ములుగు: పూలకొమ్మ ‘ఎన్‌కౌంటర్’లో ఏడుగురు మావోయిస్టులు మృతి, అనుమానం వ్యక్తం చేసిన పౌరహక్కుల సంఘం

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఆదివారం (డిసెంబర్ 1) ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారని ములుగు జిల్లా పోలీసులు తెలిపారు.
అయితే, ఈ ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలున్నాయని తెలంగాణ పౌరహక్కుల సంఘం తెలిపింది.

ఫొటో సోర్స్, UGC
పోలీసులు ఏం చెప్పారంటే..
ఈ ఘటనపై ములుగు జిల్లా పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
2024 డిసెంబర్ 1 ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారని ములుగు జిల్లా ఎస్పీ శభరీష్ ఆ ప్రకటనలో తెలిపారు.
“ఉదయం 6.18 గంటలప్పుడు పూలకొమ్మ అటవీ ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా 12 నుంచి 13 మంది నిషేధిత మావోయిస్టులు ఎదురుపడ్డారు. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా వినకుండా వారు కాల్పులు ప్రారంభించారు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. సంఘటనా స్థలంలో ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి” అని ఎస్పీ శభరీష్ వెల్లడించారు.
మృతుల వివరాలు:
ములుగు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం చనిపోయిన మావోయిస్టులు వీరే:
1) కుర్సుం మంగు అలియాస్ బద్రు, అలియాస్ పాపన్న- తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు
2) ఏగోలపు మల్లయ్య అలియాస్ కోటి - జిల్లా కమిటీ సభ్యుడు
3) జమున - ఏరియా కమిటీ సభ్యురాలు
4) కరుణాకర్ - ఏరియా కమిటీ సభ్యుడు
మృతుల్లో మరో ముగ్గురు ఎవరన్నది గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
సంఘటనా స్థలం నుంచి రెండు ఏకే-47 తుపాకులతో పాటు మరికొన్ని ఆయుధాలు, కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
పారిపోయిన మిగతా మావోయిస్టులు లొంగిపోవాలని, వారికి పునరావాసం కల్పించి అండగా ఉంటామని ములుగు ఎస్పీ శభరీష్ తెలిపారు.
ఈ ఎన్‌కౌంటర్‌పై ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఫొటో సోర్స్, UGC
‘ఈ ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయి’- పౌరహక్కుల సంఘం
ఏటూరు నాగారం ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలున్నాయని తెలంగాణ పౌరహక్కుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. అన్నంలో విషం కలిపి వారిని చంపారనే అనుమానాలు ఉన్నాయని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, నిపుణులైన వైద్యుల సమక్షంలో శవపరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేసింది.
తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో 16 మంది ఎన్‌కౌంటర్ల పేరుతో చనిపోయారని, అవన్నీ బూటకపు ఎన్‌కౌంటర్లేనని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ ‘ఆపరేషన్ కగార్‘ను తెలంగాణలో అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆక్షేపించింది.

ఫొటో సోర్స్, UGC
వారోత్సవాలకు ఒక రోజు ముందు..
పీఎల్‌జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) వారోత్సవాల (డిసెంబర్ 2-8) ప్రారంభానికి సరిగ్గా 24 గంటల ముందు ఈ ఘటన జరిగింది.
1999 డిసెంబర్ 2న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొయ్యూరు అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు నల్ల ఆదిరెడ్డి, శీలం సురేష్, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డిలు మరణించారు. అది బూటకపు ఎన్‌కౌంటర్ అని అప్పట్లో ప్రజాసంఘాలు ఆరోపించాయి.
ఈ క్రమంలో వీరి యాదిలో 2,000 సంవత్సరంలో మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ పేరిట ప్రత్యేక సైనిక పటాలాన్ని ఏర్పాటు చేసింది. కొయ్యూరు ఎన్‌కౌంటర్ మృతులను స్మరిస్తూ ఏటా డిసెంబర్ 2 నుంచి 8 వరకు పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహిస్తోంది.
ఈ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ సందర్బంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి, కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తుంటారు.
ఈసారి వారోత్సవాలను విజయవంతం చేయాలని ఖమ్మం- ములుగు- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కొద్ది రోజుల కిందట మావోయిస్టు పార్టీ పేరిట బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














