జాకిర్ హుసేన్ కన్నుమూత: ఏడేళ్ల వయసులో తబలా వాయించడం ప్రారంభించి, నాలుగు సార్లు గ్రామీ అవార్డులు అందుకుని..

Zakir Hussain

ఫొటో సోర్స్, Getty Images

ప్రఖ్యాత తబలా వాయిద్యకారుడు జాకిర్ హుసేన్ ఇక లేరు. ఆయన వయసు 73 సంవత్సరాలు. అమెరికాలో నివసిస్తున్న ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొద్దిరోజుల కిందట శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

జాకిర్ హుసేన్ మరణించినట్లు ఆయన కుటుంబం ధ్రువీకరించింది.

భారత ప్రభుత్వం పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మ శ్రీ పురస్కారాలతో జాకిర్ హుసేన్‌ను సత్కరించింది.

తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ కుమారుడే జాకిర్ హుసేన్. ఏడేళ్ల వయసు నుంచే తబలా వాయించడం ప్రారంభించిన హుసేన్, హిందూస్థానీ సంగీతంలో పండితులైన అనేకమంది సంగీత కళాకారులతో కలిసి పని చేశారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జాకిర్ హుసేన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాలుగుసార్లు గ్రామీ అవార్డులు అందుకున్నారు జాకిర్ హుసేన్

జాకిర్ హుసేన్ గ్రామీ అవార్డు గ్రహీత. ఏడుసార్లు ఆయన ఈ అవార్డులకు నామినేట్ అయ్యారు. నాలుగుసార్లు అవార్డు గెలుచుకున్నారు.

2009లో తొలిసారిగా గ్రామీ అవార్డును పొందారు జాకిర్ హుసేన్. 'గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్ట్'కు ఈ అవార్డు లభించింది. ఈ ఆల్బమ్‌ను మిక్కీ హార్ట్, గియోవన్నీ హిడాల్గోతో కలిసి రూపొందించారు.

51వ గ్రామీ అవార్డుల్లో తొలిసారిగా గ్రామీ అవార్డును అందుకున్నారాయన. బెస్ట్ కాంటెంపరరీ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో ఆయనకు ఈ అవార్డు దక్కింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

జాకిర్ హుసేన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తబలా రంగానికి జాకిర్ హుసేన్ విశిష్టమైన సేవలు అందించారు

2024 గ్రామీ అవార్డులలో కూడా ఆయన ఏకంగా మూడు అవార్డులను సొంతం చేసుకున్నారు.

బెస్ట్ కాంటెంపరరీ ఇన్‌స్ట్రుమెంటల్ ఆల్బమ్ విభాగంలో 'యాజ్ వుయ్ స్పీక్', బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో 'దిస్ మూమెంట్', బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ విభాగంలో 'పాష్టో'‌లకు ఈ అవార్డులను ప్రకటించారు.

ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు.

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్‌ సింగ్‌ కూడా సంతాపం వ్యక్తం చేస్తూ, "సంగీత నాటక అకాడమీ, గ్రామీ, పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ వంటి అనేక అవార్డులు అందుకున్న ప్రఖ్యాత తబలా వాయిద్యకారుడు ఉస్తాద్ జాకిర్ హుసేన్ మరణం రాష్ట్రానికి, కళారంగానికి తీరని లోటు’’ అని అన్నారు.

బీజేపీ నేత నితిన్ గడ్కరీ స్పందిస్తూ.. ‘‘కళారంగానికి ఆయన చేసిన సేవ అపూర్వమైనది. కళ పట్ల ఆయనకున్న నిబద్ధత, అంకితభావం, సహకారం చిరకాలం గుర్తుండిపోతాయి." అని సోషల్ మీడియాలో రాశారు.

ప్రఖ్యాత కవ్వాలీ గాయకుడు నుస్రత్ ఫతే అలీ ఖాన్‌తో కలిసి, జాకిర్ హుసేన్ నిర్వహించిన జుగల్‌బందీ పాత వీడియో ఒకదానిని ఎక్స్‌లో పోస్ట్ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. ‘‘ఈ రోజు భారతదేశపు లయ ఆగిపోయింది’’ అని రాశారు.

జాకిర్ హుసేన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జాకిర్ హుసేన్, సచిన్ తెందుల్కర్ (ఫైల్ ఫోటో)

2009లో గ్రామీ అవార్డు అందుకున్న తర్వాత బీబీసీ హిందీ రేడియోలో ‘ఏక్ ములాకాత్’ కార్యక్రమంలో జాకిర్ హుసేన్ మాట్లాడారు.

బీబీసీ: ఇన్ని అవార్డులు అందుకున్నారు. రొటీన్‌గా అనిపిస్తుందా?

