అఫ్గానిస్తాన్‌లో 5 లక్షల ఆయుధాలు మిస్, ఎవరి చేతికి చిక్కాయి?

తాలిబాన్లు, అప్గానిస్తాన్, అమెరికా, ఆయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తాలిబాన్లకు వ్యతిరేకంగా, అఫ్గాన్ భద్రతాబలగాలకు మద్దతుగా ఆయుధాలు చూపెడుతున్న అఫ్గాన్ మిలీషియా సభ్యులు
    • రచయిత, యాసిన్ రసూలీ, జియా షహర్యార్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

అఫ్గానిస్తాన్‌లో ఐదు లక్షల ఆయుధాలు కనిపించడం లేదు. వాటిని అమ్ముంటారని లేదా అక్రమ రవాణా చేసి ఉంటారని కొన్ని వర్గాలు బీబీసీకి తెలిపాయి.

ఈ ఆయుధాలలో కొన్ని అల్-ఖైదాతో సంబంధం ఉన్న తీవ్రవాద సంస్థల చేతుల్లోకి కూడా వెళ్లి ఉంటాయని ఐక్యరాజ్యసమితి భావిస్తోంది.

2021లో తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నప్పుడు, దాదాపు పది లక్షల సైనిక ఆయుధాలు, ఇతర సామగ్రి నిల్వలను గుర్తించారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అఫ్గన్ మాజీ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.

వీటిలో ఎక్కువ భాగం అమెరికా ఆర్థిక సాయంతో కొనుగోలు చేసినవి. ఇందులో అమెరికా తయారు చేసిన ఎం4, ఎం16 రైఫిల్స్‌తో సహా అఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన పాత ఆయుధాలూ ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అఫ్గానిస్తాన్, తాలిబాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2021లో అప్గానిస్తాన్‌ను తిరిగి నియంత్రణలోకి తెచ్చుకున్నప్పుడు తాలిబాన్లకు దాదాపు 10 లక్షల సైనిక ఆయుధాలు లభించాయి.

2021లో ఆయుధాలను వదిలి పారిపోయిన అఫ్గాన్ సైనికులు

2021లో తాలిబాన్లు దేశాన్ని తిరిగి క్రమంగా ఆక్రమించుకుంటున్న సమయంలో, అఫ్గాన్ సైనికుల్లో కొందరు లొంగిపోయారు. మరికొందరు ఆయుధాలు, వాహనాలతో పారిపోయారు.

అమెరికా సైన్యం కూడా తన సైనిక పరికరాలను కొన్నింటిని అక్కడే వదిలేసింది.

ఈ సైనిక ఆయుధాలు, పరికరాల్లో సగం కనిపించడం లేదని గతేడాది దోహాలో జరిగిన భద్రతా మండలి ఆంక్షల కమిటీ సమావేశంలో తాలిబాన్లు అంగీకరించారని కొన్ని వర్గాలు బీబీసీకి చెప్పాయి.

దాదాపు ఐదు లక్షల ఆయుధాలు కనిపించడం లేదని, పలు మార్గాల్లో ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నానని కమిటీలోని ఓ వ్యక్తి తెలిపారు.

తాలిబాన్లు, అప్గానిస్తాన్, అమెరికా, ఆయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అధికారం చేపట్టి మూడేళ్లయిన సందర్భంగా తాలిబాన్లు 2024 ఆగస్టులో కాబూల్‌లోని అమెరికా కార్యాలయం ముందు మిలటరీ పరేడ్ జరిపారు.

అల్-ఖైదాతో సంబంధం ఉన్న సంస్థలు అమెరికా ఆయుధాలను కొనుగోలు చేశాయా?

అఫ్గానిస్తాన్‌లోని ఆయుధాలను అల్-ఖైదాతో సంబంధం ఉన్న సంస్థలు బ్లాక్ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నాయని ఫిబ్రవరిలో విడుదల చేసిన నివేదికలో ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

ఇందులో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్, ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, ఈస్ట్ తుర్కెస్తాన్ ఇస్లామిక్ మూమెంట్, యెమెన్‌కు చెందిన అన్సరుల్లా మూమెంట్ తాలిబాన్ ఉన్నాయి.

''ఆయుధాలను మేం చాలా జాగ్రత్తగా భద్రపరుస్తాం'' అని తాలిబాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి హమీదుల్లా ఫిత్రాత్ బీబీసీకి చెప్పారు.

''ఆయుధాల అక్రమ రవాణా, అవి అదృశ్యమయ్యాయనే ప్రచారం నిజం కాదు. భారీ ఆయుధాలతో పాటు తేలికపాటివి కూడా పూర్తి సురక్షితంగా ఉన్నాయి'' అని ఆయన అన్నారు.

