ఇష్టం లేని పేరు మార్చుకోవడం ఎలా, చట్టపరమైన ప్రక్రియలు ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కొటేరు శ్రావణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
చాలామంది రకరకాల కారణాల రీత్యా తమ పేరు మార్చుకుంటూ ఉంటారు. కొందరికి చిన్నప్పుడు పెట్టిన పేరు నచ్చక, మరికొందరికి సర్టిఫికెట్లలో పేరు, తమ పేరు వేరు వేరుగా ఉన్నందున, ఇంకొందరు జాతకం ప్రకారం, మరికొందరు సంఖ్యాశాస్త్రం మేరకు, కొందరు పెళ్ళయ్యాక, విడాకుల తరువాత, మతం మార్చుకున్నప్పుడు, తమ పేర్లపై సమాజంలో ఉన్న వ్యతిరేకత కారణంగా, ఇలా అనేక కారణాలతో పలువురు తమ పేర్లను మార్చుకుంటూ ఉంటారు.
అయితే, పేరు మార్చుకోవడం అనేది ప్రాథమిక హక్కే అయినప్పటికీ, అది పరిమితులతో కూడిందని, దీనికోసం కచ్చితంగా చట్టపరమైన నిబంధనలకు కట్టుబడి ఉండాలని అలహాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని చీఫ్ జస్టిస్ అరుణ్ బన్సాలి, జస్టిస్ క్షితిజ్ శైలేంద్ర స్పష్టం చేసినట్లు లా ట్రెండ్ పేర్కొంది. దీనిలో సివిల్ కోర్టు డిక్లరేషన్ తప్పనిసరిగా కావాలని తెలిపింది.
తన పేరును షానవాజ్ నుంచి మొహమ్మద్ సమీర్‌రావుగా మార్చాలని కోరుతూ ఆ వ్యక్తి పిటిషన్ వేశారు.
అయితే, అసలు చట్టబద్ధంగా పేరు మార్చుకోవాలంటే ఎలా..? ఏయే న్యాయ ప్రక్రియలను అనుసరించాలి..? రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కింద పేరు మార్చుకునే వీలుంటుంది..? పేరు మార్చుకున్న తర్వాత ఎక్కడెక్కడ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది..?


ఫొటో సోర్స్, Getty Images
పేరు మార్చుకోవడం ఎలా?
భారత్‌లో పేరు మార్చుకోవడానికి కచ్చితంగా న్యాయ, అధికారిక ప్రక్రియలను అనుసరించాలి.
ముందుగా పేరు మార్చుకోవాలనుకోవడానికి కారణమేంటో చెప్పాల్సి ఉంటుంది.
ప్రస్తుత పేరు, కొత్త పేరు, పేరు ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారు, ఇతర వివరాలు తెలుపుతూ న్యాయవాది సాయంతో స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్‌ను సిద్ధం చేసుకున్న తర్వాత, ఆ అఫిడవిట్‌ను నోటరీ చేయించుకోవాలి. ఇద్దరు సాక్షులతో సంతకం చేయించాలి. ఆ డాక్యుమెంట్‌పై అధికారిక స్టాంప్ ఉండాలని ఇండియా లా ఆఫీసెస్ డాట్ కామ్ పేర్కొంది.
ప్రస్తుత పేరు, కొత్త పేరు, పేరు మార్పుకు గల కారణాలు తెలుపుతూ వార్తా పత్రికలో దరఖాస్తుదారు ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది.
ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్లు, న్యూస్‌పేపర్ క్లిపింగ్స్, అఫిడవిట్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లికేషన్‌కు పంపాలి. పేరు మార్చుకునేందుకు అవసరమయ్యే లీగల్ వెరిఫికేషన్‌కు గెజిట్ నోటిఫికేషన్ అదనపు లేయర్ లాంటిది.
ఒకవేళ విదేశాల్లో నివసించే భారతీయులు పేరు మార్చుకోవాలంటే, సంబంధిత భారత రాయబార కార్యాలయం, ఇండియన్ హై కమిషన్ ధ్రువీకరించిన డీడ్‌ను పబ్లికేషన్ డిపార్ట్‌మెంట్‌కు పంపాలి.
అలాగే, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లికేషన్ నిర్దేశించిన ప్రింటింగ్ వివరాలను కూడా ఒక తెల్లని కాగితంపై టైప్ చేసి, పాత పేరుతో సంతకం చేసి, రెండు సాక్షి సంతకాలను పెట్టించి, సాఫ్ట్ కాపీతో పాటు పంపించాలి.
పేరు మార్పుకు ప్రింటింగ్ చార్జీలు కూడా చెల్లించాలి. మేజర్ లేదా ప్రభుత్వ ఉద్యోగి అయితే పేరు మార్పు కోసం రూ.1100 చెల్లించాలి. విదేశాల్లో నివసించే భారతీయులు అయితే రూ.3,500 చెల్లించాలి.
