ఆరోగ్య బీమా: ఎలాంటి పాలసీలు తీసుకోవాలి, ఏయే అంశాలు చూడాలి?

హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా, క్యాష్‌లెస్ వైద్యం, హార్ట్ ఎటాక్, బీపీ, షుగర్, ఆసుపత్రులు, వైద్య ఖర్చులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నాగేంద్ర సాయి కుందవరం
    • హోదా, బిజినెస్ అనలిస్ట్, బీబీసీ కోసం

ఆరోగ్య బీమాలో ప్రత్యేక బీమా ప్రాధాన్యం ఏంటో,ఎంత ముఖ్యమో రాఘవ రావు ఇబ్బంది చూస్తే సులువుగా అర్థం చేసుకోవచ్చు.

విశాఖపట్నానికి చెందిన రాఘవ రావుకు 52 ఏళ్లు. ఇద్దరు పిల్లలు.

ఆలస్యంగా పెళ్లి కావడం వల్ల పిల్లలు ఇంకా ఇంటర్మీడియెట్‌‌లోపే ఉన్నారు. భార్య గృహిణి. ఓ ప్రముఖ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఆయనకు సడెన్‌గా గుండెపోటు వచ్చింది. సర్జరీ చేసి గుండెకు స్టంట్‌ వేశారు. జీవన శైలి కారణంగా మళ్లీ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్లు ఓ చిన్నపాటి హెచ్చరిక కూడా చేశారు.

సర్జరీ, ఇతర ఖర్చులన్నీ కలిపి రాఘవరావుకు 15 లక్షలవరకూ ఖర్చు అయింది. నిజానికి ఆయనకు ఇన్సూరెన్స్‌ ఉన్నా.. అది కేవలం 5 లక్షలరూపాయలకే పరిమితమవడంతో చేతి నుంచి మరో పది లక్షల వరకూ పడింది.

దీంతో మరోసారి ఆరోగ్య బీమా పాలసీని రెన్యూవల్ చేసుకోవడానికి వెళితే ప్రీమియం భారీగా పెంచి చెప్పారు. అంత ప్రీమియం కట్టలేమనుకుంటూ మరో కంపెనీకి మారాలని చూస్తే, అందులో చాలా షరతులు ఉండటంతో రాఘవ రావు కుటుంబానికి ఏం చేయాలో అర్థం కాలేదు.

ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా బిక్కుబిక్కుమంటున్నారు. ఓవైపు ఆదాయం తగ్గిపోయింది, మరోవైపు అనారోగ్యం ఇబ్బందిపెడుతోంది.

ఇది ఒక్క రాఘవరావు అనే కాదు మనలో చాలామందికి ఇలాంటి సమస్య ఎదురు కావచ్చు.

అందుకే మన అవసరాలకు తగినంత బీమా తీసుకోవాలి. ప్రీమియం ఎక్కువ కట్టాల్సి వస్తుందనే ఆలోచనతో అన్నింటికంటే తక్కువ ప్రీమియం ఉన్న పాలసీలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మన కుటుంబమే ఇబ్బంది పడుతుంది.

సరైన ఆరోగ్య బీమా ఎంపిక చేసుకోవడం ఎంత ముఖ్యమో, మన అవసరానికి తగిన మొత్తానికి పాలసీలను తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.

ఇటీవల కాలంలో ప్రత్యేక అనారోగ్య పరిస్థితులున్న వాళ్లకోసం రెగ్యులర్‌ బీమా పాలసీలకంటే వాటికంటే భిన్నమైన 'డిసీజ్‌ స్పెసిఫిక్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ'లు అందుబాటులోకి వచ్చాయి.

క్యాన్సర్‌ కేర్‌, కార్డియాక్‌ కేర్‌, డయాబెటిక్‌ కేర్ వంటి పాలసీలను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గుండెపోటు సాధారణమవుతోంది

జీవనశైలిలో మార్పుల వల్ల గుండెపోటు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇన్సూరెన్స్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ పాలసీ బజార్‌ లెక్కల ప్రకారం 2019-20లో తమ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్స్‌లో గుండె సంబంధ రోగాల వాటా 10.5 శాతం ఉండేది.

అప్పుడు సగటు క్లెయిమ్‌ సైజ్‌ రూ.4.5 లక్షలుగా ఉంది. అదే 2023-24లో ఈ వాటా 19 శాతానికి ఎగబాకడంతో పాటు సగటు క్లెయిమ్‌ అమౌంట్‌ రూ.13.5 లక్షలకు పెరిగింది. కేవలం నాలుగేళ్లలో క్లెయిమ్‌ మొత్తం దాదాపు మూడురెట్లు పెరిగింది.

