ఔరంగజేబును ఖననం చేసిన చోట నిజాం నిర్మించిన రహస్య సమాధి ఎవరి కోసం, ఆయన సీక్రెట్ ప్లాన్ నెరవేరలేదా?

నిజాం, హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
    • రచయిత, ఇమ్రాన్ ముల్లా
    • హోదా, చరిత్రకారుడు, జర్నలిస్ట్, బీబీసీ కోసం

మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి మహారాష్ట్రలోని శంభాజీనగర్‌ జిల్లా (గతంలో ఔరంగాబాద్), ఖుల్తాబాద్‌లో ఉంది. ఈ ప్రాంతంలో ఇంకా ఎన్నో చారిత్రక ఆనవాళ్లున్నాయి. వాటిలో 20వ శతాబ్దంలో నిర్మించిన మరో సమాధి ఒకటి.

ఓట్టొమన్ సామ్రాజ్య చివరి ఖలీఫా (ప్రవక్త మొహమ్మద్ వారసుడిగా భావించే మతగురువు, ముస్లిం పాలకుడు) అయిన అబ్దుల్ మాజీద్ II సమాధి కోసం దీనిని నిర్మించారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగి ఉంటే, ఈ ప్రాంతం ఇస్లాం చరిత్రలో ఒక ముఖ్యమైన కేంద్రంగా మారి ఉండేది. కానీ, అలా జరగలేదు.

అంతకుముందు, మొగల్ చక్రవర్తి ఔరంగజేబు మరణానంతరం, ఆయన కోరిక మేరకు సమాధిని ఖుల్తాబాద్ ప్రాంతంలోనే నిర్మించారు.

ఓట్టొమన్ సామ్రాజ్యంలో ఖలీఫాగా నియమితులైన చివరి వ్యక్తి అబ్దుల్ మాజీద్. ఆయన ప్రవక్త మొహమ్మద్ రాజకీయ వారసత్వానికి చిహ్నంగా కొనసాగారు. ఆయన కవిగా, సంగీత ప్రియుడిగా ప్రసిద్ధి చెందారు.

దాదాపు 15 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు ఉన్న ఈ స్మారక చిహ్నం గుంతలో ఒక సమాధిని నిర్మించాల్సి ఉంది.

హైదరాబాద్ సంస్ధానం ద్వారా భారత్‌లో తన రాజవంశాన్ని కొనసాగించాలని మాజీద్ కోరుకున్నారు. కానీ, నిజాం సామ్రాజ్య పతనం కారణంగా ఇది సాధ్యం కాలేదు.

దీంతో, ఓట్టొమన్ టర్కిష్ శైలిలో నిర్మితమైన ఈ సమాధిలో ఖలీఫాను ఖననం చేశారు. అయితే, తన రాజ్యం భారత్‌లో విలీనం కావడంతో ఖలీఫా హోదా పొందేందుకు నిజాం చేసిన ప్రయత్నం సఫలం కాలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఓట్టొమన్ సామ్రాజ్య పతనం తర్వాత, 1922లో టర్కీ ప్రభుత్వం మాజీద్‌ను ఇస్తాంబుల్‌లో ఖలీఫాగా నియమించింది.

కానీ, 1924 మార్చిలో ఖలీఫాను రద్దు చేసి అబ్దుల్ మాజీద్ కుటుంబాన్ని రైలులో స్విట్జర్లాండ్ పంపారు.

ఆ సమయంలో హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ ఆయనకు సాయం చేశారు. అప్పట్లో, టైమ్ మేగజీన్‌లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిజాంను పేర్కొన్నారు.

ఖుల్తాబాద్, నిజాం, ఖలీఫా, అబ్దుల్ మాజీద్

ఫొటో సోర్స్, Imran Mulla

ఫొటో క్యాప్షన్, చివరి ఖలీఫా కోసం నిర్మించిన సమాధి

సాయానికి ముందుకొచ్చిన నిజాం

మొగల్ సామ్రాజ్య కాలం నాటినుంచే సాంస్కృతిక వారసత్వానికి హైదరాబాద్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడి రాజభవనాలు వైభవోపేతంగా ఉండేవి.

బ్రిటిష్ పాలన కాలంలో భారత్‌లోని అతిపెద్ద సంస్థానాల్లో (రాజులు, నవాబులు పాలిస్తున్న సంస్థానాలు) హైదరాబాద్ కూడా ఒకటి. నిజాంల పాలనలో ఉన్న ఈ సంస్థానంలో హిందూ జనాభా ఎక్కువ.

అందువల్ల, ముస్లిం సమాజంలో తన ప్రతిష్ట పెంచుకునేందుకు అబ్దుల్ మాజీద్‌కు సాయం చేసేందుకు నిజాం ముందుకొచ్చారు.

