సాయిపల్లవి మొబైల్ నంబర్‌గా అమరన్ సినిమాలో ఒక ఫోన్ నంబర్‌ను చూపించడంతో ఏం జరిగిందంటే..

అమరన్ సినిమా పోస్టర్

ఫొటో సోర్స్, FB/iKamalHaasan

    • రచయిత, సిరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం అమరన్.

అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో ముకుంద్ భార్య ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రను పోషించిన సాయిపల్లవి మొబైల్ నంబర్‌గా ఒక నంబర్‌ను స్క్రీన్‌పై చూపించారు.

ఆ నంబర్‌ను చూపించడంపై చెన్నైకి చెందిన ఒక యువకుడు ఫిర్యాదు చేశారు.

ఆ ఫోన్ నంబర్ తనదేనని, దానిని సినిమాలో చూపించడం వల్ల చాలా అవాంఛిత కాల్స్ వస్తున్నాయని, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యానని ఆ యువకుడు పేర్కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమరన్, శివకార్తికేయన్

ఫొటో సోర్స్, @RKFI

ఫొటో క్యాప్షన్, అమరన్ సినిమాలో సాయిపల్లవి నంబర్‌గా తన ఫోన్ నంబర్‌ను చూపించారంటూ చెన్నైకి చెందిన ఒక యువకుడు ఫిర్యాదు చేశారు

నవంబర్ 21న ఈ ఫిర్యాదు నమోదు కాగా, ఆ యువకుడు కోటి 10 లక్షల రూపాయల పరిహారం డిమాండ్ చేస్తూ అమరన్ చిత్ర నిర్మాణ సంస్థకు నోటీసు పంపినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ విషయంపై 'అమరన్' చిత్రబృందం ఏమంటోంది? అనుమతి లేకుండా ఒక వ్యక్తి మొబైల్ నంబర్‌ని సినిమాలో వాడటం చట్టరీత్యా నేరమా?

వాగీసన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అపరిచితుల నుంచి రోజుకు వందకు పైగా ఫోన్ కాల్స్ రావడంతో విసిగెత్తిపోయానని వాగీసన్ ఫిర్యాదులో పేర్కొన్నారు

ఫిర్యాదు నేపథ్యం ఏమిటి?

గత నెలలో విడుదలైన ‘అమరన్’ సినిమాలో ‘ఇందు రెబెక్కా వర్గీస్’ పాత్రలో నటించిన సాయి పల్లవి తన మొబైల్ నంబర్‌ను పేపర్‌పై రాసి ‘ముకుంద్ వరదరాజన్’ పాత్రలో నటిస్తున్న శివకార్తికేయన్‌కి ఇచ్చే సన్నివేశం ఉంది.

పేపర్‌పై రాసిన ఆ మొబైల్ నంబర్ కొన్ని సెకన్ల పాటు స్క్రీన్‌పై కనిపిస్తుంది.

సినిమాలో కనిపించిన నంబర్ తనదంటూ చెన్నైకి చెందిన విద్యార్థి వీవీ వాగీసన్ పేర్కొన్నారని మీడియా సంస్థ ‘ది హిందూ’ రాసింది.

దీపావళికి ముందు ఈ సినిమా విడుదలైంది. ఇక దీపావళి రోజున తనకు ఎక్కువ కాల్స్ వచ్చాయని వాగీసన్‌ను ఉటంకిస్తూ తన కథనంలో ది హిందూ పేర్కొంది.

