పాకిస్తాన్: రెండేళ్లపాటు పతాక శీర్షికలకెక్కిన ఆమె పేరు చనిపోయిన రోజు ఎందుకు కనిపించలేదు, అత్యంత మిస్టరీ మరణంలో ఆమె పాత్ర ఏంటి?

ఇప్పటికీ వీడని ముస్తఫా మరణం వెనక మిస్టరీ

ఫొటో సోర్స్, Saba Imtiaz

ఫొటో క్యాప్షన్, షెహనాజ్ గుల్(ఎడమ), ముస్తఫా హస్నైన్ జైదీ(కుడి)
    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ హిందీ

పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడిన సమయమది. ఆ సమయంలో కూడా షెహనాజ్ గుల్ పేరు పాకిస్తాన్ వార్తా పత్రిక పతాక శీర్షికలలో దాదాపు రెండేళ్లపాటు కనిపించింది. హత్యా నేరాభియోగాలు ఎదుర్కొన్న షెహనాజ్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

ఒకనాడు పాకిస్తాన్ పత్రికల పతాకశీర్షికలుగా కనిపించిన షెహనాజ్ తరువాత రోజులలో అజ్ఞాత జీవితం గడిపారు. అజ్ఞాతంగానే మరణించారు.

పాకిస్తాన్‌లో లాహోర్ కమిషనర్‌గా, కవిగా పేరు గాంచిన సయ్యద్ ముస్తఫా హసనైన్ జైదీ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. హసనైన్ జైదీ హత్య కేసులోనే షెహనాజ్ అభియోగాలు ఎదుర్కొన్నారు. ఇంతకీ ఎవరీ హసనైన్ జైదీ? ఆయనకు షెహనాజ్ మధ్య ఏం జరిగింది? వారిద్దరూ ఆరోజుల్లో ఎందుకింత సంచలనంగా మారారు. తరువాత ఏం జరిగింది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాకిస్తాన్‌లో అత్యంత సంచలనాత్మక కేసు

ఫొటో సోర్స్, Saba Imtiaz

ఫొటో క్యాప్షన్, ముస్తఫా జైదీ, షెహనాజ్ గుల్

కలవని ఫోన్

కరాచీ టెలిఫోన్ ఎక్స్‌చేంజ్‌కు 1970 అక్టోబరు 13వ తేదీ అర్ధరాత్రి ఓ ఫిర్యాదు వచ్చింది. 417935 నెంబరుగల టెలిఫోన్‌కు ఎన్నిసార్లు కాల్ చేసినా...ఫోను కలవడం లేదన్నది ఆ ఫిర్యాదు సారాంశం.

ఎక్స్ఛేంజ్ సిబ్బంది ఫిర్యాదు ఆధారంగా ఆ నెంబర్‌ను చెక్ చేసి, ఫోన్ ఎంగేజ్‌లో ఉందని ఫిర్యాదుదారుడికి సమాచారం అందించారు. ఆ ఎంగేజ్డ్ ఫోన్ యజమాని పేరు సయ్యద్ ముస్తఫా హసనైన్ జైదీ.

కొన్నిరోజుల కిందటే ముస్తఫా తన 40వ పుట్టినరోజు జరుపుకున్నారు. ముస్తఫా స్నేహితుడు షాహిద్ అబిది కూడా ఆయనకు ఫోన్ చేశారు. సలీమ్ అనే వ్యక్తి తన ఇంటికి రావడంతో షాహిద్...ముస్తఫాకు ఫోన్ చేశారు.

కొన్నిగంటల నుంచి తన భార్య షెహనాజ్ గుల్ కనిపించడం లేదని ఆమె వయసు 26 ఏళ్ళని, బహుశా ముస్తఫా దగ్గరకు వెళ్లి ఉండవచ్చనే అనుమానంతో సలీమ్, ముస్తఫా స్నేహితుడైన షాహిద్ వద్దకు వచ్చారు. తన భార్య కనిపించడం లేదనే విషయాన్ని పురువు పోతుందనే భయంతో సలీమ్ పోలీసులకు చెప్పాలనుకోలేదు. అందుకే ముస్తఫా ఎక్కడుంటారో కనుక్కునేందుకు సలీమ్, షాహిద్ ఇంటికి వచ్చారు. తరువాత సలీమ్ ముస్తఫా ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో ముస్తఫా నిద్రపోతున్నారని ఆయన వాచ్‌‌మెన్ సలీమ్‌కు చెప్పారు.

