‘భూగర్భంలో రెండు కిలోమీటర్ల లోపల 3 నెలలు ఉండి బంగారం తవ్వుతాను.. ఒక అంతస్తు మొత్తం అస్తిపంజరాలే’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నోమ్సా మాసెకో
- హోదా, బీబీసీ న్యూస్, జోహన్నెస్‌బర్గ్
ఒక మాఫియా గ్యాంగ్ నియంత్రించే చిన్న పట్టణంలో 600 మంది ఇతరులతో పాటు డుమిసో కూడా నివసిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో నిరుపయోగంగా ఉన్న ఒక బంగారు గనిలో.. భూగర్భంలో ఈ చిన్న పట్టణం ఉంది. ఇక్కడ మార్కెట్లు, రెడ్ లైట్ ఏరియా ఉన్నాయి.
తాను అక్కడ ఒక పెద్ద మైనింగ్ సంస్థలో పనిచేసేవాడినని.. కానీ ఆ సంస్థ నుంచి తనను తొలగించారని డుమిసో బీబీసీతో చెప్పారు.
పని నుంచి తొలగించడంతో అక్కడి గ్యాంగ్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఆ తరువాత డుమిసో అక్రమ మైనర్‌గా మారారు.. దక్షిణాఫ్రికాలో అక్రమంగా గనులు తవ్వేవారిని ‘జామాజామా’ అంటారు.
విలువైన లోహాల కోసం ఆయన ఆ గనులు తవ్వుతుంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి భూమిపైకి వస్తారు.
వచ్చేటప్పుడు ఆ గనిలో ఆయన వెలికితీసిన బంగారంలో కొంత భాగాన్ని భూమిపైకి తీసుకొచ్చి అత్యధిక లాభానికి బ్లాక్ మార్కెట్లో అమ్ముతారు.
‘‘భూగర్భంలో జీవితమనేది చాలా దారుణంగా ఉంటుంది. చాలామంది ప్రాణాలతో బయటపడరు’’ అని ఈ 52 ఏళ్ల ‘జామాజామా’ చెప్పారు.
అండర్‌గ్రౌండ్‌లో తమ పరిస్థితులపై ‘బీబీసీ’తో మాట్లాడిన ఆయన అసలు పేరును ఈ కథనంలో వాడలేదు. డుమిసో అనేది అసలు పేరు కాదు.

‘‘ఈ బంగారు గనిలో ఒక అంతస్తులో మొత్తం మృతదేహాలు, అస్తి పంజరాలే ఉంటాయి. దాన్ని మేం జామా-జామా స్మశానం అంటాం’’ అని డుమిసో చెప్పారు.
డుమిసోలా బతికున్న వారు మాత్రం అక్కడ లాభసాటి వ్యాపారం చేస్తుంటారు.
అండర్‌గ్రౌండ్‌లోని ఆ బంగారు గనిలో పనిచేసిన తర్వాత ఆయన అక్కడే ఇసుక బ్యాగులపై పడుకుంటారు. ఆయన కుటుంబం జోహన్నెస్‌బర్గ్‌లోని ఒక టౌన్‌షిప్‌లో తాను కొన్న ఇంట్లో ఉంటున్నారు.
ఒక బెడ్‌రూమ్ ఇంటి కోసం ఆయన 7 వేల డాలర్లు (సుమారు రూ.6 లక్షలు) వరకు నగదు చెల్లింపులు చేశారు. మరో మూడు బెడ్‌రూమ్‌లను దానికి కలపాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఎనిమిదేళ్లుగా అక్రమ మైనింగ్ చేస్తూనే తన ముగ్గురు పిల్లల స్కూల్ ఫీజులను చెల్లించగలుగుతున్నట్లు చెప్పారు డుమిసో. తన పిల్లల్లో ఒకరు ప్రస్తుతం యూనివర్సిటీలో చదువుతున్నారని చెప్పారు.
‘‘నా భార్యా పిల్లల్ని పోషించుకోవాలి. నాకు తెలిసింది ఇదొక్కటే’’ అని డుమిసో చెప్పారు. కార్ హైజాకర్‌గా కానీ దొంగగా కానీ మారి నేరాల్లో భాగం కావడం కంటే భూగర్భంలో కష్టపడి పనిచేయడం మేలని ఆయన అన్నారు.
