అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు అవుతున్నాయా? విపక్షం విమర్శలేమిటి? ప్రభుత్వం ఏం చెబుతోంది?

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, గౌతమ్ అదానీ

ఫొటో సోర్స్, x/TelanganaCMO

ఫొటో క్యాప్షన్, దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, అదానీ (పాత చిత్రం)
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ మీద అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ ఫౌండేషన్ ఇస్తానన్న రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇదే సమయంలో అదానీ గ్రూపుతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాల విషయంలో ఎలా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారంది.

అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న పెట్టుబడుల ఒప్పందాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఎక్కడా నేరుగా ప్రస్తావించాలేదు.

కానీ, ఈ ఒప్పందాలను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. పెట్టుబడుల విషయంలో ఎవరికీ ఆయాచిత లబ్ధి చేకూర్చబోమని చెప్పారు.

మరోవైపు తమ మీద వచ్చిన ఆరోపణలను అదానీ ఖండించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సీఎం రేవంత్ రెడ్డి, కరణ్ అదానీ

ఫొటో సోర్స్, https://www.telangana.gov.in/

ఫొటో క్యాప్షన్, 2024 జనవరి 3న సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కరణ్ అదానీ

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అదానీ పెట్టుబడులు ఎప్పుడంటే..

అమెరికాలో అదానీ కేసుల వ్యవహారం వెలుగులోకి వచ్చాక తెలంగాణలో అదానీ ప్రాజెక్టులపై చర్చ మొదలైంది.

2023 డిసెంబర్‌లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక, అదానీ, ఆయన కుమారుడు వేర్వేరు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రులను, ఉన్నతాధికారులను కలిశారు.

2024 జనవరి 3న గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సంస్థ సీఈవో కరణ్ అదానీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

అదే జనవరి నెలలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో రేవంత్ రెడ్డి, గౌతమ్ అదానీ భేటీ అయ్యారు.

రేవంత్, అదానీ, కరణ్ అదానీ

ఫొటో సోర్స్, https://x.com/TelanganaCMO

ఫొటో క్యాప్షన్, తెలంగాణలో పెట్టుబడులపై దావోస్‌లో చర్చలు జరిగాయి

తెలంగాణ ప్రభుత్వం, అదానీ గ్రూప్‌ ఒప్పందాల వివరాలు..

ప్రభుత్వ ప్రకటన మేరకు తెలంగాణ ప్రభుత్వం, అదానీ గ్రూప్‌తో చేసుకున్న ఒప్పందాల వివరాలు ఇలా ఉన్నాయి.

  • రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందన్‌వెల్లిలో డాటా సెంటర్ టెక్ పార్కును చేసేందుకు ఒప్పందం కుదిరినట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది.
  • యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండలంలో అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి అదానీ గ్రూప్ డీపీఆర్ సమర్పించింది. ఆరు వేల మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. ఈ ప్లాంటు ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణను ఇటీవల బహిష్కరించారు.
  • గ్రీన్ ఎనర్జీ విభాగంలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ప్రతిపాదనలను అదానీ గ్రూప్ తెలంగాణ ప్రభుత్వానికి పంపించింది. 5 వేల మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు.
  • రామన్నపేటలో లాజిస్టిక్ పార్కు, డ్రైపోర్టు ఏర్పాటు.
  • కొడంగల్ నియోజకవర్గంలో సిమెంట్ ప్లాంట్ నిర్మించేందుకు ఆసక్తి(ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) చూపిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.
  • అదానీ ఏరోస్పేస్ -రక్షణ విభాగానికి సంబంధించి డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి కేంద్రాలకు రూ.వేయి కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్టు ప్రభుత్వం జనవరిలో ప్రకటించింది.
స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం

ఫొటో సోర్స్, https://www.facebook.com/TelanganaCMO

ఫొటో క్యాప్షన్, 2024 అక్టోబర్ 18న స్కిల్స్ యూనివర్సిటీకి విరాళంగా రూ.100 కోట్ల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి గౌతమ్ అదానీ అందించారు

‘‘ఆ రూ.100 కోట్ల విరాళం తీసుకోవట్లేదు’’- సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అక్టోబరు 18న హైదరాబాద్‌లో గౌతమ్ అదానీ, కరణ్ అదానీ కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గౌతమ్ అదానీ అందించారు.

ఈ డబ్బులు ఇంకా తెలంగాణ ప్రభుత్వ ఖాతాకు బదలాయింపు జరగలేదని నవంబరు 25న జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు రేవంత్ రెడ్డి.

