అంత్యక్రియల్లో డ్యాన్స్‌ చేసేందుకు ఈ అమ్మాయిలను పిలుస్తారు

రియా
ఫొటో క్యాప్షన్, రియా స్వస్థలం దిల్లీ
    • రచయిత, సీతూ తివారీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి, పట్నా

ఉదయం పూట 10 గంటలకు నేను రియాను కలుసుకున్నప్పుడు, ఆమె నడవడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు ఆమె ఎన్నిసార్లు కొబ్బరి నీళ్లు తాగారో లెక్కలేదు.

అంత్యక్రియల్లో డ్యాన్స్ చేసిన తర్వాత పట్నాలోని సిపారా ప్రాంతంలో ఉన్న తన అద్దె ఇంటికి తిరిగి వచ్చారు 24 ఏళ్ల రియా. రాత్రంతా డ్యాన్స్ చేయడంతో ఆమె చాలా అలసిపోయారు.

రియా స్వస్థలం దిల్లీ.

‘‘ఇక్కడ ప్రజలు చనిపోయినప్పుడు కూడా డ్యాన్స్ చేస్తారు. పాడె ఎత్తినప్పటి నుంచి డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. అంతేకాక, ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో కొందరు తప్పుగా కూడా ప్రవర్తిస్తుంటారు. మాకు సైగలు చేస్తూ, దగ్గరగా వచ్చి తాకడానికి ప్రయత్నిస్తారు. నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ, ఇదే మా వృత్తి’’ అని రియా చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రియా పక్కనే కూర్చున్న కాజల్ సింగ్ కూడా తన అనుభవాలను చెప్పారు.

‘‘పట్నాకు సమీపంలోని దనియావాన్‌లో అంత్యక్రియల్లో డ్యాన్స్ చేయాలంటూ మొదటిసారి నన్ను పిలిచారు. చావుకు ఏం డ్యాన్స్ చేస్తారు? అని చాలా షాకయ్యాను. తాను చనిపోయినప్పుడు డ్యాన్సర్లు వచ్చి డ్యాన్స్ చేయాలన్నది మరణించిన వ్యక్తి కోరిక అని వారు మాకు చెప్పారు’’ అని కాజల్ సింగ్ చెప్పారు.

రియా, కాజల్ ఇద్దరూ ప్రొఫెషనల్ డ్యాన్సర్లు. పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు, వివాహ వార్షికోత్సవాలతో పాటు ఇప్పుడు ఎవరైనా మరణించినప్పుడు కూడా వీరు డ్యాన్స్ చేస్తున్నారు. బిహార్‌లో దీన్ని ‘‘బాయీజీ కా నాచ్’ అని పిలుస్తారు.

కోమల్ మిశ్రా
ఫొటో క్యాప్షన్, 15 ఏళ్ల వయసు నుంచే పెళ్లిళ్లలో డ్యాన్స్ చేస్తున్న కోమల్ మిశ్రా

చావు వేడుకలు

ఎవరైనా పెద్దవారు చనిపోయినప్పుడు, బ్యాండ్, మ్యూజిక్‌తో అంత్యక్రియలకు తీసుకెళ్లడమన్నది సంప్రదాయం. కానీ, డ్యాన్స్‌లు వేయడం అన్నది ప్రస్తుతం సరికొత్త ట్రెండ్‌గా మారింది.

పట్నాకు చెందిన కోమల్ మిశ్రా.. తనకు 15 ఏళ్లు వచ్చినప్పటి నుంచే పెళ్లిళ్లలో డ్యాన్స్‌ చేయడం ప్రారంభించారు.

ప్రస్తుతం ఆమెకు 32 ఏళ్లు. గత ఏడు ఎనిమిదేళ్లుగా అంత్యక్రియల్లో కూడా డ్యాన్స్ చేయాలంటూ తనని పిలుస్తున్నారని కోమల్ మిశ్రా చెప్పారు.

‘‘చావైనా, పెళ్లయినా డ్యాన్స్ అనేది ఇప్పుడు అన్నింటికీ అవసరమవుతోంది. ఎలాంటి కమీషన్ లేకపోతే (కొందరు మధ్యవర్తులు వీరి కూలీలో కొంత తీసుకుంటారు), ఒక రాత్రి కార్యక్రమానికి ఆరు వేల వరకు సంపాదించుకోవచ్చు. డ్యాన్స్ కార్యక్రమం రాత్రి ఎనిమిది, తొమ్మిదికి మొదలవుతుంది. తెల్లవారుజామున నాలుగు, ఐదు గంటల వరకు జరుగుతుంది. తొలుత హిందీ పాటలు పెడతారు. రాత్రి 12 గంటల నుంచి భోజ్‌పురి పాటలు ప్లే చేస్తారు’’ అని కోమల్ వివరించారు.

