కీలక రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ వరుస ఓటములకు కారణమేంటి?

ఫొటో సోర్స్, X/Congress
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ బీజేపీ సొంతంగా సాధించలేకపోవడంతో కాంగ్రెస్ సంతోషపడింది. కానీ ఆ పార్టీ ఈ ఆనందాన్ని కొనసాగించుకోలేకపోయింది. దీనికి కారణం లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలు సాధించింది. 2019 ఎన్నికల్లో 52 సీట్లు సాధించింది. 2024లో మాత్రం 99 స్థానాలు గెలుపొందింది. ఆ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పుంజుకుంటోందన్న నమ్మకం కలిగింది.
రాజ్యాంగం, రిజర్వేషన్, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలపై లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏపై ఒత్తిడి పెంచడంలో కాంగ్రెస్ కొంత మేర సఫలీకృతమైంది.
లోక్‌సభ ఎన్నికల్లో మెరుగ్గా రాణించిన కాంగ్రెస్, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలవుతోంది. వీటిని ఉదహరిస్తూ కొందరు లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టింది కాంగ్రెస్ కాదని, ఆ పార్టీ మిత్రపక్షాల వల్ల ఎక్కువ సీట్లు వచ్చాయని అభిప్రాయపడ్డారు. కానీ అది నిజం కాదు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వరుసగా కీలక రాష్ట్రాల్లో ఎందుకు పరాజయం పాలవుతోందన్నది ఈ విశ్లేషణ ద్వారా అర్థం చేసుకోవచ్చు.


ఫొటో సోర్స్, ANI
కాంగ్రెస్ అంచనాలు ఎక్కడ తప్పాయి?
లోక్‌సభ ఎన్నికలు ముగిసిన కొన్నిరోజులకే హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో గెలుపొందుతుందన్న ధీమా ఆ పార్టీలో వ్యక్తమైంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, బీజేపీని పార్లమెంట్ లోపలా, బయటా రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏమైనప్పటికీ హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది.
మహారాష్ట్రలోనూ అదే జరిగింది.
ఝార్ఖండ్ విషయానికొస్తే... ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా కలిసి కూటమిగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 16 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. 2024లోనూ అన్నే సీట్లు సాధించింది.
ఇక జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. 90 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ ఆరు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అక్కడ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ఓ కూటమిగా ఉన్నాయి.
లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మెరుగ్గా రాణించలేకపోయింది. అందుకే కాంగ్రెస్ విధానాలు ఎక్కడ విఫలమవుతున్నాయన్నది మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీనికోసం మేం చాలా మంది రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులతో చర్చించాం. వారంతా ఏం చెప్పారంటే..
మహారాష్ట్రలో ఏం జరిగింది?
మహారాష్ట్రలో బీజేపీ, శిందే శివసేన, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కలిసి ‘మహాయుతి’ కూటమిగా ఏర్పడి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశాయి. బీజేపీ 149 స్థానాల్లో పోటీచేసింది. శిందే శివసేన 81 సీట్లలో, ఎన్సీపీ 59 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి.
కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడితో మహాయుతి పోటీపడింది. ఆ కూటమిలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ ఉన్నాయి. ఉద్ధవ్ శివసేన 95 స్థానాల్లో ఎన్సీపీ 101 సీట్లలో, కాంగ్రెస్ 86 స్థానాల్లో పోటీచేశాయి.
చాలా ఎగ్జిట్‌పోల్స్ మహాయుతి గెలుస్తుందని అంచనావేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం మహావికాస్ అఘాడికి అనుకూలంగా అంచనాలు వెల్లడించాయి.
మహాయుతి 288 స్థానాల్లో 235 గెలుచుకుంది. ఈ కూటమికి 49.6 శాతం ఓట్లు పడ్డాయి.
మహావికాస్ అగాఢీ 35.3 శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగింది. 49 స్థానాలకు పరిమితమైంది.

ఫొటో సోర్స్, Getty Images
మహారాష్ట్రలో అసలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారిన విషయాలేంటి?
‘‘ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యకర్తలు, సంస్థాగత బలోపేతం ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి. కానీ ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తల హవా నడుస్తోంది. వాళ్లే ఎన్నికల విధానాలను, అంశాలను నిర్ణయిస్తున్నారు. టికెట్లు ఎవరికివ్వాలనేది నిర్ణయించడంలో కూడా వారిది చాలా ముఖ్యమైన పాత్ర. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఈ సంస్కృతి బాగా కనిపిస్తోంది. గత కొన్ని అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ ఈ ఎన్నికల వ్యూహకర్తలపై ఆధారపడుతోంది. హరియాణా, మహారాష్ట్రలోనూ ఇదే జరిగింది’’ అని రాజకీయ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ విశ్లేషించారు.