జాకిర్ హుసేన్: చేసిన పనిని బట్టి అవార్డులు రావాలని నమ్ముతాను. అవార్డును అందుకోవడమంటే మనం సరైన మార్గంలో నడుస్తున్నామని నిర్ధరించుకోవడమే. ఈ అవార్డును ఒక వరంలా భావించవచ్చు. గ్రామీ అవార్డు జ్యూరీలో అంతా కళాకారులే ఉంటారు. నా అభిప్రాయం ప్రకారం మళ్లీ 17 ఏళ్ల తర్వాత నాకు ఈ అవార్డు దక్కిందంటే.. నేను కొత్త యుగంలో దూసుకుపోతున్నానని అర్థం. లేదంటే ఈ వయసులో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ఇస్తారు.

బీబీసీ: సంప్రదాయ, ఆధునికతల మధ్య సమన్వయం ఎలా సాధించారు?

జాకిర్ హుసేన్: చిన్న వయసులోనే పెద్దలు, గురువులతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. నేను వారి నుంచి చాలా నేర్చుకున్నాను. తర్వాత కూడా నేను చాలా ఓపెన్ మైండెడ్‌గా ఉండే వాడిని. ముంబయిలో పెరిగిన నేను అన్ని రకాల సంగీతాలు వినగలిగాను. మా నాన్న కూడా ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ, వినడానికి నాకు రకరకాల టేపులు ఇచ్చేవారు. చిన్నవయసులోనే సంగీతంతో బంధం ఏర్పరుచుకోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కళాకారులతో కలిసి పని చేయగలిగాను.

12 ఏళ్ల వయసులో బడే గులాం అలీ, అమీర్‌ఖాన్‌, ఓంకార్‌నాథ్‌ ఠాకూర్‌తో కలిసి తబలా వాయించాను. 16-17 సంవత్సరాల వయస్సులో, రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్‌తో కలిసి పని చేశాను. వారి తరువాతి తరం హరి ప్రసాద్, శివ కుమార్, అమ్జద్ భాయ్ నుంచి నేటి తరం వాళ్లైన షాహిద్ పర్వేజ్, రాహుల్ శర్మ, అమన్-అయాన్‌లతో కూడా కలిసి పని చేశాను.

జాకిర్ హుసేన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత ప్రభుత్వం పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మ శ్రీ అవార్డులతో జాకిర్ హుసేన్‌ను గౌరవించింది.

బీబీసీ: మీ తండ్రి ఉస్తాద్ అల్లా రఖా స్వతహాగా ఒక సంగీత నిలయం. ఆయన మీకు స్ఫూర్తిగా నిలిచారా?

జాకిర్ హుసేన్: నాపై మా నాన్న ప్రభావం ఎక్కువగా ఉంది. నాకు ప్రాథమిక శిక్షణ ఇచ్చింది మా నాన్నే. ఆ తర్వాత వివిధ చోట్ల తబలా వాయించడం వల్ల ప్రముఖుల నుంచి స్ఫూర్తి పొందాను. ఉస్తాద్ హబీబుద్దీన్ ఖాన్, ఖలీఫా వాజిద్ హుస్సేన్, కాంత మహరాజ్జీ, శాంత ప్రసాద్ జీ లాంటి వారు కూడా నన్ను ప్రభావితం చేశారు.

బీబీసీ: తబలా కాకుండా ఇంకేదైనా వాయించాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా?

జాకిర్ హుసేన్: లేదు, వేరే మాటే లేదు. పడుకునేటప్పుడు కూడా తబలా నా దగ్గర ఉండేది. మరే ఇన్‌స్ట్రుమెంట్‌నైనా వాయించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. మా నాన్న కొన్నాళ్లు నాకు పియానో నేర్పించడానికి ప్రయత్నించారు.

బీబీసీ: మీ హెయిర్ స్టైల్ ఎందుకు డిఫరెంట్‌గా ఉంటుంది.

జాకిర్ హుసేన్: నేను కావాలని దాన్ని అలా పెంచుకోలేదు. కొన్నిసార్లు నన్ను చూస్తే అప్పుడే తలస్నానం చేసి వచ్చినట్లు కనిపిస్తాను. నేను ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు, తొందరలో తడి జుట్టును ఆరబెట్టి దువ్వుకునేవాడిని కాను.

అప్పట్లో అమెరికాలో హిప్పీ స్టైల్ బాగా పాపులర్. వారు జుట్టు ఎక్కువగా పెంచుతారు. కాబట్టి నేను కూడా దాదాపు అలాంటి స్టైల్‌నే ఫాలో అయ్యేవాడిని.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)