అదానీపై అమెరికాలో వివాదం తలెత్తింది. అదే సమయంలో అదానీ గ్రూపుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.

ఒకవైపు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అదానీ గ్రూపుపై విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే, మరోవైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదానీ నుంచి విరాళాల పేరిట నిధులు తీసుకుంటోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ నుంచి నిధులు తీసుకోవడం లేదన్న రేవంత్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ప్రీతి అదానీకి జయేశ్ రంజన్ లేఖ

లేఖలో ఏముందంటే..

ఈ వివాదం నేపథ్యంలో అదానీ ఫౌండేషన్ ఇస్తామని చెప్పిన రూ.వంద కోట్లను తీసుకోవడం లేదని, ఆ మేరకు ప్రభుత్వం తరఫున లేఖ రాసినట్టు సీఎం వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, అదానీ గ్రూపుకు ఈ మేరకు లేఖ రాశారు.

‘‘మీ ఫౌండేషన్ తరఫున రూ.100 కోట్లను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తామన్నందుకు ధన్యవాదాలు. యూనివర్సిటీకి 80జి కింద ఆదాయపన్ను మినహాయింపు రానందున ఇప్పటివరకు ఫండ్స్‌ను బదలాయించాలని ఏ దాతనూ అడగలేదు.

ఇప్పుడు మినహాయింపు వచ్చింది. అయినప్పటికీ ఇటీవల తలెత్తిన పరిస్థితులు, వివాదాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఫండ్స్ బదలాయించవద్దని కోరుతున్నాను’’ అని అదానీ ఫౌండేషన్ చైర్‌పర్సన్ ప్రీతి అదానీకి లేఖ రాశారు జయేశ్ రంజన్.

ఇదే విషయంపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు అదానీతో సహా ఏ సంస్థ నుంచీ తెలంగాణ ప్రభుత్వం ఫండ్ తీసుకోలేదు. ప్రస్తుతం జరుగుతున్న వివాదాల నేపథ్యంలో అదానీ ఇస్తామన్న రూ.100 కోట్లు స్వీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని లేఖ రాశాం. రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయొద్దని లేఖలో పేర్కొన్నాం. పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో అదానీ విషయంలో జరుగుతున్న వివాదానికి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు’’ అని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, గతంలో గౌతమ్ అదానీతో కేటీఆర్ సమావేశమైన చిత్రాన్ని చూపిస్తున్న రేవంత్ రెడ్డి

దావోస్ ఒప్పందాల మాటేమిటి?

స్కిల్స్ యూనివర్సిటీ కోసం అదానీ ఫౌండేషన్ ఇస్తామన్న రూ.వంద కోట్ల విరాళాన్ని తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాల విషయంపై చర్చ మొదలైంది.

ప్రాజెక్టుల విషయంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పించడం ప్రారంభించింది. అదానీతో చేసుకున్న ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు.

‘‘అదానీ అవినీతిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని రాహుల్ గాంధీ నినదిస్తున్న సమయంలో దావోస్‌లో మీరు(తెలంగాణ ప్రభుత్వం) చేసుకున్న రూ. 12,400 కోట్ల ఒప్పందాల సంగతేమిటి? కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది. రాహుల్ గాంధీ విమర్శిస్తున్న వ్యక్తికి, ఇక్కడ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచింది.

దిల్లీలో రాహుల్ పోరాటం చేస్తున్న అదానీతో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పుడు అదానీ వ్యవహారం బయటికి రాగానే మాట మార్చారు’’ అని విమర్శించారు హరీశ్ రావు.

ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోసిపుచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అదానీ నుంచి పెట్టుబడులు స్వీకరించారని విమర్శించారు.

‘‘అదానీ నుంచి నిధులు స్వీకరించారని రాష్ట్ర ప్రభుత్వంపై కొందరు ఆరోపణలు చేస్తున్నారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏదైనా అంశంలో టెండర్లు పిలిచినా.. పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పించినా.. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ నిబంధన. నిబంధనల మేరకు టెండర్లను దక్కించుకున్న ఏ సంస్థలకైనా పెట్టుబడులకు అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టంగా వివరించారు. అలా అదానీనే కాదు, అంబానీ, టాటా కావొచ్చు, బిర్లా కావొచ్చు.. అందరికీ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ చాలా సందర్భాల్లో చెప్పారు. అందుకు తగ్గట్టుగానే అదానీ నుంచి పెట్టుబడులు ఆహ్వానించాం’’ అని రేవంత్ రెడ్డి చెప్పారు.