ఫ్రెంచ్ నగరమైన నీస్‌లోని ఓ బీచ్‌‌లో ఉన్న బంగ్లాలో అబ్దుల్ మాజీద్ నివాసం ఉండేందుకు 1924 అక్టోబర్‌లో నిజాం ఆర్థిక సాయం అందించారు.

ఆ తర్వాత, అక్కడి నుంచి అబ్దుల్ మాజీద్ తన ఖలీఫా హోదాను తిరిగి పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

అందుకోసం, 1931 మార్చిలో ఆయన మౌలానా షౌకత్ అలీతో చేతులు కలిపారు.

మౌలానా షౌకత్ అలీ భారత స్వాతంత్య్రోద్యమ నాయకుడు, మహాత్మ గాంధీకి సన్నిహితుడు.

నిజాం - అబ్దుల్ మాజీద్ చుట్టరికం

అబ్దుల్ మాజీద్ దృష్టంతా ఆ ఏడాది డిసెంబర్‌లో జెరూసలెంలో జరగాల్సిన ఇస్లామిక్ కాంగ్రెస్‌పై ఉంది.

ఖలీఫాకు మద్దతు సంపాదించేందుకు జెరూసలెం వెళ్లి ఈ సమావేశంలో ప్రసంగించాలని ప్లాన్ చేసుకున్నారు.

అయితే, బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను అడ్డుకుంది.

అబ్దుల్ మాజీద్ పాలస్తీనాలోకి ప్రవేశించకుండా బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ ప్రాంతం అప్పట్లో వారి ఆధీనంలో ఉంది.

అయితే, వారి వద్ద మరో ప్లాన్ కూడా ఉంది. 1931 అక్టోబర్‌లో అబ్దుల్ మాజీద్ కుమార్తె, ప్రిన్సెస్ దుర్ర్ -ఎ-షెహ్వర్‌కు.. నిజాం పెద్ద కుమారుడు, ప్రిన్స్ ఆజమ్‌తో నిఖా జరిగింది.

షౌకత్ అలీ, బ్రిటిష్ థింకర్ మార్మాడ్యూక్ పిక్‌‌థాల్ ఇందులో చొరవ తీసుకున్నారు.

నిజాం, అబ్దుల్ మాజీద్, ఖలీఫా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రిన్సెస్ దుర్ర్ -ఎ-షెహ్వర్‌

''ఈ యువజంట ఒక బిడ్డకు జన్మనిచ్చి.. ఆ బాలుడిని ఖలీఫాగా ప్రకటించనున్నారా?'' అని ప్రశ్నిస్తూ టైమ్ మ్యాగజీన్ వారి వివాహం తర్వాత కథనం ప్రచురించింది.

''ఈ అనుబంధం యావత్ ముస్లిం ప్రపంచంపై సానుకూల ప్రభావం చూపుతుంది'' అని అబ్దుల్ మాజీద్ అన్నారు.

ఈ వివాహ వేడుక నీస్‌లో జరిగింది. కొద్దిరోజుల తర్వాత, షౌకత్ అలీ ప్రకటన ఆధారంగా బొంబాయ్ నుంచి ప్రచురితమయ్యే ఉర్దూ వార్తాపత్రికలు ఖలీఫా హోదాను ప్రదానం చేసినట్లు రిపోర్ట్ చేశాయి.

కానీ, ఇది బ్రిటిష్ అధికారులను భయాందోళనకు గురిచేసింది.

అబ్దుల్ మాజీద్ హైదరాబాద్ పర్యటన రద్దు కోసం నిజాంపై ఒత్తిడి తెచ్చారు.

పత్రాల ప్రామాణికతపై సందేహాలు

కొందరు చెబుతున్న దాని ప్రకారం, ఈ వివాహం జరిగిన కొన్నిరోజుల తర్వాత యావత్ ప్రపంచ చరిత్రను మార్చేసే ఒక డాక్యుమెంట్‌(పత్రం)పై అబ్దుల్ మాజీద్ సంతకం చేశారు. దీనికి తగిన ఆధారాలున్న పత్రాలను సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి 2021లో హైదరాబాద్‌లోని తన ఇంట్లో గుర్తించారు.

వాటిని పరిశోధించేందుకు 2024 ఏప్రిల్‌లో ఆయన కుటుంబం నన్ను వారి ఇంటికి ఆహ్వానించింది.

2021 డిసెంబర్‌లో తమ తాతకు సంబంధించిన పత్రాల్లో ఈ ఆధారాలను గుర్తించినట్లు ఆ సమయంలో ఖాన్ నాతో చెప్పారు. ఖాన్ తాత సయ్యద్ మొహమ్మద్ అమ్రుద్దీన్ 7వ నిజాం వద్ద సైనిక అధికారిగా పనిచేశారు. ఆయన 99 ఏళ్ల వయసులో, 2012లో మరణించారు.

