మణిపుర్‌లో మళ్లీ చెలరేగిన హింస - మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు వాహనాలకు నిప్పు

మణిపుర్ అల్లర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంఫాల్ లోయలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై మూకదాడులు చేశారు

మణిపుర్ మరోసారి హింసాత్మకంగా మారింది. మణిపుర్ - అస్సాం సరిహద్దులోని జిరీ నదిలో శుక్రవారం ఒక మహిళ సహా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం కావడం హింసకు దారితీసింది.

ఇంఫాల్ లోయలోని పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లపై శనివారం మూకదాడులు జరిగాయి. ఈ గుంపు అనేక వాహనాలకు నిప్పు పెట్టింది.

ఇంఫాల్ లోయలో అల్లరిమూకలు హింసాత్మక చర్యలకు పాల్పడినట్లు ఇంఫాల్ వెస్ట్ పోలీస్ సూపరింటెండెంట్ మేఘచంద్ర చెప్పారు.

''జిల్లాలో పరిస్థితులు చేయిదాటకుండా, ముందుస్తు చర్యల్లో భాగంగా కర్ఫ్యూ విధించాం. సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశాం'' అని ఆయన చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
మణిపుర్ అల్లర్లు

ఫొటో సోర్స్, Getty Images

పోలీసులు ఏమన్నారంటే..

ఇంఫాల్‌ లోయలోని పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా కొందరు ప్రజాప్రతినిధుల ఇళ్లు, ఆస్తులపై మూకదాడులు జరిగాయి. ఆ అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఇంఫాల్‌లో పరిస్థితులను అదుపులో ఉంచేందుకు అస్సాం రైఫిల్స్ సహా ఆర్మీ భద్రతా బలగాలను పట్టణ ప్రాంతంలో మోహరించారు. భద్రతా బలగాలు పట్టణంలో కవాతు నిర్వహించాయి. మూకలను చెదరగొట్టే ప్రయత్నంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.

ఇళ్లను తగలబెట్టడం, దోపిడీ వంటి ఘటనలకు పాల్పడిన 23 మందిని ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్ జిల్లాల్లో అరెస్టు చేశారు. వారి నుంచి ఒక 32 పిస్టల్, 7 రౌండ్ల ఎస్బీబీఎల్ బుల్లెట్లు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ పట్టణంలో కర్ఫ్యూను అమల్లోకి తెచ్చారు. ఇంటర్నెట్, మొబైల్ సేవలను రెండు రోజులపాటు నిలిపివేశారు.

ఎస్ఎస్‌పీలు, కమాండింగ్ ఆఫీసర్లు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Congress/X

స్పందించిన రాహుల్ గాంధీ..

మణిపుర్‌లో తాజా పరిస్థితులపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్‌ పోస్టు ద్వారా స్పందించారు.

మణిపుర్‌లో తాజా హింస, రక్తపాతం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఏడాదికి పైగా సాగుతున్న జాతుల మధ్య ఈ వైరాన్ని, వేదనను రూపుమాపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాయని, వారి మధ్య సయోధ్య కుదిర్చి సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేందుకు కృషి చేస్తాయని ప్రతి భారతీయుడి ఆశ'' అని రాహుల్ గాంధీ రాశారు.

''ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి మణిపుర్‌లో పర్యటించి, శాంతిభద్రతల పునరుద్ధరణకు కృషి చేయాలని అభ్యర్థిస్తున్నా'' అని రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)