ఆదిత్య ఎల్1: సూర్యుడిపై భారత్ చేపట్టిన ఈ ప్రయోగం ఫలితాలు ప్రపంచానికి ఎందుకంత కీలకం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
సూర్యుడికి సంబంధించిన ‘మొదటి కీలక సమాచారాన్ని’ ఆదిత్య-ఎల్1 భూమి మీదికి పంపిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆదిత్య-ఎల్1 అనేది అంతరిక్షం నుంచి సూర్యుడిని పరిశీలించడానికి భారత్ చేపట్టిన మొదటి మిషన్.
2023 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట స్పేస్ స్టేషన్ నుంచి ఇస్రో ఆదిత్య L1ను ప్రయోగించింది.
ఆదిత్య-ఎల్1లోని విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వెల్క్) అనే పరికరం, జులై 16న కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) ప్రారంభమైన ఖచ్చితమైన సమయాన్ని గుర్తించడంలో శాస్త్రవేత్తలకు సహాయపడే డేటాను సంగ్రహించింది.
సూర్యుడి బయటి పొర నుంచి వెలువడే కరోనల్ మాస్ ఎజెక్షన్ల(సీఎంఈ) డైనిమిక్స్‌ను, వాటి ప్రభావాలను పరిశీలించడం ఆదిత్య-ఎల్1 ప్రధాన లక్ష్యం.
"శక్తి కణాలతో తయారైన ఒక సీఎంఈ ఒక ట్రిలియన్ కిలోగ్రాముల వరకు బరువు ఉంటుంది. సెకన్‌కు 3,000 కి.మీ. వేగంతో కదులుతుంది. ఇది భూమి వైపు సహా ఏ దిశలోనైనా ప్రయాణించగలదు’’ అని వెల్క్ కోసం పనిచేసిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ ఆర్. రమేష్ చెప్పారు.
"ఈ భారీ అగ్నిగోళం భూమి వైపు వేగంగా దూసుకొస్తోందనుకోండి. అది దాదాపు 15 కోట్ల కి.మీ.ల దూరమున్న సూర్యుడి నుంచి భూమికి చేరుకోవడానికి కేవలం 15 గంటల సమయమే పడుతుంది" అని ఆయన వివరించారు.
విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వెల్క్) క్యాప్చర్ చేసిన సీఎంఈ 2024 జులై 16న సాయంత్రం 6:38కి ప్రారంభమైంది.
ఇది మొదట్లో భూమి వైపునకు ప్రయాణించిందని ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్‌లో ఈ సీఎంఈపై ఒక పత్రాన్ని ప్రచురించిన వెల్క్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ రమేష్ చెప్పారు.
"కానీ సీఎంఈ ప్రయాణించిన అరగంటలో దాని దిశను మార్చుకుంది. సూర్యుడి వెనక్కి వెళ్లింది. అది మనకు చాలా దూరంగా ఉండటం వల్ల భూ వాతావరణాన్ని ప్రభావితం చేయలేదు" అని ఆయన అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
మానవ జీవితాలపై ప్రభావం..
సౌర తుపాన్లు, మంటలు, కరోనల్ మాస్ ఎజెక్షన్లు తరచుగా భూ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. అంతరిక్ష వాతావరణంపై కూడా ప్రభావం చూపిస్తాయి. ఇక్కడ 50కి పైగా భారత ఉపగ్రహాలతో సహా ఇతర దేశాలకు చెందిన దాదాపు 7,800 ఉపగ్రహాలు ఉన్నాయి.
Space.com ప్రకారం.. ఈ సంఘటనలు మానవ జీవితాలపై చాలా అరుదుగా ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. కానీ, భూ అయస్కాంత క్షేత్రానికి అంతరాయం కలిగిస్తుంటాయి. సమస్యలను సృష్టిస్తుంటాయి. వాటి తేలికపాటి ప్రభావం ఉత్తర, దక్షిణ ధ్రువాల దగ్గర అందమైన అరోరాలకు కారణమవుతుంది.
కొన్నిసార్లు బలమైన సీఎంఈలు ధ్రువాలకు దూరంగా ఉన్న ప్రదేశాలలోనూ అరోరాలు కనిపించేలా చేస్తాయి. ఇలాగే మే, అక్టోబర్‌లలో లండన్, ఫ్రాన్స్‌లలో అరోరాలు కనిపించాయి.
అంతరిక్షంలో వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ సీఎంఈల నుంచి శక్తిని తీసుకున్న కణాలు ఉపగ్రహ ఎలక్ట్రానిక్స్‌ను దెబ్బతీస్తాయి. పవర్ గ్రిడ్‌లకు అంతరాయం కలిగిస్తాయి. వాతావరణ సమాచారం, కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ఉపగ్రహాలను ప్రభావితం చేస్తాయి.
"మనం కమ్యూనికేషన్ ఉపగ్రహాలపై ఎక్కువగా ఆధారపడతాం. ఇంటర్నెట్, ఫోన్ నెట్‌వర్క్, రేడియో సిగ్నల్స్‌కు సీఎంఈలు అంతరాయం కలిగిస్తాయి. దీంతో పూర్తి గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది" అని ప్రొఫెసర్ రమేష్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రాఫ్ వ్యవస్థలకు అంతరాయం
ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన సౌర తుపాను 1859లో సంభవించింది. కారింగ్‌టన్ ఈవెంట్‌గా ప్రసిద్ధిగాంచిన ఈ సౌర తుపాను కారణంగా ప్రకాశవంతమైన అరోరాలు కనిపించాయి. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రాఫ్ వ్యవస్థలకు అంతరాయం కలిగింది.