ఆ పత్రాల్లో, మందపాటి కాగితంపై నిజాంను ఉద్దేశించి అరబిక్‌లో రాసిన, అబ్దుల్ మాజీద్ సంతకం చేసిన లేఖ ఉంది. నీస్‌లో వివాహం జరిగిన వారం రోజుల తర్వాత ఈ లేఖ రాసినట్లుగా ఉంది.

నిజాం, హైదరాబాద్

ఫొటో సోర్స్, Imran Mulla

ఫొటో క్యాప్షన్, సమాధి లోపలి భాగం

ఈ లేఖ ద్వారా అబ్దుల్ మాజీద్ తన ఖలీఫా స్థానాన్ని నిజాంకు బదిలీ చేశారు. అయితే, యువరాజు ఆజమ్‌కు, యువరాణి దుర్ర్ -ఎ-షెహ్వర్‌కు కొడుకు పుట్టే వరకు ఈ ఒప్పందాన్ని రహస్యంగా ఉంచాలి.

అయితే, తుర్కియే రచయిత మురాత్ బర్దాచ్ సహా కొందరు స్కాలర్లు ఈ లేఖ నకిలీదని అన్నారు.

‘ఈ పత్రాలు కొన్నేళ్ల కిందట తయారుచేసినవి. కాబట్టి ఇవి నకిలీవి. వాటిపై ఉన్న సంతకాలు నిజమైనవి కావు’ అని మురాత్ బర్దాచ్ అన్నారు.

కానీ, ఈ పత్రాలు నిజమైనవేనని కొంతమంది విశ్వసిస్తున్నారు.

ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్వర్షన్ ఆఫ్ మాన్యుస్క్రిప్ట్‌లో పనిచేసే డాక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాద్రీ వీటిని పరిశీలించి.. ''ఈ పత్రాలపై ఉన్న అబ్దుల్ మాజీద్ సంతకం, ఇతర పత్రాలపై ఉన్న ఆయన సంతకంలానే ఉంది'' అని చెప్పారు.

''ఇందులో వాడిన సిరా కూడా యువరాజులు, పాలకుల కోసం తయారుచేసిన అదే ముదురు నల్లరంగు సిరా. అలాగే, ఆ కాగితం కూడా రాజుల కాలంలో వినియోగించినదే. ఇది సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం లేదు'' అని ఆయన అన్నారు.

''ఖలీఫాతో పాటు ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. వాటికి ఇతర పత్రాలతో కూడా సారూప్యతలు ఉన్నాయి'' అని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సాలార్‌జంగ్ మ్యూజియం మాజీ చైర్మన్ అహ్మద్ అలీ అన్నారు.

కానీ, దీనిపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. సయ్యద్ అహ్మద్ ఖాన్ స్పందిస్తూ, ''ఖలీఫా స్థానాన్ని పునరుద్ధరించాలనే మతపరమైన ఉద్దేశాలు కానీ, రాజకీయపరమైన ఉద్దేశాలు కానీ మాకు లేవు'' అని అన్నారు.

నిజాం, హైదరాబాద్

ఫొటో సోర్స్, James Wrathall

ఖుల్తాబాద్‌లో సమాధి చేయాలనుకున్నారు..

ఖలీఫా హోదాను హైదరాబాద్‌కు ఇవ్వాలని అబ్దుల్ మాజీద్ భావించారని చెప్పేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా నేను కొన్ని స్పష్టమైన ఆధారాలను సేకరించాను.

1933 అక్టోబర్ 6న దుర్-ఎ-షెహ్వర్ నీస్‌లో ‘ముకరం జా’కు జన్మనిచ్చారు. ఆయన అబ్దుల్ మాజీద్‌ - నిజాంల మనవడు. ముకరం జా తన వారసుడని ఆయన చిన్నతనంలోనే నిజాం తన సన్నిహితులతో చెప్పడం మొదలుపెట్టారు.

1944 ఆగస్ట్‌లో ఖలీఫా అబ్దుల్ మాజీద్ చనిపోయారు. 1944 నవంబర్‌లో సర్ ఆర్థర్ లోథియన్ హైదరాబాద్‌లోని తన ప్రతినిధికి ఒక సీక్రెట్ లెటర్ రాశారు. ''ప్రధాన మంత్రి అబ్దుల్ మాజీద్ వీలునామా చూశారు. ఆయన తనను ఇండియాలో ఖననం చేయాలని, తన మనవడు ఖలీఫా అవ్వాలని కోరుకున్నారు'' అని ఆ లేఖలో రాశారు.

1946లో ఇద్దరు బ్రిటిష్ అధికారుల మధ్య నడిచిన రహస్య లేఖలు కూడా ముకరం జాను, అబ్దుల్ మాజీద్ తన వారసుడిగా ప్రకటించినట్లు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని ఆయన కోరుకున్నారు.

