ఈ కారు ప్రమాదంలో తప్పెవరిది? అసలేం జరిగింది?

అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణం

ఫొటో సోర్స్, Viral Video

ఫొటో క్యాప్షన్, బరేలిలో వంతెన పైనుంచి పడిన కారు, ముగ్గురు మృతి
    • రచయిత, సయ్యద్ మొజీజ్ ఇమామ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో ఆదివారం (నవంబర్ 24) జరిగిన కారు ప్రమాదం కేసులో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన నలుగురు అధికారులపై కేసు నమోదైంది. గూగుల్ మ్యాప్స్ ప్రాంతీయ మేనేజర్‌ను కూడా ఈ ఘటనకు బాధ్యులను చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఉంది.

ఆదివారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

గూగుల్ మ్యాప్స్ చూసి, ముగ్గురు వ్యక్తులు కారుతో వంతెనను ఎక్కినట్టు భావిస్తున్నారు. ఆ బ్రిడ్జి నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. ఆ విషయం తెలియని యువకులు బ్రిడ్జిపైకి ఎక్కారు. దీంతో కారు ముందుకు వెళ్లి కిందపడిపోయింది.

ఈ ఘటనలో గూగుల్ మ్యాప్స్ ప్రాంతీయ మేనేజర్‌ పైనా కేసు నమోదు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. కేసు దర్యాప్తులో సహకరిస్తామని గూగుల్ ప్రతినిధి చెప్పారు.

దాతాగంజ్ డిప్యూటీ తహశీల్దార్ ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రమాదంలో ముగ్గురు మృతి
ఫొటో క్యాప్షన్, అజిత్, అమిత్, నితిన్ (ఎడమ నుంచి)

గూగుల్ మ్యాప్స్‌పై కూడా ఫిర్యాదు

పబ్లిక్ వర్స్క్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లు అభిషేక్ కుమార్, మొహమ్మద్ ఆరిఫ్‌తో పాటు ఇద్దరు జూనియర్ ఇంజినీర్లు మహరాజ్ సింగ్, అజయ్ గంగ్వార్‌పై కేసు నమోదైంది.

వంతెన మీదికి మనుషులు, వాహనాలు వెళ్లకుండా అధికారులు గట్టి బారికేడ్లు ఏర్పాటు చేయలేదని, వంతెనను సూచించే బోర్డులు గానీ, రోడ్డు అక్కడితో ఆగిపోతుందనే బోర్డులు గానీ పెట్టలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మొదట్లో ఈ వంతెన మీదికి వెళ్లకుండా అడ్డుగా ఓ గోడ ఉండేదని, కానీ దాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ఆ ఫిర్యాదులో రాసి ఉంది.

గూగుల్ మ్యాప్స్‌లో ఈ మార్గం గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు కూడా బ్యారికేడ్ ఉన్నట్టు చూపించలేదని, వెళ్లాల్సిన చోటును చేరుకోవచ్చు అన్నట్టుగా రూట్ చూపించిందని ఫిర్యాదులో ఆరోపించారు.

క్షేత్రస్థాయిలో అధికారులు, ఇతర సిబ్బంది ప్రదర్శించిన నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తహశీల్దార్ తన రిపోర్టులో రాశారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారుల పైనా, గూగుల్ మ్యాప్స్‌ పైనా, గుర్తుతెలియని గ్రామస్థుల పైనా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘‘దర్యాప్తు జరుగుతోంది. గూగూల్ మ్యాప్స్ తప్పుందని తేలితే వాళ్లను కూడా నిందితుల జాబితాలో చేర్చుతాం. ప్రస్తుతం గూగుల్ అధికారుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు’’ అని దాతాగంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ గౌరవ్ వైష్ణోయ్ బీబీసీతో చెప్పారు.

మృతుల ఫోన్‌లలో నావిగేషన్ ఆన్‌లో ఉందన్న స్థానికులు

ఫొటో సోర్స్, Viral Video

ఫొటో క్యాప్షన్, ప్రమాదస్థలంలో స్థానికులు

గూగుల్ ఏమంటోంది?