ఎన్నో ఏళ్ల పాటు బయట చట్టబద్ధమైన పనుల కోసం ప్రయత్నించి చివరకు ఈ పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ప్రస్తుతం ఆయన స్టిల్‌ఫోంటెయిన్ పట్టణంలోని మైన్‌లో పనిచేస్తున్నారు. జోహన్నెస్‌బర్గ్‌కు నైరుతి దిక్కున సుమారు 145 కిలో మీటర్ల దూరంలో ఇది ఉంది. అక్కడ భూగర్భంలో పనిచేసే వందల మంది మైనర్లను బయటకు తీసుకొస్తామని ఆ దేశ మంత్రి వాగ్దానం చేయడంతో ఈ ప్రాంతం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
అండర్‌గ్రౌండ్‌లోని ఈ గనిలో పనిచేసే వారికి ఆహారం, నీరు సరఫరా చేయకుండా భద్రత దళాలు అడ్డుకున్నాయి.
‘‘క్రిమినల్స్‌కు సాయం చేయకూడదు. క్రిమినల్స్‌కు శిక్ష విధించాలి’’ అని ఆ దేశ ప్రభుత్వ మంత్రి అన్నారు.
భూగర్భంలో ఉన్న ఆ గనిలోకి తమకు యాక్సెస్ కల్పించాలని డిమాండ్ చేస్తూ క్యాంపెయిన్ గ్రూప్ ‘సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ కన్‌స్ట్రక్షన్’ అక్కడ కోర్టులో కేసు వేసింది. ఇది 2 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
మైనర్లకు ఆహారం, ఇతర నిత్యావసరాలను డెలివరీ చేయాలని పేర్కొంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఫొటో సోర్స్, Reuters
ఆ గనిలో పనిచేసే డుమిసో, ఈ ప్రతిష్టంభన ప్రారంభం కావడానికి ముందే భూమిపైకి వచ్చారు.
తిరిగి ఆ అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లాలో వద్దో నిర్ణయించుకోవడానికి ముందు పరిస్థితులు ఎలా మారతాయో చూడాలంటున్నారు.
మాఫియా గ్యాంగ్‌ల చేతుల్లో ఉన్న ఈ ఇండస్ట్రీని నిలువరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ ప్రతిష్టంభన నెలకొంది.
‘‘ఎన్నో ఏళ్లుగా అక్రమ మైనింగ్‌ను నియంత్రించేందుకు ఆ దేశం పెద్ద యుద్ధమే చేస్తోంది. అత్యాచారం, దొంగతనం, ప్రజా మౌలిక సదుపాయాల ధ్వంసం వంటి పలు క్రిమినల్ నేరాలను మైనింగ్ కమ్యూనిటీలోని ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ఖనిజ వనరులపై పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తోన్న మికాటెకో మహలౌలే అన్నారు.
గనులు ‘క్రైమ్ సీన్’గా మారుతున్నాయని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా అన్నారు.
అండర్‌గ్రౌండ్‌లో ఉన్న గోల్డ్ మైన్‌లోకి వెళ్లి వారిని అరెస్ట్ చేయడానికి బదులు ఈ ప్రతిష్టంభనకు తెరదించేందుకు మైనర్లతో పోలీసులు చర్చలు జరుపుతున్నారని చెప్పారు.
‘‘కొంతమంది మైనర్ల వద్ద భారీగా ఆయుధాలు ఉన్నాయని అధికారులకు తెలిసింది. క్రిమినల్ గ్యాంగ్‌లు నియమించుకున్న అక్రమ మైనర్లు చాలా బాగా స్థిరపడ్డారు’’ అని చెప్పారు.
స్థానికులు, సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలతో పాటు ఇలా అక్కడ వందల వేలాది మంది కార్మికులు డుమిసోలాగా పనిచేస్తున్నారు.
గత మూడు దశాబ్దాలుగా దక్షిణాఫ్రికాలోని చట్టబద్ధమైన మైనింగ్ ఇండస్ట్రీ పడిపోవడంతో, చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.
అలాంటి వారంతా అక్రమ గనుల తవ్వకాలకు వెళ్తున్నారు. పాడుబడ్డ గనుల్లో పనిచేసేందుకు ‘‘జామా జామా’’లుగా మారుతున్నారు.
దేశంలో పాడుబడి, వదిలేసిన గనులు 6వేల వరకు ఉన్నాయని ఈ పరిశ్రమపై అధ్యయనం చేస్తున్న సౌతాఫ్రికాకు చెందిన బెంచ్‌మార్క్ ఫౌండేషన్ పరిశోధకులు డేవిడ్ వాన్ వింక్ చెప్పారు.
