విశాఖ రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించిన కేంద్రం, ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖపట్నం కేంద్రంగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లను ఆహ్వానించింది.
అర్హత కలిగిన సంస్థలు డిసెంబర్ 27లోగా టెండర్లు దాఖలు చేయాలని ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. టెండర్లు దక్కించుకున్న సంస్థలు రెండేళ్లలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని తెలిపింది.
ఎన్నో ఏళ్లుగా విశాఖ రైల్వే జోన్ కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి. ఇప్పుడు దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణం కోసం టెండర్ల ఆహ్వానించడం వరకు ప్రక్రియ వచ్చింది.
ఇప్పటి వరకు ఏం జరిగింది? రైల్వే జోన్ కార్యాలయాలు ఎక్కడ నిర్మించబోతున్నారు అక్కడ ప్రస్తుత పరిస్థితులేంటి? టెండర్ల ప్రక్రియ మొదలు కావడంతో ఇక రైల్వే జోన్ పనులు మొదలైనట్లేనా? స్థానికులు, రైల్వే ఉద్యోగులు ఏమంటున్నారు?


టెండర్ల ప్రక్రియకు ముందు ఏం జరిగింది?
2019 ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అంటే కేంద్రం ఆ ప్రకటన చేసి ఇప్పటికి ఐదేళ్ల 9 నెలలు అయ్యింది.
2019 మార్చి 8న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) నియామకం జరిగింది.
2019 సెప్టెంబర్ మొదటి వారంలో రైల్వే జోన్‌కు సంబంధించిన డీపీఆర్‌ను రైల్వే బోర్డుకు అందజేశారు. ఆ తర్వాత కూడా జోన్‌కు సంబంధించిన ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు.
రైల్వే జోన్ కార్యాలయం కోసం కేటాయించిన భూములపై వివాదం నెలకొనడమే పనులు ప్రారంభం కాకపోవడానికి కారణమంటూ కేంద్ర, రాష్ట్ర (వైసీపీ) ప్రభుత్వాలు చెప్పుకొచ్చాయి.

విశాఖలో రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి కావాల్సిన 52 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం తమకు అప్పగించలేదని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2024 ఫిబ్రవరి 2న దిల్లీలో చెప్పారు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కోసం ముడసర్లోవలోని శ్రీకృష్ణాపురంలో సర్వే నెంబరు 26లోని జీవీఎంసీ భూమిని సిద్ధం చేశామని కలెక్టర్ చెప్పారు.
అక్కడ భూమికి సరిహద్దులు నిర్ణయిస్తూ పొడవాటి గోతులు కూడా తవ్వామని, ఆ భూమినే కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధం చేశామని, ఆ విషయాన్ని కేంద్రానికి తెలియజేశామని అప్పటి విశాఖ కలెక్టర్ ఎ. మల్లికార్జున బీబీసీకి చెప్పారు.

అయితే రైల్వే జోన్ కార్యాలయాలు, ఇతర నిర్మాణాల కోసం రైల్వే శాఖ ఆ భూములను పరిశీలించగా... అవి విశాఖ తాగు నీటి అసవరాలను తీర్చే ముడసర్లోవ రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ భూములను తీసుకునేందుకు రైల్వేశాఖ నిరాకరించింది.
కానీ భూముల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని, ఈ భూములనే కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున చెప్పారు.
ఆ తర్వాత మళ్లీ రైల్వే జోన్‌పై ఎటువంటి ప్రకటనలు రాలేదు. ఇంతలో ఏపీలో ప్రభుత్వం మారింది.

