బ్లాక్ ఫ్రైడే అంటే ఏమిటి, ఆ రోజున వ్యాపారులు భారీ డిస్కౌంట్లు ఎందుకు ఇస్తుంటారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫెర్నాండో డ్యురాతే
- హోదా, బీబీసీ ప్రతినిధి
నవంబర్ 29న వచ్చే బ్లాక్‌ఫ్రైడే కోసం ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఆ రోజున భారీగా డబ్బు ఖర్చు చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో షాపింగ్ విండోస్, ఈమెయిల్ బాక్సులన్నీ“ఇప్పుడే కొనండి” “ఈ అవకాశాన్ని మిస్ కావద్దు”“ఈ ఆఫర్ త్వరలో ముగుస్తుంది” అనే సందేశాలతో నిండిపోతున్నాయి.
ఆ సమయంలో షాపులు, రిటైల్ దుకాణాలు ధరలుతగ్గించి వినియోగదారులు ఎక్కువ సంఖ్యలో కొనేలా ప్రోత్సహిస్తాయి. అమెరికాలో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరిస్తోంది.
బ్లాక్‌ఫ్రైడే ఏడాదిలో బిజీ షాపింగ్ రోజుగా ఎలా మారింది?


ఫొటో సోర్స్, Getty Images
బ్లాక్ ఫ్రైడే ఎలా పుట్టింది?
నవంబర్ చివరి వారంలో వచ్చే శుక్రవారాన్ని బ్లాక్ ఫ్రైడేగా చెబుతున్నారు. అమెరికాలో బ్లాక్ ఫ్రైడే ముందు రోజును థాంక్స్ గివింగ్ (కృతజ్ఞతలు తెలుపుకునే)డేగా జరుపుకుంటున్నారు. ఆరోజున అమెరికాలో సెలవు కూడా.
బ్లాక్ ఫ్రైడే అనే పదం పుట్టడానికి, షాపింగ్‌కు ఎలాంటి సంబంధం లేదు. 1869 ఆర్థిక సంక్షోభం సమయంలో ఒక శుక్రవారం రోజు బంగారం ధరలు పడిపోవడంతో దాన్ని బ్లాక్ ఫ్రైడే అని పిలిచారు.
20వ శతాబ్దం మధ్యలో, అమెరికా కార్మికులు సెలవు రోజుల తర్వాత కూడా విధులకు గైర్హాజరవడాన్ని బ్లాక్ ఫ్రైడేగా ప్రస్తావించారు.
ఫిలడెల్ఫియాలో శుక్రవారం రోజు షాపింగ్ వల్ల రద్దీ పెరగడంతో పోలీసులు దాన్ని బ్లాక్ ఫ్రైడే అని పిలిచేవారు.
కొంతమంది వ్యాపారులు ఈ పదాన్ని 1980ల్లో కొంత సానుకూలంగా మార్చారు. తమ వ్యాపార లాభాలకు ప్రతీకగా దీనిని చూడటం ప్రారంభించారు.తమ వ్యాపారంలో ఖర్చులు తగ్గి రాబడి పెరగడాన్ని బ్లాక్ ఫ్రైడేగా చెప్పడం మొదలుపెట్టారు.
ఇక బ్లాక్ ఫ్రైడే అనేది భారీ ఆన్‌లైన్ కొనుగోళ్లకు, డిస్కౌంట్లకు పర్యాయపదంగా మారింది. వారంతపు సెలవురోజుల్లో జరిగే ఈ వ్యాపారం సైబర్ మండే అనే మరో షాపింగ్ రోజుకు కూడా దారితీసింది. దీనివల్ల శుక్రవారం మొదలైన వ్యాపారం సోమవారం వరకు కొనసాగే అవకాశం ఏర్పడింది.
ఇంటర్‌నెట్ కారణంగా బ్లాక్ ఫ్రైడే పదం ప్రపంచమంతటా విస్తరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచమంతటా బ్లాక్ ఫ్రైడే?
ప్రపంచవ్యాప్తంగా 2023లో వినియోగదారులు ఆన్‌లైన్‌లో 70.9 బిలియన్ డాలర్లు (దాదాపు 6లక్షల కోట్లరూపాయలకు పైగా) ఖర్చు చేశారని అమెరికన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సేల్స్ ఫోర్స్ పరిశోధన అంచనా వేసింది. 2022తో పోలిస్తే ఇది 8శాతం ఎక్కువ.