ఈ లెక్కన మన ఆరోగ్య బీమా ఎన్ని లక్షలు ఉండాలో ఈ పాటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఏదో తీసుకోవాలి కాబట్టి రూ.3 లక్షలకో, రూ.5 లక్షలకో తూతూ మంత్రంగా పాలసీ తీసుకుంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండకపోవచ్చు.

హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా, క్యాష్‌లెస్ వైద్యం, హార్ట్ ఎటాక్, బీపీ, షుగర్, ఆసుపత్రులు, వైద్య ఖర్చులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మన అవసరానికి తగిన మొత్తానికి పాలసీలను తీసుకోవడం కూడా ముఖ్యం.

కాంప్రహెన్సివ్ బీమా సరిపోదా ?

ఈ రోజుల్లో అన్నీ ప్రత్యేకం అయిపోతున్నాయి.

సాధారణంగా అందరికీ పనికొచ్చే పాలసీలతో పాటు మన అవసరానికి తగ్గట్టు బీమా అందించేందుకు కంపెనీలు ముందుకు రావడం సంతోషించాల్సిన విషయం.

సాధారణ కాంప్రహెన్సివ్ బీమా పాలసీలు మొదటిసారి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే కచ్చితంగా పనికొస్తాయి. అయితే హార్ట్ బైపాస్‌ సర్జరీ, యాంజియో లాంటి పెద్ద సమస్యలు వచ్చినప్పుడు వీటి ప్రయోజనం తగ్గిపోతుంది.

ఎందుకంటే ఒకసారి సమస్య మొదలైతే రోజూ హాస్పిటల్‌కు వెళ్లాల్సి రావడం, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మనం చెల్లించే ప్రీమియం కంటే మన క్లెయిమ్స్‌ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి కాబట్టి బీమా కంపెనీలు రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడవు.

ఈ 'కార్డియాక్‌ కేర్‌ స్పెసిఫిక్‌ పాలసీ'ల్లో పేస్‌ మేకర్స్‌ అమరిక గుండె మార్పిడి వంటి వాటికి కూడా బీమా కంపెనీలు అంగీకరిస్తాయి.

కొన్ని బీమా కంపెనీలు రెగ్యులర్, వార్షిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

అయితే ఈ తరహా 'డిసీజ్‌ స్పెసిఫిక్‌ పాలసీ'లు కేవలం ఆయా నిర్దిష్ట అనారోగ్యాలకే కానీ, ఇతర ఆరోగ్య సమస్యలకు పనికిరావని గుర్తు పెట్టుకోవాలి.

హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా, క్యాష్‌లెస్ వైద్యం, హార్ట్ ఎటాక్, బీపీ, షుగర్, ఆసుపత్రులు, వైద్య ఖర్చులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రత్యేక అనారోగ్య పరిస్థితులున్న వాళ్లకోసం డిసీజ్‌ స్పెసిఫిక్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు అందుబాటులోకి వచ్చాయి.

ముందు నుంచే వ్యాధి ఉంటే..

మీ కుటుంబంలో ఎవరికైనా ఇప్పటికే డయాబెటిస్‌, గుండె సంబంధిత సమస్యలు ఉంటే అవి తర్వాత తరానికి కూడా వచ్చే అవకాశాలున్నాయి. ముందు జాగ్రత్తగా కాంప్రహెన్సివ్‌ పాలసీతో పాటు యాడ్‌ ఆన్‌ కింద డిసీజ్‌ స్పెసిఫిక్‌ పాలసీని కూడా తీసుకోవచ్చు లేదా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌ను జత చేసుకోవచ్చు.

కార్డియాక్‌ కేర్‌ పాలసీ అనేది ఇప్పటికే ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకసారి పెద్ద అనారోగ్య సమస్య ఎదురైన తర్వాత, కంపెనీలు అంత సులభంగా పాలసీలను ఇవ్వవు. ఏదో ఒక మెలిక పెట్టి తప్పించుకోవడానికే చూస్తాయి.

అందుకే ప్రీ ఎగ్జిస్టింగ్‌ డిసీజ్‌ (ముందు నుంచి ఉన్నవ్యాధి)తో బాధపడుతున్న వాళ్లకు సాధారణ కాంప్రహెన్సివ్‌ పాలసీ రావడం చాలా కష్టం. అలాంటప్పుడు ఈ తరహా పాలసీ తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా, క్యాష్‌లెస్ వైద్యం, హార్ట్ ఎటాక్, బీపీ, షుగర్, ఆసుపత్రులు, వైద్య ఖర్చులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కార్డియాక్‌ కేర్‌ పాలసీ ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.

