అదానీ చేతుల్లోకి వెళ్లిన గంగవరం, కృష్ణపట్నం పోర్టులపై వివాదం ఏంటి?

గంగవరం పోర్టులో తన వాటాను 2021లో అదానీకి అమ్మిన అప్పటి ఏపీ ప్రభుత్వం
ఫొటో క్యాప్షన్, గంగవరం పోర్టు
    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అదానీ గ్రూపు సంస్థలతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, తెలుగునాట వ్యాపారవేత్తల సంబంధం ఆసక్తికరమైనది. దశాబ్దాల తరబడి నిర్మించుకున్న తమ వ్యాపార సామ్రాజ్యాలను కేవలం రోజుల వ్యవధిలోనే అదానీకి అమ్మేసిన ఘటనలు ఇక్కడ జరిగాయి. వాటిపై స్వయంగా రాహుల్ గాంధీ లాంటివారు కూడా ఆరోపణలు చేసేంత వివాదం అయ్యాయి. తాజాగా జగన్-అదానీ వివాదం నేపథ్యంలో తెలుగునాట అదానీ వ్యాపారాలపై ఉన్న వివాదాలు చర్చలోకి వచ్చాయి.

ప్రపంచంలోనే పెద్దవాటిలో ఒకటైన ముంబయి ఎయిర్‌పోర్టు విస్తరణలో తెలుగు పారిశ్రామికవేత్త కృష్ణారెడ్డికి చెందిన జీవీకే గ్రూపు ఉంది. ఆ విమానాశ్రయంలో జరిగిన అభివృద్ధి పనులను తెలుగు మీడియా కవర్ చేసి ముంబయిలో తెలుగువాడి వ్యాపార విజయమంటూ అభివర్ణించింది.

ముంబయి ఎయిర్‌పోర్టు బాధ్యతలను 2006 నుంచి చూస్తున్న జీవీకే,తరువాత తన వ్యాపారాన్ని అదానీ గ్రూపుకు అమ్మేసింది. ఆ అమ్మకం జరిగిన తీరుపై ప్రతిపక్షాలు ఎన్నో అనుమానాలు లేవనెత్తాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ముంబై ఎయిర్ పోర్టు నిర్వహణను అదానీ సంస్థకు అమ్మిన జీవీకే

ఫొటో సోర్స్, https://www.facebook.com/CSMIAOfficial

ఫొటో క్యాప్షన్, ముంబయి ఎయిర్‌పోర్టు

ముంబయి ఎయిర్‌పోర్ట్ ఒప్పందం ఎలా కుదిరింది?

2006: ముంబయి ఎయిర్‌పోర్టులో వాటాలు కొన్న జీవీకే, క్రమంగా వాటిని పెంచుకుంటూ వెళ్లింది.

2016-17: జీవీకే ఎయిర్‌పోర్టు వ్యాపారంలో ఒడిదుడుకులు, అప్పులు

2019: విమానాశ్రయంలో వాటాను వేరే కంపెనీలకు అమ్మాలని జీవీకే ప్రణాళిక

2020 జూన్: రూ.705 కోట్ల కుంభకోణం ఆరోపణలతో జీవీకే గ్రూపుపై సీబీఐ కేసు

2020 జూలై: జీవీకే గ్రూపు కార్యాలయాల్లో ఈడీ సోదాలు

2021 ఆగస్టు: జీవీకే విమానాశ్రయంలో ఆదానీకి 74 శాతం వాటా అమ్మకం

2023 జనవరి: జీవీకే అక్రమాలకు పాల్పడలేదని తేల్చిన సీబీఐ

2023 ఫిబ్రవరి: సీబీఐ, ఈడీ ఒత్తిడితోనే జీవీకే తన వ్యాపారాన్ని అదానీకి అమ్మిందని లోక్‌సభలో ఆరోపించిన రాహుల్ గాంధీ.

‘‘విమానాశ్రయ నిర్వహణలో అనుభవం లేని వారి కోసం నిబంధనలు మార్చారు. రూల్స్ మార్చి అదానీకి 6 విమానాశ్రయాలు ఇచ్చారు. ఆ తరువాత దేశంలోనే అత్యంత లాభసాటి విమానాశ్రయమైన ముంబయి ఎయిర్‌పోర్టును జీవీకేపై సీబీఐ, ఈడీలను ప్రయోగించడం ద్వారా హైజాక్ చేసి అదానీకి ఇచ్చింది ఈ ప్రభుత్వం’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు.