‘‘భారీ స్థాయి మైనింగ్ పరిశ్రమ వారికి పెద్దగా లాభదాయకంగా లేదు, కానీ సూక్ష్మస్థాయి మైనింగ్ వారికి లాభదాయకంగా ఉంది’’ అని బీబీసీ ఫోకస్ ఆఫ్రికా పాడ్‌కాస్ట్‌లో తెలిపారు.
1996లో తనని తీసివేసేంత వరకు ఒక గోల్డ్ మైనింగ్ కంపెనీలో డ్రిల్ ఆపరేటర్‌గా పనిచేసే వాడినని డుమిసో చెప్పారు. నెలకు 220 డాలర్ల(రూ.18,584) కంటే తక్కువగానే సంపాదించేవాడినని అన్నారు.
20 ఏళ్ల పాటు ఫుల్ టైమ్ ఉద్యోగం కోసం తీవ్రంగా పోరాడిన తర్వాత, ఆయన చివరికి అక్రమ మైనర్‌గా మారారు. దక్షిణాఫ్రికాలో నిరుద్యోగ రేటు తీవ్ర స్థాయిలో ఉంది.
దక్షిణాఫ్రికాలో వేలమంది అక్రమ మైనర్లు ఉన్నారు. దేశానికి ఆర్థిక కేంద్రంగా నిలుస్తున్న గౌటెంగ్ ప్రావిన్స్‌లోనే 36 వేల మంది వరకు అక్రమ మైనర్లు ఉన్నట్లు వాన్ వింక్ చెప్పారు. తొలుత 19వ శతాబ్దంలో బంగారాన్ని ఇక్కడే కనుగొన్నారు.
‘‘జామాజామాలు భూమి పైకి రాకుండా నెలల పాటు అండర్‌గ్రౌండ్‌లో ఉంటుంటారు. బయట నుంచి గనుల్లోకి సరఫరా అయ్యే ఆహారం, ఇతర నిత్యావసరాలపైనే ఆధారపడతారు. ఇది చాలా ప్రమాదకరమైన, కష్టమైన పని’’ అని ‘గ్లోబల్ ఇనిషియేటివ్ అగెనెస్ట్ ట్రాన్స్‌నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్’ అనే ప్రచార సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
అక్రమంగా గనులు తవ్వేవారు ప్రత్యర్థి గ్రూప్‌ల నుంచి తమని తాము కాపాడుకోవడానికి పిస్టల్స్, గన్‌లు, సెమీ-ఆటోమేటిక్ ఆయుధాలను వాడుతుంటారు.
తన వద్ద కూడా పిస్టల్ ఉందని, కానీ నెలవారీ ప్రొటెక్షన్ ఫీజు కింద 8 డాలర్లను (రూ.676) తన గ్యాంగ్‌కు చెల్లిస్తున్నట్లు డుమిసో బీబీసీకి చెప్పారు.
నిత్యం గ్యాంగ్‌ల నియంత్రణలో ఉంటూ పనిచేసే తాను బంగారాన్ని వెలికితీసేందుకు గొడ్డలి, పార, ఉలి వంటి పరికరాలను.. రాక్ బ్లాస్టింగ్ కోసం డైనమైట్ వాడతానని డుమిసో తెలిపారు.
తాను వెలికితీసిన బంగారంలో చాలా వరకు గ్యాంగ్ లీడర్లకు ఇస్తానని చెప్పారు.
కొంత బంగారాన్ని తన వద్ద ఉంచుకుంటానని, దాన్ని ఆదాయం పెంచుకునేందుకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతుంటానని తెలిపారు.
అయితే, తన పరిస్థితి కొంత నయమని.. కొందరినైతే బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి, గనుల్లో పనులకు పెడుతుంటారని చెప్పారు.
బానిస కార్మికులలాగా వారితో పనిచేయించుకుంటూ, కనీసం ఎలాంటి చెల్లింపులు లేదా బంగారం కూడా ఇవ్వరని అన్నారు.