అయినా సలీమ్ ముస్తఫాను నిద్రలేపాలని నిర్ణయించుకుని, ఆయన బెడ్‌రూమ్ తలుపు తట్టారు. కానీ లోపల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. లోపల నుంచి ఏసీ చప్పుడు వినిపిస్తోంది. ముస్తఫా కారు కూడా గ్యారేజీలోనే ఉంది. దీంతో సలీమ్ ఆరోజు రాత్రంతా మనశ్శాంతి లేకుండానే గడిపారు. మరుసటిరోజు ఉదయం ఏడున్నరకు మరోసారి ముస్తఫాతో మాట్లాడానికి సలీమ్ ప్రయత్నించినా ఉపయోగం లేకపోవడంతో చివరకు పోలీసులకు సమాచారమందించారు.

పోలీసులు ముస్తఫా ఇంటికి చేరుకున్నారు. బెడ్‌రూమ్ తలుపు పగలకొట్టి లోపలికి వెళ్లేసరికి, ముస్తఫా విగతజీవిగా మంచంపై కనిపించారు. ఆయన మృతదేహం రక్తంతో తడిసిపోయిఉంది. ఆయన శరీరంపై ఎక్కడా గాయాలు లేవు కానీ ముక్కు, నోటి నుంచి రక్తం కారుతోంది. ఫోన్ రిసీవర్ వేలాడుతోంది.

ఆయన గది బయట కారిడార్‌లో షెహనాజ్ అపస్మారకస్థితిలో కనిపించారు.

మిస్టరీ మరణం వెనక షెహనాజ్ గుల్ ప్రమేయమేంటి?

ఫొటో సోర్స్, Saba Imtiaz

ఫొటో క్యాప్షన్, షెహనాజ్ గుల్

‘‘షెహనాజ్ కోసం తపించేవారు’’

‘‘ఆ రోజుల్లో ముస్తఫా జైదీ చాలా నిరుత్సాహంగా ఉండేవారు. హెహనాజ్ గుల్‌ను కలవాలని ఆయన భావించేవారు. కానీ ఆమె ఆయన్ను దూరం పెట్టారు. ముస్తఫా పదే పదే కోరడంతో ఆయన్ను కలవడానికి షెహనాజ్ వెళ్లారు’’ అని ఇటీవల ప్రచురితమైన ‘సొసైటీ గర్ల్, ఏ టేల్ ఆఫ్ సెక్స్, లైస్ అండ్ స్కాండల్’ అనే పుస్తకంలో తూబా మసూద్ ఖాన్ రాశారు.

మరణించిన వ్యక్తి సాధారణమైన మనిషి కాదు. అంతకు కొద్దికాలం ముందటివరకు ముస్తఫా లాహోర్ జిల్లా కమిషనర్‌గా పనిచేశారు. ఆయన పాకిస్తాన్ యువ కవుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రముఖ కవి జోష్ మలీహబాది ఆయన గురువు.

అపస్మారక స్థితిలో ఉన్న షెహనాజ్‌ను తక్షణమే జిన్నా ఆస్పత్రికి తరలించారు. ఆమెతో పాటు భర్త సలీమ్ ఉన్నారు. మరణించిన సమయంలో ముస్తఫా బ్లూ షర్ట్ వేసుకున్నారు. టక్ చేసుకున్నారు. ఎడంచేయి పొట్టమీద ఉంది. చొక్కా గుండీలు తీసిఉన్నాయి.

