బెజవాడ కనకదుర్గమ్మ చేతిలోనూ ఈ వీణే.. స్వరాల కళకు కలప కష్టాలు

నూజివీడు ప్రత్యేకత చిన్న వీణ
ఫొటో క్యాప్షన్, నూజివీడుకి ప్రత్యేకతగా చెబుతున్న చిన్న వీణతో షేక్‌ మాబూ సాహెబ్‌
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

నూజివీడు పేరు వినగానే గుర్తొచ్చేది మధురమైన మామిడికాయలే కాదు సుస్వరాల వీణలు కూడా.

తమిళనాడులోని తంజావూరు, విజయనగరం జిల్లా బొబ్బిలి తరువాత వీణల తయారీకి అంతగా ప్రసిద్ధి పొందిన ప్రాంతం నూజివీడు.

దశాబ్దాలుగా విభిన్న రకాల వీణల రూపకల్పనకు ఈ పట్టణం పేరుగాంచింది.

గతంలో కృష్ణాజిల్లాలో ఉన్న నూజివీడు జిల్లాల పునర్విభజన తరువాత ఏలూరు పరిథిలోకి వచ్చింది.

ఇక్కడ తయారయ్యే వీణలు దేశ, విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి.

నూజివీడులో ఎప్పుడు, ఎలా మొదలైందంటే..

నూజివీడులో దాదాపు 130 ఏళ్లుగా వీణలను తయారు చేస్తున్నారు. అంతకుముందు బందరు(మచిలీపట్నం)లో వీణలు తయారు చేసేవారు.

''యడవల్లి వెంకటస్వామి అనే కళాకారుడు అక్కడ నేర్చుకుని నూజివీడు వచ్చి వీణల తయారీ ప్రారంభించారు.

అలా ఒకరిని చూసి మరొకరు, ఇలా దాదాపు 20 కుటుంబాలు కేవలం వీణల తయారీనే నమ్ముకుని జీవించేవి.

అప్పట్లో దాదాపు 150 మంది వరకు కళాకారులు ఉండేవాళ్లు'' అని నూజివీడుకు చెందిన వీణల తయారీదారు నర్ని శోభనాద్రి బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

విద్వాంసుల చేతిలో నూజివీడు వీణ

''జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఎందరో ప్రముఖులు నూజివీడు వీణలను వినియోగించారు. ఇప్పుడు కూడా చాలామంది ఉపయోగిస్తున్నారు'' అని నూజివీడు పట్టణంలో దశాబ్దాలుగా వీణల తయారీ కేంద్రం నిర్వహిస్తున్న షేక్‌ మాబూ సాహెబ్‌ బీబీసీకి తెలిపారు.

''అబ్దుల్‌ కలాంకు నూజివీడు వీణ ఇచ్చాం. ఆయన నేర్చుకున్నారు. అలాగే మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అయ్యగారి శ్యాంసుందర్, చిట్టిబాబు, ఈమని శంకర శాస్త్రి ఇలా ప్రముఖ విద్వాంసులకు నూజివీడు వీణలే వెళ్లేవి. విద్వాంసులకు వీణ ఎలా కావాలో తెలుసు కాబట్టి వారికి కావాల్సినట్లుగా తయారుచేయించి ఇచ్చేవాళ్లం'' అని ఆయన చెప్పారు.

విదేశాలకు సైతం వీణలు రెగ్యులర్‌గా వెళ్తుంటాయని శోభనాద్రి వెల్లడించారు.

''ఇక్కడి నుంచి విదేశాలకూ నూజివీడు వీణలు తీసుకెళ్తుంటారు. ఆస్ట్రేలియా, అమెరికా, మలేసియాలకు వెళ్తుంటాయి. మొన్న కూడా న్యూయార్క్‌‌కు ఒకటి పంపించాం'' అని ఆయన చెప్పుకొచ్చారు.

నూజివీడు వీణ

సహజంగా వీణ 53 అంగుళాల పొడవు ఉంటుంది. కానీ, ఇక్కడి కళాకారులు కేవలం 20 అంగుళాల పొడవుతో చిన్నవీణలను కూడా తయారు చేస్తుంటారు.

సులభంగా మోసుకుని వెళ్లేందుకు వీలుగా.. తేలికగా ఉండే చిన్న వీణలను రూపొందిస్తామని కళాకారులు చెబుతున్నారు.

ఇక సరస్వతి వీణ, మయూరి వీణ, డ్రాగన్‌ వీణ, శంఖం వీణ వంటి ప్రత్యేక వీణల తయారీలో కూడా ఇక్కడి కళాకారులు సిద్ధహస్తులు.

నూజివీడు వీణ

సప్త స్వరాలు పలికే చిన్న వీణలు

''పెద్ద వీణ వచ్చేసరికి 53 అంగుళాల పొడవు ఉంటుంది. అలాంటిదే 21 అంగుళాల్లో తయారు చేశాం.