వెయిటింగ్‌ పీరియడ్‌ ఎలా ఉంటుంది?

సాధారణంగా ఏదైనా పాలసీ తీసుకున్నప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్‌ కండిషన్స్‌ కవరేజ్‌ కోసం కనీసం మూడేళ్ల వెయిటింగ్‌ ఉంటుంది.

అయితే కార్డియాక్‌ కేర్‌లో ఇది తక్కువ. కనీసం 90 రోజుల వెయిటింగ్‌తో ప్రారంభమై వ్యాధి తీవ్రత, మల్టిపుల్‌ కాంప్లికేషన్స్‌ను బట్టి ఈ వ్యవధి ఆధారపడి ఉంటుంది.

అప్పటికే గుండె పోటు లేదా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వాళ్లు కూడా పాలసీ తీసుకున్న 90 రోజుల తర్వాత ఏదైనా ఇబ్బంది వస్తే క్లెయిమ్స్‌ చేసుకోవచ్చు.

అవసరం, అనారోగ్యాన్ని బట్టి మనం పది రూపాయలు కట్టి రూ.100 క్లెయిమ్‌ పొందాలని చూస్తాం. కంపెనీ వాళ్లు కూడా ఇన్సూరర్‌కు వీలైనతం తక్కువ మొత్తం ఇచ్చి వదిలించుకోవాలని చూస్తారు.

అందుకే కార్డియాక్‌ కేర్‌ పాలసీ తీసుకున్నా కొన్ని పరిమితులు, ఆంక్షలు తప్పకుండా ఉంటాయని గమనించాలి.

హాస్పిటల్లో చేరితే వంద శాతం ఖర్చులను కంపెనీ భరించకపోవచ్చు. రూమ్‌ అద్దెలో పరిమితితో పాటు నూతన టెక్నాలజీతో చేసే ఆపరేషన్లు, అధునాతన వైద్య పరికరాల అమరిక వంటి వాటికి కచ్చితంగా ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

మెజారిటీ బీమా కంపెనీలు ఇళ్లలో ఇచ్చే వైద్యానికి (డొమిసిలరీ ట్రీట్మెంట్‌) క్లెయిమ్ నిరాకరిస్తున్నాయి.

సాధారణ కాంప్రహెన్సివ్‌ పాలసీలలో డే కేర్‌ ట్రీట్‌మెంట్స్ సంఖ్య కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి అవకాశాలు బాగా తక్కువ. రీఫిల్స్‌ అయ్యే అవకాశమూ తక్కువే.

అంటే మీరు రూ.10 లక్షల పాలసీ తీసుకున్నారని అనుకుందాం. హాస్పిటల్‌లో చేరినప్పుడు అదంతా ఖర్చైపోయింది అనుకుందాం.

రీఫిల్‌ పాలసీ తీసుకున్నాక వేరే ఇతర అనారోగ్య సమస్యలతో హాస్పిటల్‌లో చేరితే మళ్లీ రూ.10 లక్షలను కంపెనీ రీలోడ్‌, రీఫిల్ చేస్తుంది. కానీ ఇక్కడ అలాంటి వెసులుబాట్లు ఉండకపోవచ్చు.

రెగ్యులర్‌ కాంప్రహెన్సివ్‌ కవర్‌తో పోలిస్తే కార్డియాక్‌ కేర్‌ పాలసీ ప్రీమియం 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా, క్యాష్‌లెస్ వైద్యం, హార్ట్ ఎటాక్, బీపీ, షుగర్, ఆసుపత్రులు, వైద్య ఖర్చులు

ఫొటో సోర్స్, Getty Images

ఎవరెవరికి ఎలాంటి పాలసీలు...

ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉండి, ఏదైనా సర్జరీ చేయించుకున్న వాళ్లకు ఆప్షన్స్‌ దాదాపుగా చాలా తక్కువే ఉంటాయి.

ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేనివాళ్లు కాంప్రహెన్సివ్‌ హెల్త్‌ కవర్‌ తీసుకుంటే చాలు. దీనితో పాటు యాడ్‌ ఆన్‌ కవర్‌ కింద 'క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌' లేదా టాప్‌ అప్‌ పాలసీ ఏదైనా తీసుకుంటే మంచిది.

చిన్న పట్టణాల్లో నివసించే వాళ్లు కనీసం రూ.10 లక్షల కవర్‌ అయ్యేలా బీమా తీసుకోవాలి.

నగరాల్లో ఉన్న వాళ్లు రూ.15-20 లక్షల వరకూ కవరేజ్‌ వచ్చే పాలసీ తీసుకోవడం మంచిది.