2012లో దాదాపు ఇదే తుపాను భూమిని తాకిందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. 2012 జులై 23న ఒక శక్తిమంతమైన సీఎంఈ భూ కక్ష్య గుండా వెళ్లింది. అదృష్టవశాత్తూ అది భూమిని తాకకుండా, అంతరిక్షంలో ఉన్న నాసాకు చెందిన స్టీరియో-ఏ సోలార్ అబ్జర్వేటరీని తాకింది.
1989లో క్యూబెక్ పవర్ గ్రిడ్‌కు సీఎంఈ తొమ్మిది గంటలపాటు అంతరాయం కలిగించింది. దీంతో దాదాపు 50 లక్షల మంది ప్రజలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
2015 నవంబర్ 4న సౌర రేడియో ఉద్గారాలు స్వీడన్, కొన్ని ఇతర యూరోపియన్ విమానాశ్రయాలలో ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణకు అంతరాయం కలిగించి, గంటల కొద్దీ ప్రయాణ గందరగోళానికి కారణమైంది.
సూర్యుడిని గమనించడం, సౌర తుపానులు లేదా సీఎంఈలను ట్రాక్ చేయడం ద్వారా ముందస్తు హెచ్చరికలను పొందవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ జాగ్రత్తలతో పవర్ గ్రిడ్‌లు, ఉపగ్రహాలను స్విచ్ ఆఫ్ చేసుకొని, అవి దెబ్బతినకుండా రక్షించుకోవచ్చని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
గ్రహణ సమయంలోనూ పని చేస్తుంది
నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ), జపాన్, చైనాలు చాలా సంవత్సరాలుగా వాటి అంతరిక్ష మిషన్లతో సూర్యుడిపై అధ్యయనం చేస్తున్నాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన ఆదిత్య-ఎల్1 ఈ గ్రూపులో చేరింది.
ఆదిత్య-ఎల్1 అంతరిక్షంలో దాని స్థానం నుంచే గ్రహణాల సమయంలో కూడా సూర్యుడిని నిరంతరం గమనించగలదు, శాస్త్రీయ పరిశోధనలు చేయగలదు.
మనం భూమి నుంచి సూర్యుడిని చూసినప్పుడు ఒక నారింజ రంగు బంతి ఆకారం కనిపిస్తుందని, ఇది ఫొటోస్పియర్ లేదా సూర్యుని ఉపరితలం, ప్రకాశవంతమైన భాగమని ప్రొఫెసర్ రమేష్ తెలిపారు.
సంపూర్ణ సూర్య గ్రహణం సమయంలో చంద్రుడు ఫోటోస్పియర్‌ను కవర్ చేసినప్పుడు మనం సూర్యుని బయటి పొర అయిన సౌర కరోనాను చూడగలం.
ప్రొఫెసర్ రమేష్ చెప్పిన వివరాల ప్రకారం.. నాసా- ఈఎస్ఏ సోలార్ అండ్ హీలియోస్పిరిక్ అబ్జర్వేటరీలో ఉన్నదాని కంటే భారత కరోనాగ్రాఫ్ కొంచెం ఎక్కువ ప్రయోజనం కలిగి ఉంది.
"సూర్యుని ఫొటోస్పియర్‌ను దాచిపెట్టడం ద్వారా చంద్రుని పాత్రను అనుకరించేలా మా కరోనాగ్రాఫ్ రూపొందించాం. ఆదిత్య-ఎల్1 రోజులో 24 గంటలు, సంవత్సరంలో 365 రోజులు కరోనాను నిరంతరాయంగా వీక్షించడానికి వీలు కల్పిస్తుంది" అని ఆయన చెప్పారు.
నాసా- ఈఎస్ఏ కరోనాగ్రాఫ్ చాలా పెద్దది, దీంతో ఇది ఫోటోస్పియర్‌ను మాత్రమే కాకుండా కరోనాలోని భాగాలను కూడా దాస్తుంది. దానివల్ల దాచిన ప్రదేశంలో సీఎంఈ ఎక్కడ ప్రారంభమవుతుందో చూసే సామర్థ్యాన్ని ఇది పరిమితం చేస్తుంది.
"కానీ మా వెల్క్ కరోనాగ్రాఫ్‌తో సీఎంఈ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఖచ్చితంగా అంచనా వేయగలం. అది ఏ దిశలో కదులుతుందో నిర్ణయించగలం" అని రమేష్ చెప్పారు.
దేశంలో సూర్యుడిని పరిశీలించడానికి కొడైకెనాల్, దక్షిణాన గౌరీబిదనూర్, వాయువ్యంలో ఉదయ్‌పూర్‌లో మూడు అబ్జర్వేటరీ(గ్రౌండ్ బేస్డ్)లు ఉన్నాయి. ఈ అబ్జర్వేటరీల డేటాను ఆదిత్య-ఎల్1 డేటాతో కలపడం వల్ల సూర్యుడిపై మన అవగాహన చాలా మెరుగుపడుతుందని ప్రొఫెసర్ రమేష్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