మొదటి అతి పెద్ద బ్లాక్ ఫ్రైడే 2010లో బ్రిటన్‌లో ప్రారంభమైంది. ఇది బ్రిటన్ చారిత్రక సంప్రదాయ షాపింగ్ ఈవెంట్ అయిన బాక్సింగ్ డే అమ్మకాలను అధిగమించింది. క్రిస్మస్ వేడుకల సమయంలో వచ్చే బాక్సింగ్ డే రోజున బ్రిటన్‌లో భారీగా అమ్మకాలు జరుగుతాయి.
ఆ సమయంలో వినియోగదారులు 9 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తారని కన్సల్టెన్సీ కంపెనీ ప్రైస్ వాటర్స్ కూపర్స్ అంచనా వేసింది.
ఆఫ్రికా విషయానికొస్తే, 2023లో నైజీరియా, దక్షిణాఫ్రికా, కెన్యాలో రోజూ జరిగే వ్యాపార లావాదేవీలతో పోలిస్తే నవంబర్ 24న అమ్మకాలు 83శాతం ఎక్కువగా ఉన్నట్లు ఆన్‌లైన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ పేయూ తెలిపింది.
అర్జెంటీనాలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ, గతేడాది బ్లాక్ ఫ్రైడేనాడు ఆన్‌లైన్ కొనుగోళ్లు 104 శాతం జరిగినట్లు పేయూ వెల్లడించింది.
నవంబర్‌లో బ్లాక్‌ఫ్రైడే ఒక్కటే అతి పెద్ద గ్లోబల్ షాపింగ్ రోజు కాదు. ఫ్రాన్స్‌లో కూడా నవంబర్ చివరి శుక్రవారంనాడు భారీ డిస్కౌంట్లు ప్రకటించే ఆనవాయితీ ఉంది. దీంతో రాబోయే ఫ్రైడే (దీనిని క్రేజీ ఫ్రైడే అని పిలుస్తారు) కోసం ఫ్రాన్స్ ప్రజలు సిద్ధమవుతున్నారు.
అలాగే చైనాలోనూ భారీగా షాపింగ్ చేసేందుకు సింగిల్స్ డే ఉంది. దాన్ని నవంబర్ 11న జరుపుకుంటారు. చైనాలో సింగిల్స్‌డే రోజున ప్రజలు షాపింగ్ చేయడం మొదలుపెట్టి కొన్ని వారాలపాటు కొనసాగిస్తారు.
మెక్సికన్లకు నవంబర్ 20న జాతీయ సెలవు. ఆ రోజు నుంచి వారం రోజుల పాటు ఎల్ బ్యూన్ ఫిన్ డి సిమానా పేరుతో షాపింగ్ చేస్తారు.
పశ్చిమాసియాలో బ్లాక్ ఫ్రైడే ను వైట్ ఫ్రైడేగాపిలుస్తారు. ముస్లింలకు శుక్రవారం పవిత్రమైన రోజు కావడంతో మతపరమైన కారణాల దృష్ట్యా వైట్ ఫ్రైడే అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మంచి ఆఫర్లు ఉంటాయా?
బ్లాక్ ఫ్రైడేనాడు నిజంగానే మంచి ఆఫర్లు ఉంటాయా అనే ప్రశ్నకు సమాధానం చాలా తేలిక.
బ్రిటన్‌లో, బ్లాక్ ఫ్రైడే రోజున ప్రకటించే ఏడు ఆఫర్లలో ఒక్కటి మాత్రమే నిజమైనది అయి ఉంటుందని 2022లో బ్రిటన్‌లోని వినియోగదారుల బృందం ఒకటి గుర్తించింది. ఎక్కువ శాతం ఉత్పత్తులు ప్రమోషన్స్‌లో చౌకగా, లేదా ఆరు నెలల ముందున్న ధరతో ఆఫర్లు అందిస్తాయి.