అందువల్లే, ఖుల్తాబాద్‌లో సమాధి నిర్మించాలని నిజాం అదేరోజున ఆదేశించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (గతంలో ఔరంగాబాద్)లోని ఈ ప్రాంతం అప్పట్లో నిజాం పరిధిలోనే ఉంది. ఇది హైదరాబాద్ మొదటి నిజాంను ఖననం చేసిన ప్రదేశానికి సమీపంలోనే ఉంటుంది.

బ్రిటిష్ వారు భారత్‌ను విడిచివెళ్లిన తర్వాత, 1948 సెప్టెంబర్‌లో ఈ సమాధి నిర్మాణం పూర్తయింది. కానీ, అదే నెలలో భారత సైన్యం నిజాం సంస్థానాన్ని దేశంలో విలీనం చేయడంతో నిజాం పదవీచ్యుతడయ్యారు.

దీంతో, అబ్దుల్ మాజీద్ మృతదేహాన్ని భారత్‌లో ఖననం చేయాలనే ప్రణాళిక నెరవేరలేదు.

ఆ తర్వాత ఆయన మరణించిన 10 ఏళ్ల తర్వాత 1954లో.. అబ్దుల్ మాజీద్‌ను సౌదీ అరేబియాలోని మదీనాలో ఖననం చేశారు.

నిజాం, హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముకరం జా

ముకరం జా మరణం

తన తాత మరణం తర్వాత 1967లో ముకరం జా, పేరుకి ఎనిమిదో నిజాం అయ్యారు. అయితే, ఆయనకు నిజమైన అధికారం లేదు. ఖలీఫా స్థానాన్ని భర్తీ చేసే పరిస్థితుల్లో ఆయన లేరు.

భారత ప్రభుత్వం 1971లో ఆయన సంస్థానాన్ని రద్దు చేసింది. పన్నులు, భూ చట్టాల ప్రకారం, ఆస్తిని జప్తు చేసింది. ఆ తర్వాత జా 1973లో పశ్చిమ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. అక్కడ 2 లక్షల హెక్టార్ల గొర్రెల పెంపక కేంద్రాన్ని కొనుగోలు చేశారు.

ఆ తర్వాత, ఆయన తుర్కియేకి వెళ్లారు. 2023 జనవరి 14న ఇస్తాంబుల్‌లో మరణించారు.

ఆయన పెద్ద కుమారుడు అజ్మత్ జా తొమ్మిదో నిజాం అయ్యారు. అజ్మత్ జా ఒక బ్రిటిష్ ఫిల్మ్‌మేకర్, ఆయనకు హైదరాబాద్‌లో అనేక ఆస్తులు ఉన్నాయి.

అబ్దుల్ మాజీద్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుటుంబాల మధ్య సంబంధాన్ని ప్రపంచంలోని రెండు పెద్ద ముస్లిం కుటుంబాల మధ్య సంబంధంగా చూస్తారు.

బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత హైదరాబాద్ కూడా స్వతంత్ర దేశంగా మారినట్లయితే, యువరాజు ముకరం జా.. నిజాం అయిన తర్వాత ఖలీఫా స్థానాన్ని కూడా పొందేవారు.

కానీ, అలా జరగలేదు. చరిత్రకారుడు జాన్ జుబార్జి 2005లో తుర్కియేలో ముకరం జాను ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో, ముకరం జా ఈ చరిత్ర గురించి ఏమనుకుంటున్నారని నేను జాన్‌‌ని అడిగాను.

ఖలీఫా అబ్దుల్ మాజీద్ వీలునామాకు సంబంధించిన ఒక కీలకమైన లేఖ జాన్‌కు అందింది.

''నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక తెలివైన వ్యూహకర్త. తన మనవడిని ఖలీఫా చేయాలనే ప్రణాళిక ఆయనకు ఉంది'' అని జాన్ చెప్పారు.

2005లో ముకరం జాను జాన్ కలిసినప్పుడు, ఆయన వ్యక్తిత్వం వినయంగా, కాస్త ఉదారంగా, అదే సమయంలో కాస్త మాయగా కూడా ఉన్నట్లు గుర్తించారు.

''జీవితంలో ఎదురైన పరిస్థితులకు వారు బాధపడ్డారు.''

చివరకు, ఈ చివరి ఖలీఫా మనవడిని హైదరాబాద్‌లోని మక్కా మసీదులో ఖననం చేశారు.

(చరిత్రకారుడు ఇమ్రాన్ ముల్లా 'ది ఇండియన్ కాలిఫేట్: ఎక్సైల్డ్ ఓట్టొమన్స్ అండ్ బిలియనీర్ ప్రిన్స్' పుస్తక రచయిత కూడా.)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)