‘‘గదిలో ఫర్నీచర్ చెల్లాచెదురుగా పడి ఉంది. సోఫా తిరగబడిఉంది. దీపం పడిపోయింది. దాదాపు 50 నాఫ్తలిన్ గోలీలు మంచంమీద, నేలమీద ఉన్నాయి. కాఫీ మిగిలిపోయిన కప్పులు కనిపించాయి. ఫోన్‌కు దగ్గరగా మూడు చిన్నని బ్లూ మాత్రలు కనిపించాయి. జర్మన్ భాషలో రాయడానికి ముస్తఫా ప్రయత్నించిన కొన్ని పేపర్లు చిందరవందరగా పడిఉన్నాయి’’ అని ముస్తఫా మేనల్లుడు షాహిద్ రజా కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.

ముస్తఫా మరణవార్త విని ప్రముఖ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్‌ కూడా అక్కడికి చేరుకున్నారు.

ముస్తఫా మృతదేహాన్ని పరీక్షించిన డాక్టర్ ఆయన 18 నుంచి 24 గంటల క్రిందటే చనిపోయి ఉండొచ్చని వెల్లడించారు.

ముస్తాఫా హత్య కేసులో షహనాజ్ అరెస్ట్

ఫొటో సోర్స్, Saba Imtiaz

ఫొటో క్యాప్షన్, ముస్తఫా జైదీ

కవి, అధికారి

ముస్తఫా భారత్‌లోని అలహాబాద్‌కు చెందిన వారు. పాకిస్తాన్‌కు వలస వెళ్లేముందు వరకు ఆయన తేగ్ అలహాబాది పేరుతో కవిత్వం రాసేవారు.

‘‘ఆయన కవితా సంకలనం ‘జంజీరే’ 1947లో ప్రచురితమైంది. ఆ పుస్తకానికి ప్రముఖ కవి ఫిరాఖ్ గోరఖ్‌పురి ముందు మాట రాశారు. చిన్నతనంలోనే ముస్తఫాకు గుర్తింపు లభించింది. ఆయన ప్రగతిశీల ఆలోచనలతో ఉండేవారు. మార్క్సిజాన్ని నమ్మేవారు. అలహాబాద్‌లో ఉన్న సమయంలో ఆయన కవిసమ్మేళనాలకు హాజరుకావడం ప్రారంభించారు’’ అని సొసైటీ గర్ల్ సహ రచయిత్రి సబా ఇంతియాజ్ చెప్పారు.

విభజన తర్వాత ముస్తఫా పాకిస్తాన్ వెళ్లిపోయారు. అక్క కాలేజీలో చేరారు. పాకిస్తాన్ సివిల్ సర్వీసుకు ఎంపికయ్యారు. 1954 బ్యాచ్‌కు చెందిన ప్రతిభావంతుడైన అధికారిగా ముస్తఫాను భావిస్తారు. ఆయన ప్రతిభకు ‘తమ్‌ఘా-ఎ-కాయద్-ఎ-ఆజమ్’ అవార్డు లభించింది.1957లో ఆయన జర్మన్ మహిళ వెరాను పెళ్లిచేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు.

‘‘1969 డిసెంబరులో పాకిస్తాన్ ప్రభుత్వం 303మంది సివిల్ సర్వీస్ అధికారులను సస్పెండ్ చేసింది. వారిలో ముస్తఫా జైదీ ఒకరు. ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ అవి నిరూపితం కాలేదు’’ అని సబా ఇంతియాజ్ తెలిపారు.

షహనాజ్‌ను రెండో పెళ్లి చేసుకున్న సలీమ్ ఖాన్

ఫొటో సోర్స్, Roli Books

ఫొటో క్యాప్షన్, షెహనాజ్ గుల్, సలీమ్ ఖాన్

షెహనాజ్ ఆత్మహత్యాయత్నం?

జిన్నా ఆస్పత్రిలో షెహనాజ్ గుల్‌కు చేసిన వైద్యపరీక్షల్లో ఆమె లిబ్రియం మాత్రలు తీసుకున్నట్టు తేలింది. ముస్తఫాను కలవడానికి వెళ్లడం మినహా తనకేమీ గుర్తులేదని షెహనాజ్ పోలీసులకు తెలిపారు.