రాహుల్ వ్యాఖ్యలను జీవీకే గ్రూపు ఖండించింది. ‘‘అదానీ నుంచి కానీ, మరెవరి నుంచి కానీ ముంబయి ఎయిర్‌పోర్టు అమ్మాలనే ఒత్తిడి అస్సలు లేదు. మొత్తం లావాదేవీలన్నీ ఒక నెలలోనే పూర్తి చేసేస్తానని అదానీ చెప్పారు. మిగతా పెట్టుబడిదారులతో పోలిస్తే ఇది మాకు మంచి మార్గం అనిపించి అదానీకి అమ్మాం.’’ అని మీడియాతో చెప్పారు జీవీకే డైరెక్టర్ సంజయ్ రెడ్డి.

అయితే సంజయ్ రెడ్డి వివరణ తరువాత కూడా ఆ ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. 2024 ఏప్రిల్ లో కూడా రాహుల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘అది చాలా సింపుల్. ముందుగా సీబీఐ, ఈడీ, ఇన్‌కమ్ టాక్స్ వారిని కొందరు వ్యాపారుల మీదకు పంపుతారు. వాళ్లు బీజేపీకి ఎక్కువ డబ్బు ఇవ్వగానే కేసులు మూసేస్తారు. ఉదాహరణకు, ముంబయి ఎయిర్‌పోర్టు ఓనర్ మీద సీబీఐ కేసు పెట్టింది. కేసు పెట్టిన నెల తరువాత ఆ విమానాశ్రయాన్ని అదానికి ఇచ్చేశారు, వెంటనే కేసు ముగిసిపోయింది’’ అని ఓ బహిరంగసభలో వ్యాఖ్యానించారు.

గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గౌతమ్ అదానీ(పాత చిత్రం)

ఏపీలో పోర్టులనూ చేజిక్కించుకున్న అదానీ

జీవీకే నిర్మించిన ఎయిర్‌పోర్టు అమ్మకం జరుగుతుండగానే ఆంధ్రప్రదేశ్‌లో అదానీ రెండు ఓడ రేవులను కొన్నారు. లాభాలతో ఉంటూ, మంచి నగదు నిల్వతో నడుస్తున్న గంగవరం వంటి ఓడరేవు కూడా అందులో ఉంది. గంగవరం విషయంలో ప్రభుత్వం ఏకంగా తన వాటా అదానీకి, ఏ టెండరూ-బిడ్డింగూ లేకుండానే అమ్మేసింది. ఐఏఎస్‌ల కమిటీ ఏర్పాటుచేసి, ఆ కమిటీ నివేదిక ఆధారంగా టెండరు లేకుండానే అమ్మేసింది.

గంగవరం ఓడరేవు:

విశాఖ ఉక్కు ఎగుమతులు జరిగే పోర్టు కావడంతో గంగవరం పోర్టు లాభాల్లో ఉండేది. ఈ పోర్టులో డీవీఎస్ రాజుకు 58.1 శాతం వాటా, విండీ లేక్ సైడ్ అనే కంపెనీకి 31.5 శాతం వాటా, ఏపీ ప్రభుత్వానికి 10.4 శాతం వాటా ఉండేవి. ముందుగా 2021 మార్చిలో విండీ లేక్ సైడ్ నుంచి 31.5 శాతం వాటా కొనేసింది అదానీ గ్రూపు. తరువాత డీవీఎస్ రాజు నుంచి 58.1 శాతం వాటా కొన్నది. నిజానికి డీవీఎస్ రాజుకు తన వాటా అమ్మడం ఇష్టం లేదనీ, అయినా అమ్మేశారని వార్తలు వచ్చాయి. అయితే దానిపై డీవీఎస్ రాజు ఎక్కడా స్పందించలేదు. పైగా ఆ పోర్టుకు 2015లో కట్టిన విలువ కంటే, తక్కువ ధరకే డీవీఎస్ రాజు అదానీకి అమ్మడం ఆసక్తికర చర్చకు కారణం అయింది. ఆ తరువాత ఏపీ ప్రభుత్వం కూడా పోర్టులో తన వాటా అదానీకి అమ్మేసింది.

