పాత పంటల జాతర: ఎద్దుల బండ్లపై విత్తనాలను ఊరేగింపుగా తీసుకెళ్లే 'రైతుల పండుగ'

బండ్ల ఊరేగింపు
ఫొటో క్యాప్షన్, సంగారెడ్డిలోని పలు గ్రామాల్లో గత 25 ఏళ్లుగా పాత పంటల జాతర జరుగుతోంది.
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

అరవయ్యేళ్ల కర్నే నర్సమ్మ హడావిడిగా కనిపించారు. 'బండ్లు వచ్చే సమయం అయ్యింది' అంటూ ఊర్లోని తోటి మహిళలను తొందరపెడుతున్నారు. అంతా సజావుగా సాగాలన్న ఆరాటం ఆమెలో కనిపిస్తోంది.

కొద్దిసేపటికే గ్రామంలోకి ప్రవేశించిన ఎడ్ల బండ్లను చూస్తూనే మురిసిపోయారు నర్సమ్మ.

బండ్ల ఊరేగింపునకు నర్సమ్మ మంగళ హారతులు, బ్యాండ్ బాజాలతో ఎదురెళ్లి స్వాగతం పలికారు. గ్రామ సర్పంచ్‌తో కలిసి కొబ్బరికాయలు కొట్టారు. వరుసలో ముందున్న బండికి కట్టిన ఎద్దుల జత కాళ్లకు మొక్కారు నర్సమ్మ.

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలోని పలు గ్రామాల్లో ప్రతిఏటా ఎద్దుల బండ్ల ఊరేగింపు జరుగుతుంది. వారికి ఇవి మామూలు ఎద్దుల బండ్లు కావు. దశాబ్దాలుగా కాపాడుతూ వస్తున్న విత్తనాలను ఈ బండ్లలో ఉంచి ఊరేగిస్తారు. ఆ విత్తనాలతో వారిది తాత ముత్తాతల కాలం నాటి అనుబంధం.

నర్సమ్మది న్యాల్‌కల్ మండలం గుంజోట్టి స్వగ్రామం. గుంజోట్టి మాదిరే సుమారు 40 గ్రామాల్లో దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) గత నాలుగు దశాబ్దాలుగా మహిళా సంఘాల సహాయంతో చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాత పంటల జాతర
ఫొటో క్యాప్షన్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలోని పలు గ్రామాల్లో ప్రతిఏటా ఎద్దుల బండ్ల ఊరేగింపు జరుగుతుంది.

పాత పంటల జాతర

ఈ చిరుధాన్యాలను ఎడ్లబండ్లలో వేసి ప్రతి ఏటా సంక్రాంతి పండగ నుంచి ఫిబ్రవరి రెండోవారం వరకు గ్రామాల్లో ఊరేగిస్తారు. ఇలా సుమారు 25-30 గ్రామాల్లో జరుగుతుంది. దీన్నే 'పాత పంటల జాతర'గా పిలుస్తారు.

గత 25 ఏళ్లుగా ఈ జాతర సాగుతోంది.

ఈ జాతరలో భాగంగా గుంజోట్టి గ్రామంలోకి పాత విత్తనాలతో ఎద్దుల బండ్లు వచ్చాయి. అదే నర్సమ్మ హడావిడి వెనుక కారణం.

గుంజోట్టి గ్రామం
ఫొటో క్యాప్షన్, పంట సేద్యంలో తమకెదురయిన కష్టసుఖాలు, అనుభవాలు, గ్రామదేవతలను తలుచుకుంటూ మహిళలు పాటలు పాడతారు, ఆటలాడుతారు.

ఈ జాతరలో ఏం చేస్తారు?

గ్రామంలోకి ప్రవేశించిన ఎద్దులబండ్లకు మహిళా సంఘాల సభ్యులు, వారి కుటుంబాలు, చిన్నాపెద్దా ఎదురుగా వచ్చి ఆహ్వానిస్తారు.

ఈ సందర్భంగా పంట సేద్యంలో తమకెదురయిన కష్టసుఖాలు, అనుభవాలు, గ్రామదేవతలను తలుచుకుంటూ పాటలు పాడతారు, ఆటలాడుతారు.

"ఊరూరు తిరిగినాయి ఆశన్న, ఊశన్న లార

మన ఊరి కొచ్చినాయి ఆశన్న, ఊశన్నలార

గల్లిగల్లి తిరిగినాయే ఆశన్న, ఊశన్నలార

పాత పంటల జాతరంట ఆశన్న, ఊశన్న లార''

ఇలా ప్రతి మహిళ గొంతు కలుపుతూ, మంగళహారతులు ఇస్తూ గ్రామం నడి వీధిలోకి (రచ్చబండ) బండ్లతో చేరుకుంటారు. అక్కడే గ్రామస్తులంతా సమావేశమవుతారు.

ఆ సమావేశంలో తమ అనుభవాలను కొందరు మహిళా రైతులు పంచుకుంటే, ఆ జాతరకు వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తలు సాగు మెలకువలపై సలహాలు, సూచనలు ఇస్తారు.