‘‘హరియాణా, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుపై ఆదారపడింది. హరియాణాలో తప్పుడు అభ్యర్థులకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ ఓటమి నుంచి కాంగ్రెస్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు’’ అని ఆయనన్నారు.
‘‘సునీల్ కనుగోలు గురించి పార్టీనేతలు కొందరు ప్రశ్నించగా రాహుల్ గాంధీ పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను సైతం టికెట్ల పంపకంలో పక్కనపెట్టారు’’ అని కిద్వాయ్ తెలిపారు.
కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పకపోవడం కూడా ఆ పార్టీ చేసిన తప్పు అని కిద్వాయ్ అభిప్రాయపడ్డారు.
‘‘మహావికాస్ అఘాడి ముఖ్యనేతగా ఉద్ధవ్ థాక్రే గుర్తింపు పొందారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకించలేదు. అదే సమయంలో కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీ త్యాగాలు చేయడం నేర్చుకోవాలని కూడా రాహుల్ గాంధీ చెబుతుంటారు. మరోవైపు కూటమిలోని పెద్ద నాయకులంతా ఒకరితో ఒకరు వాదులాడుకుంటుంటారు. ఈ వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తుంటుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, శరద్ పవార్ వేర్వేరు విషయాల గురించి మాట్లాడుతుంటారు. వాటిపై రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే దృష్టిపెట్టరు. ‘‘ఒక్కటిగా ఉంటే సురక్షితంగా ఉంటాం’’ వంటి బలమైన నినాదాలతో బీజేపీ విధానాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. కానీ కాంగ్రెస్‌కు అలాంటి బలమైన నినాదం లేదు. బీజేపీ సొంత బలంతోనూ, ఆర్ఎస్ఎస్ ప్రభావంతోనూ గెలిచింది. బీజేపీ గెలుపులో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించింది. ఎన్నికల వ్యూహకర్తల సాయం కూడా బీజేపీ తీసుకుంది. కానీ పార్టీలోని వ్యక్తుల కంటే వ్యూహకర్తలకు బీజేపీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు’’ అని కిద్వాయ్ విశ్లేషించారు.
స్థానిక అంశాలను పట్టించుకోని కాంగ్రెస్
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ స్థానిక అంశాలపైనే పూర్తిగా దృష్టిపెట్టింది.
బలమైన నినాదాల ద్వారా హిందూ ఓటర్లకు విజ్ఞప్తులు చేసింది. లాడ్లీ బహీన్ వంటి పథకాలు, రిజర్వేషన్లపై, మహారాష్ట్ర రైతుల సమస్యలపై ప్రశ్నలు వంటివాటి చుట్టూ బీజేపీ ప్రచారం కేంద్రీకృతమైంది’’ అని కిద్వాయ్ విశ్లేషించారు.
బీజేపీ తరహాలో స్థానిక సమస్యలపై కాంగ్రెస్ దృష్టిపెట్టలేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ ‘రాజ్యాంగాన్ని రక్షించండి’ వంటి నినాదాల గురించి, కులవివక్ష గురించి మాట్లాడారు. దీంతో రిజర్వేషన్ అంశంలో మరాఠాలు, ఓబీసీల మధ్య నెలకొన్న వివాదం నుంచి కాంగ్రెస్ లబ్దిపొందలేకపోయింది.
రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ల గురించి మాత్రమే కాంగ్రెస్ మాట్లాడుతూ వచ్చింది.
లోక్‌సభ ఎన్నికల్లో విదర్భ ప్రాంతంలో మొత్తం 10 స్థానాల్లో 7 గెలిచినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలైంది.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార అంశాలు భిన్నంగా ఉంటాయని కిద్వాయ్ చెప్పారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలపై తన విధానాలను కాంగ్రెస్ గట్టిగా ప్రజలముందుంచలేకపోయింది. దీనివల్ల కాంగ్రెస్‌కు చేదుఫలితాలు ఎదురయ్యాయి.
తమ హామీలను నెరవేర్చుతామన్న నమ్మకాన్ని కాంగ్రెస్ ఓటర్లకు కల్పించలేకపోయిందని ప్రముఖ జర్నలిస్ట్ అదితి ఫడ్నిస్ విశ్లేషించారు.