ముస్తఫా ఇంట్లో షెహనాజ్ ఏ దుస్తులతో కనిపించారో, ఆ దుస్తులతోనే ఆమె ఆస్పత్రిలోనూ కనిపించారు. ఆమె జుట్టంతా చిందరవందరగా ఉంది. ముఖం వాచిపోయింది. ఒకరోజు తర్వాత షెహనాజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. భర్త సలీమ్ ఆమెను ఇంటికి తీసుకెళ్లారు.

‘‘అప్పట్లో షెహనాజ్ గుల్ చాలా అందమైన మహిళ. 54 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ షెహనాజ్ లాంటి అందమైన మహిళ దేశంలోనే లేరని పాకిస్తాన్‌లో చెప్పుకుంటారు. ఆమె భర్త ఆమె కన్నా కనీసం 30 ఏళ్లు పెద్దవాడు. సలీమ్ మొదట ఇంగ్లీషు మహిళను పెళ్లిచేసుకున్నారు. ఆయన అంతకుముందు భారత ఆర్మీలో ఉండేవారు. విభజన తర్వాత ఆయన భారత ఆర్మీకి రాజీనామా చేశారు’’ అని సబా ఇంతియాజ్ చెప్పారు.

పెళ్లిసమయంలో సలీమ్ వయసు 46 ఏళ్లు, షెహనాజ్ వయసు 17 ఏళ్లు.

‘‘షెహనాజ్‌ కవిత్వాన్ని. పార్టీలకు వెళ్లడాన్ని ఇష్టపడేవారు. ఆమెతో మాట్లాడేందుకు ప్రజలు ఉత్సాహం చూపేవారు. 1964లో షెహనాజ్‌కు మొదటి బిడ్డ జన్మించింది. అప్పట్లో ఆమె లాహోర్ నుంచి కరాచీకి వచ్చారు’’ అని ఇంతియాజ్ చెప్పారు.

షహనాజ్‌పై పుస్తకం

ఫొటో సోర్స్, tooba masood khan

ఫొటో క్యాప్షన్, సొసైటీ గర్ల్ రచయిత్రులు సబా ఇంతియాజ్, తూబా మసూద్ ఖాన్

ముస్తఫా, షెహనాజ్ పరిచయం

సివిల్ సర్వీసెస్ అధికారిగా ఉన్నప్పుడు ముస్తఫా జైదీ తరచుగా కరాచీ వెళుతుండేవారు. సింథ్ క్లబ్‌లో మొదటిసారి షెహనాజ్, సలీమ్ దంపతులు ముస్తఫాను కలిశారు.

‘‘షెహనాజ్‌ను తాను చాలా ఇష్టపడుతున్నానని ముస్తఫా తన స్నేహితులకు చెప్పారు. తన స్నేహితులతో కలిసి ముస్తఫా పిక్నిక్‌లకు వెళ్లేటప్పుడు షెహనాజ్ గుల్, ఆమె భర్త కూడా వాళ్లతో ఉండేవారు. షెహనాజ్ పెళ్లయిన మహిళ అని ముస్తఫాకు చాలా మంది చెప్పారు. ఆమెతో సంబంధం ఏర్పరుచుకునేముందు ఈ విషయంలో ఆయన కొంచెం ఆలోచించాల్సింది. కానీ ముస్తఫా ఎవ్వరి మాటా వినలేదు’’ అని సబా ఇంతియాజ్ అభిప్రాయపడ్డారు.

తర్వాత ముస్తఫా లాహోర్ నుంచి కరాచీకి మకాం మార్చేశారు. దీంతో వారి అనుబంధం బాగా పెరిగింది.

‘‘ముస్తఫా జైదీ కోసం తన కుటుంబాన్ని విడిచి వచ్చేందుకు షెహనాజ్ అంగీకరించలేదని మా పరిశోధనలో తేలింది’’ అని ఇంతియాజ్ తెలిపారు.

తొలి పరిచయం తరువాత ముస్తఫా, షెహనాజ్ తరచుగా కలుచుకోవడం ప్రారంభించారు. ఆడవారితో సంబంధాలు పెట్టుకోవడం ముస్తఫాకు ఇష్టమని..ఆయన్ను తెలిసినవాళ్లు చెప్పారు.

