కుంభమేళాతో కోనసీమలో ఆ రైతులు ఎందుకు ఆనందంగా ఉన్నారు? ఆ తర్వాత పరిస్థితిపై ఆందోళన ఏంటి?

- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
కొన్నేళ్లుగా సరైన గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి ఖర్చులు రాక నష్టాలలోనే సాగు చేస్తోన్న కోనసీమ కొబ్బరి రైతులలో ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళా ఉత్సాహం నింపింది.
కోనసీమ నుంచి భారీ సంఖ్యలో కొబ్బరికాయలు కుంభమేళాకు ఎగుమతి కావడంతో ఇక్కడి రైతులు చాలాకాలం తర్వాత లాభాలు కళ్లజూశారు.
ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో ''కొబ్బరి చెట్టు కొడుకు కన్నా మిన్న'' అనే సామెత బాగా వినపడేదని పెద్దలు చెబుతుంటారు. కొడుకులు చూసినా చూడకపోయినా ఇంటి దగ్గర పది కొబ్బరి చెట్లు ఉంటే బతికేయవచ్చు అనే నమ్మకంతో ఇక్కడి ప్రజలు ఉండేవారు.
అంతటి వైభవం ఉన్న కొబ్బరి పంటను నమ్ముకున్న రైతులు కొన్నాళ్లుగా నష్టాల్లో ఉన్నారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు.
సరిగ్గా ఈ సమయంలోనే గతనెలలో ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా మొదలైంది.
కుంభమేళాలో జరిగే పూజలు, ఇతరత్రా వైదిక కార్యకలాపాల కోసం కోనసీమ జిల్లా నుంచి పెద్దసంఖ్యలో కొబ్బరికాయలు ఎగుమతి కావడం, ధర కూడా 14 నుంచి 16 రూపాయల వరకు చేరడంతో రైతులు, వ్యాపారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
ప్రయాగ్‌రాజ్‌కు పోటెత్తిన కొబ్బరికాయలు
''ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతున్న కుంభమేళా.. కోనసీమ కొబ్బరి రైతులకు వరం అనే చెప్పాలి. కుంభమేళాకు లక్షల సంఖ్యలో కొబ్బరికాయలు ఎగుమతి కావడం, ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడటంతో కొబ్బరి ధరలు అమాంతం పెరగడం ఆనందదాయకం. చాలాకాలం తర్వాత కొబ్బరి ధరలు పెరగడం వల్ల రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నారు'' అని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన కొబ్బరి రైతు, కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ సీఈవో అడ్డాల గోపాలకృష్ణ బీబీసీకి తెలిపారు.
మరో రైతు, అమలాపురానికే చెందిన అబ్బిరెడ్డి రంగబాబు మాట్లాడుతూ ''మా కొబ్బరి కాయ కుంభమేళాకు వెళ్లింది కాబట్టే ఎంతో కొంత గిట్టుబాటు ధర వచ్చింది. ఐదారేళ్ల కిందట ఐదారు రూపాయలే ఉండగా, మొన్నటివరకు పది రూపాయలు రావడం గగనంగా మారింది. ఇప్పుడు ఏకంగా 14 రూపాయలకు కొంటున్నారు'' అని అన్నారు.

ఇక మరో రైతు వంకాయల స్వామి ప్రకాశ్ మాట్లాడుతూ.. 'నా పొలంలోని కాయలు కుంభమేళాకు వెళ్లడంతో వెయ్యి కాయల ధర రూ. 16 వేల నుంచి 16,500 వరకు వెళ్లింది' అని సంతోషాన్ని వెలిబుచ్చారు.
కాగా, కుంభమేళా తర్వాత పరిస్థితి ఏమిటనే ఆందోళన కోనసీమ కొబ్బరి రైతుల్లో కనిపిస్తోంది.
''కుంభమేళా అయిపోతోందన్న భయం ఇక్కడి రైతుల్లో కనిపిస్తోంది. ధర మళ్లీ నెమ్మదిగా పాత స్థితికి చేరుకుంటుందన్న ఆందోళన రైతుల్లోఉంది'' అని గోపాలకృష్ణ అన్నారు.

కొబ్బరి రైతుల సమస్యేంటి?
ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశం మూడో స్థానంలో ఉంది. ఉత్పత్తిలో దేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక తరువాత ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది.
రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల ఎకరాల వరకు కొబ్బరి విస్తీర్ణం ఉండగా, ఒక్క డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే లక్షా 5వేల ఎకరాల్లో కొబ్బరి పంట సాగవుతోంది. 2000 సంవత్సరం వరకు కొబ్బరి సాగు బాగానే ఉండేది.
అయితే ఆ తర్వాతి నుంచి ఎర్ర నల్లి, తెల్ల దోమ వంటి తెగుళ్లు ఆశించడంతో దిగుబడి బాగా తగ్గింది.
మరోవైపు మార్కెట్లో ధరలు హెచ్చుతగ్గులుగా ఉండటం వల్ల కూడా నష్టపోతున్నామని కొబ్బరి రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