‘‘సాధారణంగా ఒకసారి పనికి వెళ్తే మూడు నెలల పాటు అండర్‌గ్రౌండ్‌లోనే పనిచేస్తుంటాను. తర్వాత కుటుంబంతో గడిపేందుకు రెండు నుంచి నాలుగు వారాల పాటు పైకి వస్తుంటాను. మళ్లీ అండర్‌గ్రౌండ్‌లోకి తిరిగి వెళ్లడానికి ముందు, నాతో తీసుకొచ్చిన బంగారాన్ని అమ్ముతుంటాను’’ అని డుమిసో చెప్పారు.
‘‘నా బెడ్‌పై నేను పడుకుని, ఇంటి భోజనం తినేందుకు ఎదురు చూస్తాను. స్వచ్ఛమైన గాలి పీల్చితే ఆ ఫీలింగే అద్భుతం’’ అని అన్నారు.
భూమిపైకి వచ్చిన తర్వాత, తనకు ఎదురైన ఒక సంఘటనను డుమిసో గుర్తు చేసుకున్నారు. ‘‘సూర్యకిరణాలు తాకగానే నాకు కారు చీకట్లు కమ్ముకున్నట్లు అయింది. నేను గుడ్డివాడిని అయిపోయానేమో అనిపించింది’’ అని డుమిసో చెప్పారు.
చర్మం కూడా పాలిపోయినట్లు అయిందని, తనను మెడికల్ చెకప్ కోసం డాక్టర్ వద్దకు తన భార్య తీసుకెళ్లారని తెలిపారు.
‘‘నేనెక్కడ నివసిస్తున్నానో డాక్టర్‌కు నిజాయతీగా చెప్పాను. ఆయనేం చెప్పలేదు. నాకు వైద్యం చేసి, విటమిన్ మాత్రలు ఇచ్చారు’’ అని చెప్పారు.
డుమిసో పైకి వచ్చినప్పుడు కూడా రిలాక్స్ అవ్వరు. ఇతర అక్రమ మైనర్లతో కలిసి పనిచేస్తారు. కింద నుంచి తీసుకొచ్చిన ఓర్-బేరింగ్ రాక్స్‌ను పగులగొట్టి, వాటిని ఫైన్ పౌడర్‌గా మారుస్తారు. మెర్క్యూరీ, సోడియం సైనైడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను వాడుతూ బంగారాన్ని వేరుచేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ తర్వాత డుమిసో తనకు వాటాగా వచ్చిన గ్రాము బంగారాన్ని 55 డాలర్లకు (రూ.4,644) అమ్ముతారు. అధికారిక ధర గ్రాము 77 డాలర్ల (రూ.6,501) కంటే ఇది తక్కువ.
తనకు కొనుగోలుదారు ఒకరు సిద్ధంగా ఉంటారని.. ఆయనే ఎప్పుడూ వాట్సాప్‌లో తనను కాంటాక్ట్ అవుతుంటారని తెలిపారు.
‘‘తొలిసారి ఆయన్ను కలిసినప్పుడు నేను తనని నమ్మలేదు. పోలీస్ స్టేషన్ వద్ద కారు పార్కింగ్ దగ్గర సమావేశమవుదామని చెప్పాను. అక్కడైతేనే నాకు సురక్షితం అని భావించా’’ అని చెప్పారు.
‘‘ప్రస్తుతం మేం ఏ కార్ పార్కింగ్‌లోనైనా కలుస్తుంటాం. స్పాట్‌లోనే బంగారాన్ని తూకమేస్తాం. ఆ తర్వాత దాన్ని ఆయనకు ఇస్తాను. ఆయన నాకు డబ్బులు చెల్లిస్తారు’’ అని వివరించారు. ఆ సమయంలో 3,800 డాలర్ల నుంచి 5,500 డాలర్ల వరకు డబ్బు సంపాదిస్తానని చెప్పారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలా తాను సంపాదిస్తుంటానని, సగటున వార్షికంగా 15,500 డాలర్ల నుంచి 22 వేల డాలర్ల వరకు సంపాదిస్తానని చెప్పారు.
గ్యాంగ్ లీడర్లు అయితే మరింత ఎక్కువగా సంపాదిస్తారు కానీ, ఎంత సంపాదిస్తారో తనకు కరెక్ట్‌గా తెలియదని అన్నారు.
తన వద్ద నుంచి బంగారం కొనే వ్యక్తి గురించి కూడా పెద్దగా తెలియదన్నారు. అక్రమంగా సాగే ఈ ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రమేయం ఉంటుంది. వారు వేరువేరు ప్రాంతాలకు చెందిన, భిన్నమైన వ్యక్తులు ఉంటారు. అందుకే, క్రిమినల్ నెట్‌వర్క్‌లను నిరోధించడం చాలా కష్టం.