‘‘షెహనాజ్‌ను ముస్తఫా ప్రేమగా లాలి అని పిలిచేవారు. షెహనాజ్ సిగ్గుపడినప్పుడు ఆమె బుగ్గలు ఎరుపెక్కేవి. అందుకే ముస్తఫా అలా పిలిచేవారు’’ అని ఇంతియాజ్ తెలిపారు.

‘‘మహిళలతో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా ముస్తఫా తన అహాన్ని సంతృప్తిపరుచుకునేవారని ఆయన స్నేహితులు చెప్పారు. తన జర్మన్ భార్య ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్న భ్రమలో కూడా ఆయన ఉండేవారు. వివాహేతర సంబంధాలపై ఆయన తన స్నేహితులకు మేధోపరమైన కారణాలను చెప్పేవారు’’ అని తూబా మసూద్ తెలిపారు.

ఫ్రెంచ్ నవలాకారుడు ఫ్రాన్సోయిస్ సాగన్ నవల ‘బాంజో త్రిస్తేస్’ ప్రభావం, సమాంతర నైతికత అనే ఆలోచన ప్రభావం ముస్తఫాపై చాలా ఎక్కువగా ఉండేదని ఫైజ్ కూతురు సలీమా చెప్పారు. భార్య వెరాపై ఆయన ఒక కవిత చెప్పారు.

‘నా నల్లని అంచులు చూసిన తర్వాత కూడా

మీ తెల్లని దుపట్టాలకు నా గురించి ఎలాంటి బాధ కలగదు’

షెహనాజ్‌పై ముస్తఫా ఐదు కవితలు రాశారు. వాటిలో ఒకటైన ‘అప్నీ జాన్ నజర్ కరూ’ ఆయన మరణానంతరం పత్రికలో ప్రచురితమైంది.

నీ కథ నేను వేరుగా ఎలా రాయగలను?

నా కళ, నా కవిత్వం, నా రాతలన్నీ నీ నుంచే వచ్చాయి.

షహనాజ్‌ను క్రిస్టీన్ కీలర్‌తో పోలుస్తూ కరపత్రాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్రిస్టీన్ కీలర్

కరాచీ క్రిస్టీన్ కీలర్

ముస్తఫా కేసును కేసును దర్యాప్తు చేస్తున్న డీఎస్పీ అబ్దుల్ రషీద్‌కు ముస్తఫా కప్‌బోర్డులో ఒక పిస్తోల్, 25 బుల్లెట్లు కనిపించాయి.

దీంతో పాటు ‘కరాచీ క్రిస్టీన్ కీలర్ షెహనాజ్’ అనే పేరుతో ఉన్న కరపత్రాలు కూడా కనిపించాయి. అందులో షెహనాజ్ ఫొటోలున్నాయి. ఆ ఫొటోల్లో ఆమె నడుము నుంచి కింద భాగం వరకు నగ్నంగా కనిపిస్తున్నారు.

‘‘ముస్తఫా మరణానికి కొన్ని నెలల ముందు షెహనాజ్ యూరప్ వెళ్లారు. తనతో షెహనాజ్ ప్రవర్తించేతీరులో మార్పు వచ్చిందని ఆ సమయంలోనే ముస్తఫా భావించారు. ఆమె ఫోన్‌లో మాట్లాడేవారు కాదు. ఆయన ఉత్తరాలకు సమాధానమిచ్చేవారు కాదు. ఇంకెవరితోనో షెహనాజ్‌కు సంబంధం ఉందని ముస్తఫా భావించారు. ఆమె ప్రవర్తన ఆయనకు కోపం తెప్పించింది. చివరకు అది ప్రతీకారంగా మారింది’’ అని సబా ఇంతియాజ్ చెప్పారు.

