మూత్రంతో వ్యవసాయం

ఫొటో సోర్స్, Rich Earth Institute
- రచయిత, బెక్కా వార్నర్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
ప్రాచీన రోమ్, చైనాలో మూత్రాన్ని ఎరువుగా వాడేవారు. ప్రస్తుతం వెర్మాంట్‌లోని రైతులు మరింత సుస్థిరమైన విధానంలో పంటలను పండించడానికి ఇలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారు.
వెస్టీ విలియమ్స్ టాయిలెట్‌కి వెళ్లినప్పుడు తన మూత్రం ఏమాత్రం వృధా కావడం లేదని సంతోషిస్తుంటారు.
గత 12 ఏళ్లుగా, అమెరికాలోని గ్రామీణ వెర్మాంట్‌లో వెస్టీ విల్లియమ్స్, ఆమె పక్కింటివారు యూరిన్‌ను సేకరించి రైతుల పంటలకు ఎరువుగా అందిస్తున్నారు.
వెర్మాంట్‌లోని లాభాపేక్ష లేని సంస్థ రిచ్ ఎర్త్ ఇనిస్టిట్యూట్ (ఆర్ఈఐ) నిర్వహించే యూరిన్ న్యూట్రియంట్ రీక్లమేషన్ ప్రొగ్రామ్ (యూఎన్ఆర్‌పీ)లో విలియమ్స్ కూడా భాగమవుతున్నారు.
ఆమె, వింధామ్ కౌంటీలో తన చుట్టుపక్కల ఇళ్లలో ఉండేవారు 250 మంది 12 వేల గ్యాలన్ల (సుమారు 45,400 లీటర్ల) యూరిన్‌ను ఏటా ఈ ప్రోగ్రామ్‌కు డొనేట్ చేస్తున్నారు. ఆ యూరిన్‌ను సంస్థ రీసైకిల్ చేస్తుంది.
వింధామ్ కౌంటీలో ఉన్నవారు డొనేట్ చేసిన మూత్రాన్ని లారీల్లో తీసుకెళ్లి ఒక పెద్ద ట్యాంక్‌లో 90 సెకన్ల పాటు 80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి పాశ్చరైజేషన్ చేస్తారు.
పాశ్చరైజేషన్ ట్యాంకులో నిల్వ చేసిన ఈ మూత్రాన్ని స్థానిక పొలాల్లో పిచికారీ చేసేందుకు ఉపయోగిస్తారు.

ప్రాచీన చైనా, రోమ్‌లలో వ్యవసాయంలో మూత్రాన్ని వాడినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. వ్యవసాయంలో మూత్రం వినియోగించడం వల్ల బచ్చలికూర లాంటి పంటల దిగుబడి రెండింతలకు పైగా పెరుగుతుందని.. సారవంతం కాని భూముల్లో కూడా దిగుబడులను మెరుగుపరుస్తుందని ప్రస్తుతం శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
యూరిన్‌లో ఉండే నైట్రోజెన్, ఫాస్ఫరస్ వల్ల అది ఎరువుగా ఉపయోగపడుతుంది. చాలా సంప్రదాయ పంటలలో వాడే సింథటిక్ ఎరువులలో ఇదే రకమైన పోషకాలను వాడుతున్నారు. కానీ, ఈ సింథటిక్ ఎరువుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది.
నైట్రోజన్‌ను శిలాజ ఇంధనాల ఇంటెన్సివ్ హేబర్ బాష్ ప్రక్రియలో ఉత్పత్తి చేస్తున్నారు. ఫాస్ఫరస్ మైనింగ్ వల్ల హానికరమైన వ్యర్థాలు వెల్లడవుతాయి.
కానీ, మూత్రం విరివిగా అందుబాటులో ఉంటుందని విలియమ్స్ చెప్పారు.
ప్రామాణిక సింథటిక్ ఎరువు కాకుండా యూరిన్‌ను ఉపయోగించడం వల్ల గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించవచ్చని ఆర్ఈఐ బృందంతో పాటు మిషిగన్ యూనివర్సిటీలోని సివిల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ నాన్సీ లవ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Rich Earth Institute
యూరిన్‌లోని పోషకాలు సాధారణంగా నీళ్లలో కలిసిపోతాయి. యూరిన్‌లో ఉన్న నైట్రోజెన్, ఫాస్ఫరస్‌ను పూర్తిగా మూత్రల వ్యర్థాల నుంచి తొలగించలేం. ఈ పోషకాలు నదుల్లోకి, చెరువుల్లోకి వెళ్లినప్పుడు, వాటిని ఆల్గేలు తింటాయి. దీనివల్ల నీళ్లల్లో హానికరమైన ఆల్గే పెరిగి సముద్ర జీవ వైవిధ్యానికి అసమతుల్యత ఏర్పడుతుంది.
''మన శరీరాలు ఎన్నో పోషకాలను సృష్టిస్తాయి. ఈ పోషకాలు వ్యర్థంగా పోవడమే కాకుండా, ఇవి ఎన్నో సమస్యలు సృష్టించి, హానిని కలిగిస్తున్నాయి'' అని ఆర్ఈఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జామినా షుపాక్ చెప్పారు. ఈ పోషకాలు ఆల్గేకు మాత్రమే కాదు, పంటలకు కూడా ఆహారమే అన్నారు.
''నైట్రోజన్ పంటలు ఏపుగా పెరిగేందుకు సాయపడుతుంది. ఒకవేళ ఇది నీళ్లల్లో ఉంటే, అక్కడ ఆల్గే పెరుగుతుంది. ఒకవేళ నేలపై ఉంటే అక్కడ పంటలు పెరుగుతాయి'' అని షుపాక్ వివరించారు.
నీటిలో నుంచి పోషకాలు పుష్కలంగా ఉన్న మూత్రాన్ని బయటకు తీసుకొచ్చి, హానికరమైన ఆల్గే పెరగకుండా ఆపాలి. రైతులు పంటలు పండించడానికి ఉపయోగించాలని అన్నారు. నీటిలోకి ప్రవేశించే ఈ పోషకాలను పీసైక్లింగ్ తగ్గించనుందని షుపాక్ చెప్పారు.