ఈ ప్రమాదం తర్వాత బీబీసీ గూగుల్ మ్యాప్స్‌కు ఒక ఈ మెయిల్ పంపించింది.

‘‘మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నాం. దర్యాప్తుకు సహకరిస్తున్నాం’’ అని గూగుల్ ప్రతినిధి చెప్పారు.

మృతులను 30 ఏళ్ల నితిన్ కుమార్‌గా, ఆయన ఇద్దరు కజిన్స్ అమిత్ కుమార్, అజిత్ కుమార్‌గా గుర్తించారు. నితిన్, అజిత్ గురుగ్రామ్‌లో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.

ముగ్గురూ గురుగ్రామ్ నుంచి బయలుదేరారు. బదౌన్‌లోని దాతాగంజ్ వైపు నుంచి వెళ్లేందుకు రామ్‌గంగ వంతెన ఎక్కారు.

పెళ్లి వేడుకకోసం ఈ ముగ్గురూ బరేలిలోని ఫరీద్‌పూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

పెళ్లికోసం ముగ్గురూ వస్తున్నారని నితిన్ మామయ్య రాజేశ్ కుమార్ చెప్పారు. దీనికి ముందు ముగ్గురూ బదౌన్‌లో ఇంకో వివాహవేడుకకు హాజరయ్యారు.

‘‘మొబైల్ నావిగేషన్ ఆధారంగా ఈ ముగ్గురూ సరైన రూట్ కోసం వెతికారు. బరేలిలోని ఖాల్పూర్ గ్రామం దగ్గర రామ్‌గంగ బ్రిడ్జి మీద నుంచి వారు ప్రయాణిస్తున్న కారు కిందపడిపోయింది’’ అని రాజేశ్ కుమార్ చెప్పారు.

రామ్‌గంగ వంతెన నిర్మాణం సగమే పూర్తయిందన్న విషయం నావిగేషన్‌లో కూడా తెలిసి ఉండకపోవచ్చని కుటుంబ సభ్యులంటున్నారు. ప్రమాదం తర్వాత స్థానికులు నావిగేషన్ వ్యవస్థను పరిశీలించినప్పుడు కూడా అక్కడ రూట్ ‘క్లియర్‌’గా ఉన్నట్టే చూపించింది.

ఫరీద్‌పూర్ డీఎస్పీ అశుతోష్ శివమ్

ఫొటో సోర్స్, UP Police

ఫొటో క్యాప్షన్, బ్రిడ్జి మీద ఎలాంటి హెచ్చరిక బోర్డు, బారియర్ లేవని పోలీసులు చెప్పారు

ప్రమాదం ఎలా జరిగింది? ఎవరు బాధ్యులు?

నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి కారు కిందపడిపోవడంతో ముగ్గురూ ప్రమాదస్థలంలోనే చనిపోయినట్టు తెలుస్తోందని ఫరీద్‌పూర్ డీఎస్పీ అశుతోష్ శివమ్ చెప్పారు.

బ్రిడ్జి నిర్మాణం ఇంకా పూర్తికాలేదని, వంతెన మీద ఎలాంటి బోర్డుగానీ, బారియర్ కానీ లేవని, దీంతో కారు వేగంగా వెళ్లి నదిలో పడిపోయిందని డీఎస్పీ తెలిపారు.

వరదల కారణంగా బ్రిడ్జిలో కొంత భాగం కూలిపోయిందని పీటీఐ తెలిపింది. ఇది జరిగిన తర్వాత ఆ వంతెనపై ప్రయాణాలకు అనుమతి ఇవ్వలేదు.

అయితే దీనికి సంబంధించిన హెచ్చరిక బోర్డు లేకపోవడంతో కారు ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

2022లో వచ్చిన వరదల్లో బ్రిడ్జిలో కొంత భాగం కొట్టుకుపోయిందని స్థానికులు కూడా చెబుతున్నారు.