‘‘ముస్తఫా దగ్గర షెహనాజ్ చిత్రాలు కొన్ని ఉన్నాయి. కరాచీలోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో ఆ ఫొటోలతో ఆయన 4వేల కరపత్రాలు ముద్రించారు. వాటిలో ఆయన ‘కరాచీ క్రిస్టీన్ కీలర్’ అని రాశారు. పాకిస్తాన్ సంపన్న సమాజాన్ని, అక్కడి మనుషుల వైఖరిని బయటపెడతానని ఆయన అందులో రాశారు. ఆయన వాటిని ముద్రించారు కానీ ఎవరికీ పంపిణీ చేయలేదు. వాటిని తన స్నేహితుల్లో ఒకరికి ఆయన చూపించారు. ఇవన్నీ చేయద్దని ఆ స్నేహితుడు ముస్తఫాకు సూచించారు’’ అని ఇంతియాజ్ తెలిపారు.

బ్రిటన్ యుద్ధ మంత్రి జాన్ ప్రొఫ్యూమో‌తో కీలర్‌కు సంబంధాలు ఉండేవి. తరువాత ఆమెకు లండన్‌లో ఉంటున్న సోవియట్ యూనియన్ నావికా దౌత్యవేత్తతోనూ సంబంధం ఉన్నట్టు బయటపడింది. తరువాత ప్రొఫ్యూమో రాజీ నామా చేశారు.

పాకిస్తాన్ అప్పటి అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌కు కూడా కీలర్ స్నేహితురాలు. వారిద్దరూ ఒకే స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొడుతూ కనిపించేవారు.

ఇప్పటికీ వీడని ముస్తఫా హస్నైన్ జైదీ మరణ రహస్యం

ఫొటో సోర్స్, Saba Imtiaz

ఫొటో క్యాప్షన్, ముస్తఫా

షెహనాజ్ గుల్ అరెస్ట్

షెహనాజ్ గుల్‌ను ఆరోజుల్లో మార్నింగ్ న్యూస్ ప్రతినిధి ఎస్‌కె పాషా ఇంటర్వ్యూ చేశారు.

‘‘ఆమె అందమైన ముఖం పాలిపోయింది. మత్తెక్కించే ఆమె కళ్లు నిద్రమాత్రల వల్ల భారంగా కనిపిస్తున్నాయి. ఆమె అమాయకత్వానికి ప్రతిరూపంలా కనిపించారు. తేలికపాటి ఇంగ్లీషులో ఆమె మాట్లాడుతున్నారు. తనకు, ముస్తఫాకు మధ్య కాస్త పరిచయం ఉందని షెహనాజ్ తెలిపారు. తమకు శారీరక సంబంధం లేదన్నారు’’ అని పాషా రాశారు.

పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంపై మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు.

ముస్తఫా మరణించిన రెండు వారాల తర్వాత పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముస్తఫా జైదీ మరణంపై తాము నిష్పాక్షిక విచారణ జరుపుతున్నామని, కానీ ఇంకా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు.

ఈ కేసులో కుట్రపూరితమైనది ఏదీ లేదని కొందరు భావిస్తే..ముస్తఫా మరణం వెనక షెహనాజ్ హస్తం ఉందని మరికొందరు నమ్మారు. పోలీసులు షెహనాజ్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని అప్పటి పరిస్థితులనుబట్టి పాకిస్తాన్ మొత్తం అనుకుంది.

‘‘మరణించినప్పుడు ఎక్కడికో వెళ్లేందుకు తయారయినట్టుగా ముస్తఫా దుస్తులున్నాయి. ఒకవేళ అది ఆత్మహత్యే అయితే షెహనాజ్, ముస్తఫా ఒకే తరహా విషం ఎందుకు తీసుకోలేదు’’ అని ముస్తఫా సోదరుడు ఇర్తాజా జైదీ ప్రశ్నించారు.

అదే సమయంలో సింధ్, బలూచిస్తాన్ హైకోర్టు సీనియర్ జడ్జి అబ్దుల్ ఖాదిర్ షేక్ ఎవరూ ఊహించని ఆదేశాలిచ్చారు. కేసులో అప్పటివరకు జరిగిన దర్యాప్తుకు సంబంధించిన నివేదికను తన ముందుంచాలని ఆదేశించారు.

