వైభవ్ సూర్యవంశీ: ఈ 14ఏళ్ల కుర్రాడు చిన్న వయసులోనే క్రికెట్‌లోకి ఎలా రాగలిగాడు, చట్టం ఏం చెబుతోంది..

ఫొటో సోర్స్, IPL
- రచయిత, నియాజ్ ఫరూఖీ
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
వైభవ్ సూర్యవంశీ. క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారిన 14 ఏళ్ల కుర్రాడి పేరు ఇది. గత ఏడాది సౌదీ అరేబియాలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలంలో రాజస్థాన్ రాయల్స్ సూర్యవంశీని కోటి పది లక్షరూపాయలకు దక్కించుకోవడంతో అతని పేరు మారుమోగిపోయింది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టోర్నమెంట్ ఐపీఎల్‌లో చోటు దక్కించుకున్న అతి పిన్నవయస్కుడిగా వైభవ్ గుర్తింపు పొందాడు.
దిల్లీ క్యాపిటల్స్ , రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యాలు బిహార్‌కు చెందిన ఈ కుర్రాడి కోసం పోటీ పడ్డాయి. ఇతని కోసం దిల్లీ జట్టు 30 లక్షల రూపాయల బిడ్ దాఖలు చేసింది. చివరకు కోటి 10 లక్షల రూపాయలకు వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ వద్ద వైభవ్ శిక్షణ పొందాడు.
బిహార్‌కు చెందిన ఈ ఎడమచేతి వాటం ఆటగాడు రంజీ, ముస్తాక్ అలీ ట్రోఫీలలో తన రాష్ట్రం తరపున ప్రాతినిథ్యం వహించడంతోపాటు ఇండియా తరపున అండర్ -19 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.
భారత క్రికెట్‌లో సహజంగా ముంబై, దిల్లీ, బెంగళూరు వంటి నగరాల నుంచి వచ్చే ఆటగాళ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇందుకు భిన్నంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆటగాళ్లకు కూడా ఐపీఎల్ కారణంగా అవకాశాలు దక్కుతున్నాయి.
సూర్యవంశీ తన 12 ఏళ్ల వయసులోనే ముంబయిపై బిహార్ తరపున అరంగ్రేటం చేశాడు. రంజీలలో ఆడిన ఐదుమ్యాచ్‌లలో అతని అత్యధిక స్కోరు 41. ఆస్ట్రేలియాపై జరిగిన అనధికార టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగి 58 బంతులలోనే సెంచరీ బాదడం అతని కెరీర్‌లోనే ఓ మేలిమలుపు. దీంతోపాటు యూత్‌క్రికెట్‌లో పిన్నవయసులోనే సెంచరీ సాధించిన ఆటగాడిగానూ సూర్యవంశీ నిలిచాడు.
దీంతోపాటు బిహార్ లో జరిగిన ఒక అండర్ 19 టోర్నమెంట్‌లో అజేయంగా 332 పరుగులు సాధించాడు.
రాజస్థాన్ రాయల్స్ వద్ద శిక్షణ పొందే సమయంలో తన ఆటతీరుతో సూర్యవంశీ శిక్షణ సిబ్బందిని ఆకట్టుకున్నాడు. సూర్యవంశీలో ఉన్న ప్రతిభను వారు గుర్తించారు.
'వైభవ్‌లో అద్భుతమైన ప్రతిభ ఉంది. అతనిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది. అందుకే అతను ఐపీఎల్ వరకు రాగలిగాడు. వైభవ్ మా జట్టులో చేరడం మాకు చాలా సంతోషం' అని రాజస్థాన్ రాయల్స్ సీఈఓ జేక్ లష్ మెక్రం వేలం అనంతరం మీడియాకు చెప్పారు. .


ఫొటో సోర్స్, Vaibhav Suryavanshi/Instagram
భారతీయ చట్టాల ప్రకారం 14 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోకూడదు. కానీ అలాంటి నిబంధనలు ఆటల్లో లేవు. అనేక జాతీయ అంతర్జాతీయ పోటీల్లో 14 సంవత్సరాలకంటే తక్కువ వయసువారు పోటీ పడుతూనే ఉంటారు.
కానీ ఐసీసీ నిర్వహించే మ్యాచ్ లలో పాల్గొనాలంటే మాత్రం వైభవ్ 15 ఏళ్లు వయసు వరకు ఆగాల్సిందే. అది ఆ సంస్థ పాటించే వయోపరిమితి.
సూర్యవంశీ కోసం తమ భూమిని కూడా అమ్మేసిన అతని కుటుంబానికి వేలంలో అతనికి పలికిన ధర కొండంత సంతోషాన్ని తెచ్చిపెట్టింది.
వైభవ్ తండ్రి బిహార్ కు చెందిన ఒక రైతు. జీవనోపాధి కోసం ముంబై నగరానికి వలస వచ్చి క్లబ్బుల్లో బౌన్సర్ గానూ పనిచేస్తున్నారు. ఆయన పబ్లిక్ టాయిలెట్‌లలో కూడా పనిచేశారు.
'వైభవ్ ఇప్పుడు నా ఒక్కడికి మాత్రమే కొడుకు కాదు, యావత్ బిహార్ రాష్ట్రానికి కొడుకు' అని ఆయన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