యూపీ రాష్ట్ర బ్రిడ్జి కార్పొరేషన్ ఈ వంతెనను నిర్మిస్తోందని ఫరీద్‌పూర్ ఎస్‌డీఎం గులాబ్ సింగ్ మీడియాకు చెప్పారు. బదౌన్‌కు వెళ్లే రోడ్డు తెరిచి ఉండడం ఈ ప్రమాదానికి కారణమన్నారు. దీనిపై విచారణకు ఆదేశించామని, దోషులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఉదయం 9.30 గంటల సమయంలో స్థానికులు ప్రమాదం గురించి సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

బ్రిడ్జి మీద ఎలాంటి బారికేడ్లు లేవని ప్రమాదస్థలికి వచ్చిన స్థానికులు తెలిపారు. ఉదయం పూట మంచు ఉందని, ప్రమాదానికి ఇది కూడా కారణమని చెప్పారు.

ఈ ప్రమాదానికి ప్రభుత్వ యంత్రాంగానిదే బాధ్యతని మృతుల బంధువులు ఆరోపించారు.

వంతెన మీద అధికారులు బారికేడ్లు పెట్టి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని మనోజ్ కుమార్ అనే బంధువు అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రమాదానికి బాధ్యత ఎవరిది?

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఐటీ యాక్ట్‌లో ఏముంది?

చట్టం ఏం చెబుతోంది?

నావిగేషన్ వ్యవస్థకు సంబంధించి చట్టాలు ఏం చెబుతున్నాయనేదానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై బారికేడ్లు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

‘‘ఐటీ చట్టంలోని సెక్షన్ 79 గూగుల్ మ్యాప్స్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను మధ్యవర్తులుగా చెబుతుంది’’ అని అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ సైమా ఖాన్ చెప్పారు.

‘‘ఈ నిబంధన ప్రకారం రోడ్లు, లొకేషన్లు వంటివాటి గురించి నేరుగా సంబంధం లేకుండా మరొక ప్లాట్‌ఫామ్ ద్వారా సమాచారం అందిస్తే... దానికి ఆ ప్లాట్‌ఫామ్‌ది బాధ్యత కాదు’’ అని సైమా తెలిపారు.

ఆ ప్లాట్‌ఫామ్‌లో తప్పుడు సమాచారం ఉందని నిరూపితమైతే, ఆ సమాచారాన్ని ప్లాట్‌ఫామ్ ఇంకా మార్చకపోతే సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ పోతుందని ఆయన తెలిపారు.

థర్డ్ పార్టీలు లేదా యూజర్లు షేర్ చేసే సమాచారానికి బాధ్యత వహించాల్సిన అవసరం లేకుండా సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ రక్షిస్తుంది. వారి నిర్లక్ష్యం నిరూపితమైతేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

మధ్యవర్తిగా ఉండే ప్లాట్‌ఫామ్ ద్వారా తప్పుడు సమాచారం షేర్ అయి, ఏదన్నా విషాదకర పరిస్థితి ఏర్పడినప్పుడు, దానికి ఎవరు బాధ్యతవహించాలన్నది నిర్ణయించడం చాలా కష్టమైన అంశమని లఖ్‌నవూ హైకోర్టు న్యాయవాది అభిషేక్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు.

‘‘రోడ్ల నిర్వహణ బాధ్యత, సమాచార బోర్డుల ఏర్పాటు, మౌలిక సదుపాయాల పరిరక్షణ స్థానిక అధికారుల విధి. రోడ్లు బాగా లేకపోవడం వల్లో, సరైన హెచ్చరిక బోర్డులేకపోవడం వల్లో ప్రమాదం జరిగితే అధికారయంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.

‘‘కొన్నిసార్లు అధికార యంత్రాంగం, నావిగేషన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని కచ్చితమైన సమాచారం అదిస్తుంది. తాజా పరిస్థితులపై యంత్రాంగం సమాచారం ఇవ్వకపోతే, ప్రమాదానికి అది కూడా ఓ కారణమవుతుంది’’ అని అభిషేక్ దీక్షిత్ చెప్పారు.

రోడ్డు ప్రయాణానికి అనువుగా లేకపోతే, ఆ విషయాన్ని అధికార యంత్రాగం తెలియజేయకపోతే వారు కూడా ప్రమాదానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయనన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)