తాలిబాన్లు, అప్గానిస్తాన్, అమెరికా, ఆయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌లో ఓ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటున్న తాలిబాన్లు

వాట్సాప్‌లో ఆయుధాల అమ్మకం

''తాలిబాన్లు తాము స్వాధీనం చేసుకున్న అమెరికా ఆయుధాలలో 20 శాతం స్థానిక కమాండర్లకు ఇచ్చారు. ఈ కమాండర్లకు తమ ప్రాంతాల్లో అన్ని రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలున్నాయి. ఆయుధాల బ్లాక్ మార్కెటింగ్ జరగడానికి ఇదే కారణం'' అని 2023లో విడుదలైన ఐక్యరాజ్యసమితి నివేదిక తెలియజేస్తోంది.

"స్థానిక కమాండర్లు, ఫైటర్లకు అధికారాన్ని కట్టబెట్టడానికి పెద్ద ఎత్తున ఆయుధాలను బహుమతిగా ఇస్తున్నారు. ఈ ఆయుధాలు బ్లాక్ మార్కెట్‌లోకి చేరడానికి ఇదే ప్రధాన కారణం'' అని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఆయుధాల మార్కెట్ బహిరంగంగా సాగిందని, కానీ ఇప్పుడు అది వాట్సాప్ ద్వారా జరుగుతోందని కాందహార్‌లోని ఒక మాజీ జర్నలిస్ట్ బీబీసీకి చెప్పారు.

కొత్త, పాత అమెరికా ఆయుధాలు, సైనిక పరికరాలతో స్థానిక కమాండర్లు, సంపన్నులు వ్యాపారం చేస్తున్నారు. ఈ ఆయుధాలలో ఎక్కువ భాగం అఫ్గాన్ సైన్యం వదిలి వెళ్ళినవే ఉన్నాయి.

తాలిబాన్లు, అప్గానిస్తాన్, అమెరికా, ఆయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎన్ని ఆయుధాలు కనపించడం లేదనే దానిపై లెక్కల్లో చాలా తేడాలున్నాయని ఓ నివేదిక తెలిపింది.

సరైన డేటాను సేకరించలేకపోయిన ఐక్యరాజ్యసమితి

అమెరికాకు చెందిన స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ అఫ్గానిస్తాన్ రీకన్‌స్ట్రక్షన్ (సైగర్) దగ్గర నమోదయిన ఆయుధాల సంఖ్య మిగిలిన అన్ని వర్గాల నుంచి అందిన ఆయుధాల సమచారంతో పోలిస్తే తక్కువగా ఉందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది.

కచ్చితమైన డేటాను సేకరించలేకపోయామని ఐక్యరాజ్యసమితి కూడా తన 2022 నివేదికలో అంగీకరించింది.

కొన్నేళ్లగా అనేక అమెరికా విభాగాలు, సంస్థలు అఫ్గానిస్తాన్‌కు సైనిక పరికరాలను సరఫరా చేస్తున్నాయి.

"అఫ్గాన్‌లో వదిలేసిన ఆయుధాలు, నిధుల మొత్తంపై విదేశాంగ శాఖ పరిమితమైన, కచ్చితత్వంలేని సమాచారాన్ని అందించింది" అని సైగర్ అమెరికా విదేశాంగ శాఖను విమర్శించింది.

అయితే ఈ విమర్శలను అమెరికా విదేశాంగ శాఖ ఖండించింది.

తాలిబాన్లు, అప్గానిస్తాన్, అమెరికా, ఆయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఫ్గాన్‌లో 85బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు వదిలేసినట్టు డోనల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు.

అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా ఆయుధాలను వెనక్కి తెప్పిస్తాం – ట్రంప్

ఇది అమెరికాలో ఒక ప్రధాన రాజకీయ సమస్యగా మారిపోయింది. అఫ్గానిస్తాన్ నుంచి ఆయుధాలను వెనక్కి తెప్పిస్తామని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పదే పదే చెప్పారు.

85 బిలియన్ డాలర్ల విలువైన అధునాతన ఆయుధాలు అఫ్గానిస్తాన్‌లో మిగిలిపోయాయని ఆయన అన్నారు.

"ప్రపంచంలోనే అత్యధికంగా సైనిక పరికరాలు అమ్మే దేశాలలో అఫ్గానిస్తాన్ ఒకటి, ఎందుకో తెలుసా? మనం వదిలి వచ్చిన ఆయుధాలను వారు అమ్ముతున్నారు" అని ట్రంప్ తన మొదటి క్యాబినెట్ సమావేశంలో అన్నారు.

