కాప్ 29 ఒప్పందంపై భిన్నాభిప్రాయాలు ఎందుకు?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, మాట్ మెక్‌గ్రాత్
- హోదా, బీబీసీ పర్యావరణ ప్రతినిధి
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఇటీవల రెండు వారాల పాటు అజర్‌బైజాన్ రాజధాని బాకులో కాప్29 సదస్సు జరిగింది. ఈ సదస్సులో 200 దేశాలు పాల్గొన్నాయి. 2035 నుంచి క్లైమేట్ ఫైనాన్స్ కింద అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏటా 300 బిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్టు ఈ సదస్సులో ధనిక దేశాలు ప్రకటించాయి. అయితే, ఆ మొత్తం చాలా తక్కువని అభివృద్ధి చెందుతున్న దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఇది ‘‘స్వల్ప మొత్తం’’ అని భారత్ వ్యాఖ్యానించింది. ‘‘ఇది చాలా తక్కువ మొత్తం, అది కూడా చాలా ఆలస్యంగా ఇస్తామంటున్నారు’’ అని ఆఫ్రికా గ్రూప్ ప్రతినిధులు అన్నారు.
ఇది పెద్ద మొత్తంలో కుదిరిన ఒప్పందంలా పైకి కనిపిస్తోంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు దీనిపై అసంతృప్తితో ఉండడం అభివృద్ధి చెందిన చాలా దేశాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి ప్రస్తుతం క్లైమేట్ ఫైనాన్స్ కింద పేద దేశాలు అందుకుంటున్నది ఏడాదికి 100 బిలియన్ డాలర్లు మాత్రమే. దీంతో పోలిస్తే కాప్ 29 ఒప్పందంలో పెరుగుదల ఉంది.


భారీ ఒప్పందంపై భిన్నాభిప్రాయాలు
ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని, ఇది కూడా గ్రాంట్లు, లోన్ల మిశ్రమమని ఆరోపణలు వస్తున్నాయి. సంపన్న దేశాలు చివరి నిమిషం దాకా నిరీక్షింపజేసి ఈ మొత్తాన్ని ప్రకటించడంపైనా అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.
దీనిపై భారత ప్రతినిధి చాందిని రైనా స్పందించారు. ‘‘ఇది స్వల్ప మొత్తం’’ అన్నారు.
‘‘ఇది ఒక భ్రమలాంటింది. మా అభిప్రాయం ఇదే. మనమందరం ఎదుర్కొంటున్న సమస్యను ఇది పరిష్కరించలేదు’’ అని ఆమె అన్నారు.
ఇలా వాదించినప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ ఒప్పందాన్ని అంగీకరించాల్సి వచ్చింది. వాతావరణ మార్పులను ఓ సమస్యగా భావించని ట్రంప్ పాలన వచ్చే ఏడాది ప్రారంభం కాబోతోందని, ఆయన ఆధ్వర్యంలో ఇంతకంటే మంచి ఒప్పందం కుదరబోదని సంపన్న దేశాలు వాదించాయి.
అభివృద్ధి చెందిన దేశాల కోణం నుంచి చూసినా ఇది దూరదృష్టి ఉన్న ప్యాకేజీ అన్న అభిప్రాయం కలగదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ప్రపంచాన్ని రక్షించాలనుకుంటే ఉద్గారాలను తగ్గించడంలో సంపన్న దేశాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత దశాబ్దంలో 75 శాతం ఉద్గారాలు ఆ దేశాల నుంచే వెలువడ్డాయి.
రాబోయే పదేళ్ల కాలంలో ప్రతి దేశం భూతాపాన్ని పెంచే వాయువులను తగ్గించడానికి అనుసరించాల్సిన జాతీయ ప్రణాళికలను వచ్చే వసంత కాలం నాటికి వెల్లడించనున్నాయి.