సాధారణంగా ప్రభుత్వాలు తమ వ్యాపారాలను, వ్యాపారాల్లో వాటాలను అమ్మాలంటే పెద్ద ప్రక్రియే ఉంటుంది. కానీ కేవలం ఆరుగురు ఐఏఎస్‌లతో కమిటీ వేసి, ఎటువంటి పారదర్శక బిడ్డింగ్ లేకుండా తన వాటా అమ్మేసింది ఏపీ సర్కార్. ఈ క్రమంలో అప్పట్లో ఈ డీల్ ఎలా సాగిందంటే..

2021 ఆగస్టు 7 : గౌతమ్ అదానీ అప్పటి ఏపీ సీఎం జగన్‌ను కలిశారు

2021 ఆగస్టు 8: ఆ మరునాడే, గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 10.4 శాతం వాటాను గంగవరం పోర్టు లిమిటెడ్ నుంచి అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ (ఏపీసెజ్) షేర్ రూ.120 చొప్పున రూ.645.10 కోట్లకు విక్రయించడానికి ఒప్పుకుంటూ ఏపీ మంత్రివర్గం తీర్మానం చేసింది.

గంగవరం పోర్టుకు గవర్నమెంటు భూమి ఇచ్చి, అనేక రాయితీలు ఇచ్చి కూడా, జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం రూ.645 కోట్లకే తన వాటా అమ్మడం పలు ప్రశ్నలకు, విమర్శలకు దారి తీసింది.

2021 ఆగస్టు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గంగవరం పోర్టులో తన వాటా అదానీకి అమ్మడంపై పలు అనుమానాలు, ప్రశ్నలూ లేవనెత్తుతూ ఈ అంశంపై విచారణ చేయాల్సిందిగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్ కి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లేఖ రాశారు. డీవీఎస్ రాజు, అదానీల మధ్య లావాదేవీని కూడా ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా కృష్ణపట్నం కంటే ఎక్కుల లాభాలు వచ్చే గంగవరం పోర్టును తక్కువ ధరకు ఎలా అమ్మారన్నది ఇప్పటికీ తేలని ప్రశ్న.

‘‘గంగవరం 30 ఏళ్ళ తరువాత ప్రభుత్వానికి చెందాల్సినది. 9 వేల కోట్ల విలువైన గంగవరం పోర్టులో వాటాను రూ.640 కోట్లకే అమ్మేశారు జగన్. అందుకు ఎంత కమిషన్ తీసుకున్నారు?’’ అని ప్రశ్నించారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. గంగవరం అమ్మకంపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాజ్యం కూడా పెండింగులో ఉంది.

‘‘గంగవరంలో ఏపీ ప్రభుత్వానికి ఉన్నది పది శాతం వాటా మాత్రమే. దాని మీద వచ్చే ఆదాయం ప్రభుత్వానికి పెద్ద ఎక్కువ కాదు. అదే సమయంలో మా ప్రభుత్వం 3 కొత్త ఓడరేవులు, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం తలపెట్టింది. అందుకే ఇది అమ్మేశాం. ఇదంతా 2021లో జరిగింది.’’ అని బీబీసీతో అన్నారు వైసీపీ నాయకుడు, పరిశ్రమల శాఖ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్. దీనిపై అదానీ కంపెనీ స్పందన కోసం కూడా బీబీసీ తెలుగు ప్రయత్నిస్తోంది.

కృష్ణపట్నం ఓడరేడును చేజిక్కించుకున్న అదానీ

ఫొటో సోర్స్, www.adaniports.com

ఫొటో క్యాప్షన్, కృష్ణపట్నం పోర్టు

కృష్ణపట్నం పోర్టు

నెల్లూరు దగ్గర ఉన్న కృష్ణపట్నం పోర్టు కూడా అదానీ సొంతం అయింది. ఈ ఓడరేవులో హైదరాబాద్‌కి చెందిన సీవీఆర్ గ్రూపుకు 92 శాతం వాటా, లండన్‌కు చెందిన ఈక్విటీ కంపెనీ 3ఐకి 8 శాతం వాటా ఉండేది. నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు నవయుగ కంపెనీ ఆధ్వర్యంలో సాగేవి. 2020 అక్టోబరులో మొదట 75 శాతం వాటా, తరువాత 25 శాతం వాటా కొని 2021 ఏప్రిల్ నాటికి మొత్తం పోర్టును కొనేశారు అదానీ.