దరఖాస్తుదారు పెట్టుకున్న అప్లికేషన్‌తో అధికారి సంతృప్తి చెందితే, అధికారిక రికార్డులలో కొత్త పేరుతో ఆ వ్యక్తి పేరును రికార్డు చేస్తారు. గెజిట్ నోటిఫికేషన్ సాయంతో ఆ వ్యక్తి తన కొత్త పేరును ప్రభుత్వం జారీ చేసిన అధికారిక డాక్యుమెంట్లలో అప్‌డేట్ చేసుకోవచ్చు.
అయితే, పేరు మార్చుకోవాలనుకునే వ్యక్తి మైనర్ అయితే, తల్లిదండ్రులు అఫిడవిట్ చేయించి, ఈ న్యాయ ప్రక్రియను పూర్తి చేయాలి.

ఫొటో సోర్స్, Getty Images
పేరు మార్పుకు కావాల్సిన పత్రాలు
రెండు ఇటీవల పాస్‌పోర్టు సైజు ఫొటోగ్రాఫ్‌లు
గెజిటెడ్ ఆఫీసర్ జారీ చేసిన పౌరసత్వ పత్రం
పేరు ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారో తెలుపుతూ అఫిడవిట్
గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకున్న సర్టిఫికేట్లు
గత ఐదేళ్లలో తనపై ఎలాంటి కేసులు లేవని తెలుపుతూ ఇచ్చే పోలీసు సర్టిఫికేట్
ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ వంటివి సమర్పించాలి.
పేరు మార్పును ఎక్కడెక్కడ అప్‌డేట్ చేసుకోవాలి?
ఒకసారి పేరు మార్చుకున్న తర్వాత వెంటనే పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంకు పాస్‌బుక్ వంటి కీలక డాక్యుమెంట్లలో కొత్త పేరును అప్‌డేట్ చేసుకోవాలి.
ఈ అన్ని డాక్యుమెంట్లలో పేరును అప్‌డేట్ చేసుకోవడం మీ వ్యక్తిగత, వృత్తి జీవితానికి అత్యంత కీలకం.

ఫొటో సోర్స్, M. Srilakshmi
1. ఎలాంటి ఇబ్బందులు వస్తాయి?
పేరు మార్చుకునే సమయంలో వచ్చే ఇబ్బందులు, ఆ తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లలో ఎలా మార్చుకోవచ్చు? వంటి విషయాలను విశాఖపట్నానికి చెందిన న్యాయవాది ఎం.శ్రీలక్ష్మి వివరించారు.
1. పేరు మార్పు ప్రక్రియలో ఎలాంటి నిబంధనలు, ఇబ్బందులు ఎదురవుతాయి?
పేరు మార్చుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా, కొత్త పేరును అధికారికంగా గుర్తించేందుకు అవసరమైన ధృవపత్రాలు సేకరించాలి. గెజిట్ నోటిఫికేషన్, ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా, విద్యా ధృవ పత్రాలు, ఆస్తి పత్రాలు మొదలైన వాటిని నవీకరించాలి.
కొన్ని సందర్భాల్లో, పేరు మార్పు ప్రక్రియ సమయంలో అనుమానాస్పద లావాదేవీలతో సంబంధముందని భావించి పోలీస్ వెరిఫికేషన్ కూడా కావొచ్చు.
పాత పేరుతో ఉన్న ఒప్పందాలు, బ్యాంక్ రుణాలు, లీగల్ కేసులు ఉంటే, వాటిని అప్‌డేట్ చేయడం అవసరం.
ఇతర డాక్యుమెంట్స్ మారడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. నోటరీ అఫిడవిట్, వార్తాపత్రికలో ప్రకటన వంటి నిబంధనలు పాటించాలి.
కొన్ని ప్రభుత్వ విభాగాలు పేరుమార్పును వెంటనే అంగీకరించకపోవచ్చు, ఎటువంటి సందేహాలు లేకుండా సరైన ఆధారాలు సమర్పించాల్సి వస్తుంది.
2. దరఖాస్తును ఎప్పుడు తిరస్కరిస్తారు?
పేరు మార్పు దరఖాస్తు కొన్ని కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. సమర్పించిన పత్రాలలో తప్పులు, అస్పష్టతలు లేదా సరైన ఆధారాలు లేకపోతే అభ్యర్థన తిరస్కరిస్తారు.
నోటరీ అఫిడవిట్, గెజిట్ నోటిఫికేషన్ లేదా వార్తాపత్రిక ప్రకటన లేకపోతే అనుమతించరు.
న్యాయపరమైన సమస్యలు, బ్యాంకు రుణాలు, క్రిమినల్ కేసులు లేదా ఇతర లీగల్ ఇష్యూలు ఉన్నప్పుడు అప్లికేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశముంది.
ప్రభుత్వ నియమాలు, విధానాలకు విరుద్ధంగా ఉంటే లేదా మార్పు అనుమతించని పేరును అభ్యర్థిస్తే కూడా దరఖాస్తును అంగీకరించరు.
అదనపు పరిశీలన అవసరమైన సందర్భాల్లో సరైన సమాధానాలు లేకపోతే తిరస్కరణకు గురవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
3. పేరు మళ్లీ మార్చుకోవచ్చా?