ఫొటో సోర్స్, Rich Earth Institute
వెర్మాంట్‌లోని యూఎన్ఆర్‌పీ అమెరికాలో ప్రముఖ పీసైక్లింగ్ సంస్థ. ఇతర దేశాలలో కూడా ఇలాంటివి ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉన్నారు.
పారిస్‌లో సీన్ నదిని కాపాడేందుకు స్వచ్ఛంద కార్యకర్తలు యూరిన్‌ను సేకరిస్తున్నారు.
గోట్లాండ్ ఐల్యాండ్ చుట్టూ పెరుగుతున్న ఆల్గల్ బ్లూమ్స్ వల్ల ఏర్పడే ప్రమాదాన్ని స్వీడిష్ ఎంట్రప్రెన్యూర్లు గుర్తించారు. దీంతో, వారు యూరిన్‌ను సేకరించి, దాన్ని ఎరువుగా మార్చేందుకు ముందుకు వస్తున్నారు.
దక్షిణాఫ్రికా, నేపాల్, నైజర్ రిపబ్లిక్‌లలో కూడా పీసైక్లింగ్ పైలట్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి.
వెర్మాంట్‌లో పంటల ఎరువుగా వాడుతున్న యూరిన్ డిమాండ్ సరఫరాను మించిపోతుందని, సేకరణ కాస్త కష్టంగా ఉందని షుపాక్ చెప్పారు.
రిచ్ ఎర్త్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్ఈఐ) తొలుత తమను సంప్రదించినప్పుడు, యూరిన్ ట్రీట్‌మెంట్ లేదా రీసైక్లింగ్‌కు ఎలాంటి 'రెగ్యులేటరీ బాక్స్' లేదని స్పష్టమైందని వెర్మాంట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ కన్వర్జేషన్ (వీటీడీఈసీ) ప్రొగ్రామ్ మేనేజర్ ఈమోన్ టూహిగ్ చెప్పారు.
వెర్మాంట్‌లో ఆర్ఈఐ కచ్చితంగా ఒక మార్గాన్ని అందిస్తుందని, ఆచరణీయమైన, నియంత్రణ విధానాన్ని తాము కనుగొనగలిగామని అనుకుంటున్నట్లు తెలిపారు. వెర్మాంట్‌లోని రెగ్యులేటర్లతో ఆర్ఈఐ మంచి సంబంధాలను కలిగి ఉందని షుపాక్ చెప్పారు. ఇది ఆపరేట్ అయ్యేందుకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయన్నారు.
ప్రస్తుతం ఈ సంస్థ మసాచుసెట్స్, మిషిగన్‌లోని భాగస్వామ్య సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ‘దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. కానీ, కొత్త పర్యావరణ నియంత్రణ అనుమతులు రావడం అంత తేలిక కాదు’ అని షుపాక్ చెప్పారు. దీనిలో కూడా పరిమితులు ఉన్నాయన్నారు.

ఫొటో సోర్స్, Rich Earth Institute
మరోవైపు యూరిన్‌లో ఫార్మాస్యూటికల్ కంటెంట్‌పై కొందరు మాట్లాడుతున్నారు. ఇదే అతిపెద్ద ప్రశ్న అని షుపాక్ అన్నారు.
యూరిన్ ఎరువు ద్వారా పెరిగిన కూరగాయాల్లో ఎంత మొత్తంలో కాఫైన్, పెయిన్‌కిల్లర్ ఎసిటామినోఫెన్ లాంటివి ఉంటున్నాయని కనుగొనడంపై ఆర్ఈఎల్ పరిశోధన చేస్తుంది. ఈ పరిశోధనల తుది ఫలితాలు రావాల్సి ఉంది.
అయితే, యూరిన్‌తో కలిసి ఎరువులు వాడిన కూరగాయల్లో ఫార్మాస్యూటికల్స్ మొత్తం చాలా తక్కువగా ఉంటుందని ప్రాథమిక విచారణలో తెలిసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