బ్లాక్ ఫ్రైడే రోజున కొనే వస్తువుల్లో ఎక్కువ శాతం టెక్నాలజీకి సంబంధించిన వస్తువులు ఉన్నట్టు ప్రముఖ వినియోగదారుల వెబ్‌సైట్ మనీ సేవింగ్ ఎక్స్‌పర్ట్ గుర్తించింది. అలాగే ఆ రోజున కొనేందుకు ఆన్‌లైన్‌లో 50 ప్రముఖ ఉత్పత్తుల కోసం వెదికితే అందులో 35 మాత్రమే చౌకగా ఉన్నాయని, అవి కూడా బ్లాక్ ఫ్రైడే కంటే క్రిస్మస్ షాపింగ్‌లో చౌకగా లభిస్తున్నాయని తేలింది.
బ్రెజిల్‌లో ముందుగానే ధరలు పెంచి బ్లాక్ ఫ్రైడేనాడు తగ్గించి, ఆఫర్లు ప్రకటించడాన్ని అక్కడి ప్రజలు “బ్లాక్ ఫ్రాడ్” అని విమర్శిస్తున్నారు.
తక్కువ ధరల కోసం వెతికే విషయంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి.
బ్లాక్‌ఫ్రైడే పేరుతో స్కాములు మూడు రెట్లు పెరిగాయని లాయిడ్స్ బ్యాంక్ విశ్లేషించింది. ఈ స్కాములు ఎక్కువగా దుస్తుల కొనుగోళ్లలో జరుగుతున్నాయని గుర్తించింది.
బ్రిటన్‌లో బ్లాక్‌ఫ్రైడే, సైబర్ మండే సందర్బంగా జరిగే స్కాములు 2021లో 29శాతం పెరిగాయని లాయిడ్స్ బ్యాంక్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
వాపసు ఇచ్చేవి ఎక్కువే
బ్లాక్‌ఫ్రైడే సందర్భంగా బ్రిటన్‌లో కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతాయి. నవంబర్ 29న బ్లాక్ ఫ్రైడే అయితే .. డిసెంబర్ మూడున రిటర్న్స్ డే అంటూ వ్యాపారులు జోక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే బ్లాక్ ఫ్రైడే నాడు కొన్న వస్తువుల్లో చాలా వరకు ఆ తరువాత వాపసు పంపుతారు. సంవత్సరంలో ఏ రోజూ అన్ని వస్తువులు తిరిగి రావని ఈ కామర్స్ సంస్థ ఐఎంఆర్‌జీ చెబుతోంది.
ఫ్లాష్ సేల్ లాంటివి ప్రజలతో బాగా డబ్బులు ఖర్చు పెట్టిస్తాయని, అలాంటి వాటిని ఆపడం కష్టమని వినియోగదారుల హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
“ఆన్‌లైన్‌లో ఇది చాలా కష్టం. ఎందుకంటే వ్యాపారులు వినియోగదారులను ఆకట్టు కోవడానికి అనేక రకాలుగా వారిపై ఒత్తిడి పెంచుతారు” అని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న చారిటీ మనీ అండ్ మెంటల్ హెల్త్ పాలసీ ఇన్‌స్టిట్‌ట్యూట్ అధికార ప్రతినిధి బ్రయన్ సెంపుల్ బీబీసీకి చెప్పారు.
ఆన్‌లైన్ షాపింగ్‌లో ఒక వస్తువుని కొనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సలహా ఇస్తున్నారు.
అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తొందరపడి హడావుడిగా ఏదో ఒకటి కొనకండి.
ఆఫర్ల గురించి స్వయంగా తెలుసుకోండి, ధరలను పోల్చి చూడండి.
నకిలీ వెబ్‌సైట్లలో కొనుగోలు చేసి మోసపోవద్దు.
ఒక వస్తువును భారీగా తక్కువ ధరకు ఇస్తున్నారంటే ఆలోచించండి.
ప్రపంచంలో ఎవరూ నష్టానికి వ్యాపారం చేయరు.
ఫేక్ రివ్యూలు చదివి మోసపోవద్దు.
కొనుగోళ్ల కోసం క్రెడిట్ కార్డుని ఉపయోగించండి.
కార్డు ఓటీపీలను ఎవరికీ షేర్ చేయకండి.
కొనుగోళ్లు అన్నీ మీరు ఉపయోగిస్తున్న ఫ్లాట్‌ఫామ్ నుంచే జరపండి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