"నా దృష్టి దీనిపై ఉంది. డబ్బు చెల్లించాల్సి వచ్చినా మంచిదే, మా సైనిక పరికరాలను తిరిగి తెచ్చుకోవాలనుకుంటున్నాం'' అని ట్రంప్ చెప్పారు.

తాలిబాన్లు, అప్గానిస్తాన్, అమెరికా, ఆయుధాలు

ఫొటో సోర్స్, AAMIR QURESHI

ఫొటో క్యాప్షన్, గత ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను దేశాన్ని రక్షించడానికి ఉపయోగిస్తున్నామని తాలిబాన్లు చెబుతున్నారు.

ట్రంప్ చెప్పే సంఖ్యలపై అనుమానాలు

అఫ్గానిస్తాన్‌లో అమెరికా ఖర్చు చేసిన డబ్బులో శిక్షణ, జీతాలు వంటివి కూడా ఉండటంతో ట్రంప్ చెప్పే లెక్కలపై ఎప్పుడూ సందేహాలు వ్యక్తమవుతుంటాయి.

స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ గత ఏడాది ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న 25 ఎగుమతిదారుల జాబితాను రూపొందించింది .

ఈ జాబితాలో అఫ్గానిస్తాన్ లేదు.

''గత ప్రభుత్వం నుంచి మేం ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. వాటిని దేశ భద్రత, రక్షణ కోసం ఉపయోగిస్తాం'' అని అఫ్గాన్ టీవీతో మాట్లాడుతూ తాలిబాన్ ముఖ్య ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు. ట్రంప్ ఆరోపణలను తోసిపుచ్చారు.

తాలిబాన్లు, అప్గానిస్తాన్, అమెరికా, ఆయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాగ్రం ఎయిర్‌ఫీల్డ్ దగ్గర అమెరికా హెలికాప్టర్లు

అమెరికన్ ఆయుధాలతో తాలిబాన్ల ఆధిపత్యం

తమ విజయానికి చిహ్నంగా అమెరికా-నాటో స్థావరం బాగ్రామ్ ఎయిర్‌ఫీల్డ్‌తో పాటు అనేక చోట్ల అమెరికా ఆయుధాలను తాలిబాన్లు తరచుగా ప్రదర్శిస్తుంటారు.

2021లో అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత, వదిలిపెట్టిన సైనిక పరికరాలను పనికిరాకుండా చేశామని పెంటగాన్ చెప్పింది.

కానీ ఆ వదిలేసిన అమెరికా ఆయుధాలను ఉపయోగించి తాలిబాన్లు బలమైన సైన్యాన్ని నిర్మించుకున్నారు.

అమెరికా ఆయుధాల సహాయంతోనే తాలిబాన్లు తన శత్రు గ్రూపులైన నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రాంతీయ అనుబంధ సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్‌ల నుంచి ఖొరాసన్ ప్రావిన్స్ పై ఆధిపత్యాన్ని సాధించాయి.

తాలిబాన్లు, అప్గానిస్తాన్, అమెరికా, ఆయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాందహార్‌లో బ్లాక్‌హాక్ హెలికాప్టర్లున్నప్పటికీ వాటిని నడిపించే పైలట్లు లేరు.

అఫ్గానిస్తాన్ దగ్గర ఇప్పటికీ బ్లాక్ హాక్ హెలికాప్టర్లు

కాందహార్‌లోని వేర్‌హౌసుల్లో వందలాది హై మొబిలిటీ మల్టీపర్పస్ వీల్డ్ వెహికల్స్(హెచ్ఎంఎండబ్ల్యువీఎస్‌), మైన్-ప్రొటెక్టెడ్ వెహికల్స్ (ఎంఆర్ఏపీ), బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ఇప్పటికీ ఉన్నాయని అఫ్గాన్ ప్రభుత్వ మాజీ అధికారి బీబీసీతో చెప్పారు.

స్వాధీనం చేసుకున్న కొన్ని సైనిక పరికరాలను ప్రచార వీడియోల్లో తాలిబాన్లు చూపించారు. అయితే బ్లాక్ హాక్ హెలికాప్టర్లను ఉపయోగించడానికి వారికి శిక్షణ, సాంకేతిక నైపుణ్యం లేదు.

ఇదే కాకుండా, అమెరికా వదిలివెళ్లిన అనేక అత్యుత్తమ సైనిక పరికరాలు ఇప్పటికీ ఉపయోగంలో లేవు.

అయితే తేలిగ్గా ఆపరేట్ చేయగల హమ్‌వీలు వంటివాటిని, చిన్న ఆయుధాలను తాలిబాన్లు తమ కార్యకలాపాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)