‘‘లాడ్లీ బహీన్ పథకం కింద డబ్బు అందించడం ద్వారా తాము హామీలను నెరవేర్చుతామన్న నమ్మకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చింది. అందుకే మహిళలు పెద్ద సంఖ్యలో మహాయుతికి ఓట్లేశారు. మహిళలకు డబ్బు అందిస్తామని కాంగ్రెస్ కూడా హామీ ఇచ్చింది. అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ ప్రజలకు నమ్మకం కలిగించలేకపోయింది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
‘‘లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరు వ్యూహాలు అనుసరించాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రానికి కాంగ్రెస్‌కు ప్రత్యేక వ్యూహం ఉండడం లేదు. కాంగ్రెస్ విధానాలు బలహీనంగా ఉన్నాయని హరియాణా, మహారాష్ట్ర.. రెండింటిలోనూ స్పష్టమైంది’’ అని ఫడ్నిస్ విశ్లేషించారు.

ఫొటో సోర్స్, ANI
ఝార్ఖండ్‌లో ఏం జరిగింది?
ఝార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలుండగా కాంగ్రెస్, ఝార్ఖండ్ ముక్తిమోర్చా కలిసి 70 చోట్ల పోటీచేశాయి. ఝార్ఖండ్ ముక్తిమోర్చాకు 34 స్థానాలు లభించగా, కాంగ్రెస్ 16 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రీయ జనతా పార్టీ 4 చోట్ల, సీపీఐ రెండు స్థానాల్లో గెలుపొందాయి.
ఝార్ఖండ్‌లో కూడా బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో బీజేపీ శక్తియుక్తులన్నీ వెచ్చించి రాజకీయవ్యూహాలు రచించింది.
బంగ్లాదేశ్ చొరబాటుదారుల గురించి బీజేపీ ప్రస్తావించింది. అయితే హేమంత్ సోరెన్ ప్రచారం చేసిన ‘ఆదివాసీలు వర్సెస్ బయటివారు’ అన్న నినాదం ముందు అది పనిచేయలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఝార్ఖండ్‌లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు ఎందుకు సాధించలేకపోయింది?
2019ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 16 స్థానాలు గెలుపొందింది. మరి ఈ సారి ఎక్కువస్థానాల్లో ఎందుకు గెలవలేకపోయింది?
ఈ ప్రశ్నలకు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు శరద్ గుప్తా ఇచ్చిన సమాధానాలు చాలా ముఖ్యమైనవి.
‘‘దేశమంతా ఎలాంటి తప్పు చేస్తోందో... అలాంటి తప్పునే కాంగ్రెస్ ఝార్ఖండ్‌లో కూడా చేసింది. స్థానిక సమస్యలను గుర్తించడంలో, వాటిని ప్రస్తావించడంలో కాంగ్రెస్ విఫలమయింది. కాంగ్రెస్‌కు జాతీయస్థాయిలో బలమైన నాయకత్వం లేకపోవడం కూడా ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది’’ అని ఆయన చెప్పారు.
‘‘మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, హరియాణాలో కాంగ్రెస్‌లో స్థానిక నేతల హవా సాగుతోంది. వారి ఇష్టానుసారం టికెట్లు పంపిణీ చేస్తున్నారు. మహారాష్ట్రలోలానే స్థానిక నేతల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలవడంపై దృష్టిపెట్టకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది’’ అని ఆయనన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఆదివాసీల నాయకత్వంపై దృష్టిపెట్టని కాంగ్రెస్
‘‘ఆదివాసీల నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి కాంగ్రెస్ ప్రయత్నించలేదు. దాని ఫలితాలను కాంగ్రెస్ ఇప్పుడు అనుభవిస్తోందనే అభాప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీలో ఆదివాసీలను నాయకులుగా తీర్చిదిద్దే ప్రయత్నం ఝార్ఖండ్ కాంగ్రెస్ చేయలేదు. కానీ బీజేపీ ఆదివాసీలకు ప్రాముఖ్యత కల్పించింది. అర్జున్ ముండా, బాబూలాల్ మరాండీ వంటివారిని ముఖ్యమంత్రులను చేసింది’’ అని శరద్ గుప్తా విశ్లేషించారు.
చాలా చోట్ల కాంగ్రెస్ తన మిత్రపక్షాలపైకి భారం నెట్టేసి నింపాదిగా ఉంటోందని, ఇది పార్టీ భవిష్యత్తుకు మంచి పరిణామం కాదని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
‘‘బిహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్, తమిళనాడులో డీఎంకే, జమ్ము కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌పై కాంగ్రెస్ ఆధారపడింది. మిత్రపక్షాల మద్దతుతో ప్రతిసారీ కొన్నిసీట్లు గెలుస్తోంది. ఒడిశాలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఒకప్పుడు తూర్పు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా ఉండేది. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో కూడా బీజేపీ తన ఆధిపత్యం ప్రదర్శిస్తోంది’’ అని శరద్ గుప్తా విశ్లేషించారు.