జీవీఎంసీ భూములని ఎందుకిచ్చారు?
పదేళ్ల కిందట రెండు బీఆర్టీఎస్ (బస్ ర్యాపిడ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం) రోడ్ల నిర్మాణం కోసం రైల్వే భూములను జీవీఎంసీ ( గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్) తీసుకుంది.
అంతేకాకుండా 1987 నుంచి 2007 వరకు వివిధ అవసరాల కోసం రైల్వే భూములను ఏపీ ప్రభుత్వం తీసుకుంది. దీంతో ఆ భూములకు బదులుగా ముడసర్లోవలోని శ్రీకృష్ణాపురంలో 52 ఎకరాలను జీవీఎంసీ ద్వారా రైల్వేకు కేటాయించింది.
అయితే ఈ భూముల హక్కుదారులమంటూ అక్కడున్న కొందరు గిరిజనులు అందోళనలు చేశారు. అధికారులకు అర్జీలు పెట్టుకున్నారు.
“1975లో అగ్నిప్రమాద బాధితులమైన మాకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 52 ఎకరాల భూములను కేటాయించారు. గిరిజనులమైన మేము అప్పటి నుంచి ఆ భూములను అనుభవిస్తున్నాం. మొత్తం ఇక్కడ 78 ఎకరాల భూమిపై మాకు డి-పట్టాలున్నాయి” అని శ్రీకృష్ణాపురానికి చెందిన గిరిజన రైతు మారిక జయలక్ష్మీ బీబీసీతో చెప్పారు.
మరోవైపు, డి-పట్టా భూములను ప్రభుత్వానికి అవసరమైనప్పుడు తీసుకుంటాయని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు.
“నోటీసుల ద్వారా తమకు తెలియపరిచి, అప్పుడు వాటిపై ప్రభుత్వం, జీవీఎంసీ ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేది. కానీ మేం పంటలు సాగు చేసుకుంటుండగా ఆ భూములను రైల్వేశాఖకు ఎలా ఇస్తారు?” అంటూ శ్రీకృష్ణాపురం గిరిజనులు ప్రశ్నించారు.
ఇలా గిరిజనుల డి-పట్టా భూములు, రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో భూముల వివాదం నడుస్తూ రైల్వే జోన్ పనుల ప్రక్రియలో ఎటువంటి కదలిక కనిపించలేదు.

జోన్ పనులు మొదలవ్వడమంటే...
''ఏదైనా రైల్వే జోన్ పనులు మొదలవ్వడమంటే పెద్ద పెద్ద కార్యాలయాలు కట్టి, ఆ తర్వాత పనులు ప్రారంభించడం కాదు. విశాఖలోని వాల్తేరు రైల్వే డివిజన్‌కు అనేక స్థలాలు, భవనాలు ఉన్నాయి. వాటిలో మొదలు పెట్టినా చాలు. ఏదీ ఏమైనా దక్షిణ కోస్తా రైల్వే పనులకు టెండర్లను పిలిచే వరకు ప్రస్తుతం అడుగు పడింది కాబట్టి, అనుకున్న సమయానికి పనులు పూర్తయ్యేటట్లు చూస్తే చాలు” అని విశాఖలో పని చేస్తున్న రైల్వే ఉద్యోగి ఎస్. శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు.
“కార్యాలయాల నిర్మాణానికి రెండేళ్ల గడువు విధించింది రైల్వేశాఖ. కానీ ఆ తర్వాత కూడా ‘అనివార్య కారణాల వలన’ అంటూ పనులు నిలిపివేయడం, కాలపరిమితి పెంచడం లాంటివి చేయొచ్చు. ఇలాంటివి జరక్కుండా చూసుకోవాలి. అప్పుడే ప్రజలు విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నమ్ముతారు” అని శ్రీనివాసరావు చెప్పారు.
జోన్ ఏర్పాటు సౌకర్యాలు, సమస్యలు, భూ సేకరణ, ఉద్యోగుల బదిలీలు వంటి అంశాలతో కూడిన డీపీఆర్ ఆమోదం పొందితే చాలు రైల్వే జోన్ పనులు ప్రారంభించవచ్చని గతంలో బీబీసీతో మాట్లాడిన అప్పటి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ఎస్.ఎస్ శ్రీనివాస్ అన్నారు.
ప్రస్తుతం టెండర్లను ఆహ్వానించి దక్షిన కోస్తా రైల్వే జోన్ కార్యాలయాలను రూ. 149.16 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు.
గతంలో రైల్వేశాఖకు ఏపీ ప్రభుత్వం కేటాయించిన ముడసర్లోవలోని 52 ఎకరాల స్థలంలోనే ఈ నిర్మాణాలు జరగనున్నాయి.
రిజర్వాయర్ పక్కనే ఉండటంతో ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని గతంలో రైల్వేశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే అటువంటి ఇబ్బందేమీ రాదని రాష్ట్రప్రభుత్వం స్పష్టతనివ్వడంతో ఇప్పుడు ఆ భూములను ఓకే చేసింది.
మొత్తం 11 అంతస్తుల్లో భవన నిర్మాణం జరగనుంది. ఇందులో రెండు సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లు ఉండనున్నాయి.