ఫలితంగా 1970 నవంబరు 5న ముస్తఫా హత్యపై ఎఫ్ఐఆర్ నమోదయింది. పాకిస్తాన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం షెహనాజ్ గుల్‌పై కేసు నమోదయింది.అదే రాత్రి క్రైమ్ బ్రాంచ్ అధికారులు షెహనాజ్‌ను అరెస్టు చేసేందుకు ఆమె ఇంటికి చేరుకున్నారు.

‘‘షెహనాజ్ గుల్ ఇంటికి పోలీసులు వెళ్లే సమయానికి ఆమె నిద్రపోతున్నారు. ముస్తఫాను హత్య చేసినందుకు అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు చెప్పగానే ఆమె మూర్ఛపోయారు’’ అని 1970 నవంబరు 7న ప్రచురితమైన సంచికలో ది మార్నింగ్ స్టార్ రాసింది.

ముస్తఫా మృతదేహాన్ని వెలికితీసి రీ పోస్టుమార్టమ్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. పోలీసులుషెహనాజ్‌ను జంషెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ మహిళా ఖైదీలకు ప్రత్యేక వసతి లేదు. దీంతో ఆమెను పోలీస్ స్టేషన్ వరండాలో ఉంచి ఓ మహిళా పోలీసు అధికారిని ఆమెకు కాపలాగా పెట్టారు.

‘షెహనాజ్ కాటన్ సల్వార్ కమీజ్ ధరించారు. చెక్క బెంచీకి బదులు ఆమె నేలమీద నిద్రించారు. ఆమెకు కప్పుకోవడానికి రెండు దుప్పట్లు ఇచ్చారు. రోజుకు ఐదుసార్లు ఆమె ప్రార్థన చేసుకుంటున్నారు. అది రంజాన్ మొదటి వారం అయినప్పటికీ ఆమె ఉపవాసం ఉండడం లేదు’ అని పాకిస్తాన్ న్యూస్ పేపర్లు రాశాయి. (జంగ్, నవంబరు 14,1970)

పాకిస్తాన్‌లో అత్యంత అందమైన మహిళగా షహనాజ్‌కు గుర్తింపు

ఫొటో సోర్స్, Saba Imtiaz

ఫొటో క్యాప్షన్, షెహనాజ్ గుల్

రుజువు కాని ఆరోపణలు

ముస్తఫా జైదీతో తనకు సన్నిహిత సంబంధాలు లేవని గతంలో చెప్పిన మాటలనే విచారణ సమయంలోనూ షెహనాజ్ చెప్పారు. తమకెప్పుడూ శారీరక సంబంధం లేదన్నారు.

ముస్తఫా కప్‌బోర్డులో కనిపించిన ఫొటోలు తనవి కావన్నారు. ముస్తఫా హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని కోర్టు తీర్పు వెల్లడించింది.

షెహనాజ్ అక్కడ ఉన్నంత మాత్రాన ఆమె హత్య చేశారని నిర్ణయించలేమని తెలిపింది.

‘‘మరణానికి ముందు ముస్తఫా నిరాశానిస్పృహలతో ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. మరణానికి ముందు ఆయన చెప్పిన మాటలు గమనిస్తే ఆయన తన ప్రాణాలను తానే తీసుకున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. ఈ మరణంలో షెహనాజ్ ప్రమేయముందని చెప్పడానికి, సందర్భోచిత సాక్ష్యాలు చాలవని నేను భావిస్తున్నా. ఆమెపై చేసిన ఆరోపణలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది’’ అని జడ్జి కున్వార్ చెప్పారు.

కోర్టు తీర్పు తర్వాత షెహనాజ్ తన లాయర్‌ ఎస్ ఎస్ షేక్‌తో మాట్లాడి వడివడిగా ఆ గది నుంచి వెళ్లిపోయారు. ఆమె ఫోటో తీయడానికి ఓ ఫోటోగ్రాఫర్ ప్రయత్నించారు. ఆ సమయంలో ఆమె తన ముఖాన్ని శాలువాతో కప్పుకోవడానికి గానీ, తలకిందకు దించుకుని నేలవైపు చూడడానికి గానీ ప్రయత్నించలేదు. ఫోటోగ్రాఫర్ కెమెరావైపు నేరుగా చూశారు. ఫోటోగ్రాఫర్ ఆమె ఫోటో తీశారు.