తర్వాత గ్రామస్థులు సహపంక్తి భోజనాలు చేయడంతో గ్రామంలో జాతర ముగిసి, మరో గ్రామానికి ఎద్దుల బండ్లు ప్రయాణమవుతాయి.

కర్నే నర్సమ్మ
ఫొటో క్యాప్షన్, దాచిన విత్తనాలను ఒకరికొకరం పంచుకుని, ఏళ్ల తరబడి సంరక్షించుకుంటున్నామని కర్నే నర్సమ్మ అన్నారు.

'డబ్బులుంటే జాతరలు ఎన్నైనా చేయొచ్చు. కానీ ఇలా పంటల జాతర చేయలేం. ఇలాంటి జాతర దేశంలోనే అరుదు' అని కర్నే నర్సమ్మ బీబీసీతో చెప్పారు.

తక్కువ భూమిని కలిగి ఉండే అట్టడుగుస్థాయి వర్గాల ప్రజలకు చిరుధాన్యాల సాగు వల్ల ఆహారభద్రతతో పాటూ వారి కుటుంబాలకు పోషక భద్రత లభిస్తుందని, పరోక్షంగా జీవవైవిధ్య పరిరక్షణకు ఈ జాతర కారణం అవుతుందని పాతపంటల జాతర కోఆర్డినేటర్ లయ బీబీసీతో చెప్పారు.

"ఇన్ని ఎకరాల్లో కొత్తగా చిరుధాన్యాల సాగు చేపడతామని జాతర సందర్భంగా గ్రామాల్లో తీర్మానాలు చేస్తుంటారు. వారికి అవసరమయ్యే విత్తనాలను సమకూర్చడం, వారి భూములు మరింత సాగు యోగ్యంగా మార్చడం కోసం మా వంతు సహకారం అందిస్తుంటాం'' అని ఆమె తెలిపారు.

పాత పంటల జాతర
ఫొటో క్యాప్షన్, గ్రామంలోకి ప్రవేశించిన ఎద్దులబండ్లకు మహిళా సంఘాల సభ్యులు, వారి కుటుంబాలు, చిన్నాపెద్దా ఎదురుగా వచ్చి ఆహ్వానిస్తారు.

'రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు'

ప్రతి ఏటా సంక్రాంతి రోజు ప్రారంభమయ్యే ఈ జాతరకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతాయని లయ అన్నారు.

జాతర నిర్వహణకు సిద్దంగా ఉన్న గ్రామాల జాబితా తయారీ, తేదీలు, రూట్ మ్యాప్ సిద్దం చేయడం, ఎద్దుల బండ్ల అలంకరణ పనులు చేస్తామని తెలిపారు.

'అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాక సంఘం మహిళలం సమావేశమవుతాం. మా గ్రామంలో ఏ రోజు జాతర వీలవుతుందో నిర్వహణ కమిటీకి తెలియజేస్తాం' అన్నారు నర్సమ్మ.

పాతపంటల జాతర కోఆర్డినేటర్ లయ
ఫొటో క్యాప్షన్, పాతపంటల జాతర కోఆర్డినేటర్ లయ

పాత విత్తనాల పరిరక్షణ

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో సుమారు రెండువేల మంది మహిళా రైతులు, మూడున్నరవేల ఎకరాల్లో పాత పంటలు (చిరు ధాన్యాలు) పండిస్తున్నారు.

"ఈ భూమి మీద ముందుగా కొత్త పంటలు (వరి, పత్తి, చెరుకు, సోయ) లేవు. పాత పంటలే ఉండే. అంటే సన్నం దినుసులు. రాగులు, సజ్జలు, సామలు వంటి సిరిధాన్యాలు. వీటి విత్తనాల కోసం నాణ్యమైన కంకుల నుంచి గింజలు వేరుచేసి కాముడు బూడిద, వేపాకు కలిపి కుండల్లో నిల్వ చేస్తాం. ఐదు రకాల బొబ్బెర్లు, అనుములు, కొర్రలు ఇలా అర ఎకరంలో 70 రకాల వరకు పంటలు వేస్తాను. నా నోటితో వంద రకాల సిరిధాన్యాల పేర్లు చెప్పగలను'' అని అన్నారు నర్సమ్మ.

సంగారెడ్డి, పాత పంటల జాతర

' నా దగ్గర లేని విత్తనం చంద్రమ్మ ఇస్తుంది, చంద్రమ్మ దగ్గర లేని దినుసు మంజులమ్మ ఇస్తుంది. మంజులమ్మ దగ్గర ఉన్న విత్తనం నర్సమ్మకు ఇస్తుంది. ఇలా ఒకరికి ఒకరం విత్తనాలు పంచుకుని ఏళ్లతరబడి సంరక్షించుకుంటున్నాం' అని నర్సమ్మ తెలిపారు.