ప్రభుత్వం మైనర్లను లక్ష్యంగా చేసుకుందని, కానీ, జోహన్నెస్‌బర్గ్, కేప్ టౌన్‌లోని శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న కింగ్‌పిన్స్ (మాఫియా డాన్‌లు)ను కాదని అన్నారు.
అక్రమ మైనింగ్ వల్ల, ఎగుమతుల ఆదాయం, రాయల్టీలు, పన్నులు కోల్పోతూ ఆర్థిక వ్యవస్థకు కోట్ల ర్యాండ్‌ల (దక్షిణాఫ్రికా కరెన్సీ) నష్టం కలుగుతుందని రమఫోసా చెప్పారు.
వాడుకలో లేని మూతపడిన గనులను మూసివేయడం కానీ, వాటిని పునరుద్ధరించడం కానీ చేసేలా మైనింగ్ సంస్థలతో ప్రభుత్వం చర్చిస్తోంది.
ఒకవేళ ప్రభుత్వం జామాజామాలను నిరోధిస్తే ఆ నిర్ణయం దక్షిణాఫ్రికా ఆర్థిక సంక్షోభాన్ని మరింత దారుణమైన స్థితికి తీసుకెళ్తుందని బీబీసీ ఫోకస్ ఆఫ్రికా పాడ్‌కాస్ట్‌లో వాన్ వింక్ చెప్పారు.
‘‘వారి ఆపరేషన్లను డీక్రిమినలైజ్ చేసే విధానాన్ని తీసుకురావాలి. వారిని మెరుగ్గా నిర్వహిస్తూ, నియంత్రించాలి’’ అని అన్నారు.
డుమిసో తిరిగి అండర్‌గ్రౌండ్‌కి పనికి వెళ్లే ముందు.. అక్కడ భూమి లోపల ఆహారం కోసం ఎక్కువ ధర చెల్లించకుండా ముందుజాగ్రత్తగా భూమి పైనుంచే ఆహార క్యాన్లను తీసుకెళ్తుంటారు.
కేవలం ఆహారం మాత్రమే కాక, సిగరెట్లు, టార్చ్‌లు, బ్యాటరీలు, మైనింగ్ టూల్స్ కూడా అక్కడ అమ్ముతుంటారని డుమిసో చెప్పారు.
ఎన్నో ఏళ్లుగా అండర్‌గ్రౌండ్‌లో ఒక చిన్న పట్టణం లేదా కమ్యూనిటీని అభివృద్ధి చేసినట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. అక్కడొక రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ కూడా ఉంది. గ్యాంగ్‌లు అండర్‌గ్రౌండ్‌లోకి సెక్స్ వర్కర్లను కూడా తీసుకొస్తుంటాయి.
తాను పనిచేసే మైన్‌లో పలు అంతస్తులుంటాయని, ప్రతి అంతస్తు ఇంకో దానితో అనుసంధానమై ఉంటుందని డుమిసో చెప్పారు.
‘‘హైవేల మాదిరి అక్కడుంటాయి. వివిధ ప్రాంతాలకు, అంతస్తులకు వెళ్లేందుకు సంకేతాలు గీసి ఉంటాయి. అంటే మేం వాడే టాయిలెట్ అంతస్తు ఎటువైపు, జామాజామాల స్మశానం ఎటువైపు ఇలా చూపిస్తుంటాయి’’ అని చెప్పారు.
ప్రత్యర్థి గ్యాంగ్ మెంబర్లు కొందర్ని చంపేస్తుంటారు. గనుల్లో రాళ్ల పెళ్లలు విరిగిపడినప్పుడు మరికొందరు చనిపోతారు.
‘నా స్నేహితుని వద్ద ఉన్న బంగారాన్ని దోచుకుని, కాల్చి చంపారు’ అని డుమిసో గుర్తు చేసుకున్నారు.
అండర్‌గ్రౌండ్‌లో జీవితం భయంకరంగా ఉన్నప్పటికీ, డుమిసో లాగా వేలమంది తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు.
30 శాతానికి పైగా నిరుద్యోగ రేటు ఉన్న దేశంలో పేదలుగా జీవించడం లేదా చనిపోవడమే తమ ముందున్న ప్రత్యామ్నాయం అంటున్నారు అక్కడి ప్రజలు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