ఒకసారి చట్టబద్ధంగా పేరు మార్చుకున్న తర్వాత, అవసరమైతే మళ్లీ పేరు మార్చుకోవచ్చు. అయితే, ఇది మొదటిసారి మార్చుకున్న దానికంటే మరింత జాగ్రత్తగా చేయాల్సిన ప్రక్రియ అవుతుంది.
పునఃమార్పు కోసం గెజిట్ నోటిఫికేషన్, నోటరీ అఫిడవిట్, వార్తాపత్రిక ప్రకటన మళ్లీ ఇవ్వాలి. పేరు వరుసగా మార్చుకోవడంపై అధికారులు అనుమానం వ్యక్తం చేసే అవకాశముంది. అందుకే సరైన కారణాలు చూపించాలి.
బ్యాంకింగ్, ఆస్తి, విద్య, పాస్‌పోర్ట్ సంబంధిత వ్యవహారాల్లో ముందుగా మార్పును అంగీకరించడంలో కొన్ని పరిమితులు ఉండొచ్చు. గత మార్పుల గురించి పూర్తి వివరాలతో సరైన ఆధారాలు సమర్పిస్తే మళ్లీ పేరు మార్చుకోవచ్చు.
4. పేరు అప్‌డేట్‌కు టైమ్ లిమిట్ ఉంటుందా?
గెజిట్‌లో పేరు మార్చుకున్న తర్వాత విద్యా సర్టిఫికేట్లలో పేరు అప్‌డేట్ చేసుకోవడానికి అధికారికంగా ప్రత్యేకమైన టైమ్ లిమిట్ అనేది లేదని సాధారణంగా భావిస్తారు.
అయితే, ప్రతి విద్యా బోర్డు లేదా యూనివర్శిటీ తమ విధానాల ప్రకారం మార్పు దరఖాస్తులకు గడువును నిర్ణయించే అవకాశం ఉంది.
కొన్ని సంస్థలు పరీక్ష పూర్తయిన కొన్ని సంవత్సరాల లోపల మాత్రమే పేరు మార్పును అనుమతిస్తాయి, మరికొన్ని మాత్రం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇస్తాయి.
మార్పు కోసం గెజిట్ నోటిఫికేషన్, నోటరీ అఫిడవిట్, పాత, కొత్త పేరు ఆధారాలతో పాటు విద్యా సంస్థ నిర్దేశించిన ఫీజు చెల్లించాలి.
నిర్దిష్ట సమయం ఉన్నదో లేదో తెలుసుకోవడానికి సంబంధిత బోర్డు లేదా యూనివర్శిటీ అధికారిక నిబంధనలను పరిశీలించడం మంచిది.

ఫొటో సోర్స్, Getty Images
5. సివిల్ కోర్టు డిక్లరేషన్ ఎప్పుడు అవసరం ?
సివిల్ కోర్టు డిక్లరేషన్ ప్రధానంగా ఏదైనా హక్కు లేదా హోదా నిర్థరణ అవసరమైనప్పుడు అవసరం పడుతుంది.
ప్రత్యేకంగా, పేరు మార్పు లేదా సంతానం గుర్తింపు వంటి లీగల్ అంశాలలో అధికారిక ధృవీకరణ అవసరమైనప్పుడు దీనిని కోరవచ్చు.
ఆస్తి హక్కుల వివాదాలు, వారసత్వ హక్కులు, ఒప్పంద చట్టబద్ధతను నిర్ధారించుకోవడం, లేదా రికార్డులలో తప్పుగా నమోదైన వివరాలను సరిచేయించుకోవడానికి కూడా కోర్టు డిక్లరేషన్ తీసుకోవాల్సి వస్తుంది.
కొన్ని సందర్భాల్లో, ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలు పేరు మార్పు లేదా ఇతర హక్కుల నిర్థరణకు గెజిట్ నోటిఫికేషన్‌తో పాటు కోర్టు డిక్లరేషన్ కూడా తప్పనిసరిగా కోరవచ్చు.
అప్లికేషన్ తిరస్కరణ లేదా లీగల్ సమస్యలు ఉన్నప్పుడు కోర్టు ద్వారా అధికారిక నిర్ధారణ పొందడం అవసరం అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
రాజ్యాంగం ఏం చెబుతోంది?
పేరు మార్చుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని న్యాయవాదులు చెబుతున్నారు.
భారత రాజ్యాంగంలో కల్పించిన ఆర్టికల్ 19(1)(ఏ), 21, 14 ప్రాథమిక హక్కుల కింద భారతీయ పౌరులు తమ పేరును మార్చుకోవచ్చని అలహాబాద్ సింగిల్ బెంచ్ ఇచ్చిన కోర్టు తీర్పులో పేర్కొంది.
అయితే, అలహాబాద్ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పులో మాత్రం ప్రాథమిక హక్కులకు కూడా పరిమితులు ఉన్నాయని తెలిపింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) వాక్ స్వాతంత్య్రం, 21వ ఆర్టికల్ వ్యక్తిగత స్వేచ్చను, 14వ ఆర్టికల్ సమానత్వ హక్కును భారతీయ పౌరులకు అందిస్తాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