ఎన్ని ఉద్యోగాలు వస్తాయి?
ఇక్కడ దక్షిణ కోస్తా జోన్ జనరల్ మేనేజర్ కార్యాలయం, ఇతర ఉన్నతాధికారుల ఆఫీసులు ఉంటాయని రైల్వే శాఖ అధికారులు చెప్పారు.
“జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలంటే ఒక జనరల్ మేనేజర్, ఆయన సపోర్టింగ్ స్టాప్ కొన్ని కార్యాలయాలు ఉంటే చాలు. మొత్తంగా దీనికి 2 వేల మంది ఉద్యోగులు అవసరమవుతారు. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే నాటికి వారి సంఖ్య క్రమంగా 3 వేలకు చేరుతుంది. ఇప్పటికే ఇక్కడ పని చేస్తున్న వారు కొందరు ఉన్నారు కాబట్టి, చాలా తక్కువ మంది ఉద్యోగులు కొత్తగా అవసరమవుతారు. వీరందరూ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఆపరేటింగ్ డిపార్ట్‌మెంట్, కంట్రోల్ రూం, అడిటోరియం, మెకానికల్.. ఇలా మొత్తం 18 రకాల విభాగాలు, దానికి సంబంధించిన అనుబంధ కార్యాలయాలలో పని చేస్తుంటారు” అని రైల్వే జోన్ అఖిల భారత సాధన సమితి కన్వీనర్, రైల్వే ఉద్యోగ సంఘం నాయకులు చలసాని గాంధీ బీబీసీతో చెప్పారు.

ఆ స్థలంలో ఇప్పుడు ఏమున్నాయి?
విశాఖ నుంచి జాతీయ రహదారిపై విజయనగరం వెళ్తుండగా... హనుమంతవాక జంక్షన్ నుంచి సింహాచలానికి వెళ్లే దారిలో ఉన్న ముడసర్లోవ రిజర్వాయర్ పక్కనే ఈ 52 ఎకరాల భూమి ఉంది.
విశాఖ వాసులకు తాగునీటిని అందించే రిజర్వాయర్లలో ముడసర్లోవ జలాశయం ఒకటి.
నవంబర్ 25న బీబీసీ వెళ్లి చూసినప్పుడు ఆ స్థలంలో జీడితోటలు, మామిడి తోటలు, తాటి చెట్లు ఎక్కువగా కనిపించాయి. కొంత భాగం చదునుగా ఉండి అనధికార డంపింగ్ యార్డుగా ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. కొన్నిచోట్ల జీవీఎంసీ రోడ్లు కనిపించాయి. అలాగే రైల్వేశాఖకు అప్పగించనున్న ఈ 52 ఎకరాల భూమి సరిహద్దుని నిర్ణయిస్తూ జీవీఎంసీ తవ్విన మట్టి కనిపించింది.
ప్రస్తుతం విశాఖలో ఉన్న వాల్తేరు డివిజన్ కార్యాలయాలకు, అలాగే విశాఖ రైల్వే స్టేషన్‌కు రైల్వే జోన్‌కు కేటాయించిన స్థలం వివిధ మార్గాల్లో వచ్చినప్పుడు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఫొటో సోర్స్, Ram Mohan Naidu Kinjarapu
చిరకాల స్వప్నం : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ రైల్వేజోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్లు పిలవడం పట్ల పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ‘ఎక్స్’ వేదికగా హర్షం వ్యక్తంచేశారు.
"ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాకారమవుతోంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఇది ఎన్డీయే ప్రభుత్వం వేసిన గొప్ప ముందడుగు" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