‘‘ఎన్నికల ప్రచార అంశాలను కాంగ్రెస్ నిర్ణయించలేకపోతోంది. బీజేపీ మాత్రం ప్రతి రాష్ట్రంలో కొత్త అంశాలను లేవనెత్తుతోంది. ఇంకా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నియోజకవర్గంలో విభిన్న సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఆ ప్రాంతం చరిత్ర, భౌగోళిక, రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రధాని ప్రసంగాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఎలాంటి అంశాలను అనుసరించాలన్నదానిపై కాంగ్రెస్ కేంద్ర నాయకత్వంలో స్పష్టత లేకపోవడం, ఆ అంశాలను స్థానిక స్థాయిలో ప్రస్తావించలేకపోవడం కాంగ్రెస్‌కు అతిపెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోలేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామన్న ఆశలు కాంగ్రెస్ పెట్టుకోకూడదు’’ అని శరద్ గుప్తా సూచించారు.

ఫొటో సోర్స్, ANI
హరియాణా ఎన్నికల్లో ఏం జరిగింది?
అక్టోబరులో హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందన్న వాదన వినిపించింది. రైతులు, రెజ్లర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించారు. అయినప్పటికీ హరియాణాలో బీజేపీ వరుసగా మూడోసారి గెలుపొందింది.
దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ హరియాణాలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనావేశాయి.
హరియాణా అసెంబ్లీలో 90 స్థానాలున్నాయి. బీజేపీ 48చోట్ల గెలుపొందింది. 39.9శాతం ఓట్లు సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ మూడన్నర శాతం ఓటింగ్ పెంచుకుంది.
హరియాణాలో కాంగ్రెస్ 37 చోట్ల విజయం సాధించింది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఆరు స్థానాల్లో ఎక్కువగా గెలుపొందింది.
మెజార్టీ సాధించడంలో కాంగ్రెస్ ఎక్కడ వెనకపడింది?
కాంగ్రెస్ ఓటమిపై హేమంత్ ఆత్రి విశ్లేషించారు. ‘‘ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత ఉంది. కానీ హరియాణా ఎన్నికలపై కాంగ్రెస్ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేదు. ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం అంతర్గత కలహాలే. ప్రధాని మోదీ కూడా దీని గురించి మాట్లాడారు. కాంగ్రెస్ నాయకురాలు సెల్జాకు పార్టీలో అవమానం జరిగిందని మోదీ ఆరోపించారు.
హరియాణాలో జాట్‌లు, జాట్‌యేతర వర్గాల విభేదాలను, కాంగ్రెస్‌లో హుడా వర్సెస్ సెల్జా అంశాల నుంచి బీజేపీ బాగా లబ్ధి పొందింది. ప్రతి నియోజకవర్గంలో బీజేపీ ప్రత్యేక వ్యూహం అవలంబించింది. ఎన్నికల్లో గెలవడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలూ చేసింది. దీంతో కాంగ్రెస్‌కు పరాభవం తప్పలేదు.
హరియాణాలో తాము మంచి ఉన్న స్థితిలో ఉన్నామని కాంగ్రెస్ నాయకులు భావించారు. చావో రేవో తరహాలో ఎన్నికల్లో పోరాడలేదు. అక్కడే వారి వ్యూహాత్మక తప్పిదం మొదలయింది. అంతర్గత కలహాలు, అభ్యర్థుల ఎంపికలో తప్పుడు నిర్ణయాలతో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. పార్టీలో వర్గపోరు వేగంగా విస్తరించింది.
బీజేపీలో ఒకరికి టికెట్ ఇస్తే.. ఆ అభ్యర్థి మొత్తం పార్టీ అభ్యర్థిగా ఉంటారు. కానీ కాంగ్రెస్‌లో టికెట్ పొందిన అభ్యర్థి ప్రత్యేక గ్రూప్‌కు చెందిన వ్యక్తిగా మాత్రమే ఉంటారు. ఆ అభ్యర్థిని ఓడించడానికి కాంగ్రెస్‌లోని ఇతర గ్రూపే ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ సంస్కృతికి హరియాణా ఎన్నికలు ఓ ఉదాహరణ’’ అని ఆత్రి చెప్పారు.
అంతర్గత కలహాల వల్లే హరియాణాలో కాంగ్రెస్ ఓటమి పాలైందని అతిది ఫడ్నిస్ విశ్లేషించారు. కాంగ్రెస్‌లో ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