అమెరికా నుంచి వచ్చిన తెల్లదోమతో..
''కోనసీమలో ఎకరం కొబ్బరి తోట ఉంటే ప్రతి నెలా వెయ్యి కొబ్బరి కాయలు దించే వారు. కానీ 2000 సంవత్సరంలో అమెరికా నుంచి వచ్చిన తెల్లదోమ వల్ల పంట తీవ్రంగా దెబ్బతిని కాయసైజు, నాణ్యత తగ్గింది. దేశంలో ముందుగా పొలాచ్చిలో కనిపించిన ఆ తెల్ల దోమ ఆ తర్వాత అన్ని ప్రాంతాల్లోని కొబ్బరి పంటలనూ నాశనం చేసింది. అప్పటి నుంచి దిగుబడులు తగ్గాయి. గతంలో ప్రతి నెలా లేదంటే 45 రోజులకు పంట వచ్చేది. ఇప్పుడు మూడు, నాలుగు నెలలకు పంట వస్తోంది'' అని రైతులు గోపాలకృష్ణ, అబ్బిరెడ్డి రంగబాబు చెప్పారు.
కాయ నాణ్యత కూడా..
''తెల్లదోమ ప్రభావంతో పాటు నల్లతెగులు వల్ల కొబ్బరిపై మచ్చలు ఏర్పడి.. కాయ సైజు తగ్గిపోతోంది. తద్వారా దిగుబడి తగ్గుతోంది. కాయ బాగుంటే ఇచ్చే రేటుకు, మచ్చ ఉన్న కాయకి ఇచ్చే రేటుకు తేడా సగానికి సగం ఉంటుంది. ఒకప్పుడు మొత్తం ఆకు పచ్చగా కనిపించే కొబ్బరితోటలో ఇప్పుడు మచ్చకాయలే ఎక్కువ కనిపిస్తున్నాయి'' అని రైతు వంకాయల స్వామి ప్రకాశ్ బీబీసీకి తెలిపారు.
పంటకు ఆశించే తెగుళ్లకు రైతులందరూ మందులు స్ప్రే చేస్తేనే ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు.
పక్క పొలంలోని రైతు చేయకపోయినా.. ఆ పంట తెగులు పక్కనే ఉన్న మందు కొట్టిన పంటను కూడా నాశనం చేస్తోందని, పంట ఎదగనివ్వడం లేదని పేరూరుకు చెందిన రైతు మోటూరు సూరిబాబు అన్నారు.

'ప్రభుత్వాలు ఆదుకోవాలి'
''కోనసీమలో కొబ్బరి ఉప ఉత్పత్తుల తయారీ లేకపోవడం వల్ల కేవలం కొబ్బరికాయలు ఎగుమతిపైనే రైతులు ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ముందుగా కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తేనే సీజన్‌లతో సంబంధం లేకుండా కొబ్బరి రైతు స్థిరమైన లాభాలను పొందుతారు'' అని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె. శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు.
అలాగే కేంద్రప్రభుత్వం కొబ్బరికాయలకు గిట్టుబాటు ధరను పెంచాలని ఆయన కోరారు.
''కేంద్రం ఈ ఏడాది బంతి కొబ్బరికి రూ. 12,100, మిల్లింగ్ కొబ్బరికి రూ.11, 528 గిట్టుబాటు ధరగా ప్రకటించింది. కానీ రైతుకు పెరిగిన పెట్టుబడి ధరలు, దిగుబడి స్థాయిలు చూస్తే ఆ ధరలు ఏమాత్రం సరిపోవు'' అని శ్రీనివాసరావు చెప్పారు.

క్వింటా కొబ్బరికి కనీసం రూ. 15 వేలు ఉండాలని రైతులు అడుగుతున్నారని, ఆ మేరకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని శ్రీనివాసరావు కోరారు.
నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) లేదా ఆయిల్‌ఫెడ్ (ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి కొబ్బరి కొనుగోలు చేయాలని శ్రీనివాసరావు కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటునిస్తేనే కొబ్బరి రైతు సాగు చేసే పరిస్థితి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

అధికారులు ఏమంటున్నారు?
కొబ్బరి రైతులకు లాభాలు ఎలా తీసుకురావాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వపరంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి బీవీ రమణ బీబీసీకి తెలిపారు.
''ముందుగా ప్రభుత్వపరంగా కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. కోల్డ్ స్టోరేజీల మాదిరిగా రైతులు కొబ్బరి పంట రాగానే అవసరమైతే మూడు, నాలుగు నెలలు దాచుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్మకునే వీలు కల్పిస్తాం'' అని ఆయన చెప్పారు.
అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేసి కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల తయారీ, అమ్మకాన్ని ప్రోత్సహిస్తామని రమణ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