‘‘ఫోన్ ఎత్తగానే అమరన్ గురించి, సాయి పల్లవి గురించి అడగడంతో ఆశ్చర్యపోయాను. తర్వాత వరుసగా కాల్స్ రావడంతో ఫోన్‌ని ‘సైలెంట్‌’‌లో పెట్టాను. మరుసటి రోజు ఉదయాన్నే వందకు పైగా కాల్స్ రావడంతో షాక్‌కు గురయ్యాను. కాల్స్ వెల్లువెత్తడంతో చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి, కథానాయకుడు శివకార్తికేయన్‌లకు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాను. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రోజూ పెద్దసంఖ్యలో ఫోన్లు రావడంతో చదువుపై దృష్టి సారించలేక, నిద్ర పట్టక ఇబ్బందిపడుతున్నా’’ అని వాగీసన్‌ను పేర్కొన్నట్లు తన కథనంలో ది హిందూ పేర్కొంది.

రెండేళ్లుగా వినియోగిస్తున్న మొబైల్ నంబర్ కావడం, బ్యాంకు ఖాతాలు, ఆధార్‌తో నంబర్‌ అనుసంధానం కావడంతో దానిని వదులుకోలేక మొబైల్‌ ఫోన్‌ను తాత్కాలికంగా స్విచాఫ్‌ చేసినట్లు ఆయన చెప్పారని తెలిసింది.

తాను అనుభవించిన మానసిక క్షోభకు పరిహారంగా తన లాయర్ ద్వారా చిత్ర నిర్మాత, దర్శకునికి రూ. కోటి 10 లక్షల పరిహారం చెల్లించాలంటూ నోటీస్ పంపించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

స్టంప్ డ్యూటీ

ఫొటో సోర్స్, Getty Images

సినిమాల్లో ఒక వ్యక్తి నంబర్ చూపించడం సబబేనా?

అనుమతి తీసుకోకుండా ఒక వ్యక్తి మొబైల్ నంబర్‌ను సినిమాల్లో చూపించడం తప్పు అని బీబీసీకి సైబర్ లా నిపుణులు, మద్రాస్ హైకోర్ట్ న్యాయవాది వి. బాలు చెప్పారు.

‘‘రోజుకు వందకు పైగా అసంబద్ధమైన ఫోన్ కాల్‌లు రావడం ఎవరికైనా చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది చాలా తప్పు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం కూడా ఇది తప్పు” ఆయన వివరించారు.

ఈ చట్టం ప్రకారం, అనుమతి లేకుండా ఒకరి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం నేరమని ఆయన తెలిపారు.

“ఫోన్ నంబర్ ద్వారా సదరు వ్యక్తి పేరును తెలిపే 'ట్రూకాలర్' వంటి యాప్‌లో వాగీసన్ మొబైల్ నంబర్‌ను అమరన్ సినిమాలోని నటి పేరు లేదా అందులోని ఒక పాత్ర పేరుతో ఎవరో సేవ్ చేశారు. ఇది అతనికి మరింత ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది’’ అని ఆయన వెల్లడించారు.

చిత్రబృందం ఉద్దేశపూర్వకంగా ఇలా చేసి ఉండకపోవచ్చని లాయర్ బాలు అంటున్నారు.

‘అయితే ఆ యువకుడి వేదనను నేను ఊహించగలను. కాబట్టి నోటీసు పంపడంలో ఎలాంటి తప్పు లేదు' అని ఆయన చెప్పారు.

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 (డీపీటీపీ) ప్రకారం, పబ్లిక్ స్పేస్‌లో ఒకరి వ్యక్తిగత సమాచారాన్ని నిర్వహించడానికి సంబంధించి మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని న్యాయవాది బాలు అన్నారు.

“లక్షల మంది చూసే సినిమా లాంటి భారీ బహిరంగ వేదిక మీద, అది కూడా ఓ ప్రముఖ నటుడి సినిమాలో 10 నంబర్లు రాసి అలా ప్రదర్శించారు. ఇలా ప్రదర్శించడానికి ముందు ఆ నంబర్‌ను ఎవరైనా వాడుతున్నారా? లేదా? అని విచారించాల్సింది. ఇలాంటి అనుభవం మరెవరికీ ఎదురుకాకుండా ఇది నిరోధించగలదు’’ అని ఆయన భావించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)