భాగస్వామికి కూడా తెలియకుండా పాపను మూడేళ్ల పాటు మంచం సొరుగులో దాచిపెట్టిన తల్లి

ఫొటో సోర్స్, CPS
- రచయిత, కాటియే బార్న్‌ఫీల్డ్, ఎవాన్ గ్వానె
- హోదా, బీబీసీ న్యూస్
మూడేళ్ల చిన్నారిని పుట్టినప్పటి నుంచి మంచం సొరుగులో దాచిన ఓ తల్లికి బ్రిటన్ కోర్టు ఏడున్నరేళ్ల జైలుశిక్ష విధించింది.
అత్యంత తీవ్రమైన నిర్లక్ష్యంగా పేర్కొంటూ కోర్టు ఈ శిక్ష వేసింది.
పగటి వెలుతురు, తాజా గాలి ఆ పాపకు తెలియనివ్వలేదని న్యాయవాదులు చెప్పారు.
చెసైర్‌లోని ఆ తల్లి ఉంటున్న ఇంటికి ఓ అతిథి వచ్చినప్పుడు ఏడుపు విని అక్కడ పాప ఉందని గుర్తించారు.
ఆ తరువాతే పాప సంగతి ప్రపంచానికి తెలిసింది.


ఫొటో సోర్స్, PA Media
వెలుతురే చూడని పాప
చిన్నారిపై క్రూరత్వం ప్రదర్శించిన తల్లి...ఈ కేసులో నాలుగు ఆరోపణలను గత విచారణ సమయంలో అంగీకరించారు. ఆమెకు చెస్టర్ క్రౌన్ కోర్టు శిక్ష విధించింది.
ఆ చిన్నారి ఎలాంటి ప్రేమకు, ఆప్యాయతకు నోచుకోలేదని, సరైన ఆహారం కూడా ఇవ్వలేదని.. పాప పట్ల తగిన శ్రద్ధ చూపలేదని న్యాయమూర్తి స్టీవెన్ ఎవెరెట్ట్ చెప్పారు.
పాపకు చికిత్స అందించాల్సిన అవసరం చాలా ఉందన్నారు.
‘చిన్నారి ఆ గదిలో దాదాపు జీవచ్ఛవంలా ఉన్న స్థితి నుంచి బహుశా ఇప్పుడే నెమ్మదిగా జీవితంలోకి ప్రవేశిస్తోంది’ అని అన్నారు.
చిన్నారి గురించి, ఆమె తోబుట్టులెవరికీ తల్లి తెలియనివ్వలేదని.. ఆమె పార్టనర్‌కు కూడా పాప విషయం తెలియదని కోర్టు తెలిపింది.
తన బెడ్ సొరుగులో పాపను దాచిపెట్టినట్లు తల్లి అంగీకరించారు.
ఆమె భాగస్వామి ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటారు కానీ చిన్నారిని గుర్తించలేదు.
చిన్నారిని గుర్తించినప్పుడు.. పేరు పెట్టి పిలిచినా స్పందించలేదని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసుకు చెందిన రాచెల్ వర్తింగ్టన్ చెప్పారు.
పసిపాపను చాలా కాలం పాటు ఒంటరిగా వదిలేశారని, సరిపడా ఆహారం ఇవ్వలేదని.. దీంతో చిన్నారి అత్యంత బలహీనంగా మారిందని తెలిపారు.

ఫొటో సోర్స్, CPS
అత్యంత క్రూరత్వం
చిన్నారి తీవ్ర పోషకాహారలోపంతో బాధపడుతోందని కోర్టు తెలిపింది. వయసు మూడేళ్లయినా చూడడానికి ఏడునెలల పాపలా ఉందని చెప్పింది.
సిరంజి ద్వారా మిల్కీ వీటాబిక్స్ మాత్రమే బిడ్డకు అందించారని తెలిపింది.
పాపకు అనారోగ్య సమస్యలున్నప్పటికీ తల్లి చికిత్స అందించలేదు.
2020 ప్రారంభం నుంచి 2023 తొలినాళ్ల వరకు పాపను తల్లి దాచిపెట్టారు.
పై అంతస్తు నుంచి వినిపిస్తున్న పాప ఏడుపును ఆ ఇంటికి వచ్చిన ఓ అతిథి గుర్తించారు. మంచం మీద పాప ఉందని గమనించారు.
పాపను గమనించిన తర్వాత ఆ అతిథి సోషల్ వర్కర్‌కు సమాచారమందించారు.
పాప ఏడుపు విని బెడ్‌రూమ్‌లోకి వెళ్లినప్పుడు అక్కడ కనిపించిన దృశ్యం తనకు భయం కలిగించిందని ఆమె చెప్పారు.
అట్టలు కట్టిన జుట్టు, అనేక వైకల్యాలు, ఒంటినిండా దద్దుర్లతో పాప కనిపించింది.
ఇప్పుడు తాత్కాలిక సంరక్షణలో ఉన్న బాలికకు పెరుగుదల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ప్రాసిక్యూటర్లు కోర్టుకు చెప్పారు.
‘‘మీరు పాపను దాచిపెట్టింది ఇక్కడేనా?’’ అని ఆ తల్లిని నేను ప్రశ్నించాను. ఆ తల్లి వెంటనే.. అవును... ఈ సొరుగులో అని బదులిచ్చారు’’ అని సోషల్ వర్కర్ చెప్పారు.
‘‘ఆ తల్లిలో ఎలాంటి భావోద్వేగం కనిపించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది’’ అని సోషల్ వర్కర్ తెలిపారు.
46 ఏళ్లలో ఇలాంటి కేసు చూడలేదన్న జడ్జి
చిన్నారిలో పెరుగుదలకు సంబంధించి తీవ్రమైన సమస్యలున్నాయని కోర్టు తెలిపింది. నిర్లక్ష్యం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, ఇప్పుడు ఆ పాప సంరక్షణ కేంద్రంలో ఉందని చెప్పింది.
తాను గర్భవతినన్న విషయం తనకు తెలియలేదని, పాపకు జన్మినిచ్చినప్పుడు తాను చాలా భయపడ్డానని ఆ తల్లి పోలీసులతో చెప్పారు.
పసికందును సొరుగులోనే ఎప్పుడూ ఉంచలేదని ఆమె చెప్పారు.
ఆ చిన్నారి తమ కుటుంబంలో భాగం కాదని తల్లి పోలీసులకు తెలిపారు.
తాను బాగా చూసుకున్న పిల్లలెవరూ ఇప్పుడు తనతో లేరని ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పారు.
బిడ్డను తల్లి ఇలా చేయడం నమ్మలేని విషయమని జడ్జి ఎవెరెట్ట్ అన్నారు.
‘‘చిన్నారి విషయాన్ని దాచిపెట్టాలని మీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అనుకోకుండా మీ భయంకర రహస్యం వెలుగుచూసింది’’ అని తల్లిని ఉద్దేశించి న్యాయమూర్తి అన్నారు.
తన 46 ఏళ్ల కెరీర్‌లో ఇంత భయంకరమైన కేసును చూడలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