పెద్ద వీణ ఎలా మోగుతుందో కూడా చిన్న వీణ కూడా అలానే మోగేలా, సప్త స్వరాలు పలికేలా తయారు చేశాను. ఇది రికార్డుల్లోకి ఎక్కింది'' అని షేక్‌ మాబూసాహెబ్‌ తెలిపారు.

''చిన్న వీణ కూడా సప్త స్వరాలు పలుకుతుంది. ఏడు తీగలు, 24 మెట్లు మొత్తం ఉంటాయి. చిన్న వీణలు బొబ్బిలిలో కూడా తయారు చేస్తారు. కానీ, అవి చూడటానికి మాత్రమే.దానిపై అన్ని స్వరాలు పలికించలేరు.

నూజివీడులో తయారు చేసే చిన్న వీణలను పెద్ద వీణల మాదిరిగానే వాయించవచ్చు'' అని యువ కళాకారుడు గోపాలకృష్ణ తెలిపారు.

వీణల తయారీ శిక్షణ కేంద్రం
ఫొటో క్యాప్షన్, శిక్షణ కేంద్రంలో వీణల తయారీ నేర్చుకుంటున్న మహిళలు

మూడు తరాలుగా..

నూజివీడులోని షేక్‌ మాబూసాహెబ్‌ కుటుంబం మూడు తరాలుగా వీణల తయారీలోనే జీవనోపాధి పొందుతోంది. ఇప్పుడు నాలుగోతరానికి కూడా వీణల తయారీని నేర్పిస్తున్నామని షేక్‌ మాబూ చెప్పారు.

వీణల తయారీకి సంబంధించి ఎన్నో అవార్డులు పొందినప్పటికీ, విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఉత్సవాల సమయంలో తాను తయారు చేసే వీణను అమ్మవారి ఒడిలో పెట్టడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తానని ఆయన భావోద్వేగంతో తెలిపారు.

''నేను వీణ తయారీని మా నాన్న షేక్‌ మీరా సాహెబ్‌ వద్ద నేర్చుకున్నా. మా తాతగారి దగ్గర మా నాన్న ఈ కళను నేర్చుకున్నారు. మా తాతగారు సన్నాయి విద్వాంసులు. వీణలు కూడా తయారు చేసేవారు. ఈ కళ మాతో అంతరించకుండా ఉండాలని నేను, మా అన్నయ్య మా పిల్లలను చదివిస్తూనే ఈ పనిలో పెట్టాం'' అని బీబీసీకి చెప్పారు.

''సరస్వతీదేవి చేతిలో ఉండే వాద్య పరికరం వీణ. ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి వీణ తయారు చేయడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా'' అని చెప్పారు.

వీణ వాయిస్తున్న యువతి గౌతమి, షేక్‌ సాహెబ్‌
ఫొటో క్యాప్షన్, వీణ వాయిస్తున్న యువతి గౌతమి

తగ్గిపోతున్న కళాకారులు

తరతరాల చరిత్ర కలిగిన నూజివీడు వీణ తయారీదారులు ఇప్పుడు బాగా తగ్గిపోవడంతో ఆ కళాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒకప్పుడు పట్టణంలో 20 కుటుంబాల వారు ఇదే వృత్తిలో ఉండగా, ఇప్పుడు నాలుగైదు కుటుంబాలు కూడా లేవని అంటున్నారు.

దీనికి తోడు వీణల తయారీకి ప్రధానంగా ఉపయోగించే పనస కలప కొరతతో పాటు దానిపై ప్రభుత్వాలు పన్నులు విధిస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు.

''మేం ఈ కళను ఇతరులకు నేర్పిస్తాం. కానీ, నేర్చుకునే వాళ్లు కనిపించడం లేదు. కళ అంతరించిపోతుందేమోనని భయంగా ఉంది'' అని వీణ తయారీదారులు యర్రంశెట్టి ధనుంజయరావు, సాంబశివరావు అన్నారు.

వీణల తయారీ శిక్షణ కేంద్రంలో నేర్చుకుంటున్న మహిళ
ఫొటో క్యాప్షన్, వీణల తయారీ శిక్షణ కేంద్రంలో నేర్చుకుంటున్న మహిళ

పనస కలప కొరత, పన్నుల బాధ

''వీణల తయారీ తగ్గిపోతోంది. ఈ వీణల తయారీకి పూర్తిగా పనస కలపనే వాడతాం. కర్ర కావాలంటే గతంలో రాజమండ్రి, దేవరపల్లి ఏరియాల నుంచి తెచ్చేవాళ్లం.

ఇప్పుడు ఆ కలపను అన్నింటికీ వాడుతుండటంతో ధర బాగా పెరిగిపోయింది. పైగా తీసుకొచ్చేందుకు పర్మిట్లు కావాలని అడుగుతున్నారు.