సరిగ్గా ఈ లావాదేవీలకు ముందు అంటే 2019 అక్టోబరులో నవయుగ కంపెనీకి కృష్ణపట్నం దగ్గర కేటాయించిన భూములను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది . నవయుగ కంపెనీ తెలుగుదేశానికి దగ్గర అని జగన్ భావించడం కూడా ఇందుకు కారణంగా చెబుతారు. నవయుగ కంపెనీతో బందరు పోర్టు నిర్మాణ ఒప్పందాన్ని, పోలవరం కాంట్రాక్టును కూడా జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసుకుంది. అది జరిగిన కొన్నాళ్లకు నవయుగ కంపెనీ, కృష్ణపట్నం పోర్టును అదానీకి అమ్మేసింది.

‘‘ బెదిరించి కృష్ణపట్నం పోర్టును అదానికీ ఇప్పించారు జగన్.’’ అని ఆరోపించారు వైఎస్ షర్మిల.

‘‘కృష్ణపట్నం నవయుగ నిర్వహిస్తున్న ప్రైవేటు పోర్టు. అది వారు వేరే కంపెనీకి అమ్ముకుంటే మాకేం సంబంధం? రెండు ప్రైవేటు కంపెనీల మధ్య జరిగిన వ్యవహారం అది’’ అని బీబీసీతో అన్నారు గుడివాడ అమర్‌నాథ్. దీనిపై అదానీ కంపెనీ స్పందన కోసం కూడా బీబీసీ తెలుగు ప్రయత్నిస్తోంది.

అదానీ టేకోవర్ చేసుకున్న తరువాత కృష్ణపట్నం, గంగవరం రెండు చోట్లా వివాదాలు వచ్చాయి. కృష్ణపట్నంలో కొంతకాలం ఎగుమతులు ఆగాయి. దానిచుట్టూ అనేక రాజకీయాలు జరిగాయి. చాలా కాలం అక్కడి వారి ఉపాధికి గండి పడింది. ఇక గంగవరంలో అయితే ఉద్యమాలే జరిగాయి.

‘‘పోర్టు కొనే వరకూ ఒకలా, కొన్న తరువాత ఒకలా మాట్లాడింది అదానీ యాజమాన్యం. పని గంటలు బాగా పెంచడం వంటివెన్నో చేసి వేధిస్తే, ఈ అదానీ కంపెనీ మాకొద్దు బాబోయ్ అంటూ కార్మికులు బయటకు వచ్చేసి ఆందోళన చేశారు. తరువాత వన్ టైమ్ సెటిల్‌మెంట్ చేస్తాం అన్నారు. అది కూడా ఇంకా చేయలేదు. డీవీఎస్ రాజుకు, ప్రభుత్వానికి మధ్య బాధిత గ్రామాల విషయంలో కుదిరిన ఒప్పందాన్ని కూడా అదానీ అమలు చేయడం లేదు.’’ అని బీబీసీతో చెప్పారు గంగవరం కార్మిక నాయకుడు అమ్మోరు. ఈ వివాదాల గురించి అదానీ కంపెనీ స్పందన కోసం కూడా బీబీసీ తెలుగు ప్రయత్నిస్తోంది.

సోలార్ విద్యుత్ ఒప్పందం

ఫొటో సోర్స్, Adani Group/Facebook

ఫొటో క్యాప్షన్, సోలార్ పవర్ ప్లాంట్స్

ఏపీలో అదానీకి దక్కిన ఇతర ప్రాజెక్టులు

సెకీ ద్వారా సోలార్ విద్యుత్ ఒప్పందం (తాజా వివాదం)

విశాఖపట్నం డేటా సెంటర్ (చంద్రబాబు, జగన్ ఇద్దరి హయాంలో అదానీదే)

3,700 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు

10,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు

ఆంధ్రా జెన్‌కో కరెంటు తయారీకి విదేశాల నుంచి బొగ్గు సరఫరా చేసే కాంట్రాక్టు

బీచ్ శాండ్ తవ్వకాల కాంట్రాక్టులు

కరెంటు మీటర్ల కాంట్రాక్టు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)