహద్దు గుండా అమెరికా చాలా ట్రక్కులను తరలిస్తోంది’’ అని బాసెల్ ఆక్షన్ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జిమ్ పకెట్ చెప్పారు. ఈ-వ్యర్థాలు సహా విషపదార్థాల అక్రమ రవాణా నిరోధానికి ఈ సంస్థ పనిచేస్తోంది.

ప్రాణాపాయమైనా తప్పించుకోలేని స్థితి
మళ్లీ ఘనాలోని అగ్‌బాగ్‌బ్లొషి డంప్ యార్డ్ విషయానికి వస్తే అక్కడ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది.
వ్యర్థాలను సేకరించడం ద్వారా తాను సంపాదిస్తున్న డబ్బులో దాదాపు సగం డబ్బును తాను.. అక్కడ పనిచేయడం వల్ల కలుగుతున్న అనారోగ్యాన్ని తగ్గించుకోడానికి అవసరమైన మందుల కోసం ఖర్చుచేస్తున్నానని అబీబా చెప్పారు.
‘‘నాకు, నా కుటుంబానికి బతకడానికి అదే ఆధారం కావడంతో అక్కడే పనిచేయాల్సివ స్తోంది’’ అని ఆమె అన్నారు.
దీనిపై స్పందించాల్సిందిగా ఘనా రెవెన్యూ, పర్యావరణ మంత్రిత్వ శాఖలను పలుమార్లు సంప్రదించినా.. వారు స్పందించలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