అదానీ ఒప్పందాలపై పునరాలోచిస్తాం: టీపీసీసీ అధ్యక్షుడు

అదానీ గ్రూప్‌తో చేసుకున్న ఒప్పందాలపై పునరాలోచిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.

‘‘దావోస్‌లో దాదాపు 45- 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు వివిధ కంపెనీలతో జరిగాయి. అందులో చట్టరీత్యా ఉన్నవి ముందుకు వెళ్తాయి. చట్టానికి లోబడి లేకపోతే బయటకు వెళ్లిపోతాయి. అవి అదానీతో చేసుకున్న ఒప్పందాలైనా.. వేరొకరితో చేసుకున్న ఒప్పందాలైనా సరే అలాగే చేస్తాం. మేం చట్టబద్ధంగా ఉన్న పెట్టుబడులనే స్వీకరిస్తాం. ఇప్పటివరకు అదానీకి మా ప్రభుత్వం జానెడు జాగా కూడా ఇవ్వలేదు’’ అని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.

గౌతమ్ అదానీ, కేటీఆర్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, గౌతమ్ అదానీతో కేటీఆర్ (పాత చిత్రం)

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అదానీతో ఒప్పందాలు జరిగాయా?

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో వివిధ సందర్భాల్లో అదానీని కేసీఆర్, కేటీఆర్ కలిసినట్లుగా మీడియాలో వచ్చిన క్లిప్పింగులను రేవంత్ రెడ్డి విడుదల చేశారు.

అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా అదానీ గ్రూప్ తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు చేపట్టిందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో విడుదల చేశారు. ఆయన చెప్పిన ప్రాజెక్టుల వివరాలు ఇవి..

  • రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో అదానీ ఎల్బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ ఏర్పాటు: 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన యూనిట్‌లో మానవ రహిత విమానాలు తయారీ ఉంటుందని అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దావోస్‌లో అదానీతో భేటీ సందర్భంగా కుదిరిన ఒప్పందంలో భాగంగానే ఎల్బిట్ సంస్థతో కలిసి అదానీ గ్రూప్ ఈ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు నమస్తే తెలంగాణ పత్రిక 2018 డిసెంబరు 15న తన కథనంలో పేర్కొంది.
  • మామిడిపల్లిలో మిస్సైల్ షెల్ తయారీ యూనిట్: ఇది నిర్మాణంలో ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
  • ఎల్లికట్టలో మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్
  • మూడు జాతీయ రహదారుల నిర్మాణం
  • 750 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్ ప్రాజెక్టు
బీఆర్ఎస్ నేతలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, గౌతామీ అదానీని కలిసిన విషయాన్ని తానే స్వయంగా చెప్పానంటున్న కేటీఆర్

సీఎం ఆరోపణలను ఖండించిన కేటీఆర్

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో అదానీ పెట్టుబడులు పెట్టారంటూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు.

ఎల్లికట్టలో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసే డాటా సెంటర్ అదానీ గ్రూప్ ఏర్పాటు చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారాయన.

‘‘మైక్రోసాప్ట్ నుంచి రెండు దశల్లో ఒకసారి రూ. 15 వేల కోట్లు, రెండోసారి రూ. 16 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. కానీ, ఈ ముఖ్యమంత్రి మాత్రం అది అదానీ డేటా సెంటర్ అని రిలీజ్ చేశారు.

మైక్రోసాప్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని అదానీ డేటా సెంటర్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

మైక్ సాప్ట్ వచ్చాక అమెజాన్ వచ్చింది. అమెజాన్ రూ. 36 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది.

మొత్తం రూ. 67 వేల కోట్ల విదేశీ పెట్టుబడులను మా ప్రభుత్వం తీసుకువచ్చింది.

కేంద్ర ప్రభుత్వం పరిధిలోని జాతీయ రహదారుల ప్రాజెక్టులు మేం ఇచ్చామని అంటున్నారు.

విద్యుత్ ప్రాజెక్ట్ కూడా కేంద్రం ఇచ్చిందే. మేం ఇవ్వని ప్రాజెక్టులు కూడా ఇచ్చామంటూ ప్రజలను ముఖ్యమంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అని కేటీఆర్ చెప్పారు.

తాను అదానీని కలిసిన మాట వాస్తమమేనని, దావోస్‌లో కలిసిన విషయాన్నే తన ఎక్స్ ఖాతాలో వెల్లడించానని చెప్పారు కేటీఆర్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)