కాప్ 29లో కుదిరిన ఫైనాన్స్ ఒప్పందం అలాంటి ప్రయత్నాలపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రాంతీయ రాజకీయ అనిశ్చితి నెలకొని ఉన్న ఈ సమయంలోనే సురక్షిత వాతావరణ పరిస్థితులు కల్పించడానికి దేశాలు ఐక్యంగా పనిచేయాల్సి ఉండడం కష్టమైన విషయం. డబ్బు విషయంలో పెద్ద ఎత్తున సాగుతున్న పోరాటం పేద, ధనిక వర్గాల మధ్య గతంలో నెలకొన్న వ్యత్యాసాలను తిరిగి తెరపైకి తెచ్చింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడనంత కోపం, అసహనం ఈ విషయంలో వ్యక్తమవుతున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
అజర్‌బైజాన్‌పై విమర్శలు
200 దేశాలను క్లైమేట్ ఫైనాన్స్‌పై కీలక ఒప్పందానికి అంగీకరించేలా చేయడం చాలా కష్టమైన అంశం. కాప్ సదస్సుకు ఆతిథ్యమిచ్చిన అజర్‌బైజాన్‌కు గతంలో కాప్ విధివిధానాలను నిర్ణయించిన చరిత్ర లేదు. ఇది వారి పరిధికి మించిన అంశం అన్న విషయం ఈ సదస్సుతో నిరూపితమైంది.
చమురు, గ్యాస్‌ను దేవుడిచ్చిన బహుమతిగా అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ అభివర్ణించడం పరిస్థితిని మరింత దిగజార్చింది. పాశ్చాత్య మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని, చారిటీలు, రాజకీయ నాయకులు తప్పుడు సమాచారం వ్యాప్తిచేస్తున్నారని ఆయన త్రీవస్థాయిలో చేసిన ఆరోపణల వల్ల ఎలాంటి ఉపయోగం కలగలేదు.
కాప్ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చే దేశాలను ఎలా ఎంపిక చేస్తారనే దానిపై వివాదం నెలకొన్న మూడో దేశం అజర్‌బైజాన్. ఈజిప్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తర్వాత అజర్‌బైజాన్ ఆతిథ్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాగానే చమురు, గ్యాస్ ఎగుమతులపై వచ్చే ఆదాయం ద్వారానే అజర్‌బైజాన్ అభివృద్ధి చెందింది. బొగ్గు, చమురు, గ్యాస్ వంటివాటికి ప్రత్యామ్నాయంగా ఇతర వనరుల వినియోగం వైపు ప్రపంచాన్ని మార్చే విధానాలు అవలంబించడం అలాంటి దేశాల్లో కష్టం అన్న అభిప్రాయం ఉంది.
ఈ దశాబ్దంలో అధ్వాన్నంగా జరిగిన ‘కాప్ సదస్సు ఇదే’ అని చాలా మంది సీనియర్ ప్రతినిధులు ప్రయివేట్ సంభాషణల్లో నిరాశచెందారు.

ట్రంప్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎలా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందడంతో భవిష్యత్ వాతావరణ చర్చలలో అమెరికా పాత్రపై అనేక సందేహాలు నెలకొన్నాయి. దీంతో వచ్చే నాలుగేళ్లలో చర్చలకు అమెరికా హాజరుకాకపోతే, వాతావరణ సదస్సులకు నాయకత్వం వహించేది ఎవరనే దానిపై అందరి దృష్టి పడింది.
చైనా ఈ వారసత్వాన్ని కొనసాగించే అవకాశం ఉంది.
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా కర్బన ఉద్గారాలు విడుదల చేసే దేశం ఈ కాప్ సదస్సులో మౌనంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చే క్లైమేట్ ఫైనాన్స్‌పై వివరాలు అందించేందుకు మాత్రమే ముందుకువచ్చింది.
ఐక్యరాజ్య సమితి ప్రకారం, చైనా ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమే. గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించాలని, లేదా పేద దేశాలకు ఆర్థిక సాయం చేయడం అన్నది చైనాకు తప్పనిసరి బాధ్యత కాదు.
అయితే ఆర్థిక ఒప్పందంలో ఓ ఫార్ములాకు చైనా అంగీకరించింది. క్లైమేట్ ఫైనాన్స్‌లో తన వంతు భాగస్వామ్యం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చింది.
చైనా అడుగు చాలా తెలివైన, ప్రభావవంతమైనది.
‘‘ప్రపంచ దేశాలకు అందించే ఆర్థిక సాయం విషయంలో చైనా మరింత పారదర్శకంగా వ్యవహరిస్తోంది’’ అని ఆసియా సొసైటీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన లి షువో చెప్పారు.