‘‘పొట్టి దుస్తులు వేసుకుని రావాలని కొందరు చెబుతుంటారు. డబ్బులు చూపిస్తూ మమ్మల్ని కిందకు పిలుస్తుంటారు కొందరు. వారి ఒళ్లో కూర్చుని, డబ్బులు తీసుకోవాలి. పెళ్లిళ్లు, అంత్యక్రియలు.. ఏ కార్యక్రమంలోనైనా ఇలాంటి జరుగుతుంటాయి’’ అని ఆమె చెప్పారు.

అశీర్వాద్ కుమార్
ఫొటో క్యాప్షన్, ‘‘బాయీజీ కే నాచ్’’ సందర్భంగా కాల్పులు జరపడంతో నలంద జిల్లాకు చెందిన అశీర్వాద్ కుమార్ మరణించారు.

డ్యాన్స్‌లు మాత్రమే కాదు, గన్‌లు కూడా పేలుస్తారు

భోజ్‌పూర్, ఔరంగాబాద్, బంకా సహా.. బిహార్‌లోని చాలా ప్రాంతాల్లో అంత్యక్రియల్లో డ్యాన్స్‌లు చేసే ట్రెండ్ పెరుగుతోంది. అంత్యక్రియల సమయంలో ప్రజలు డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు పెడుతూ.. గాలిలోకి కాల్పులు కూడా జరుపుతుంటారు.

ఇటీవలే, ఒక చోట అంత్యక్రియల సందర్భంగా నిర్వహించిన ‘‘బాయీజీ కా నాచ్’’ సందర్భంగా నలంద జిల్లాకు చెందిన అశీర్వాద్ కుమార్ అనే వ్యక్తి బుల్లెట్ తగిలి మరణించారు.

‘‘నవంబర్ 2న జానకి దేవీ అంత్యక్రియల కార్యక్రమంలో డ్యాన్స్‌ను చూసేందుకు మేం వెళ్లాం. మధ్యరాత్రి, ముగ్గురు డ్యాన్సర్లు తుపాకీలు పట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. మా అబ్బాయి కూడా స్టేజీపై డ్యాన్స్ చేస్తున్నాడు. తెల్లవారుజామున నాలుగు గంటలప్పుడు వాడి తలకు బుల్లెట్ తాకింది. ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ, మా బాబును కాపాడుకోలేకపోయాం’’ అని అశీర్వాద్ కుమార్ తండ్రి ప్రమోద్ ప్రసాద్ తెలిపారు.

అంత్యక్రియల కార్యక్రమాల్లో నిర్వహించే డ్యాన్స్ ప్రోగ్రామ్‌లలో, కొందరు చేతుల్లో గన్‌లు పట్టుకుని డ్యాన్స్ చేసే వీడియోలు చాలానే వైరల్ అవుతున్నాయి.

‘‘అంతకుముందు నాకు భయం వేసేది. కానీ, ఇప్పుడెలాంటి భయం లేదు. చెప్పాలంటే, నా ప్రోగ్రామ్‌లో బుల్లెట్ పేలకపోతే, నా డ్యాన్స్‌కు అసలు అర్థమే లేదని నేను భావిస్తున్నా’’ అని కోమల్ చెప్పారు.

‘‘గొప్పవారు చనిపోయినప్పుడు అధికారిక లాంఛనాల పేరుతో గాలిలోకి కాల్పులు జరుపుతుంటారు. అదే విధంగా ప్రజలు కూడా వారి బంధువుల కోసం గాల్లోకి కాల్పులు జరిపి, సమాజంలో వారి బలాన్ని చూపించుకుంటున్నారు. ఇది ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసరించడం లాంటిదే’’ అని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చెందిన మాజీ ప్రొఫెసర్ పుష్పేంద్ర తెలిపారు.

ఇది సంప్రదాయంలో భాగమా?

ఉత్తరప్రదేశ్‌లోని పీజీ ఘాజిపూర్ కాలేజీలో రామ్ నారాయణ్ తివారి ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ‘భోజ్‌పురి కార్మికుల జానపద గేయాల్లోని జంతసార్’ అనే పుస్తకంతో పాటు పలు పుస్తకాలను రామ్ నారాయణ్ తివారీ రాశారు.

‘‘మరణాలకు సంబంధించిన మూడు రకాల పాటలు ఉన్నాయి. ఒకటి మృత్యు గీత్. రెండోది నిర్గుణ్, మూడోది శ్రీ నారాయణి. అంత్యక్రియలప్పుడు మహిళలు ఏదైనా చెబుతూ ఏడవడాన్ని రుద్రన్ గీత్ అంటారు. కానీ, డ్యాన్స్ అనేది నిషేధం’’ అని ఆయన చెప్పారు.

