గూగుల్ ఫొటోస్ సేవలు ఇకపై ‘ఫ్రీ’ కాదు - ప్రెస్ రివ్యూ

గూగుల్ ఫొటోస్

ఫొటో సోర్స్, Getty Images

గూగుల్ సంస్థ 'గూగుల్‌ ఫొటోస్‌' పేరుతో మన ఫొటోలను భద్రపర్చుకొనేందుకు వెసులుబాటు కల్పించింది. ఇకపై ఈ సేవలు 'ఉచితం' కాదని నమస్తే తెలంగాణ ఒక కథనంలో ప్రచురించింది.

ఫోన్‌తో ఫొటోలు తీసినప్పుడు అవి ఆటోమేటిక్‌గా గూగుల్‌ ఫొటోస్‌కు వెళ్తాయి. జీమెయిల్‌తో లాగిన్‌ అవడం ద్వారా వాటిని ఎక్కడైనా చూసుకోవచ్చు. గూగుల్‌ సంస్థ దాదాపు ఐదేండ్లుగా ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నది. కానీ ఇకపై గూగుల్‌ ఫొటోస్‌ సేవలను ఫ్రీగా పొందడం కుదరదు. 15 జీబీకి మించి ఫొటోలను దాచుకోవాలంటే నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని గూగుల్‌ వెల్లడించింది. వచ్చే ఏడాది జూన్‌ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తన అధికారిక బ్లాగులో పేర్కొన్నది.

అయితే జూన్‌ 1వరకు అప్‌లోడ్‌చేసిన ఫొటోలు ఈ 15జీబీ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. గూగుల్‌ ఫొటోస్‌ ఉచితం కావడంతో అందులో డేటా రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇప్పటికే 4 లక్షల కోట్లకు పైగా ఫొటోలు అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. ప్రతీవారం 2,800 కోట్ల కొత్త ఫొటోలు వచ్చి చేరుతున్నాయి. దీంతో గూగుల్‌ సర్వర్లపై విపరీతమైన భారం పెరుగుతున్నది. సర్వర్లపై భారం తగ్గించేందుకే గూగుల్‌ చార్జీల నిర్ణయం తీసుకున్నట్టు తెలిస్తున్నదని ఈ కథనంలో తెలిపారు.

చార్మినార్

ఫొటో సోర్స్, Getty Images

అతి త్వరలో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు, డిసెంబరు తొలివారంలోనే జరుగనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.

దీపావళి తర్వాత ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ వెలువరించి 16 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని సర్కారు ఓ నిర్ణయానికొచ్చినట్లు ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయని ఈ వార్తలో రాసారు.

వాస్తవానికి 13వ తేదీ తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్‌ వెలువడుతుందని వారం క్రితం ఎన్నికల సంఘం కమిషనర్‌ పార్థసారథి ప్రకటించారు. ఆ మరునాడే ఎన్నికల నిర్వహణకు సంబంధించి భిన్న ప్రచారం జరిగింది. ఇప్పట్లో ఎన్నికలు ఉండవని, జనవరి చివరివారం, లేదంటే ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయని ఉన్నతస్థాయి వర్గాల నుంచి లీకులు వచ్చాయి. అయితే దుబ్బాకలో అధికార టీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా ఫలితం రావడంతో సర్కారు 'ప్రణాళిక'లో మార్పు వచ్చింది. ఇంకా ఆలస్యం చేస్తే దుబ్బాక ఫలితం ప్రభావం.. గ్రేటర్‌ ఎన్నికలపైనా పడుతుందని సర్కారులో పెద్దలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. అనేక విషయాలను విశ్లేషించుకున్న మీదట షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం.

ఓటరు తుది జాబితా, పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన అంశాలపై ఎన్నికల సంఘం కమిషనర్‌ సి.పార్థసారథి గురువారం తన కార్యాలయంలో 11 రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అన్ని పార్టీలు, అభ్యర్థులు తప్పక పాటించి, ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు. ఫిబ్రవరి 10లోగా జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ముగియనుండటంతో ఈలోగా ఎన్నికలు జరపాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. శుక్రవారం ఓటరు తుది జాబితాను వెల్లడిస్తామని, 13న పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రకటించి, 21న తుది జాబితాను జారీ చేస్తామని చెప్పారని ఈ కథనంలో తెలిపారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ భేటీ అయ్యారు. దుబ్బాక ఫలితం నేపథ్యంలో.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వ్యూహాలు ఎలా ఉండాలనేది చర్చించారని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని నిలువరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అవసరమైన చోట రెండు పార్టీలూ పోటీ చేయాలని, ఒకరు గెలిచే అవకాశం ఉన్న చోట మరొకరు పోటీలో నిలవకూడదని రెండు పార్టీలూ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అంటూ ఈ కథనంలో తెలిపారు.