భవిష్యత్తులో శక్తిమంతమైన పాత్ర పోషించడానికి చైనాకు ఇది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
ట్రంప్ హయాంలో అమెరికా భాగస్వామ్యం ఉండదా?
ట్రంప్ అక్కడ లేకపోయినప్పటికీ కాప్ సదస్సు మొత్తం ట్రంప్ ఉన్నట్టే అనిపించింది.
ట్రంప్ రెండోసారి అధికారంలో ఉండే సమయంలో వాతావరణ మార్పులపై చర్చలు, సంప్రదింపులు ఏళ్ల తరబడి సాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బాకులో జరిగిన సదస్సులో భాగస్వామ్య దేశాల ప్రతినిధులందరూ భావించారు.
అందుకే సంపన్న దేశాలు 2035 నాటికి నిధులు పెంచాలన్న దానికి కట్టుబడి ఉండాలనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ట్రంప్ పదవీకాలం పూర్తయిన తర్వాత అమెరికా మరోసారి వాతావరణ మార్పులపై చర్చల్లో భాగస్వామ్యమవుతుందని వారు నమ్ముతున్నారు.
అలాగే ట్రంప్‌ను దృష్టిలో ఉంచుకునే భాగస్వాములు ఇవ్వాల్సిన మొత్తాన్ని పెంచాలని భావించారు.
స్వచ్ఛందంగానే అయినా చైనా ముందుకు రావడానికి కారణం, కాప్ వంటి అంతర్జాతీయ సదస్సులకు తాను నాయకత్వం వహించగలను అన్న విషయాన్ని రుజువుచేయడానికే.
‘‘వాతావరణ మార్పులపై జరిగే అనేక రకాల చర్చలపై ప్రభావం చూపడం తప్ప ట్రంప్ మరేమైనా చేయగలరని ఎవరూ అనుకోవడం లేదు’’ అని ఓడీఐ గ్లోబల్ థింక్ ట్యాంక్ విజిటింగ్ సీనియర్ ఫెలో ప్రొఫెసర్ మైఖేల్ జాకోబ్స్ చెప్పారు.
అయితే వాతావరణ విధ్వంసాన్ని వీలైనంతమేర తగ్గించడం ఈ ఒప్పందం ఉద్దేశం.
మరింత బలంగా తమ గొంతు వినిపించిన ప్రచార కర్తలు
పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న ఎన్జీవోలు, ప్రచార కర్తలు తీవ్రస్థాయిలో స్పందించడం కాప్ 29 సదస్సులో గుర్తించాల్సిన ముఖ్యమైన అంశం.
ఓ మీటింగ్ ప్రాంతానికి వస్తున్న అమెరికా వాతావరణ ప్రతినిధి జాన్ పాడెస్టాను వెంబడిస్తూ పర్యావరణ కార్యకర్తలు ‘‘సిగ్గు సిగ్గు’’ అంటూ చేసిన నినాదాలు చెవుల్లో ఇంకా మార్మోగుతున్నాయి. ఈ ఘటనకు నేను ప్రత్యక్షసాక్షిని.
కాప్ వంటి క్లిష్టమైన సదస్సుల విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ ఎన్జీవోలపై ఆధారపడతాయి.
చర్చల సమయంలో ఈ ప్రచారకర్తలు ఎలాంటి ఒప్పందాన్ని అయినా వ్యతిరేకించాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచారు.
చివరకు అన్ని దేశాలు ఆమోదించిన ఫైనాన్స్ ఒప్పందాన్ని, చాలా దేశాలకు చెందిన ప్రతినిధులు వ్యతిరేకిస్తూ మాట్లాడినప్పుడు ప్రచారకర్తలు వారికి మద్దతుగా నినాదాలు చేశారు.
దౌత్యపరమైన వాతావరణ సదస్సులో ఘర్షణాత్మక క్రియాశీలత, ప్రతినిధులు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలు చెప్పడం, ప్రచారకర్తలు వ్యతిరేక నినాదాలు చేయడం, దౌత్యవేత్తలను నిలదీయడం కొత్త విధానంగా మారనుందా?
ఇది నిజమా.. కాదా అన్నది తెలుసుకోవడానికి వచ్చే కాప్ సదస్సు వరకు ఎదురుచూడాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