‘‘చావుతో ముడిపడి ఉన్న సంప్రదాయ గేయాలలో అపరాధం, కరుణ, శాంతి ఉంటుంది. కానీ, ప్రస్తుతం పెడుతున్న పాటలు, డ్యాన్స్ చేసేందుకు మహిళలను పిలవడం వంటివి వారి కులాధిపత్యం చూపించుకునేందుకు ప్రదర్శిస్తున్నారు’’ అని తివారీ అన్నారు.

పల్లవి బిశ్వాస్ పాటలీపుత్ర యూనివర్సిటీలో మ్యూజిక్ టీచర్.

‘‘మరణానంతరం, చనిపోయిన వారికి, ఈ భూమ్మీద ఉన్న వారికి ఈ జర్నీని సులభతరం చేయాలని కోరుతూ పాటలు ఉండేవి. ఆ పాటలు సామాన్య ప్రజల యాసలో ఉండేలా నిర్గుణ్ వచ్చింది. నిర్గుణ్ తర్వాత, దుగోలా పాడటం ప్రారంభించారు. కానీ, ఆ తర్వాత దుగోలాలో మహిళలు డ్యాన్స్‌లు చేయడం కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం ప్రత్యేకంగా డ్యాన్సర్లను పిలిపించి, భోజ్‌పురి పాటలకు డ్యాన్స్‌లు చేయిస్తున్నారు’’ అని ఆమె తెలిపారు.

డ్యాన్సర్ కోమల్
ఫొటో క్యాప్షన్, కులాన్ని బట్టి పాటలు నిర్ణయిస్తారన్న డ్యాన్సర్ కోమల్

కులాధిపత్యాన్ని చూపించుకునేందుకు..

‘‘గతంలో, దుగోలాలో మతపరమైన అంశాలను ప్రశ్నలు, సమాధానాల రూపంలో ఆలపించే వారు. కానీ ఇప్పుడు కులతత్వ వ్యంగ్యం ఎక్కువైంది’’ అని పల్లవి అన్నారు.

‘‘గత 30 ఏళ్లుగా, దుగోలాను చావుల సందర్భంగా పాడుతున్నారు. యూట్యూబ్‌లో మీరు రికార్డింగ్స్‌ను చూస్తే, వెనుకవైపు శ్రాద్ధ కర్మ కనిపిస్తుంటుంది. ముందు, దుగోలాలో అశ్లీల పాటలు, అమ్మాయిల డ్యాన్స్‌లు కనిపిస్తుంటాయి’’ అని బిహార్ సంస్కృతుల నిపుణురాలు, సీనియర్ జర్నలిస్ట్ నిరలా బిదేసియా చెప్పారు.

పెళ్లయినా, చావైనా పాటలను కులం బట్టి నిర్ణయిస్తారని డ్యాన్సర్ కోమల్ చెప్పారు.

‘అందుకే డ్యాన్సర్లను పిలిపిస్తుంటారు’

చాలాసార్లు ఆత్మీయుల ఒత్తిళ్లతో ఈ డ్యాన్సర్లను పిలిపిస్తున్నారు. నలందలోని గోవింద్‌పుర్‌కు చెందిన అజయ్ యాదవ్ తన తండ్రి మరణించినప్పుడు డ్యాన్సర్లను పిలిపించారు.

‘‘డ్యాన్స్ చేయించాలని మా కమ్యూనిటీవారు కోరడంతో టెంట్‌ వేశాం. డ్యాన్స్ చేసే ఆరుగురు అమ్మాయిలను పిలిపించాం. తొలుత నిర్గుణ్ జరిగింది. ఆ తర్వాత రాత్రికి భోజ్‌పురి పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేశారు. ఈ విషయంలో మా అమ్మ చాలా భాదపడింది. దీనిపై కొన్నిరోజుల పాటు బాధపడుతూనే ఉంది’’ అని అజయ్ చెప్పారు.

కాజల్ సింగ్

‘సమాజానికి అంత మంచిది కాదు’

సమాజానికి ఈ ట్రెండ్ అంత మంచిది కాదని సామాజికవేత్తలు అంటున్నారు. ‘‘ఇది పూర్తిగా సరికొత్త మాస్ కల్చర్. దీనిలో జానపద సంగీతం, ఇతర సంస్కృతులు కలుస్తున్నాయి’’ అని ప్రొఫెసర్ పుష్పేంద్ర చెప్పారు.

దీనివల్ల వచ్చే పర్యవసనాలు ఏమిటి? అని ప్రశ్నించినప్పుడు, ‘‘చావుకి, జీవితానికి మధ్య తేడాన్ని మనం చెరిపేసినప్పుడు, పశ్చాత్తాపం, హింసపై ద్వేషం, శాంతి, మరణం తర్వాత సంయమనం పాటించే ప్రవర్తన ఇలా అన్నింటినీ కోల్పోతాం. దీనివల్ల, సమాజం మరింత హింసాత్మకంగా మారుతుంది’’ అని పుష్పేంద్ర అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)