హరప్పా నాగరికతపై పరిశోధిస్తోన్న ఐఐటీ దిల్లీ పరిశోధకురాలు ఎలా చనిపోయారు?

ఫొటో సోర్స్, Ahmedabad Rural Police/Verma Family
- రచయిత, గోపాల్ కటేసియా
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థి సురభి వర్మ బుధవారం (నవంబర్ 27) గుజరాత్‌లోని లోథాల్‌లో మట్టి పెళ్లలు కూలి మీద పడటంతో బురదలో కూరుకుపోయి మృతి చెందారు.
భారత్‌లో హరప్పా నాగరికతకు నిలయమైన లోథాల్ ప్రాంతం అహ్మదాబాద్‌కు 75 కి.మీ దూరంలో ఉంటుంది.
పీహెచ్‌డీ కోసం పరిశోధన చేస్తోన్న సురభి వర్మతో పాటు పీహెచ్‌డీలో ఆమెకు గైడ్‌గా వ్యవహరిస్తోన్న ప్రొఫెసర్ యామా దీక్షిత్ కూడా మట్టిపెళ్లల కింద కూరుకుపోయారు. అయితే, పోలీసులతో కలిసి స్థానికులు ఆయనను కాపాడారు.
ఇక్కడ పరిశోధన కోసం సురభి వర్మ భారత పురావస్తు శాఖ నుంచి అవసరమైన అనుమతులు తీసుకోలేదని దర్యాప్తులో వెల్లడైంది.

లోథాల్‌లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన వేళ ఓ పరిశోధకురాలు ప్రమాదవశాత్తు మృతి చెందడం పురావస్తు శాస్త్రవేత్తలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
భొగావో నది ఒడ్డున ఉన్న లోథాల్ నగరాన్ని హరప్పా నాగరికత కాలంలో ప్రధాన ఓడరేపు పట్టణంగా భావించేవారు. హరప్పా నాగరికతనే సింధు లోయ నాగరికత అని పిలుస్తారు.
లోథాన్ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు.
ఈ ఘటన తర్వాత పురావస్తు ప్రాంతాల్లో పరిశోధన కోసం నిర్దేశించిన ప్రక్రియలను (ఎస్‌ఓపీ) అనుసరించారా? లేదా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

ఫొటో సోర్స్, Ahmedabad Rural Police
లోథాల్‌లో సురభివర్మ ఎలా చనిపోయారు?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సింధు లోయ నాగరికతపై వాతావరణ మార్పుల ప్రభావం గురించి ప్రొఫెసర్ దీక్షిత్‌తో పాటు సురభి వర్మ పరిశోధన చేస్తున్నారు. పరిశోధనలో భాగంగా మట్టి నమూనాలు తీసుకోవడం కోసం వారిద్దరూ లోథాల్‌కు వచ్చారు.
ఈ ఘటన గురించి అహ్మదాబాద్ రూరల్ ఎస్పీ ఓం ప్రకాశ్‌తో బీబీసీ మాట్లాడింది.
‘‘లోథాల్‌లోని సింధు లోయ నాగరికత రక్షిత ప్రాంతం నుంచి మట్టి నమూనాలు తీసుకోవాలని పరిశోధకులు అనుకున్నారు. పక్కనే ఉన్న రోడ్డు మీద ఒక జేసీబీ పనిచేస్తోంది. పరిశోధన పనుల కోసం ఒక గొయ్యిని తవ్వాలని జేసీబీ డ్రైవర్‌ను వారు కోరారు. అందుకే జేసీబీ డ్రైవర్ రోడ్డుకు సమీపంలో ఒక గొయ్యిని తవ్వారు.
మట్టి నమూనాలు సేకరించడం కోసం దీక్షిత్, సురభి వర్మ ఆ గొయ్యిలోకి దిగారు. వారు అందులోకి దిగిన తర్వాత గొయ్యిలోకి నీరు రావడం మొదలైంది. ఉదయం దాదాపు 10:50 గంటలకు మట్టిదిబ్బ కూలడంతో వారిద్దరూ బురదలో కూరుకుపోయారు. స్థానికులు, మా పోలీస్ సిబ్బంది కలిసి ప్రొఫెసర్ దీక్షిత్‌ను రక్షించగలిగారు. కానీ, బురదలోంచి బయటకు తీసేసరికే సురభి చనిపోయారు’’ అని ఓం ప్రకాశ్ వివరించారు.

ఫొటో సోర్స్, Ahmedabad Rural Police
ఐఐటీ దిల్లీ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, ప్రొఫెసర్ దీక్షిత్ ప్రాచీన వాతావరణం, హైడ్రాలజీలో మార్పులు, వాతావరణంలో ఆకస్మిక మార్పులు, పురాతన నాగరికతలపై వీటి ప్రభావం అనే అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు.
కోథ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ వీఎన్ గోహిల్ కూడా ఈ ఘటన వివరాలు వెల్లడించారు.
‘‘మట్టి కూలిపడటంతో బురదలో కూరుకుపోయిన సురభికి ఊపిరి ఆడలేదు. ఆమెను బయటకు తీసి వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లాం. కానీ, ఆమె చనిపోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధరించారు. మెరుగైన చికిత్స కోసం ప్రొఫెసర్ దీక్షిత్‌ను అహ్మదాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించాం’’ అని ఆయన వివరించారు.
లోథాల్‌కు 20 కి.మీ దూరంలో కోథ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది.
‘‘మట్టి నమూనాలు సేకరించే సమయంలో ఐఐటీ గాంధీనగర్ అసోసియేట్ ప్రొఫెసర్ వీఎన్ ప్రభాకర్, సీనియర్ రీసెర్చ్ ఫెలో శిఖా రాయ్ గొయ్యి పక్కన నిల్చున్నారు. వారు జేసీబీ సహాయంతో 10 ఫీట్ల లోతు, 13 ఫీట్ల పొడవు, నాలుగు ఫీట్ల వెడల్పుతో గొయ్యిని తవ్వించారు. గొయ్యి తవ్విన తర్వాత జేసీబీ సహాయంతో దీక్షిత్, సురభి వర్మ అందులోకి దిగారు. మట్టి నమూనాలు సేకరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత సమీపంలో జరుగుతున్న రోడ్డు పనుల కోసం జేసీబీ వెళ్లిపోయింది’’ అని గోహిల్ వివరించారు.

ఫొటో సోర్స్, Verma Family

ఫొటో సోర్స్, Ahmedabad Rural Police
సురభి వర్మ ఎవరు?
సురభి వర్మ, ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందినవారు. ఆమె తండ్రి రామ్ వర్మ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి గృహిణి.
‘‘సురభి స్కూల్లో టాపర్. ఆమె అలహాబాద్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేశారు. అక్కడ కూడా ఆమె టాపర్. ఆమెకు చదువు పట్ల శ్రద్ధ చాలా ఎక్కువ. తన లక్ష్యాల దిశగా కఠోర శ్రమ చేసేది. రీసర్చర్ అవ్వాలనుకుంది. పీహెచ్‌డీ చేయడం కోసం 2024 జనవరిలో ఐఐటీ దిల్లీలో చేరింది. కానీ, నిర్లక్ష్యం కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది ’’ అని సురభి బంధువు అజీర్ వర్మ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