బండ్లలో చిరుధాన్యాలు
ఫొటో క్యాప్షన్, బండ్లలో చిరుధాన్యాలు

జీవవైవిధ్యం కాపాడటంలో పాత పంటలు ప్రముఖ పాత్ర పోషించాయని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.

''ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా సరఫరా చేసే రేషన్‌లో కేవలం బియ్యం, గోధుమలే ఉంటున్నాయి. దీంతో గ్రామాల్లో గతంలో కనిపించిన డైట్ డైవర్సిటీ ఇప్పుడు లేదు. గతంలో ఉన్న కాస్త భూమిలో చిరుధాన్యాలు, పప్పుదినుసులు, నూనెగింజలు వేసేవారు. దీంతో ఆహారభద్రతతో పాటు పోషక భద్రత కూడా ఆ కుటుంబాలకు లభించేది. జొన్న పంట భూమి నుంచి పోషకాలను తీసుకుంటే, పప్పుదినుసుల పంటలు అదే భూమిలో నైట్రోజన్ స్థాపనకు కారణం అయ్యేవి. దీంతో సాగు భూమికి కూడా మేలు జరిగేది'' అని లయ అన్నారు.

మహిళా సంఘాలు
ఫొటో క్యాప్షన్, గ్రామస్తులు సహపంక్తి భోజనాలు చేయడంతో గ్రామంలో జాతర ముగుస్తుంది.

జీవవైవిధ్యం, సుస్థిర అభివృద్ది అనే పదాలు ఇప్పుడు ఎక్కువగా వింటున్నాం. ఇవి ఎప్పటి నుంచో మన గ్రామీణ వ్యవసాయ విధానంలో అంతర్భాగమైన ప్రధాన విలువలుగా ఉన్నాయి. దీన్ని వెలుగులోకి తేవడమే పాతపంటల జాతర ఉద్దేశమని లయ అన్నారు.

'విత్తనాలను భద్రపరుచుకోవడం వల్ల వాటిపై అధికారం మహిళా రైతులకే ఉంటుంది. కార్పొరేట్ విత్తన కంపెనీల నియంత్రణలోకి వారి వ్యవసాయం వెళ్లదు' అని ఆమె అన్నారు.

ఇది ఏ దేవునికో, దేవతకో, మతానికో సంబంధించిన జాతర కాదని, ఇక్కడ విత్తనాలే వారి దేవుళ్లు అన్నారు లయ.

ఎద్దుల బండ్ల ఊరేగింపు

'అపోహలు పోవాలి'

పాత పంటలు పండించేవారు తక్కువ స్థాయి రైతులని సమాజంలో ఉన్న అపోహలు దూరం కావాలంటున్నారు జీవవైవిద్య నిపుణులు.

''పత్తి సాగు చేస్తే పెద్ద రైతు, రాగులు సాగుచేసే వారు చిన్న రైతులు, పేదవారు అన్న భావన సమాజంలో ఉంది. అది పోవాలి. ఇలాంటి పరిస్తితుల్లో చిరుధాన్యాలను అంతపెద్ద స్థాయిలో అందంగా అలంకరించిన బండ్లమీద గ్రామాల్లో తిప్పినప్పుడు వాటికి వచ్చే స్టేటస్ వేరు. వాటిని పండించే రైతులకు ప్రతి ఏటా ప్రేరణ, ఉత్సాహం నింపడంలో పాతపంటల జాతర ఒక సాధనం'' అన్నారు లయ.

గ్రామీణ ప్రాంత వ్యవసాయంలో ఇమిడి ఉన్న జ్ఞానంతో పాటు, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం పాతపంటల జాతర ఉద్దేశమని ఆమె చెప్పారు.

మంజుల
ఫొటో క్యాప్షన్, మంజుల

''వాణిజ్య పంటల సాగుతో విత్తనాలు కొనడం, పంట పండించడం, మార్కెట్‌లో అమ్మడం ఇలా వ్యవసాయం అంతా మగవారి చేతిలోకి పోయి మహిళలు కేవలం శ్రమ చేసే కూలీలుగా మిగిలిపోతున్నారు. ఎక్కువ రకాల పంటలు పండించినప్పుడు భూమికి, ఇంటికి, పశువులకు మధ్య విడదీయలేని సంబంధం ఉండేది'' అని లయ అన్నారు.

'మేం చేయగలిగినంత వరకు చేసి కోడళ్లకు ఈ బాధ్యతలు అప్పగిస్తాం' అన్నారు నర్సమ్మ.

''గతంలో పాతపంటల జాతరకు పదహారు బండ్ల కాన్వాయ్ వచ్చేది. ఇప్పుడు బండ్ల సంఖ్య తగ్గింది. మా కుటుంబాలకు గౌరవాన్ని తెచ్చిన ఈ పంటలను ఇంటి కోడళ్లుగా మేం ఎక్కువగా పండించి రాబోయే రోజుల్లో తిరిగి పదహారు బండ్లతో జాతర నిర్వహించాలి'' అని గుంజోట్టి గ్రామానికి చెందిన మంజుల అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)