మీకు ఇప్పటికే ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నప్పుడు, దాన్ని గుర్తించి అండర్‌ రైటింగ్‌లో కొద్దిగా ప్రీమియం లోడింగ్‌తో కాంప్రహెన్సివ్‌ కవర్‌ ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోవడం మంచి ఆప్షన్‌.

ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా, దాన్ని దాయకుండా బీమా సంస్థకు చెప్పండి. ఎందుకంటే తీవ్ర అనారోగ్యం వచ్చి హాస్పిటల్‌లో పడితే, మీ కంటే ఎక్కువగా ఇబ్బంది పడేది కుటుంబమని గుర్తుంచుకోండి.

కేర్‌ హెల్త్‌, నివా బూపా, స్టార్‌ హెల్త్, ఆదిత్య బిర్లా, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్‌ వంటి సంస్థలు ఈ తరహా గుండె సంబంధ ఎక్స్‌క్లూజివ్‌ పాలసీలను అందిస్తున్నాయి.

ఇక ప్రీమియం విషయానికి వస్తే డిసీజ్‌ స్పెసిఫిక్‌ పాలసీ తీసుకునే విషయంలో 45 ఏళ్లు వయసున్న హైదరాబాద్‌లో నివసిస్తున్న వ్యక్తి రూ.5 లక్షల కవరేజీకి గరిష్టంగా రూ.19వేల వరకూ ప్రీమియం కట్టాల్సి ఉంటుంది.

హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా, క్యాష్‌లెస్ వైద్యం, హార్ట్ ఎటాక్, బీపీ, షుగర్, ఆసుపత్రులు, వైద్య ఖర్చులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాలసీ తీసుకునే ముందు నియమనిబంధనలను ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకోండి.

ఇవి గుర్తుంచుకోవాలి

ఇప్పటికే హార్ట్‌ స్ట్రోక్‌ సహా గుండె సంబంధ వ్యాధులతో బాధపడే వాళ్లు హెల్త్ పాలసీలు తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి.

  • ప్రీ ఎగ్జిస్టింగ్‌ డిసీజ్‌ వెయిటింగ్ పీరియడ్‌ ఎంత?
  • హార్ట్‌ కేర్‌ పాలసీ కింద వేటికి కవరేజ్‌ ఉందో, వేటికి లేదో చెక్‌ చేయండి.
  • నెట్‌వర్క్ హాస్పిటల్స్‌ లిస్ట్‌ చూడండి. అప్పుడే మీరు నగదు రహిత ప్రయోజనం పొందడానికి ప్లాన్ చేసుకోవచ్చు.
  • ప్రీమియం కాస్త ఎక్కువగా ఉన్నా ఆర్థిక స్థోమతను బట్టి వీలైనంత గరిష్ఠ బీమా మొత్తాన్ని తీసుకునేందుకు చూడండి.
  • జీవితకాలం పాటు (లైఫ్‌ లాంగ్‌) కవరేజ్‌ ఉందో లేదో చెక్‌ చేయండి.
  • వార్షిక హెల్త్‌చెకప్స్‌ ఉన్నాయా?
  • రూమ్‌ రెంట్‌, సబ్‌ లిమిట్స్‌పై పరిమితులు ఉన్నాయా? ఉంటే ఎంత?
  • విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకునే వెసులుబాటు ఉందా?
  • కొన్ని బీమా సంస్థలు హాస్పిటల్‌ ఖర్చులతో సంబంధం లేకుండా గుండె సంబంధ అనారోగ్యం (వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌, యాంజియోప్లాస్టీ, బైపాస్‌ సర్జరీ) వచ్చినప్పుడు భారీ అమౌంట్‌ (గంపగుత్తగా పాలసీ మొత్తాన్ని) ఇచ్చేస్తాయి. అలా ఇచ్చే మొత్తం ఎంతుందో చెక్‌ చేయండి.
  • ఏదేమైనా రూ.20 లక్షలకు తక్కువ లేకుండా పాలసీ కవరేజ్‌ ఉండేలా చూసుకోండి.

ఇందులో డెత్‌ బెనిఫిట్స్‌, మెచ్యూరిటీ బెనిఫిట్స్‌ అంటూ ఏమీ ఉండవు. అందుకే పాలసీ నియమనిబంధనలన్నీ ఒకటికి రెండు సార్లు చదవి అర్థం చేసుకోండి.

(నోట్: ఈ కథనం నిర్దిష్టమైన అంశంపై స్థూలమైన అవగాహన కోసం మాత్రమే. నిర్ణయాలు మీ వ్యక్తిగత ఆర్థిక సలహాదారులను సంప్రదించి తీసుకోవాలి.)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)