తెలంగాణ హైకోర్టు

ఫొటో సోర్స్, TS HIGH COURT

ఈ దీపావళికి బాణాసంచాపై నిషేధం..హై కోర్టు ఆదేశం

పండుగల కన్నా ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని, బాణసంచా కాల్చకుండా, విక్రయించకుండా నిషేధం విధించాలని, రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయ దుకాణాలను వెంటనే మూసేయించాలని తెలంగాణ హైకోర్టు, ప్రభుత్వాన్ని ఆదేశించిందంటూ సాక్షి ఒక కథనంలో ప్రచిరించింది.

కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. బాణసంచా కాల్చరాదంటూ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, తమ ఆదేశాల అమలుపై తీసుకున్న చర్యలను 19న వివరించాలని ఆదేశించినట్లు ఈ వార్తలో రాసారు.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నవంబర్‌ 10-30 మధ్య బాణసంచా కాల్చకుండా నిషేధం విధించేలా ఆదేశించాలంటూ న్యాయవాది పి.ఇంద్ర ప్రకాశ్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ నేపథ్యంలో బాణసంచాను నిషేధించాలన్నారు. బాణసంచా నిషేధానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలంటూ ధర్మాసనం అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను ప్రశ్నించింది. రాత్రి 3 గంటల వరకు కూడా బాణసంచా కాలుస్తూ ధ్వని, వాయు కాలుష్యానికి పాల్పడుతున్నా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి వివరణ తీసుకొని చెబుతానని, విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేయాలని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ అభ్యర్థించడంతో విచారణను వాయిదా వేసింది. అనంతరం బాణాసంచా నిషేధానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఏజీ ప్రసాద్‌ నివేదించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తారని భావిస్తున్నామని పేర్కొన్నట్లు ఈ కథనంలో వివరించారు.

''కరోనా సెకండ్‌ వేవ్‌ ఇప్పటికే ప్రారంభమైంది. బాణసంచా కాల్చడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది. శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఇతర హైకోర్టులు సైతం బాణసంచా కాల్చకుండా నిషేధం విధించాయి. బాణసంచా కాల్చి వాయు కాలుష్యానికి పాల్పడకుండా ప్రజలను చైతన్యం చేయండి. ఈ మేరకు ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించండి" అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొందని ఈ కథనంలో తెలిపారు.

సోనూసూద్

ఫొటో సోర్స్, Getty Images

సోనూసూద్ ఆత్మకథ...'ఐ యామ్‌ నో మెస్సయ్య'

లాక్‌డౌన్‌ సమయంలో ఇబ్బందులు పడుతున్న ఎందరో వలస కూలీలను సురక్షితంగా వారి సొంత ఊరికి చేర్చడానికి పెద్ద మనసుతో సాయం చేసిన సోనూసూద్ ఆత్మకథ పుస్తక రూపంలో రాబోతోందని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచిరించింది.

‌నిస్వార్ధంగా ఆయన చేసిన సాయం కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. 'వలస కూలీల పాలిట మెస్సయ్య'గా ఆయన్ను ప్రజలు అభివర్ణించారు. లాక్‌డౌన్‌ కాలంలో ఎదుర్కొన్న సంఘటనలు, అనుభవాలతో 'ఐ యామ్‌ నో మెస్సయ్య' పేరుతో సోనూసూద్‌ ఆత్మకథను పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ సంస్థ ప్రచురిస్తోందని ఈ కథనంలో తెలిపారు.

దీనికి మీనా అయ్యర్‌ సహ రచయిత్రి. వలస కూలీలను కాపాడి వారిని సొంతూళ్లకు చేర్చడంలో ఎదురైన సవాళ్లు, భావోద్వేగానికి గురి చేసిన సంఘటనలను సోనూసూద్‌ ఈ పుస్తకంలో వివరించారు. లాక్‌డౌన్‌ కాలంలో తను విన్నవి, తనకు తారస పడిన సంఘటనలు తన జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చాయో, జీవితంపై తన దృక్పథాన్ని ఎలా మార్చాయో ఈ పుస్తకం ద్వారా సోనూసూద్‌ అభిమానులతో పంచుకుంటున్నారని ఈ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)