నిర్దోషిగా విడుదలైన తర్వాత జనాల్లోకి రావడం ప్రారంభించిన షహనాజ్

ఫొటో సోర్స్, Roli books

ఫొటో క్యాప్షన్, షెహనాజ్‌పై వార్తాపత్రికల కథనాలు

పత్రికల నిండా షెహనాజ్ వార్తలే

పాకిస్తాన్‌లో ఆ సమయంలో షెహనాజ్‌ది అత్యంత సంచలనాత్మక కేసు. పాకిస్తాన్‌లో అప్పుడు చాలా జరుగుతున్నాయి. కానీ షెహనాజ్ గుల్ ఫొటోలు రోజూ పత్రికల్లో ప్రచురితమయ్యేవి. పత్రికల్లో ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త ఉండేది. జంగ్ వార్తాపత్రికకు చెందిన ఒక రిపోర్టర్ షెహనాజ్ ఏం చేస్తున్నారో చూడడానికి పోలీస్ స్టేషన్ గోడ ఎక్కారు.

అప్పట్లో పరిస్థితి ఎలా మారిపోయిందంటే పిల్లలు వార్తాపత్రికలు చదవకూడదని ప్రజలు పేపర్లను వేయించుకోవడం మానేశారు.షెహనాజ్ గుల్‌కు అది చాలా కష్టమైన సమయం. దాదాపు రెండేళ్లపాటు ఆమె పత్రికల మొదటి పేజీల్లో నిలిచారు.

‘‘సంచలనాత్మక తరహాలో ఆ సమయంలో పత్రికలు పనిచేశాయి. అక్టోబరు 1970 నుంచి, 1972 వరకు షెహనాజ్ ముఖం పత్రికల మొదటి పేజీల్లో కనిపించేదంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి. ఆ సమయంలో తూర్పు పాకిస్తాన్ వేరు పడి బంగ్లాదేశ్ అయింది. అయినప్పటికీ షెహనాజ్ ఎల్లప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలిచేవారు. డాన్‌తో పాటు ఇతర సాయంకాలం పత్రికలు షెహనాజ్ సెక్స్ లైఫ్ గురించి వార్తలు రాసేవి. ఆమెకు సంబంధించినప్రతి విషయం పత్రికల్లో వచ్చేది. ఓ వ్యక్తికి సంబంధించిన వార్తలు ఈ స్థాయిలో రావడం నా జీవితంలో నేనెప్పుడూ చూడలేదు’’ అని తూబా మసూద్ చెప్పారు.

నిర్దోషి అన్న తీర్పు వెల్లడయిన కొన్నిరోజుల తర్వాత నుంచి ఆమె జనంలోకి రావడం మొదలుపెట్టారు.

‘‘చాలా మంది ఆమెపై జాలి చూపించేవారు. షెహనాజ్‌కు జరిగింది చాలా బాధాకరమైన విషయంగా వారు భావించేవారు. ఈ ఘటన తర్వాత ఆమె పార్టీకో, రెస్టారెంట్‌కో, లేదా వీధిలో పళ్లు కొనడానికో వెళ్లినా సరే..ప్రజలు ఆమెను ఆపి చూస్తుండేవారు. ఆ తర్వాత ఆమెప్పుడూ ముస్తఫా జైదీ గురించి బహిరంగంగా మాట్లాడలేదు’’ అని సబా ఇంతియాజ్ తెలిపారు.

20 ఏళ్ల కిందట ఆమె అజ్ఞాత వ్యక్తిగా మరణించారు.

ఆమె మరణవార్తను సైతం న్యూస్ పేపర్లు ప్రచురించలేదు. ఇవే న్యూస్ పేపర్లు ఒకానొక సమయంలో ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్నీ అన్ని వివరాలతో ప్రతిరోజూ మొదటిపేజీలో ప్రచురించేవి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)