ఇంతకుముందు ఇలాంటివేమీ లేవు. కొన్నేళ్లుగా జీఎస్టీ విధిస్తుండటంతో భారం పెరిగింది'' అని షేక్‌ మాబూ తెలిపారు.

''పూర్తిగా చేతితో తయారుచేసే వీణకు కావాల్సిన కలపపై టాక్స్‌లు వేయడం అన్యాయం. రైతుల నుంచి తెచ్చుకుంటున్నామని చెబుతున్నా కర్ర వ్యాపారం చేసేవారికి వేసినట్టుగా టాక్స్‌లు వేస్తున్నారు ఫారెస్ట్‌ అధికారులు.

మాకు ప్రభుత్వం వేరే సాయం చేయనక్కరలేదు. కర్రను ఏర్పాటు చేస్తే చాలు. లేదంటే అది పండించుకునేందుకు ఉచితంగా భూమి ఇచ్చినా చాలు'' అని శోభనాద్రి కోరారు.

నూజివీడు వీణ

వీణల తయారీ శిక్షణ కేంద్రం

వీణ తయారీదారులు తగ్గిపోతున్నారని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ హ్యాండీ క్రాఫ్ట్స్‌ సర్వీస్‌ సెంటర్, ఆంధ్రప్రదేశ్‌ హ్యాండీ క్రాఫ్ట్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నూజివీడు సమీపంలోని తుకులూరు గ్రామంలో వీణ తయారీపై 30 మంది మహిళలకు అయిదు నెలలు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ శిక్షణ కాలంలో 7,500 రూపాయలు స్టైఫండ్‌గా ఇస్తున్నారు. శిక్షణ కార్యక్రమం వచ్చే నెలతో పూర్తవుతోంది.

''అయిదు నెలల్లో పూర్తిగా నేర్చుకోవడం రాదు. మరికొంతకాలం శిక్షణ ఇవ్వాలని'' బీబీసీతో అక్కడ నేర్చుకుంటున్న షేక్‌ సబీనా, మాధవి, మెహరున్నీసా బేగం అన్నారు.

నూజివీడు వీణ

జీఐ ట్యాగ్‌..

''మన రాష్ట్రంలో బొబ్బిలి వీణలతో పాటు నూజివీడులో తయారయ్యే వీణలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. అలాంటి నూజివీడు వీణలకు భౌగోళిక గుర్తింపు ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది'' అని స్థానికుడు యనమదల సత్యనారాయణ కోరారు.

బొబ్బిలి వీణలకు ఇప్పటికే జీఐ గుర్తింపు ఉన్నందున నూజివీడు వీణలకు కూడా జీఐ గుర్తింపు వచ్చేలా నాయకులు కృషి చేయాలని ఆయన కోరారు.

నూజివీడు వీణలకు జీఐ ట్యాగ్‌ కోసం అన్ని అధ్యయనాలు చేసి నివేదిక రూపొందించామని, దానికి కచ్చితంగా గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని నూజివీడు ఐఐటీలో గతంలో పనిచేసి ప్రస్తుతం బెంగళూరులోని ఓ విద్యాసంస్థల ట్రస్ట్‌‌కు హానరరీ డైరెక్టర్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్‌ రావు బీబీసీకి చెప్పారు.

‘మరింత మందికి శిక్షణ ఇస్తాం’

ప్రస్తుతం నడుస్తున్న అయిదు నెలల శిక్షణ కార్యక్రమం కేంద్రప్రభుత్వ సంస్థతో కలిసి చేస్తున్న కార్యక్రమం కాబట్టి దాన్ని పొడిగించలేమని ఏపీ హ్యాండీ క్రాఫ్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విశ్వా మనోహర్‌ ‘బీబీసీ’తో చెప్పారు. త్వరలోనే మరింత మందికి శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు.

వీణ తయారీకి వాడే కలపపై పన్ను అనేది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి కళాకారుల ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని నూజివీడు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సత్యనారాయణ బీబీసీతో అన్నారు.

మంత్రి పార్దసారధి
ఫొటో క్యాప్షన్, మంత్రి పార్థ సారథి

జీఐ కోసం ప్రయత్నిస్తాం: మంత్రి పార్థసారథి

''అద్భుతమైన వీణ కళాకారులు నా నియోజవర్గంలో ఉండటం గర్వకారణం.

నూజివీడు వీణలకు భౌగోళిక గుర్తింపు(జీఐ) వచ్చేందుకు కచ్చితంగా కృషి చేస్తా.

అదే విధంగా వారు ఉపయోగించే పనస కలపపై పన్ను విధించకుండా తగిన చర్యలు తీసుకుంటాం'' అని నూజివీడు శాసనసభ్యుడు, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బీబీసీకి చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)